అయోధ్యకు జగన్ వెళతారా?

724

వెళ్లాలని రఘురాముడి లేఖ
గతంలో పుష్కరస్నానాలు చేసిన జగన్
స్వరూపానంద ఇప్పుడు చొరవ చూపుతారా?
వెళ్లాలంటున్న బీజేపీ నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

యావత్ దేశం..హిందూ సమాజం.. ఈ నెల 5న అయోధ్యలో జరగనున్న, రామాలయ భూమిపూజ కోసం భావోద్వేగంతో ఎదురుచూస్తోంది. ఆ చరిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవాలని, అయోధ్య ట్రస్టు ఇప్పటికే దేశంలోని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. ఆగస్టు 5న జరపతలపెట్టిన రామాలయ భూమిపూజకు, ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆగస్టు 5 నాడు జరగనున్న.. ఆ మహత్తర ఘట్టం జనరంజకంగా ఉండేందుకు,  ట్రస్టు ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అయోధ్యకు ఆధ్యాత్మికశోభ అద్దేందుకు, హిందూపరివారం రంగంలోకి దిగింది. అయితే, ఆ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కూడా హాజరుకావాలని ట్రస్టు లేఖ రాసింది. మరి ఆయన అక్కడి వెళతారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చ. హిందువులంతా ఆయన వైఖరి కోసం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా.. యుశ్రారైకా ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, జగన్ అయోధ్యకు వెళ్లాలని, ఎస్వీబీసీ భక్తి చానెల్ ఆ భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ, ఓ లేఖ కూడా రాశారు. రామాలయం కోసం ఆయన, తన మూడు నెలల ఎంపీ వేతనాన్ని అయోధ్య ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం,  విరాళమిచ్చిన తొలి ఎంపీ రఘురామకృష్ణంరాజు కావడం విశేషం. అంటే అలాంటి భావన ఆ పార్టీలో కూడా ఉందని స్పష్టమవుతున్నట్లే లెక్క.ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు గౌరవించి, జగన్మోహన్‌రెడ్డి అయోధ్యకు వెళతారా? లేదా? అన్న అంశంపై జరుగుతున్న చర్చ ఆసక్తి కలిగిస్తోంది.

ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా, రెండు ఘాట్లలో పుష్కరస్నానం చేశారు. రిషీకేష్ వెళ్లి, విశాఖ పీఠాథిపతి స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు వెళ్లిన వైనం, హిందువులను ఆశ్చర్యపరిచింది. ఆ వె ంటనే, వైసీపీ సోషల్‌మీడియా బృందాలు రంగంలోకి దిగి.. జగన్మోహన్‌రెడ్డి హిందూ మతం స్వీకరించారన్న స్థాయిలో, ఆ ఫొటోలు పెట్టి విపరీతమైన ప్రచారం కల్పించాయి. అవి హిందువులను బాగానే ఆకట్టుకున్నాయి. క్రైస్తవుడయిన జగన్మోహన్‌రెడ్డి హిందూమతాచారం, సంప్రదాయాలు పాటిస్తూ పుష్కరస్నానం చేయడం, స్వామి స్వరూపానంద శిష్యరికం చేయడం చూసి.. అదంతా నిజమోకామోసనుకున్నారు. అయితే, క్రైస్తవుడయిన జగన్ క్రైస్తవమతాచారాలను ఉల్లంఘించి.. అధికారం కోసం పుష్కరస్నానం చేయడం, గుళ్లకు వెళ్లినందున ఆయనను క్రైస్తవ మతస్తులు బహిష్కరించాలని, క్రైస్తవ మత ప్రచారకుడయిన జెరూసలేం మత్తయ్య, అప్పట్లో చేసిన డిమాండ్ చర్చనీయాంశమయింది.

