రఘురాముడిపై వేటు తప్పదా?
‘అమరావతిై’పె 46 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి?
వారికి రాజు స్ఫూర్తి కాకూడదన్న ఆందోళన
జాతీయ మీడియాలో ఇంకా వైసీపీ ఎంపీగానే  గుర్తింపు
ముందు జాగ్రత్తగా రాజుపై వేటుకు నిర్ణయం?
క్రమశిక్షణ కట్టుదాటకుండా జగన్ ముందస్తు నిర్ణయం?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

యుశ్రారైకా ఎంపీ రఘరామకృష్ణంరాజును వదిలించుకునేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ, రాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ, ఆయన ఎక్కడా తగ్గకపోగా.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు,  పార్టీని చికాకు పెడుతోంది. జగన్‌ను వ్యక్తిగతంగా పొగుడుతూనే, ఆయన  తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకిస్తున్నారు. ఇది జాతీయ-రాష్ట్ర మీడియాలో, ‘సొంత పార్టీ నేత చేస్తున్న వ్యాఖ్యలుగానే’ గుర్తింపు పొందడం, జగన్ పార్టీ ఇమేజీని డ్యామేజీ చేస్తున్నాయి. జాతీయ మీడియా అయితే, వాటిని వైసీపీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలుగానే ప్రసారం చేస్తున్నాయి. దానితో గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని, సొంత పార్టీ ఎంపీనే వ్యతిరేకిస్తున్నారన్న భావన ఏర్పడింది. టీవీ చర్చల్లో కూడా రాజును వైసీపీ ఎంపీగానే సంబోధిస్తున్నారు.

దీనితో జగన్మోహన్‌రెడ్డి తన పాత ధోరణిని విడిచిపెట్టి, రాజుపై బహిష్కరణ వేటు వేసి, ఆయన కథకు తెరదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ట్వీట్లు, కేంద్రమంత్రులకు లేఖలు, మీడియాతో ముచ్చట్లు, మధ్యలో రాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రుల వరకూ భేటీలతో,  రాజు నానా రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఇప్పటివరకూ వైకాపా ఎంపీలెవరూ,  అంతమంది కేంద్రమంత్రులను కలిసిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా,  ఎవరినీ కలవకూడదని లక్ష్మణరేఖ గీయడమే దానికి కారణం. కానీ రాజు, ఏకంగా రాష్ట్రపతితోనే భేటీ కావడంతోపాటు.. రాజధాని బిల్లుల అంశం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించి, వాటిపై నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమయింది. దానితోపాటు తనకు రాష్ట్రంలో భద్రత లేనందున, కేంద్ర దళాలతో సెక్యూరిటీ ఇవ్వాలని కోరడం,  జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది. సొంత పార్టీ ఎంపీనే, తన రాష్ట్రంలో తనకు భద్రత లేదని ఫిర్యాదు చేసి, కోర్టుకెక్కడంపై, జాతీయ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.

ఇక ఆయనను అలాగే స్వేచ్ఛగా విడిచిపెడితే, పార్టీని మరింత భ్రష్ఠుపట్టిస్తారన్న ముందు జాగ్రత్తతోనే, రాజును పార్టీ నుంచి బహిష్కరించాలని జగన్ యోచిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఆయనను బహిష్కరించినప్పటికీ, పార్టీకి వచ్చేచచచ నష్టం లేకపోగా, వ్యక్తిగంగా అది ఆయనకే నష్టమంటున్నారు. కాబట్టి, ఆయనను అలా నాలుగేళ్లు వదిలిపెట్టడమే మంచిదని, కొందరు సీనియర్లు జగన్‌కు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. గతంలో టీడీపీ నాయకత్వం, రేణుకాచౌదరి వ్యవహారంలో ఇదేవిధంగా వ్యవహరించిందని గుర్తు చేస్తున్నారు. రేణుకా పార్టీపై తిరుగుబాటు చేసిన తొలినాళ్లలో ఆమె చర్యలు జాతీయ స్థాయిలో పార్టీని ఇబ్బందిపెట్టాయి. దానితో ఆమెపై నాయకత్వం వేటు వేసింది.

ఆయనను బహిష్కరించకుండా వదిలేస్తే, రేపు పార్లమెంటులో స్పీకర్ అనుమతి తీసుకుని, ఏదో ఒక అంశంపై మాట్లాడే ప్రమాదం లేకపోలేదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఆ సందర్భంలో రఘురామ కృష్ణంరాజు కచ్చితంగా.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారంటున్నారు.  అప్పుడు సొంత పార్టీ సభ్యుడే, జగన్‌పై తిరుగుబాటు చేశారని మీడియాలో వస్తే, పార్టీ పరువు పోతుందని విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు ఏపీలో శాంతిభద్రతలు లేవని, దళితులపై హత్యలు-దాడులు  జరుగుతున్నాయని, మతమార్పిళ్లు జరుగుతున్నాయనే అంశాలు లేవనెత్తితే, పార్టీ పరువు గంగపాలవుతుందంటున్నారు.

ఈ కారణాల దృష్ట్యానే,  రఘురాముడిపై బహిష్కరణ వేటు వేయనున్నారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత, ఇక మీడియా కూడా ఆయనకు ఇప్పటిమాదిరిగా, ప్రాధాన్యం ఇవ్వదన్న అంచనా కూడా, జగన్ నిర్ణయానికి మరో కారణమంటున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో, ఇప్పటికే రాజుకు ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తయారుచేసినందున, ఇక స్థానిక పరిస్థితులపై, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. కానీ,  ప్రధానంగా.. రాజు ఇటీవలి కాలంలో, హిందుత్వ విధానాల గురించి ఎక్కువగా గళమెత్తుతున్నారు. తిరుపతి దేవస్థానం భూముల నుంచి,  అయోధ్య ఆలయ నిర్మాణానికి విరాళం వరకూ, రాజు వ్యవహార శైలిని  జగన్ గమనిస్తున్నారు.

రాజు  హిందుత్వ అంశాలలో మరింత ముందుకు వెళితే, తన పార్టీకి దన్నుగా ఉన్న క్రైస్తవులు,  దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని భావిస్తున్నారంటున్నారు. రాజు.. తరచూ  క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించకుండా ఉండటంపై, ఇప్పటికే క్రైస్తవులలో అసంతృప్తి నెలకొంది. మత మార్పిళ్లకు వ్యతిరేకంగా రాజు వినిపిస్తున్న స్వరం వైసీపీదేనన్న భావన క్రైస్తవులలో ఉంది.  అది ముదిరితే పార్టీకే నష్టం. ఈ కారణాల దృష్ట్యానే.. రాజు తలనొప్పి వదిలించుకుంటేనే,  మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  అదే ఆయనను బహిష్కరించినట్టయితే.. రాజు వాదనతో పార్టీకి సంబంధం లేదన్న సంకేతాలు పంపించవచ్చు. ఇది పార్టీ వర్గాలలో  గత రెండురోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

అందుకే రఘురామకృష్ణంరాజుపై, అనర్హత వేటు వేయాలని ముందు కోరిన పార్టీ నాయకత్వం, అది సాధ్యం కాదని భావించడం వల్లనే, లోక్‌సభలో ఆయన సీటు మార్పించిందని విశ్లేషిస్తున్నారు. వీటికిమించి.. రాజు ధిక్కార వైఖరి, మరికొందరికి స్ఫూర్తి కాకూడదన్న ముందు జాగ్రత్త కూడా, జగన్ నిర్ణయానికి మరో కారణం కావచ్చంటున్నారు. ఇప్పటికే రాజధాని మార్పుపై.. 46 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, జోరుగా ప్రచారం జరుగుతోంది.  జగన్ మొండిగా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల, తమ రాజకీయ భవిషత్తుపై నీలినీడలు ఖాయమని, సదరు ఎమ్మెల్యేలు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం.

అయితే, దానిపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నప్పటికీ.. పిల్లిమెడలో గంటకొట్టే వారికోసం ఎదురుచూస్తున్నారన్న చర్చ,  పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పరిస్థితిలో వారిలో ఏ ఒక్కరయినా, రఘురామకృష్ణంరాజు మాదిరిగా ధైర్యం చేసి గళం విప్పితే ప్రమాదమే.  అప్పుడు పార్టీలో అసంతృప్తి స్వరం పెరిగి, అది అసమ్మతిగా మారే ప్రమాదం లేకపోలేదని  సీనియర్లు చెబుతున్నారు. అందుకే రాజును పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా, అసంతృప్తివాదులకు.. ఒక హెచ్చరిక జారీ చేయాలన్న వ్యూహం కూడా,  జగన్ నిర్ణయంలో లేకపోలేదంటున్నారు.

బహిష్కరిస్తే రాజుకు కష్టకాలమే

సీఎం-పార్టీ అధినేత జగన్.. రాజును పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయనకు కష్టకాలమేనంటున్నారు. బహుశా  ఆయన నేరుగా బీజేపీలో చేరే అవకాశం ఉండదు. పోనీ బీజేపీలో పరిస్థితి సానుకూలంగా ఉంటుందా అంటే.. నాయకత్వం మారిన నేపథ్యంలో, అది కూడా అనుమానమేనంటున్నారు. ఇక తెలుగుదేశం వైపు మొగ్గు చూపలేరు. జనసేన ఎటూ బీజేపీతోనే కలసి ఉన్నందున, అక్కడ కూడా పెద్దగా ఉపయోగం ఉందంటున్నారు. ఈ రకంగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే.. జగన్ ఆయనను బహిష్కరించడం ద్వారా, ఒంటరిని చేయనున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner