‘అమరావతి ఆట’లో అరటిపండెవరు?

492

ప్రశ్నించే జనసేనాని పవనెక్కడ?
వద్దని కన్నా కోరితే  అని సోము మౌనం
కేంద్రాన్ని విమర్శించే ధైర్యం లేని చంద్రబాబు
బీజేపీ ఆట మొదలయిందా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘వాళ్లు మాతో ఆటలాడుతున్నారు. మేం కూడా మా ఆట మొదలుపెడతాం’- ఇది భాజపా ఏపీ రధసారథిగా  నియమితులయిన సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య. ఆ తర్వాతనే గవర్నర్ బిశ్వభూషణ్, వైసీపీ ప్రభుత్వం రూపొందించిన  రాజధానుల బిల్లును ఆమోదించారు. మాజీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ బిల్లును ఆమోదించవద్దని లేఖ రాస్తే, తాజా అధ్యక్షుడు వీర్రాజు మాత్రం, గవర్నరు చర్య రాజ్యాంగ పరిథిలోనిదేనని కితాబివ్వడేమిటి?  మరి రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ, కమలదళాలు నాడు.. కూడబలుక్కుని చేసిన తీర్మానం కాకి ఎత్తుకెళ్లిందా?  ఇదంతా చూస్తుంటే.. సోము వీర్రాజు చెప్పినట్లు.. ఆంధ్రాలో బీజేపీ ఆట మొదలుపెట్టిందా?

అయితే ఆ ఆట ప్రత్యక్ష యుద్ధమా? పరోక్ష యుద్ధమా? రెండూ కాకపోతే.. ఆనాడు వాలి-సుగ్రీవ యుద్ధంలో,  రాముడు చెట్టుచాటు నుంచి  వాలిని కొట్టి, సుగ్రీవుడిని గెలిపించే తరహా యుద్ధమా? అదే నిజమయితే ఆ ఆటలో అరటిపండెవరు? గవర్నర్ సంతకంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నా, ‘ప్రశ్నించే పార్టీ’ నాయకుడయిన పవన్‌లో ఉలుకూ పలుకూ లేదేంటి? అమరావతి కోసం అంతెత్తున లేచి.. ఉద్యమించిన తెదేపాధిపతి చంద్రబాబు, గవర్నర్ నిర్ణయాన్ని ఆక్షేపిస్తారే తప్ప, కేంద్రంపై కన్నెర్ర చేయరేం? ఎంతసేపూ గవర్నర్, గవర్నమెంటుపై గరమైతే ఏం ఉపయోగం? శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టనట్లు.. కేంద్రంలోని బీజేపీ బాసుల ఆజ్ఞ లేకపోతే, బిల్లు ఆమోదం పొందదు. ఈ సూక్ష్మం తెలిసికూడా, కేంద్రంపై కదనానికి దూకకుండా చంద్రబాబు ఎందుకు చల్లబడుతున్నారు? చచ్చు పుచ్చు ఇచ్చకచాలతో దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారు? ఇవీ..అమరావతి ఆటలో ప్రధానాంశాలు.

ఆ యుగంలో శ్రీరాముడు తనకు సాయం చేసిన సుగ్రీవుడి కోసం, చెట్టు చాటు నుంచి వాలిని సంహరిస్తాడు. అప్పుడు ‘మహానుభావా? ఇంత వీరుడవయి ఉండీ, చెట్టు చాటునుంచి అధర్మయుద్ధం చేస్తావా? నీకిది న్యాయమా’? అని వాలి కన్నీటి పర్యంతమవుతాడు. అప్పుడు రాముడు ‘నీవు మహా బలపరాక్రమశాలివి. నిన్ను నేరుగా జయించడం అసాధ్యమన్న వరం పొందావు. కాబట్టి ధర్మరక్షణ కోసం నిన్ను సంహరించాల్సి వచ్చిందని’ బదులిస్తాడు. అంతకుముందు.. ఒకసారి వాలి చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడు, రెండోసారి యుద్ధానికి వాలిని సవాల్ చేస్తాడు. అప్పుడు వాలి భార్య.. ఇంతకుముందే ఓడిన నీ సోదరుడు, ఇప్పుడు మళ్లీ రమ్మని సవాల్ చేస్తున్నాడంటే, అందులో ఏదో మర్మం ఉందని హెచ్చరిస్తుంది. దానిని వాలి కుమారుడు కూడా సమర్ధిస్తాడు. దశరధ మహారాజు కుమారుడు, సుగ్రీవుడికి దన్నుగా వచ్చాడని చెబుతాడు. అయినా సరే లెక్కచేయకుండా యుద్ధానికి వెళ్లిన వాలి, రాముడు  చెట్టు చాటు నుంచి విసిరిన బాణానికి హతుడవుతాడు. ఇదీ.. రామాయణంలో అందరికీ తెలిసిన కథ.

