కేసీఆర్ వాయిదా.. జగన్‌కే ఫాయిదా!

565

జగన్ కోసమే అపెక్స్ వాయిదానా?
కేసీఆర్ లక్ష్యంగా విపక్షాల వార్
తెలంగాణలో మళ్లీ జల జగడం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణలో కొద్దిరోజుల పాటు సర్దుమణిగిన జలజగడం.. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల మళ్లీ తెరపైకొచ్చింది. విభజన తర్వాత కూడా కొనసాగుతున్న, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించుకునేందుకు.. వచ్చిన అవకాశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సూచనలతో వాయిదా వేయడంపై, విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ వాయిదా వేయడాన్ని బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్‌గా అభివర్ణిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల ప్రారంభానికి కేసీఆరే, జగన్‌కు పరోక్షంగా అవకాశమిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. దీనితో జలజగడం కాక రేపుతోంది.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న.. కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు, ఆగస్టు 5న  భేటీ కావాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో జరుగుతుంది. అందులో ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయితే, అక్కడ దానికో పరిష్కారమార్గం లభిస్తుంది. గతంలో చంద్రబాబు-కేసీఆర్ ఇదేవిధంగా, నాటి కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్  కౌన్సిల్ భేటీకి హాజరయ్యారు. ఆ తరహాలోనే ఇప్పుడు, రెండు రాష్ట్రాల నడుమ నెలకొన్న జలవివాదాలు పరిష్కరించేందుకు, ఈనెల 5న జరిగే భేటీకి హాజరుకావాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు రెండు ప్రభుత్వాలు అజెండా వివరాలు కూడా పంపించాయి. కరోనా కారణంగా ఈ భేటీ ఎప్పటిలా ఢిల్లీలో కాకుండా, వీడియో కాన్ఫరెన్సు ద్వారానే జరగనుంది.

అంతకుముందు, ఆంధ్ర సర్కారు జలచౌర్యానికి పాల్పడుతోందని.. కేటాయింపులు ఉల్లంఘించి, అదనపు నీటిని వాడుకుంటోందని తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర హక్కును వదులుకోబోమని, చుక్కనీటిని కూడా వదులుకునేది లేదని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో రెండు రాష్ట్రాలు, ఒకరిపై మరొకరు కృష్ణా-గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్-బీజేపీ నేతలు, కేసీఆర్ అసమర్థతను ఎండగట్టాయి. జగన్-కేసీఆర్ విందులోనే పోతిరెడ్డిపాడు ఉత్తర్వు వెలువడిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌తో ఉన్న రహస్య వ్యాపార ఒప్పందం మేరకే, ఏపీ తెలంగాణ నీటిని తరలించుకుపోతున్నా, కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, నాగం జనార్దన్‌రెడ్డి, డికె అరుణ, రామచందర్‌రావు వంటి కాంగ్రెస్-బీజేపీ నేతలు శరపరంపరగా,  ఇదే అంశంలో  కేసీఆర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనితో అపెక్స్ కౌన్సిల్‌లోనే, ఈ వ్యవహారం తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమయింది. ఆ మేరకు ఆగస్టు 5వ తేదీన, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడే రెండు రాష్ల్రా జల జగడానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమయింది.

అయితే, హటాత్తుగా 20వ తేదీ తర్వాత.. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరపాలని కేసీఆర్ సర్కారు కోరడాన్ని, బీజేపీ-కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. నిజానికి, సమావేశానికి ఢిల్లీ వరకూ వెళ్లాల్సిన పనిలేదు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లోనే కూర్చుని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుకావచ్చు. దానికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ, కేంద్రం నిర్ణయించిన తేదీని కాదని, 20వ తేదీ తర్వాత నిర్వహించాలన్న కేసీఆర్ సూచన, సహజంగానే విమర్శలకు గురవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గతంలో మాదిరిగా, కరోనాపై రోజువారీ సమీక్షేవీ నిర్వహించడం లేదు. సచివాలయ నిర్మాణంపైనే ఆయన పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు.  కీలకమైన కృష్ణా జలాల వివాదంపై జరిగే భేటీతో పోలిస్తే, సచివాలయ నిర్మాణ వ్యవహారం ప్రధానమైనదేమీ కాదు. ఇప్పటికే  ఏపీ సర్కారు చర్యల వల్ల దక్షిణ తెలంగా ఎడారవుతోందన్న ఆందోళన బలంగా ఉంది. దానిని ఎంత త్వరగా తొలగిస్తే, దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలకు అంత ఊరట లభిస్తుంది.

