ఈ అవమానం.. గవర్నరుకా? సీఎమ్‌కా?

647

జడ్జిలు హీరోలు…పాలకులు జీరోలు ఎందుకవుతున్నారు?
ఖండించని కమలం వ్యూహాత్మక తప్పిదం చేసిందా?
ఒక స్టే.. ఎన్నో ప్రశ్నలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజధానుల బిల్లులను త్రోసిపుచ్చిన ఏపీ హెకోర్టు ఇచ్చిన స్టే సందేశం ఏమిటి? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో జడ్జీలు హీరోలు, పాలకులు జీరోలుగా మిగులుతున్న పరిస్థితి ఎందుకొస్తోంది? తాజా స్టే అవమానం సర్కారు ప్రతిపాదనలపై సంతగించిన గవర్నరుదా? రాగల పరిణామాలేమిటో తెలిసీ తెగించిన ముఖ్యమంత్రిదా? గవర్నరు సంతగించడాన్ని సర్వ పక్షాలూ వ్యతిరేకిస్తే… ఖండించకుండా మౌనవ్రతం పాటించి, కమల నాయకత్వం వ్యూహాత్మక తప్పిదం చేసిందా? ఇప్పటికే నిర్నిరోధంగా తనకు వస్తున్న తీర్పులకు వెరవకుండా, నింపాదిగా తన వైఖరినే కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మొండితనాన్ని అభినందించాలా? అభిశంసించాలా?.. రాజధాని తరలింపు బిల్లు ఆమోదించటం నుంచి, దానిని హైకోర్టులో కొట్టివేసిన  పరిణామాల అనంతరం  తెరపైకొస్తున్న ప్రశ్నలివి.

ఒక స్టే.. అనేక  ప్రశ్నలు

మూడు రాజధానుల బిల్లును కొట్టివేస్తూ, ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే అనేక ప్రశ్నలకు తెరలేపింది. అసలు ఇంత కీలకమైన బిల్లు.. తన వద్దకు పరిశీలనకు వచ్చినప్పుడు, దానిని న్యాయకోవిదుల దృష్టికి తీసుకువెళ్లి, అభిప్రాయం కోరడం గవర్నర్ చేయవలసిన మొదటి పని. గవర్నరు గారు స్వయంగా న్యాయవాది కావచ్చు. కానీ, రాజ్యాంగానికి సంబంధించిన సమస్య తలెత్తినప్పుడు, న్యాయనిపుణుల సలహా కోరడం సముచితం. గవర్నరు గారు ఆ పనిచేస్తారని అంతా భావిస్తారు. ఎందుకంటే..అంతకుముందే, ఆయన సంతగించిన  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు ఆర్డినెన్సు వ్యవహారం కూడా, ఇలాగే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

కోర్టు తీర్పులు అర్ధం కావడం లేదా?

చివరాఖరకు ఎవరికయితే వ్యతిరేకంగా తాను సంతగించారో.. మళ్లీ అదే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని, తనకు సిఫార్సు చేసిన పాలకులనే ఆదేశించాల్సి వచ్చింది కాబట్టి! అయినా మాననీయ గవర్నరుజీ, ఎందుకో ఆ పనిచేయలేకపోయారు. ఆ ప్రకారంగా గవర్నరు సంతకం చేసిన.. రెండు ఫైళ్లు కోర్టులో నిలవలేదంటే, ప్రభుత్వం అనాలోచితంగా పంపించే ప్రతిపాదనలో, న్యాయపరమైన దోషాలు ఉన్నాయని అర్ధం అవుతుంది. ఒక సందర్భంలో న్యాయసలహాదారులు, ప్రభుత్వానికి సరైన సలహాలివ్వడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ అది, గవర్నరు స్థాయి వ్యక్తికి కనిపించకపోవడమే ఆశ్చర్యం. మరి ఇప్పుడు పరువు పోయిందెవరికి?

గవర్నరు వైఖరి సరైనదేనా?

ఏ పాలకుడయినా తన నిర్ణయం సహేతుకమేనని భావిస్తారు. దానిని గవర్నరు సహా, అన్ని వ్యవస్థలూ ఆమోదించాలని ఆకాంక్షిస్తారు. అందులో 151 సీట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి వంటి బలమైన ముఖ్యమంత్రులు, అంతే బలంగా ఆకాంక్షిస్తుంటారు. కానీ, ఆయన ఆకాంక్ష వెనుక.. ఏ కాంక్ష ఉంది? అది న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉందా? లేక ప్రభుత్వానికి ఉన్న అధికారం వల్ల ఇచ్చిందా? వచ్చిందా? అని పరిశీలించి, నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత మాత్రం గవర్నరుదే. మరి ఆయన సంతకం పెట్టిన రెండు అంశాలు.. కోర్టులో ఎదురుదెబ్బలు తిన్నందున, గవర్నరు నిర్ణయం సరైనదా? కాదా? అన్నది స్పష్టమవుతూనే ఉంది.