ఇప్పుడు ఆంధ్రాలో, రాజధాని ‘అమరాయణం’ కథ కూడా దాదాపు అదే మాదిరి కనిపిస్తోంది. అయితే, ఇప్పటికి రాముడెవరు? వాలి సుగ్రీవుడి పాత్రధారులెవరన్నది కనిపిస్తూనే  ఉంది. రామాయణంలో వాలి.. రాముడి దెబ్బకు కూలిపోతే, ఇక్కడ రాజధాని ‘అమరాయణం’ కథ ఇప్పుడే మొదలయి, రేపో మాపో కోర్టుకెక్కనుంది. ఇక్కడే కొన్ని  ఆసక్తికరమైన ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ కలియుగ రాముడి పాత్రధారి బీజేపీ అయితే, సుగ్రీవ పాత్రధారి వైసీపీనా? ఎందుకంటే, సీతమ్మ జాడలో సుగ్రీవుడు తనకు దన్నుగా ఉన్నందున, రాముడు ఆయనకు సాయం చేస్తాడు. ఆ ప్రకారంగా.. రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న బీజేపీ, వైకాపా చేస్తున్న ఉడత సాయానికి, ప్రతిసాయం చేసి ఉండవచ్చు. అయితే రాముడి దొంగదెబ్బకు కూలిపోయిన వాలి, అమరావతి ప్రజలనా? లేక తెలుగుదేశం సహా విపక్షాలా? అన్నది  కొద్దిరోజుల్లోగానీ తేలదు.

ఎందుకంటే రాముడిపై, సర్వహక్కులూ పొందిన బీజేపీ కూడా, అమరావతి ప్రజలకు బోలెడు వరాలిచ్చింది. మా వల్లే అపమరావతికి రాజధాని వచ్చింది. మా నిధులతోనే రాజధాని నిర్మిస్తున్నారని పేటెంట్ హక్కులు పొందే ప్రయత్నం చేసింది. కానీ ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు మాదిరిగా.. బీజేపీ ఒకటో రాముడు కన్నా లక్ష్మీనారాయణ, అమరావతి బిల్లును అడ్డుకోమని గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన తర్వాత వచ్చిన రెండో రాముడయిన సోము వీర్రాజు మాత్రం, గవర్నర్  నిర్ణయాన్ని స్వాగతించారు. మరి కమల సహిత రామశోభిత అమరాయణాన్ని, వాటి పాత్రలను  ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? ఇదీ ఇప్పుడు ప్రశ్న.

