ప్రశ్నించే పార్టీతో పొత్తు.. ప్రశ్నిస్తే మాత్రం వేటు!

560

 జీవీఎల్, సుజనాను వదిలి రమణపై వేటు
బీజేపీ.. భలే భలే
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

హేమిటో.. ఆంధ్రాలో బీజేపీ నావ ఎటుపోతుందో తెలియడం లేదు. విరుద్ధ ప్రకటనలు, విభిన్న వాదనలతో గజిబిజి గందరగోళంగా మారిన తమ పార్టీ వైఖరిని చూసి,  కమలనాధులే కళ్లు తేలేస్తున్నారు. మొన్నా మధ్య.. రాజధాని బిల్లులపై, పార్టీ  ఎంపి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై,  రాష్ట్ర నాయకత్వం ఆగమేఘాలపై స్పందించింది. పార్టీకి ఆయన ప్రకటనతో  సంబంధం లేదని ట్వీటింది. కానీ, అదే పార్టీ ఎంపి జీవీఎల్ నరసింహారావు.. గతంలో రాష్ట్ర పార్టీ విధానాలతో విబేధించి లెక్కలేనన్నిసార్లు మాట్లాడినా, ఆయనపై దేవధరుడు ఎలాంటి చర్య తీసుకోకపోవడం, మరో తమాషా ముచ్చట.

ఇక టీవీ డిబేట్లకు వెళ్లిన సీనియర్ నాయకుడు, లక్ష్మీపతిరాజాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. మళ్లీ తొలగించామని చెబుతున్నారు. ఆ కథేంటో ఎవరికీ తెలియదు. సాక్షి చానెల్‌కు వెళ్లిన లక్ష్మీపతి రాజా, నాటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై ఆ చర్చలో పాల్గొన్న వారు వ్యతిరేకంగా మాట్లాడినా, లక్ష్మీపతిరాజా మౌనం వహించారట. అదీ అభియోగం. ఇక జాతీయ చానెళ్లలో నిరంతరం కనిపించే మరో నాయకుడు లంకా దినకర్, ఆ సమయంలోనే ఏబీఎన్ చానెల్‌కు వెళ్లారు. అక్కడ హటాత్తుగా అమరావతి గురించి చర్చ జరిగింది.  తాను చర్చ అంశాన్ని దాటివెళ్లనని, అయినా అడిగారు కాబట్టి, అమరావతిపై పార్టీ తన వైఖరికి కట్టుబడి ఉందని చెప్పారు.

దానిని రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్, చాలా ప్రతిష్ఠగా తీసుకున్నారట. ఆయనపై కూడా వేటు వేయాలని రాష్ట్ర నాయకత్వంపై కొన్ని రోజులు నానా ఒత్తిళ్లు తెచ్చిన మీదట, చివరాఖరకు షోకాజ్ నోటీసులిచ్చారట. అయితే, జాతీయ మీడియాలో నిరంతరం కనిపించే లంకా దినకర్ వ్యవహారం… అదే జాతీయ మీడియాతో నిరంతరం టచ్‌లో ఉండే, ఓ తెలుగు ఎంపీకి మింగుడు పడలేదట. టీడీపీ నుంచి కొత్తగా వచ్చిన దినకర్.. ఏళ్ల నుంచి జాతీయ మీడియాలో పాతుకుపోయిన తనకు,  ఎక్కడ పోటీ అవుతారన్న ముందుచూపుతోనే, లంకాపై వేటు వేయించినట్లు, కమలదళాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత నాయకత్వ మార్పులో.. చక్రం తిప్పిన సదరు ఎంపీ మాటలకే, రాష్ట్ర ఇన్చార్జి తలాడిస్తున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచీ ఉంది. ఆయన సూచనల ప్రకారమే, లంకాకు షోకాజ్ ఇచ్చినట్లు కమలదళాలు చెబుతున్నాయి.

ఇక ’మూడుముక్కలాటలో నష్టపోతున్న బీజేపీ’ పేరుతో,  తిరుపతికి చెందిన బీజేపీ నాయకుడు, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు  ఓ.వి.రమణ తాజాగా ‘ఆంధ్రజ్యోతి’లో ఒక వ్యాసం రాశారు.  దేవెగౌడ సారధ్యంలోని, జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధిగా సుదీర్ఘకాలం పనిచేసి, దేవెగౌడకు సన్నిహితుడయిన రమణ..  చాలాకాలం క్రితమే బీజేపీ జాతీయ దళపతి నద్దా సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు, దానికంటే ముందు జనతాదళ్‌లో పనిచేసినప్పుడూ.. రాష్ట్ర-జాతీయ టీవీ చానెళ్ల చర్చలు, ప్రతికల్లో వ్యాసాలతో  రమణ చాలా చురుకుగా ఉండేవారు. తాజాగా ఆయన రాసిన వ్యాసం, రాష్ట్ర నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. ఇంతకూ ఆయనేమైనా పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా ఏమైనా  వ్యాసం రాశారనుకుంటే పొరపాటే. అమరావతిపై పార్టీ అనుసరిస్తున్న వైఖరి వల్ల కార్యకర్తలు గందరగోళంలో పడుతున్నారని, ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారని వెల్లడించారు. అది పార్టీపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ‘రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, ఇక మద్దతు దేనికి ఇస్తున్నట్లు’ అని సందేహం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడు సోము.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తర్వాత రాసిన వ్యాసమది.

‘అమరావతికి మద్దతు ఇస్తాం. కానీ రాజధాని ఎక్కడ పెట్టాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. అమరావతిపై గతంలో బీజేపీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామ’న్న వీర్రాజు తెలివైన వ్యాఖ్య.. బహుశా అందరు పామరులు-తెలివిలేనివారి మాదిరిగానే, ఆ పార్టీలో ఉన్న ఓ.వి.రమణకూ అర్ధమయి ఉండదు. సోము వీర్రాజు కూడా ఆ స్థాయిలో, ప్రణబ్‌ముఖర్జీ మాదిరిగా మాట్లాడారు మరి! కాంగ్రెస్‌లో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న ప్రణబ్ దాదా కూడా, అందరికీ అర్ధమయి-అర్ధంకాకుండా నోట్స్ ప్రిపేర్ చేస్తుంటారు. సమైక్య-ప్రత్యేకవాద ఉద్యమ సమయంలో, ప్రత్యేక రాష్ట్రంపై రెండుసార్లు కేంద్రం చేసిన ప్రకటన,  ప్రణబ్‌సాబ్ లిఖించినదే.

అలాగే… చంద్రబాబు పిలిస్తేనే మోదీ వచ్చారన్న సోము మాటలపైనా, రమణ కూడా అందరు పామరుల మాదిరిగానే, సందేహం వ్యక్తం చేశారు. 1500 కోట్ల రూపాయల నిధులు, ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం మంజూరు, అమరావతికి నిధుల కోసం బాండ్ల అమ్మకాలకు అనుమతించడం, హైకోర్టు, కంపెనీలా కోర్టు ఇవన్నీ అమరావతిగా రాజధాని ఉన్నందుకే   కేంద్రం అనుమతించింది కదా? అని బుర్ర ఉన్న వారి  మాదిరిగానే, ధర్మ సందేహం వ్యక్తం చేశారు. తన వ్యాసంలో అన్ని సందేహాలు వ్యక్తం చేసిన రమణ..  ఇలాంటి వైఖరి ఏపీలో పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుందని, మిగిలిన పార్టీల మాదిరిగా బీజేపీ ఉండకూడదని అభిప్రాయపడ్డారు.  సిద్ధాంతాల ప్రాతపదిక పనిచేస్తున్న పార్టీ నాయకుల మనోభావాలు గౌరవించి, బీజేపీ అంటే ఒకే మాట-ఒకే సిద్ధాంతం అన్న సంకేతం వెళ్లాలన్న సూచన, సలహా కూడా ఇచ్చారు. ఇదీ ఓ.వీ.రమణ అనే నాయకుడిపై వేటుకు కారణం.

ఇంతకూ.. ఇదే ‘బలిజనాడు’ కన్వీనర్ కూడా అయిన,  ఓ.వి.రమణ అనే నాయకుడు కొద్దిరోజుల క్రితం, నాటి అధ్యక్షుడు కన్నాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు..  అదే ‘ఆంధ్రజ్యోతి’లో విజయసాయిపై ఘాటు వ్యాసం రాశారు. విజయసాయి గత వైఖరిని గుర్తు చేసి, నిలదీశారు. అప్పుడెవరూ ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వనేలేదు. అదొక విచిత్రం! సొంత పార్టీ అధ్యక్షుడిపై, మరొక పార్టీ నేత ఆరోపణ చేస్తే,  రాష్ట్ర ఇన్చార్జి నుంచి ముఖ్యుల వరకూ ఎవరూ ఖండించని సమయంలో.. ఇదే ఓ.వి.రమణ తన వ్యాసాలతో విరుచుకుపడ్డారు. మరి అదే రమణను ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఇదొక విచిత్రం!  పైగా.. కాపు-బలిజ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న, బలిజనాడు  కన్వీనర్‌నే సస్పెండ్ చేసిన పరిస్థితి.

సరే. బాగానే ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనకు భిన్నంగా మాట్లాడిన.. ఎంపి సుజనాచౌదరికి షోకాజ్ నోటీసు గానీ, సస్పెన్షన్‌గానీ ఎందుకు చేయలేదు? ఓ వైపు పార్టీ విధానం అమరావతి రాజధాని అన్నప్పుడు, కర్నూలునే రాజధాని చేయాలని లెక్కలేనన్నిసార్లు గళం విప్పిన, మరో ఎంపి టిజి వెంకటేష్‌కు ఎందుకు షోకాజ్ నోటీలు ఇవ్వలేదని…పార్టీలో అమాయకులు వేస్తున్న ప్రశ్న.

అయినా.. ప్రశ్నించేందుకే పుట్టిన, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న భాజపా.. తన సొంత పార్టీలో మాత్రం, ప్రశ్నించిన వారిపై వేటు వేస్తుండటమే ఆశ్చర్యం. ప్రశ్నించే నైజం పెరగాలని, ఓ పక్క కొత్త-పాత పార్టనర్ పవన్ రోజూ పిలుపునిస్తున్నారు. దాన్ని పాటిస్తున్న నాయకులపైనేమో,  భాగస్వామ్య బీజేపీ వేటు వేస్తోంది. ఇదేం విచిత్రమో?!