గత ఎన్నికల్లో చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత,  యుశ్రారైకాపై అభిమానం, జగన్ పోరాట పటిమతోపాటు.. ఆయన హిందువుగా మారాడేమోనన్న సంతోషంతో.. జగన్ పార్టీని హిందువులు గెలిపించారు. చివరకు బ్రాహ్మణ సంఘాల నాయకులు సైతం జగన్మోహన్‌రెడ్డి పార్టీలో చేరి, ఆయన సీఎం అయేందుకు పనిచేయడం మరో విశేషం. అంటే… జగన్మోహన్‌రెడ్డి పుష్కరస్నానాలు, స్వరూపానంద శిష్యరికం ఆయనకు అంతగా వర్కవుటయిందన్నమాట. జగన్ హిందువుగా మారారన్న సోషల్‌మీడియా బృందగానం, అంత ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది.

జగన్  ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, తన రాజగురువయిన స్వరూపానందను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి, ఘనంగా సత్కరించారు. దేవదాయ శాఖ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ముందు స్వామి వారితో చర్చించాలని ఆదేశించారు. విశాఖ చినముషిడివాడలో, పోలీసు అవుట్‌పోస్ట్ కూడా ఏర్పాటుచేశారు. జగన్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు తన తపశ్శక్తిని ధారపోశానని, ఆయనంటే తనకు అత్యం ఇష్టమని నిర్భయంగా స్వామివారు అప్పట్లో సెలవిచ్చారు. అంతేకాదు.. దేశంలో ఏ పీఠాథిపతి చేయని విధంగా, జగన్మోహన్‌రెడ్డిని అందరి సమక్షంలో ముద్దు పెట్టుకున్నారు. దానిపై సాటి పీఠాథిపతులు, మఠాథిపతులు ఆక్షేపణ వ్యక్తం చేసినా, ‘అది పీఠం కాదు. వైసీపీ కార్యాలయమని’ శాపనార్ధాలు పెట్టినా స్వామివారు పెదవి విప్పలేదు.

ఈ క్రమంలోనే..  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని, అందరు ముఖ్యమంత్రులను ఆహ్వానించినందున.. హిందూమతాన్ని అంతగా అభిమానిస్తున్న జగనన్న, అయోధ్యకు వెళతారని హిందువులు సహజంగానే అంచనా వేస్తున్నారు. పుష్కరస్నానాలు చేసి, రిషీకేషుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన జగనన్న,  అయోధ్యకు వెళ్లకుండా ఉండే సమస్యే లేదంటున్నారు. ఈ విషయంలో ఆయన రాజగురువైన స్వరూపానంద సరస్వతి కూడా, చొరవ తీసుకుంటారని భావిస్తున్నారు. అసలు ఇద్దరూ కలసి అయోధ్యకు వెళ్లినా, ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఆరకంగా అయోధ్యకు వెళ్లడం ద్వారా.. హిందూమతంపై జగనన్న తన చిత్తశుద్ధి, విశ్వాసాన్ని మరోసారి ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

జగన్ ఏ మతస్తుడో తెలుస్తుంది: శ్రీధర్‌శర్మ

అయోధ్యలో రామాలయ భూమిపూజకు హాజరవడంపైనే.. జగన్ ఏ మతస్తుడో తేలిపోతుందని, ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ వ్యాఖ్యానించారు. ‘ జగన్‌గారు నిజంగా అయోధ్యకు వెళితే హిందువులకు సంతోషమే. హిందూ సమాజానికి అంతకంటే కావలసింది ఇంకేముంటుంది?  ఒకవేళ   హాజరుకాకపోతే, ఆయన ఏ మతస్తుడో, ఏ మత విశ్వాసాలు పాటిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతుంది. మేమయితే  ఆయన రాష్ట్ర ప్రజలు, హిందువుల ప్రతినిధిగా హాజరుకావాలనే కోరుకుంటున్నాం. ఆయన గతంలోనే పుష్కరస్నానం చేశారు. స్వరూపానంద సరస్వతి వారు ఆయనతో స్నానం చేయించారు. ఇప్పుడు జగన్‌గారిని అయోధ్య తీసుకువెళ్లే బాధ్యత కూడా, స్వరూపానంద గారే తీసుకోవాలి. స్వామివారితో ఉన్నందున, జగన్‌గారిని తమ వాడిగానే, హిందువులంతా భావించారు. రేపు స్వామి వారే, అయోధ్యకు జగన్‌గారిని తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే, కేవలం హిందువుల ఓట్ల కోసమే జగన్ గారు.. స్వరూపానంద స్వామితో కలసి నాటకం ఆడారన్న అపకీర్తి, స్వామివారికి వస్తుంది. అది మేం భరించలేం. కాబట్టి, స్వామివారే జగన్ గారిని అయోధ్యకు తీసుకువెళ్లాలి’ అని శ్రీధర్‌శర్మ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే జగన్  వెళ్లాలి: మత్తయ్య