చేదు అనుభవాలెదురయినా.. మారని సీఎం తీరు

ఇక సీఎం జగన్మోహన్‌రెడ్డి విషయం సరేసరి. మిన్ను విరిగి మీదపడినా, నిశ్చలంగా, నిర్భయంగా నిలిచే వైఖరి ఆయనది. కోర్టులతోపాటు, తాను గవర్నరు ద్వారా పంపిన నిర్ణయాలు, ప్రతిపాదనలు .. దీపావళిలో పేలని నేలటపాసులా తుస్సుమంటున్నా, ఆయన  వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. జగన్మోహన్‌రెడ్డి సహజ శైలి చూసిన వారు, అలాంటి మార్పు కోరుకోవడాన్ని అత్యాశగా అవహేళన చేస్తారేమో? 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి, నేను చెప్పిందే వేదం- చేసిందే శాసనం అని ఆయన భావించడంలో ఏమాత్రం తప్పు లేదు. నిర్ణయాలు తీసుకునే సమయంలో, ఆయన మానసిక పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు. కానీ, ఈ దేశంలో చట్టం-న్యాయం-రాజ్యాంగ  వ్యవస్థలనేవి, ఒకటున్నాయని గుర్తించకపోవడమే జగన్ చేస్తున్న పొరపాటు. 151 మంది ఎమ్మెల్యేల దళపతిగా తానెన్ని నిర్ణయాలు తీసుకున్నా, అది ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ప్రియాతిప్రియంగా అనిపించవచ్చు. కానీ, అవి రాజ్యాంగ వ్యవస్థలు రూపొందించిన, నిబంధనలకు లోబడి ఉంటేనే నిలుస్తాయన్నది,  ఆయన పక్కన ఉన్న అధికారులూ చెప్పకపోవడం- ఆయన కూడా వారిని సలహా అడగకపోవడం దురదృష్టకరం.

జగన్ ఇమేజీకి డ్యామేజీనే..

ఇప్పుడు రాజధాని బిల్లులపై హైకోర్టు స్టే విధించడం, వ్యక్తిగతంగా జగన్మోహన్‌రెడ్డి ఇమేజీకి మాత్రమే అవమానం కాదు. ముఖ్యమంత్రి హోదాకూ అవమానకరమే. ఇదే కాంగ్రెస్ నాటి కాలమయితే, ఆ ముఖ్యమంత్రి… నైతిక విలువలు పోయినట్లుగా భావించి రాజీనామా చేసేవారు. అవి సతె్తకాలపు రోజులు కాబట్టి.. ఆయన పిచ్చిమారాజు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాబట్టి, రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నది నెల్లూరు జనార్దన్‌రెడ్డి కాదు, కడప జగన్మోహన్‌రెడ్డి! ప్రతిపక్షాలు అది గుర్తుంచుకుని డిమాండ్లు చేస్తే మంచిది. తన వైఖరి  కోర్టులో నిలవదని తెలిసినా, ఎమ్మెల్యేల బలంతో వచ్చిన అధికారం చూసుకుని, తీసుకునే నిర్ణయాలకు న్యాయామోదం ఎప్పుడూ ఉండదని.. ఇన్ని ఎదురుదెబ్బల తర్వాత కూడా గ్రహించటపోవడమే విచిత్రం.

సాధారణ మున్సిపల్ చైర్మన్ స్ధాయిలో…

మునిసిపల్ చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యేవారంటే..వారికి తొందర, దూకుడు, ఉంటుందనుకోవచ్చు. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికీ,  ఆ స్థాయి తొందర ఉండటం ఇప్పుడే చూస్తున్నాం. కొత్తగా ఎన్నికయిన మున్సిపల్  చైర్మన్, తాను తన పట్టణాన్ని అద్భుత ంగా మార్చాలనుకుంటారు. అంతకుముందు చైర్మన్ పనితీరుపై, కసితో రగిలిపోతుంటారు. దానికితోడు.. చైర్మన్ పదవి రాగానే, రోజూ ఇంటికి కమిషనరు, మునిసిపల్ అధికారులు, ప్రజలతో ఆయన నివాసం అధికారదర్పంతో వెలిగిపోతుంటుంది. పట్టణ పర్యటనలో భాగంగా, బాగా ఇరుకుగా ఉన్న ప్రధాన ర హదారి వల్ల సమస్యలు వస్తున్నాయని ఆయన భావిస్తారు.

