కాపు రిజర్వేషన్ పోరాటంలో వంగవీటి రాధా?

705

నేడు బలిజనాడు నేత ఓ.వి.రమణతో భేటీ
ఐదు శాతం రిజర్వేషన్లపై ఉద్యమ ప్రణాళిక
అమరావతి రైతులకు కాపు-బలిజనాడు అండ
నేడు బెజవాడలో వంగవీటి-రమణ భేటీ?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ కోటాలో ఇచ్చిన  పది శాతం రిజర్వేషన్ కోటాలో… గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని కోరుతూ, కాపు-బలిజలు రోడ్డెక్కనున్నారు. గత ప్రభుత్వం దీనిని చట్టసభలో ఆమోదించినా, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దానిని అమలుచేయకుండా మోకాలడ్డుతున్న వైనంపై, కాపుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోరాడాల్సిన కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం, ఉద్యమం నుంచి అస్త్రసన్యాసం చేయడంతో, కాపులు డీలాపడ్డారు. ఈ నేపథ్యంలో ఏర్పడ్డ నాయకత్వాన్ని భర్తీ చేసేందుకు.. దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గరైన, బలిజనాడు రాష్ట్ర కన్వీనర్ ఓ.వి.రమణ దన్నుగా నిలవనున్నారు. ఆ మేరకు వారివురు, గురువారం విజయవాడ హోటల్ మనోమరలో భేటీ కానున్నట్లు సమాచారం.

గురువారం ఉదయం పదకొండున్నర ప్రాంతంలో జరగనున్న వారి సమావేశంలో…కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన, ఐదు శాతం రిజర్వేషన్ల అమలు, కాపు కార్పొరే షన్ స్థితిగతులు, ప్రధానంగా రాయలసీమలో ప్రభుత్వం.. కాపు మహిళలకు అమ్మఒడి కింద డబ్బులు ఇవ్వకపోవడం వంటి అంశాలు, చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దానితోపాటు… రాజధాని తరలింపులో అమరావతి రైతులతోపాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతునిచ్చే కార్యాచరణను, ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అమరావతిపై బీజేపీ కొత్త నాయకత్వం మాట మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ పార్టీ నాయకుడయిన ఓ.వి.రమణ, ఓ పత్రికకు రాసిన వ్యాసంపై,  సోము వీర్రాజు నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు విధించిన విషయం తెలిసిందే.

బీజేపీలో చేరకముందు వరకూ.. రాయలసీమ బలిజ హక్కుల కోసం ఉద్యమించిన రమణ, తిరిగి కుల ఉద్యమంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం కాపు-బలిజలకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు…  జగన్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ, కాపు-బలిజలతో కలసి మరోసారి, రాష్ట్ర స్థాయి ఉద్యమం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా, కోస్తా-సీమ కాపులలో ఇమేజ్ ఉన్న వంగవీటి రాధాకృష్ణను ముందుంచి, లక్ష్యసాధన కోసం ఉద్యమించాలని నిర్ణయించారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతునిచ్చిన వంగవీటి రాధాకు, అక్కడి రైతులలో మరింత ఇమేజ్ పెరిగింది. ఇటీవలి కాలంలో టీడీపీ కార్యకలాపాల్లో అంతగా పాల్గొనని రాధా.. ఇకపై కాపు ఉద్యమంలో, చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అందుకు గురువారం నాటి బెజవాడ భేటీ నాందీప్రస్తావన కానున్నట్లు కాపు వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గ అధిపత్యాన్ని సవాల్ చేసే బలిజలను, చైతన్యవంతులను చేసే ప్రణాళికకు సైతం, గురువారం నాటి భేటీలో బీజం పడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఏపీలో మళ్లీ కాపు ఉద్యమం, ఐదు శాతం అగ్రవర్ణ కోటా అమలు డిమాండ్‌తో మరోసారి ఊపందుకోనుంది.

1 COMMENT