రాజధానుల బిల్లు, అంటే వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని కొద్దిరోజుల క్రితం, బీజేపీ అధ్యక్షహోదాలో కన్నా గవర్నర్‌కు లేఖ రాశారు. అంతకుముందు, ఆ పార్టీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తీర్మానించింది. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్, రాజధానిపై అనేక పిల్లిమొగ్గులు వేసినా, ఎంపి జీవీఎల్ నరసింహారావు మాత్రం.. రాజధాని అంశం కేంద్రం పరిథిలోకి రాదని, చాలాసార్లు బల్లగుద్ది మరీ వాదించారు. కానీ అదేపార్టీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం, అమరావతి అంగుళం కూడా కదలదని, కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతనే, తాను ఈ విషయం చెబుతున్నానన్నారు. తాజాగా బిల్లు ఆమోదాన్ని కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు,  గవర్నరు రాజ్యాంగ పరిథిలో తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానిస్తే, సుజనా చౌదరి వ్యతిరేకించారు. అందుకు రాష్ట్ర పార్టీ రంగంలోకి దిగి, సుజనా చౌదరి తీరును తప్పు పట్టింది. మరి అంతకుముందు, రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా ప్రకటనలిచ్చిన, జీవీఎల్ తీరుపై పార్టీ సుజనా తరహాలో పార్టీ ఇన్చార్జి ఎందుకు వేగంగా స్పందించలేదు? అలా ఒకే అంశంపై, భిన్నాభిప్రాయాలు వెలువరించిన విచిత్రపార్టీగా, బీజేపీ ముద్రపడటం ఆ పార్టీ శ్రేణులకే మింగుడు పడటం లేదు.

ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తున్న బీజేపీ.. మళ్లీ అమరావతిలోనే రాజధాని ఉండాలనేది రాజకీయ పార్టీగా తమ విధానమని, అయితే దానికి కేంద్రంతో సంబంధం లేదన్న, కొత్త వాదనకు తెరలేపింది. మళ్లీ అదే.. రాజధాని రైతులకు న్యాయం చేసే విషయంలో, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజధాని అంశం రాష్ట్ర పరిథిలోది అన్నప్పుడు రాజధాని రైతులపై ఇక పోరాడేమిటి? ఆ పార్టీ నేతల మాటల ప్రకారమే.. ఒక రాజకీయ పార్టీగా, అమరావతిని రాజధానిగా ఉంచాలన్న తన డిమాండ్, ఇప్పుడు నెరవేరే అవకాశం లేదు. మరి అప్పుడు ఒక రాజకీయ పార్టీగా, బీజేపీ తానే ముందుండి ఉద్యమాలు చేయాలి కదా? ఎందుకంటే రాష్ట్రంలో గవర్నరు కేంద్రం నియమించిన  వ్యక్తి అయినా,  అధికారంలో ఉన్నది వేరే పార్టీ కదా? ప్రతిపక్షంగా మరి ఆ పని ఎందుకు చేయడం లేదు? అంటే అవన్నీ పత్రికల్లో ప్రకటనలు, అమరావతి ప్రజల కంటితుడుపు కోసమేనా అన్నది మరో సందేహం!


పోనీ దాన్ని కూడా కాసేపు పక్కనపెడితే.. అమరావతిలోనే రాజధాని ఉండాలని,  బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ కూడా, ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. అమరావతి రైతులకు, తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కన్నా సహా అగ్రనేతలంతా అమరావతి వెళ్లి, దీక్షలు చేరి వారికి మద్దతునిచ్చారు. మరి ఇప్పుడు, అదే సునీల్ దియోధర్ సమక్షంలో, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజధానుల బిల్లును ఖండించకపోతే.. దాని సంకేతాలేమిటి? అంటే, అంతకుముందు చేసిన తీర్మానానికి అర్ధమే లేదా? లేక సీఎం మారినప్పుడల్లా రాజధాని మారినట్లు, అధ్యక్షుడు మారినప్పుడల్లా వైఖరి మారుతుందా? సరే.. వీటన్నింటినీ పక్కనపెడితే, అమరావతిలో రాజధాని నగర శంకుస్థాపనకే కదా మోదీ వచ్చింది? పవిత్ర జలాలు, మట్టి తెచ్చింది అందుకోసమే కదా? పైగా రాజధాని నగర నిర్మాణానికి, వందల కోట్లు విడుదల చేసింది కదా? ఇప్పుడు అక్కడి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తే.. ఆ అవమానం ఎవరికి? శంకుస్థాపనకు వచ్చిన మోదీకా? ఆంధ్ర రాష్ట్రానికా? లేక మోదీ ఉన్న వేదికపై ఆసీనులయిన నాటి బీజేపీ నాయకులకా? వీరెవరూ కాకుండా.. నోరూ వాయీ లేకుండా, నిస్సిగ్గుగా ఆత్మాభిమానం వదిలేసి, ప్రేక్షకుల్లా చూస్తున్న ప్రజలదా? ఒక ఓటు-రెండు రాష్ట్రాల నినాదం సమయంలోనే.. స్థిరంగా ఉన్న భాజపేయుల గళం, ఇప్పుడెందుకు బలహీనపడుతోందన్నది ఎవరికీ అర్ధం కాని వాదన.