అధికారులు చెప్పరా..?

కమిషనరును పిలిచి, ఆ ప్రాంతంలో వెంటనే రోడ్డు వెడల్పు చేయాలని ఆదేశిస్తారు. తనకు ఎక్కడ ఉద్యోగం చేసినా ఒకటే అనుకునే ఎల్వీ సుబ్రమణ్యం లాంటి అధికారయితే.. అది ఒకేసారి సాధ్యం కాదని చెబుతారు.  ఎందుకంటే అక్కడ చాలామంది నివసిస్తున్నారు, షాపులు ఉన్నందున.. ముందు వారితో సమావేశం ఏర్పాటుచేద్దామని సూచిస్తారు. నష్టపరిహారం, ప్యాకేజీ ఇస్తే ప్రజలు, వ్యాపారులు అంగీకరించవచ్చేమోనని సలహా ఇస్తారు. లేకపోతే ఏకపక్షంగా కూలిస్తే కోర్టుకు వెళతారని హెచ్చరిస్తారు. మూర్ఖంగా కాకుండా, తెలివైన చైర్మనయితే… సరే అలాగే వెళదాం. ముందు వారితో సమావేశం ఏర్పాటుచేయించండి అని సూచిస్తారు. అదే మూర్ఖంగా ఆలోచించే చైర్మనే అనుకోండి. ఆ కమిషనర్ తనకు వద్దని ఎమ్మెల్యేకి చెప్పి, ఆయనను ఎల్వీ మాదిరిగా బదిలీ చేయిస్తారు.

పాలకుల ఇగోను చల్లబరుస్తున్నారా?

అదే.. పోస్టింగుల కోసం తపన పడే, కమిషనరే ఉన్నారనుకోండి. చైర్మను చెప్పిన వెంటనే ఆదేశాలిచ్చేస్తారు.  తన ఇగో చల్లబడినందుకు అది  చైర్మనుకూ ఆనందం ఇస్తుంది. కానీ  వెంటనే బాధితులు కోర్టుకు వెళ్లడం, కోర్టు కమిషనరు నిర్ణయాన్ని కొట్టివేయడం జరుగుతుంది. ఇది పాతకాలంలో వచ్చిన చాలా సినిమాల్లో చూసిన దృశ్యాలే. ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివినందున, బహుశా ఆ బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలు చూసి ఉండకపోవచ్చు. ఆయనంటే సరే.. మరి సీఎం దగ్గర పనిచేసే అధికారులు, బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలు చూసి ఈ స్థాయికి వచ్చిన వారే కదా? వారయినా సీఎంకు చెప్పవచ్చు కదా అన్నదే అందరి  సందేహం!

రాజధానిపై బీజేపీ లేఖకు విలువ ఉందా? లేదా?

ఇక ఈ వ్యవహారంలో ఒక రాజకీయ పార్టీగా,  బీజేపీ ఎలా వ్యూహాత్మక తప్పిదం చేసిందో చూద్దాం. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, గవర్నరు వద్దకు రాజధానుల ప్రతిపాదనను పంపినప్పుడు, రాష్ట్రంలోని విపక్షాలన్నీ తప్పుపట్టాయి. దానిని తిరస్కరించాలని డిమాండ్ చేశాయి. చివరకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర అధ్యక్షుడయిన కన్నా లక్ష్మీనారాయణయితే… ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని లేఖ కూడా రాశారు. అంటే… ఒక రాజకీయ పార్టీగా బీజేపీ దానిని వ్యతిరేకించిందన్న మాట. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజల మనోభావాల ప్రకారమే పనిచేస్తుంది. చేయాలి కూడా. బీజేపీ రాష్ట్ర శాఖ అదే పనిచేసింది. కానీ, ఆ తర్వాత ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, సోము వీర్రాజును ఆయన స్థానంలో నియమించారు. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం.

కానీ.. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గవర్నరుకు రాసిన లేఖ ఆ పార్టీ అభిప్రాయంగానే భావించాలి. ఆయన తర్వాత వచ్చిన ఏ అధ్యక్షుడయినా, ఆ విధానమే కొనసాగించాలి. ఎందుకంటే బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ అన్నది విస్మరించకూడదు. జాతీయ పార్టీలకు వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. అక్కడి వరకూ.. ఒక్క అధికార వైసీపీ మినహా, రాష్ట్రంలోని విపక్షాలన్నీ మూడు రాజధానుల బిల్లును, వ్యతిరేకిస్తున్నట్లుగానే మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

ఎందుకీ పిల్లిమొగ్గలు?