అయోధ్య భూమిపూజకు.. ఏపీ సీఎం జగన్ దమ్ముంటే హాజరుకావాలని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి, అఖిల భారత దళిత క్రైస్తవ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జెరూసలేం మత్తయ్య సవాల్ విసిరారు. ‘ఇప్పుడు జగన్ మత విశ్వాసమేటిటో తెలుస్తుంది. నిజంగా ఆయన అయోధ్యకు వె ళితే, జగన్ ఏ మత విశ్వాసాలు పాటిస్తున్నారన్నది తెలుస్తుంది. నిజమైన క్రైస్తవుడయితే, జగన్ అయోధ్యకు వెళ్లకూడదు. వెళితే ఆయన, క్రైస్తవ సంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా అని విశ్వాసకులకు అర్ధమవుతుంది. వెళ్లకపోతేనే, ఆయన క్రైస్తవ మతస్తుడని భావించాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

హిందూమత ప్రతినిధిగా హాజరుకావాలి: బీజేపీ

అయోధ్య భూమిపూజకు సీఎం జగన్, హిందువుల ప్రతినిధిగా హాజరుకావాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘జగన్మోహన్‌రెడ్డి గారు పుష్కరస్నారం చేసినందు వల్ల, ఆయన హిందూ మత విశ్వాసాలు పాటించే నాయకుడిగానే హిందువులు భావిస్తున్నారు. క్రైస్తవులు ఆ పని చేయరుకదా? అదే విశ్వాసాన్ని అయోధ్యకు వెళ్లి ప్రకటించాలి. ఏపీలోని హిందువుల ప్రతినిధిగా అయోధ్యకు వెళ్లినట్టయితే, రాష్ట్రంలోని హిందువులంతా సంతోషిస్తారు. క్రైస్తవమత ప్రచారం తీవ్రంగా ఉన్నందున, జగన్‌గారు అయోధ్యకు వెళ్లడం వల్ల, అలాంటి ప్రచారానికి తెర దింపిన వారవుతారు. ఆగస్టు 5 నాటి కార్యకమ్రంలో జగన్‌గారు పాల్గొనడం వల్ల, ఏపీలోని హిందువులంతా, అయోధ్య రామాలయం కోసం ఎదురుచూస్తున్నారన్న సంకేతాలివ్వవచ్చు’ అని  ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కోట శేష సాయి శర్మ, బీజేపీ రాష్ట్ర ధార్మికసెల్ అధ్యక్షుడు చైతన్య వ్యాఖ్యానించారు.

ఇక భారమంతా స్వరూపనందులపైనే…

హిందు, క్రైస్తవ మత నాయకుల వ్యాఖ్యలు పరిశీలిస్తే… జగన్మోహన్‌రెడ్డిని అయోధ్యకు తీసుకువెళ్లే బాధ్యత విశాఖ పీఠాథిపతి స్వరూపానంద సరస్వతిపైనే పడినట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ఆయన జగన్మోహన్‌రెడ్డిని అయోధ్యకు తీసుకువెళ్లకపోతే.. హిందూ, బ్రాహ్మణ సంఘ నేతలు చెప్పినట్లు.. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే స్వరూపానందతో కలసి, హిందువు అవతారం ఎత్తినట్లు రుజవుయే ప్రమాదం లేకపోలేదు. ఈ అపోహలు, విమర్శలకు తెరదించుతూ జగన్, అయోధ్యకు వెళితే.. ఆయన హిందువుల విశ్వాసాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్నది రుజువవుతుంది. చూడాలి… జగనన్న అయోధ్యకు వెళతారో..  లేదో?!