పరువు తీస్తున్న.. జగనన్న పాత పలుకులు

123

ఆత్మరక్షణలో యుశ్రారైకా పార్టీ నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మాట తప్పటం-మడమ తిప్పటం వైఎస్ కుటుంబ చరిత్రలోనే లేదు. హలో.. ఇక్కడ వైఎస్ అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకునేరు! అట్టెట్టా కుదురుతుంది? ఈ వైఎస్ కూడా కొన్ని వందల డజన్ల సార్లు.. ‘మాది మాట తప్పని-మడమ తిప్పని వంశమని’ చెప్పారు కదా? ఏవో పాత డైలాగులు గుర్తు చేయకండి. అది అప్పుడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు! అవసరార్ధం అనేకం చెబుతుంటారు. అందులో రాజకీయ పార్టీ నాయకుడాయె!  అన్నీ నమ్మేస్తే ఎలా? అవును. అమరావతిలో 23 వేల ఎకరాలతో రాజధాని నిర్మించాలని, జగనన్న అప్పుడు అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పారు. తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని మైకు పక్కకులాగి, హామీ ఇచ్చారు. ఆ… ఇస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత, వాటిని అమలుచేయాలని ఏమైనా రూలుందా? ఆశ దోశ అప్పడం వడ! చెప్పినవేమీ చేయం. చేయమంటే చేయం. అంతే! ఏం చేస్తారు? తండ్రి మాట మీద నిలబడే నాయకుడయితే, కొడుకూ అలాంటివాడే కావాలని రూలుందా? రాజీవ్‌గాంధీకీ-రాహుల్‌గాంధీకి, చంద్రబాబుకు-లోకేషుకూ తేడా లేదూ? ఇదీ అంతే!

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత.. ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్న,  పాత పలుకులు చూస్తే నిజమనిపించకమానదు.  ‘తద్దినం మంత్రం వేరు-తలంబ్రాలు తంతులు వేరని’ తెలిసినా.. వైసీపీ సోషల్‌మీడియా దండు, గత ఎన్నికల ముందు తెదేపాని భ్రష్టు పట్టించేందుకు, అన్నీ మిక్స్ చేసి కలిపికొట్టు కావేటిరంగా మాదిరిగా జనంపై వదిలారు. అది తగలాల్సిన చోటనే తగిలి, ఓటమిపాలయ్యారు.

గద్దెనెక్కిన తర్వాత వైసీపీ చేతలు-నాటి మాటల మధ్య ఉన్న తేడా వివరిస్తూ.. ఇప్పుడు టీడీపీ కూడా నాటి  వైకాపా మాదిరిగానే, సోషల్‌మీడియానే వేదికగా ఎంచుకుని, వీడియో యుద్ధానికి తెరలేపటం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకూ ఎన్నికల ముందు, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల వీడియోలను జనంపైకి వదిలిన టీడీపీ.. ఇప్పుడు అమరావతి వీడియోలను ప్రదర్శిస్తోంది. ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు, జగన్ అమరావతిపై ఏం మాట్లాడారు? ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు, చేసిన రాజీనామా హెచ్చరికలు, రోజా ఫైర్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా త్యాగం, మీడియాపై ఉమ్మారెడ్డి చిటపటలు ఇవన్నీ.. వీడియోలలో విస్తతృంగా ప్రజల్లోకి వెళ్లి చర్చనీయాంశమవుతున్నాయి.

ఎప్పుడయితే వికేంద్రీకరణ బిల్లులపై గవర్నరు సంతకం చేశారో, అప్పటినుంచే జగనన్న.. గతంలో అమరావతిపై మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీల వీడియోలు విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాలకుడి పాత పలుకులు చూసిన ప్రజలు, మాట తప్పిన వైనాన్ని చూసి గతం గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ పాలకుడి పరువు గంగపాలు చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు, అమరావతికి జగన్ వ్యతిరేకమని తెదెపా సోషల్‌మీడియా బృందాలు ప్రచారం చేశాయి. కాబట్టి ఆయన సీఎం అయితే, అమరావతిని రాజధాని నుంచి తరలిస్తారని ప్రచారం చేశాయి. దానిని జగనన్న తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో కూడా, అమరావతిలో రాజధాని నిర్మాణానికి మద్దతునిచ్చారు. తర్వాత తాడేపల్లిలో సొంత ఇల్లు నిర్మించుకున్న జగనన్నను చూసి.. అనవసరంగా ఆయనపై నోరుపారేసుకున్నామే, మాటతప్పని శ్రీరామచంద్రమూర్తిని అనవసరంగా అనుమానించామని, చాలామంది బాధపడ్డారు.

దానితోపాటు.. రోజా అక్కయ్య కూడా, జగన్‌గారు తాడేపల్లిలో ఇల్లు కట్టి.. ఆయన అమరావతికి వ్యతిరేకమని, ప్రచారం చేసిన వారి చెంప ఛెళ్లు మనిపించారన్నారు. అప్పుడందరూ ‘జగనన్న ఇంటినే అమరావతికి మద్దతు’గా చూపించారు. దానితో జగనన్న అమరావతికి, అనుకూలం కామోసనుకున్నారు. తీరా ఇప్పుడు, మూడు రాజధానులకై జైకొట్టడంతో ఖంగుతినాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఒక రోజా.. ఇంకో వసంతకృష్ణప్రసాద్, మరో ఉమ్మారెడ్డి ఏమంటారో?