కానీ, నాయకత్వం మారిన తర్వాత.. బీజేపీ విధానం కూడా తల్లకిందులయి, రాజధానిపై పిల్లిమొగ్గ వేయడం ఆశ్చర్యపరిచింది. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు, తొలుత ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కర్నూలులో హైకోర్టులో పెట్టాలన్నదే తమ విధానమని చెప్పారు. గవర్నరు నిర్ణయంతో, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతే తప్ప.. గవర్నరు విధానాన్ని వ్యతిరేకించలేదు. ఖండించలేదు. ఇది ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదమేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. ఒక పక్క సొంత పార్టీ పాత అధ్యక్షుడు వద్దని లేఖ ఇస్తే, అన్ని రాజకీయ పార్టీలు బిల్లు ఆమోదాన్ని ఖండించాయి.

బీజేపీది వ్యూహాత్మక తప్పిదమేనా?

కానీ, ఒక విపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మాత్రం దాన్ని ఖండించకుండా, వేరు దారి పట్టడం సహజంగానే… సర్కారు అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న, నిందకు గురి కావలసి వచ్చింది. నిజంగా బీజేపీ, అధికార వైసీపీ మిత్రపక్షమయి ఉంటే, ఆ పార్టీ వైఖరిని ఎవరూ తప్పుపట్టరు. కానీ, విపక్ష పార్టీగా ఉంటూ బిల్లును సమర్ధించడం, ఖండించక పోవడమంటే.. జాతీయ పార్టీ రాష్ట్ర నాయకత్వ వ్యూహాత్మక తప్పిదం, ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. బహుశా.. రాష్ట్రంలో దాని ఓటింగు శాతం .8 కాబట్టి, కొత్తగా వచ్చే నష్టం ఏమి ఉంటుందన్న లెక్కలేనితనమూ కావచ్చు. కానీ, మొన్నటి వరకూ  అమరావతి అనుకూల వైఖరి ప్రదర్శించిన జాతీయ పార్టీగా, ప్రజల మన్ననలు పొందిన బీజేపీ.. ఒక్కసారిగా ముద్దాయిగా నిలబడటమే దురదృష్టకరం. అన్ని పక్షాల మాదిరిగా బీజేపీ కూడా.. గవర్నరు చర్య, ప్రభుత్వ ప్రయత్నాన్ని ఖండించి ఉంటే, ఆ పార్టీ కూడా ప్రజామోదం పొంది ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడవలసి వచ్చింది. అది ఎవరి కోసం..? ఎందుకోసం? అన్నది గ్రహించలేనంత అమాయక ప్రజలెవరూ ఉండరు. దాన్ని గ్రహించకపోవడమే అసలైన అమాయకత్వం!

ఇక కోర్టులే దిక్కా..?

ఇక జనం జడ్జీలను హీరోలు, పాలకులను జీరోలుగా చూసే పరిస్థితి రావడం ఆసక్తికరం. నిజానికి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ కూడా, మరో వ్యవస్థలో జోక్యం చేసుకోదు. కానీ, ప్రభుత్వాల నిర్ణయాలు జనరంజకంగా లేకపోతే, మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనివార్యమవుతుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఒకసారి కాదు. పది సార్లు కాదు. డజన్ల సార్లు ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తిరస్కరించిన తర్వాతయినా, జగన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. పైగా.. తీర్పులిచ్చే జడ్జీల వ్యక్తిత్వ హననానికి దిగే బరితెగింపు ధోరణికి పాల్పడటం, అలాంటి మూకలకు అధికార పార్టీ ఎంపీనే అభయహస్తం ఇవ్వడం, ఆ బరితెగింపునకు పరాకాష్ఠ. రాజధానుల బిల్లులను గవర్నరు ఆమోదించిన తర్వాత, రాజధాని రైతులు కుటుంబసభ్యులతో సహా రోడ్డెక్కి.. మోకాలి మీద నిలబడ్డి, న్యాయం చేయమని  జడ్జీలను కోరుతూ, మోకాలిపై కూర్చుని రోదించిన దృశ్యాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఎంత జనరంజకంగా ఉన్నాయో, చెప్పకనే చెబుతున్నాయి. అంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయి, న్యాయవ్యవస్థ ఒక్కటే తమకు దిక్కన్న అభిప్రాయం వ్యక్తమవడం విశేషం. ఇలా ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలను, కోర్టులే సరిచేస్తూ పోతే… ఇక ప్రభుత్వంపై ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది? ఎందుకు విలువ ఉంటుంది? ఆలోచించుకోవాల్సింది పాలకులే! జగన్మోహన్‌రెడ్డి గారూ.. మీకు అర్ధమవుతోందా?