లక్నో : ఈ రోజు భారత దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారత దేశం ’వసుధైక కుటుంబకం‘ అన్న వాక్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని, మన దేశ వాసులకున్న ఈ స్వభావమే ప్రతి సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనగలదని ఆయన పేర్కొన్నారు. రామ మందిర భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు పోరాటం చేయాలని, అప్పుడే అది ఫలిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సరసంఘ చాలకులు బాలాసాహేబ్ దేవరస్ అనేవారని, ఆ విషయం ఇంకా గుర్తుందని అన్నారు. దీని కోసం 30 సంవత్సరాల పోరాటం చేశామని, ఇప్పుడు దాని ఫలాలను అనుభవిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. వీరితో పాటు ఇంకా అనేక మంది ఉన్నారని, అయితే వారందరూ భౌతికంగా హాజరయ్యే పరిస్థితి లేదని, కాలం అలాంటిదని ఆయన పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణమే ఊపిరిగా చాలా మంది బతికి… శరీరం విడిచిపెట్టారని… వారందరూ సూక్ష్మ రూపంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని, మిగితా వారందరూ తమ మనస్సుతో చూస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో స్వావలంబన దిశగా పనులు జరుగుతున్నాయని, కరోనా తర్వాత ప్రపంచం మొత్తం కూడా కొత్త మార్గాల కోసం వెతుకుతోందన్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న లక్షలాది దేవాలయాల మాదిరిగానే ఈ అయోధ్య మందిర నిర్మాణం కాదని, ఈ దేవాలయాల ఆశయాలు ఏవైతే ఉన్నాయో… వాటన్నింటినీ తిరిగి మననం చేసుకుంటూ వాటిని సాధించే దిశగా అడుగులు వేయడమే ఈ మందిర నిర్మాణ లక్ష్యమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner