శారదాపీఠం కంటే అయోధ్య ముఖ్యమా?

239

జగనెక్కడ? మోదీ ఎక్కడ?
ప్రత్యక్ష ప్రసారంపై బీజేపీ విమర్శలా?
రాజు గారూ… మీరు మరీనూ?!
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘అయోధ్యలో జరిగే భూమిపూజకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెళ్లాలి. ఎస్వీబీసీ దానిని ప్రత్యక్ష ప్రసారం చేయాలి’
-యుశ్రారైకా ఎంపీ రఘురామకృష్ణంరాజు
‘ప్రపంచంలోని 250 చానెళ్లు అయోధ్య భూమిపూజను ప్రత్యక్షప్రసారం చేస్తే, ఎస్వీబీసీ ఎందుకు ఆ పనిచేయలేదు? అందుకు బాధ్యులైన సీఈఓపై చర్య తీసుకోవాలి. సీఎం జగన్ విశాఖలో శారదాపీఠానికి వెళితే ప్రత్యప్రసారం చేసిన ఎస్వీబీసీ అయోధ్యను ఎందుకు విస్మరించింది? వీవీఐపిలు, నాయకుల దర్శనాలప్పుడే కనిపిస్తారా?’
– బీజేపీ నేత, నెహ్రు యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు విష్థువర్దన్‌రెడ్డి

అయోధ్యలో భూమిపూజను ప్రత్యక్ష ప్రసారం చేయని ఎస్వీబీసీ చానెల్ సీఈఓ తీరుపై వచ్చిన విమర్శలివి. ఇవి చేసిన వారిలో ఒకరు ఎంపీ, మరొకరు కేంద్ర సహాయ హోదా మంత్రి ఉన్న నాయకుడు. ఈ స్థాయి నాయకులిచ్చిన ఈ ప్రకటన చూస్తే, వారు ఎంత అమాయకులో, ఇంకా ఏ కాలంలో ఉండి బతుకుతున్నారో ఆలోచిస్తే వారిపై ఎవరికయినా జాలి వేయక తప్పదు.

అసలు అయోధ్యకు- ఆ పరమేశ్వరుడే దిగివచ్చి స్థాపించిన శారదా పీఠానికి, పోలిక ఎందుకో అర్ధం కావడం లేదు. అయోధ్య అంటే అది, ఒక మతానికే పరిమితమయిన ప్రాచీన దేవాలయం. ఇప్పుడు అక్కడ పూజలేవీ జరగడం లేదు. ప్రధాని వచ్చి కొత్త ఆలయానికి భూమిపూజ చేశారు. అయితే..? దానిని ఎస్వీబీసీ చానెల్ ఆగమేఘాలపై వెళ్లి ప్రత్యక్ష ప్రసారం చేయాలా? ప్రైవేటు చానెళ్లు చేస్తే, మేధావులతో కొలువుదీరిన ఎస్వీబీసీ చానెల్ కూడా వారితో పాటు ప్రత్యక్ష ప్రసారం చేయాలా? పైగా.. జగన్ విశాఖ పీఠానికి వెళితే ప్రత్యక్ష ప్రసారం చేయలేదా? అన్న పుల్లవిరుపు ప్రశ్నొకటి! విష్ణువర్దన్‌రెడ్డి అసలు జగనన్నను, ఆయన రాజగురువైన శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి గురించి ఏమనుకుంటున్నారు? అయోధ్యకు మోదీ వెళితే మన ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయాలా? దానిని జగన్ విశాఖ పీఠం పర్యటనతో ముడిపెట్టడం ఏమిటి? అంటే మా జగనన్న- ఆ మోదీ ఒక్కటేనా ఏమిటి?

బీజేపీ విష్ణు లెక్క ప్రకారం.. అయోధ్య-విశాఖ పీఠం ఒకటేనా? ఆ మాట అనడానికి విష్ణుకు ఎంత ధైర్యం? ఆయనది గుండెనా? చెరువా? స్వామివారెంత మహిమాన్వితుడో, ఆయనను ఒకేసారి దర్శనం చేసుకున్న తన పార్టీ రథసారధి సోమువీర్రాజు-వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డినీ, అడిగి తెలుసుకుంటే మంచిది. విశాఖ పీఠం అనేది పరమాచార్య సంకల్పిత పీఠం. దేశంలో తొలి రాజకీయ-ఆధ్మాతిక ప్రవచన పీఠం అదొక్కటే. ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చేయగలిగిన, మహిమాన్విత పీఠం అది. అక్కడ ఉన్నది.. ఒక సాధారణ భక్తుడికి, మనసారా ముద్దులిచ్చిన ఓ మహాపీఠాధిపతి!

అలాంటి మహర్షి పీఠానికి ఒక సీఎం వెళ్లినప్పుడు, ఎస్వీబీసీ చంద్రుడికో నూలుపోగులా.. ఆ లోకోత్తర దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేమిటి? మోకాలికీ-బట్టతలకూ లంకెపెట్టినట్లు,  అయోధ్యకు-శారదా పీఠానికి లంకేమిటి? ఏదైనా అదృష్టం ఉంటేనే జరుగుతుంది. అయోధ్య ప్రత్యక్ష ప్రసారంతో, రాముడిభక్తులు చరితార్ధులయే యోగం లేదేమో మరి? వెంకటేశ్వరస్వామి వారు కూడా,  రామభక్తులపై కరుణ చూపలేదేమో? అందుకు ఎస్వీబీసీ చానెల్‌ను, అందులో మహ బాగా పనిచేస్తున్న సీఈఓను నిందించడం, ఎంత వరకూ న్యాయం? పైగా.. ఆ చేసే విమర్శలేవో,  ప్రత్యక్ష ప్రసారం వరకూ పరిమితం కాకుండా, మధ్యలో జగనన్న-ఆయన రాజగురువు, కలియుగ దైవస్వరూపడయిన  స్వరూపానందను లాగడానికి విష్ణుకు ఎంత ధైర్యం?

ఆరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం ఉన్నందున, అయోధ్యలో జరిగిన భూమిపూజను ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని, దయ గల సీఈఓ గారు ‘ఒకరోజు ఆలస్యంగానయినా’ వివరించారు. పైగా.. అసలు ఎస్వీబీసీ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని, పాలకమండలి ఆ దిశగా అనేక చర్యలు తీసుకుందని సెలవిచ్చారు. నిజమే.. వెంకటేశ్వరస్వామి కల్యాణం ఎలాగూ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కాబట్టి, అయోధ్యలో కొద్ది గంటల పాటే జరిగిన, భూమిపూజను ఎందుకు చూపించకూడదు? పోనీ, ఆ తర్వాతయినా రికార్డయిన ఆ కార్యక్రమాన్ని చూపించవచ్చు కదా? ఈ రెండూ కాకపోతే, అటు శ్రీవారి కల్యాణం ఒకవైపు- ఇటు అయోధ్య భూమిపూజ మరోవైపు చూపించవచ్చు కదా? అన్నది, రామభక్తుల లా పాయింటు.

ఇట్టెట్రా అంటే ఇల్లంతా నాదేనన్నట్లు..  ఏదో భక్తులపై దయదలచి.. ఒక రఘురాముడు, మరో విష్ణువర్దనుడు అడిగారు కదాని, ఒక రోజు ఆలస్యంగానయినా అయోధ్య కార్యక్రమం చూపించాం కదా? అందుకు సంతోషపడండి. అంతేగానీ, ఆ సమయంలో ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదని అడగకండి. మీ ప్రాప్తం అంతే మరి. అంతే కదా.. సీఈఓ గారూ?! రామభక్తులూ.. మీకు అర్ధమవుతోందా?