తూర్పు గోదావరి: అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపడం శుభ సూచికమని ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. దాన్ని చంద్రబాబు పక్కన పడేసి.. పాఠశాలలను ఎలా నడపాలో తెలియని నారాయణను రాజధాని కమిటీ ఛైర్మన్‌గా పెట్టారన్నారు. నారాయణ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు గుంటూరు-విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా పెట్టారని తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూములు తవ్వుతుంటే నల్లటి సారవంతైన మట్టిని చూశానని, అటువంటి మట్టిని చూస్తే భూదేవిని చూసినట్లుగా రైతు పులకించిపోతాడని పేర్కొన్నారు. అలాంటి భూదేవి గర్భాన్ని తవ్వి రాజధాని నిర్మిస్తే చంద్రబాబుకు శాపం తగులుతుందని తనతో చాలా మంది చెప్పారని ఆయన అన్నారు. రాజధాని భవనాల పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ తయారు చేసి దాన్ని సినిమా దర్శకుడితో అప్రూవ్ చేయించారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అధికార వికేంద్రీకరణపై చారిత్మక నిర్ణయం తీసుకున్నారని, అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం కోసం చంద్రబాబు ఒక డ్రామా కంపెనీనే నడిపారని విమర్శించారు. న్యాయానికి ఎప్పుడు మంచే జరుగుతుందని, సీఎం వైఎస్‌ జగన్ వెనుక దేవుడు ఉన్నాడన్నారు. మంచికి ఎప్పుడు దేవుడు సాయంగా ఉంటాడని చెప్పడానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదమే ఒక ఉదాహరణ అన్నారు. సీఎం జగన్‌ వ్యక్తిగతానికి ఇది ఒక పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner