కాంగ్రెస్ నేతను కమల దళపతి కలవచ్చా?

567

కాంగ్రెస్ నేతను కమల దళపతి కలవచ్చా?
ఇంకా కాంగ్రెస్‌కు రాజీనామా చేయని చిరంజీవి
ఆయనతో సోము భేటీపై పార్టీలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

భారతీయ జనతా పార్టీకి వ్యక్తుల కంటే సిద్ధాంతం ముఖ్యం. అంటే మామూలు ఇతర పార్టీల మాదిరిగా, వ్యవహరించడం బీజేపీలో ఉన్న వారికి సాధ్యం కాదు. పార్టీ అంటే పార్టీనే. తన కులం వాడయినా సరే, ప్రత్యర్ధి పార్టీ నేతను కలవడానికి ఆ పార్టీ సిద్ధాంతం అస్సలు ఒప్పుకోదు. అలాంటి సిద్ధాంత పునాదుల మీద పుట్టిన పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు..  ఆ లాజిక్కు  మిస్సయ్యారు. తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి ఇంటికి వెళ్లి, ఏవిధంగా  సన్మానం చేయించుకున్నారన్న చర్చ, ఇప్పుడు ఆ పార్టీలో ఆసక్తి కలిగిస్తోంది.

కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని,  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేసి ఉంటే, ఆయనతో బీజేపీ చీఫ్ భేటీ అవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అప్పుడాయనను ఒక సినిమా హీరోను మర్యాదపూర్వకంగా కలసిశారనుకోవచ్చు. పోనీ, చిరంజీవి.. ముద్రగడ మాదిరిగా  కాపు వర్గ నేతగానో, కాపునాడు నాయకుడిగానో ఉన్నా.. ఆయనను కలిస్తే, ఎవరూ ఆ భేటీని ఆక్షేపించరు. కానీ ఇంకా కాంగ్రెస్ నాయకుడిగానే కొనసాగుతున్న చిరంజీవిని,  బీజేపీ అధ్యక్షుడు ‘మర్యాదపూర్వకంగా ’ ఎలా కలిశారన్న ఆశ్చర్యం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ వ్యతిరేకతపై పుట్టి, సిద్ధాంతాలనే మడి కట్టుకున్న సంఘ్‌లో స్వయంసేవకుడిగా పనిచేసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగిన సోము వీర్రాజు.. అదే కాంగ్రెస్ నాయకుడితో కలవడమే, పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. ఒకవేళ అది వ్యక్తిగత కలయిక అనుకున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకుడితో వ్యక్తిగత కలయిక విషయం బయటకు తెలిస్తే.. అది ఎలాంటి సంకేతాలు-చర్చకు దారితీస్తుందో,  బీజేపీ సిద్ధాంతాలను కాచి వడపోసిన సోముకు తెలియనిది కాదు. పైగా.. చిరంజీవిని కలసిన ఫొటోలను, పార్టీనే అధికారికంగా విడుదల చేయడం మరో ఆశ్చర్యకర పరిణామం. ఏపీ సీఎం జగన్ దంపతులను కలసిన సందర్భంలో.. మూడు రాజధానుల ఆలోచనకు చిరంజీవి మద్దతునిచ్చిన వైనంపై, అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. తమ్ముడు పవన్ కల్యాణ్.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తే, అన్నయ్య చిరంజీవి మాత్రం,  దానిని స్వాగతించడమే ఆ చర్చకు కారణం.

పోనీ.. బీజేపీ అధ్యక్ష హోదాలో, జనసేన దళపతి పవన్‌ను కలసినా.. పార్టీ వర్గాలలో ఇంత చర్చ జరిగేది కాదు. ఎందుకంటే..ఆయన అధికారికంగానే బీజేపీతో కలసి ఉన్నారు కాబట్టి. ఒకవేళ దానిని ఎవరైనా వ్యతిరేకించినా, వారే అభాసుపాలవుతారు. కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న చిరంజీవిని, ఆ పార్టీని జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కలవడాన్ని, కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో చురుకుగా లేరు. అయినప్పటికీ, ఆయన కాంగ్రె స్ పార్టీకి రాజీనామా చేయనందున, ఇంకా ఆ పార్టీ సభ్యుడిగానే పరిగణించక తప్పదు.రేపు బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటించిన తర్వాత,ఎవరైన దళిత బీజేపీ నేత పీసీసీ అధ్యక్షుడు శైలజనాధ్‌ను,కాపు బీజేపీ నాయకుడు ఏ పళ్ళం రాజును కలిస్తే ఇలాగే స్వాగతిస్తారా?లేక వారిపై సస్పెన్షన్ వేటు వేస్తారా?అన్నది ప్రశ్న.  అయితే… మొన్నామధ్య.. టీవీ9 చర్చలో,  ‘మేం ఎవరిని కలిస్తే మీకెందుకు బాధ?’ అని రజనీకాంత్‌ను  ప్రశ్నించినట్లుగానే.. ‘నేను కాంగ్రెస్ నాయకుడిని కలిస్తే మీకెందుకు బాధ?’ అని సోము ఎదురు ప్రశ్నిస్తారా? చూడాలి!