పైగా 5వ తేదీన భేటీ జరిగితే, ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమవేశం నిర్వహించినా ప్రయోజనం ఉండదన్న  తెలంగాణ విపక్షాల వాదనలో సమంజసం ఉంది. అసలు కృష్ణా జల వివాద పరిష్కారం కంటే కేసీఆర్‌కు ఇంకేం ప్రాధాన్యత ఉందని నిప్పులు కురిపిస్తున్నారు.
జగన్‌తో భేటీ తర్వాత,  పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఉత్తర్వు వెలువడినందుకే,  ఒకసారి కేసీఆర్ సర్కారు విపక్షాల విమర్శలకు చిక్కింది.

మళ్లీ ఇప్పుడు ఖరారయిన సమావేశాన్ని, వాయిదా కోరడం మరోసారి విమర్శలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు అజెండా వివరాలు పంపించిన కేసీఆర్ సర్కారు, ఆ భేటీని వాయిదా వేయమని కోరడంలో మతలబేమిటన్న ప్రశ్నలు,  సహజంగానే తెరపైకి వస్తాయి. ఏపీ సర్కారు జలచౌర్యం, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి.. ప్రభుత్వం వద్ద  పూర్తి ఆధారాలున్నందున, సమావేశం వాయిదా కోరడంలో అర్ధం లేదు. పైగా, విపక్షాల నోళ్లు మూయించేందుకు,  అపెక్స్ కౌన్సిల్ భేటీ రూపంలో వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడం ఆశ్చర్యమే.

పైగా.. కేసీఆర్ కోరిన ఈ వాయిదా, సహజంగానే జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు ఫాయిదాగా మారనుంది. ఎందుకంటే.. షెడ్యూల్ ప్రకారం 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం, ఏపీ సర్కారు పిలిచిన టెండర్లను ఖరారు చేసే అవకాశం ఉండదు. ఆ రకంగా ప్రాధమిక స్థాయిలోనే,  ఏపీ సర్కారు ప్రయత్నాలను ముందస్తుగానే తిప్పికొట్టవచ్చు. కానీ, 20వ తేదీ తర్వాత కౌన్సిల్ భేటీ ఏర్పాటుచేయాలన్న కేసీఆర్ సూచన, సహజంగానే  ఏపీ సర్కారుకే ప్రత్యక్షంగా లాభిస్తుంది. నిజంగానే 20వ తేదీ తర్వాత ఆ భేటీ జరిగితే.. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లు.. రాయలసీమ  ఎత్తిపోతల పథకం కోసం, టెండరు వేసిన కాంట్రాక్టర్లే గంధర్వుల అవతారమెత్తుతారు. కేసీఆర్ సూచన ప్రకారం, 20వ తేదీ తర్వాత భేటీ జరిగి, అందులో ఏపీ సర్కారు ఖరారు చేసిన టెండర్లను నిలిపివేయాలని, కౌన్సిల్ ఆదేశించిందనుకోండి. అప్పుడు టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు, సహజంగానే  కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు. అందువల్ల.. అపెక్స్ కౌన్సిల్ భేటీ 5వ తేదీన జరిగితే తెలంగాణకు, 20వ తేదీ తర్వాత జరిగితే ఏపీ సర్కారుకు లాభమని,  మెడ మీద తల ఉన్న ఎవరికయినా సులభంగా అర్ధమవుతుంది. కనీసం 12 వతేదీనాటికయినా భేటీ నిర్వహిస్తే, తెలంగాణ పోరాటానికి సార్ధకత ఉంటుంది.

విరుచుకుపడుతున్న విపక్షాలు..

ఈ విషయం అందరికీ సులభంగా అర్ధమయినప్పటికీ, తెలంగాణ సర్కారు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో జగన్‌కు మేలు చేకూర్చేందుకే, కౌన్సిల్ భేటీని కేసీఆర్ వాయిదా వేయమంటున్నారని, బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్-జగన్ లాలూచీ ఉందని ఆరోపిస్తున్నారు.  జలవివాద పరిష్కారం కంటే కేసీఆర్‌కు, ఇంకేం ప్రాముఖ్యత ఉందని లా పాయింటు తీస్తున్నారు. కేసీఆర్ అసమర్థ వైఖరి వల్లనే.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాగా 555 టీఎంసీ డిమాండ్ చేయాల్సి ఉండగా, 299 టీఎంసీల నీటినే వాడుకుంటామని అంగీకరించడమే, ప్రస్తుత ఈ దుస్థితికి కారణమని దుయ్యబట్టారు. అటు ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సైతం, 10వ తేదీలోగా కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని, డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సర్కారుకు మేలు చేసేందుకే, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.