దాన్ని కాసేపలా పక్కనపెట్టి.. ‘ప్రశ్నించడానికే పార్టీని పుట్టించిన’, జనసేనాని పవన్ వేస్తున్న పిల్లిమొగ్గలేమిటో చూద్దాం. ఆయన కూడా అమరావతి కోసం నినదించిన వీరుడే. అమరావతి పల్లెలకు వెళ్లి, ఓ చెల్లెమ్మ టిఫిన్ బాక్సులో ఉప్మా తిన్న మానవుడే. అమరావతి అక్కడే ఉండాలని కోరుతూ, వారి వద్దకు వెళ్లేందుకు, పోలీసు ఆజ్ఞలు కూడా ధిక్కరించిన వీరుడు.  బీజేపీతో జత కట్టే సమయంలో ప్రత్యేక హోదాను అటకెక్కించినా, అమరావతినే రాజధానిగా  ఉంచేలా బీజేపీతో కలసి పోరాడతానని, సెలవిచ్చిన అభినవ చేగువేరా వారసుడు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారో తెలుసా? ‘రాజధాని రైతుల పక్షాన చివరివరకూ పోరాడుతా. గవర్నర్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో, భవిష్యత్యు కార్యాచరణపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తార’ట! అదేంటీ? ప్రశ్నించడానికే పార్టీని పుట్టించిన కల్యాణ్‌బాబు.. గవర్నర్ చర్యను విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తుంటే, చేగువేరా వారసుడయి ఉండీ, పవన్ పల్లెత్తు మాట అనకుండా, పలుకేబంగారంలా చర్చించి నిర్ణయం తీసుకోవడమేమిటి? జోక్ కాకపోతే?! పోనీ .. గవర్నర్ చర్యను తాను ఖండిస్తే, కొత్త కమలదళపతికి ఎక్కడ కోపం వస్తుందోనన్న మొహమటమా?

ఇక తెదేపాధిపతి చంద్రబాబు పోరాట కత్తి, పూర్తి స్థాయిలో పదును తగ్గినట్లుంది. గవర్నర్ చర్యను ఖండించిన ఆయన, కేంద్రాన్ని-బీజేపీనీ దుయ్యబట్టడానికి మాత్రం పాపం తెగ భయపడిపోతున్నారు. గతంలో నేషనల్‌ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ సారథిగా విపక్షాలను నడిపించినప్పుడు.. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ఇలాంటి నిర్ణయాలే తీసుకునేవారు. అప్పుడు బాబు, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దునుమాడేవారు. మరి ఇప్పుడు ఆ స్ఫూర్తి ఏమయింది? ఆ తెగువ ఏమయింది? కేంద్రం- పార్టీ అనుమతి లేకుండా, ఇంత కీలక బిల్లును ఏ గవర్నరూ ఆమోదించే ధైర్యం చేయరు. ఇది మెడమీద తల ఉన్న ఎవరికయినా, చివరకు ఓ వార్డు కౌన్సిలరుకూ తెలిసిన నగ్నసత్యం. మరి ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్రీ’్ట చంద్రబాబుకు తెలియదనుకోవడం, అమాయకత్వం. ఒకసారి  కేంద్రంలోని బీజేపీతో కయ్యం పెట్టుకుంటునే, పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో గ్రహించిన బాబు.. పాపం ఆ చేదు అనుభవంతో, మనకెందుకులేనని ప్రాప్తకాలజ్ఞతతో, జగన్‌ను విమర్శించడం వరకూ పరిమితమవుతున్నారేమో?