మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాలి:బొండా ఉమామహేశ్వరరావు

153

జగన్ తన ప్రభుత్వాన్ని రద్దుచేసి మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాలి
• ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు.
• 14 నెలల్లో ఎక్కడా, ఏ విధమైన పని చేయని వ్యక్తి, అభివృద్ధిని వికేంద్రీకరిస్తాడా?
• ఒక్క రాజధాని కట్టలేని వాడు మూడురాజధానులు కడతాడా?
• గవర్నర్ కు తప్పుడు సమాచారమిచ్చి, బిల్లులు ఆమోదిపంచేశారు.
• మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏరద్దు బిల్లు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా గవర్నర్ సంతకం చేయడమేంటి?

ఈ రోజు రాష్ట్రానికి చీకటిరోజని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, రాష్ట్ర ప్రజలంతా ఎంతలా బాధపడ్డారో అందరూ చూశారని, మరలా ఇప్పుడు అలాంటి స్థితి వచ్చిందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతే రాజధాని అని అంగీకరించిన జగన్, ఏరుదాటాక తెప్ప తగలేశాడని ఉమా మండిపడ్డారు. ఆనాడు జగన్, ఆయన పార్టీ నేతలు గల్లీగల్లీలో అమరావతే రాజధాని ప్రచారంచేసి, ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మూడురాజధానులను తెరపైకి తెచ్చారన్నారు. తన విపరీతధోరణితో మూడురాజధానులను తెరపైకి తెచ్చి, ప్రజలను రెచ్చగొడుతున్న జగన్, తాజాగా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, మూడు రాజధానుల అంశమే అజెండాగా ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం కోరాలని బొండా తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో లక్షల అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించిన జగన్, చెప్పిన హామీలేవీ నెరవేర్చకుండా, వారి కలల రాజధానిని చిదిమేయాలని చూస్తున్నాడన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్, ఇప్పుడు మూడు రాజధానులని ఎలా అంటాడని బొండా నిలదీశారు. అసలు జగన్ ఆలోచనా విధానం, ఆయన విపరీత బుద్ధి ఏమిటో తెలియడం లేదన్న బొండా, ఎలాంటి పరిస్థితుల్లో అమరావతి ఏర్పడిందో తెలుసుకోలేకపోతున్నాడన్నారు. రాష్ట్ర విభజనానంతరం శాస్త్రీయబద్ధంగా అమరావతి ఏర్పడిందని, 29వేల మంది రైతులు, 34వేల ఎకరాల వరకు భూములిచ్చారని, రూ.10వేల కోట్ల ఖర్చుతో దాదాపు 80 శాతం పనులు రాజధానిలో పూర్తయ్యాయని బొండా పేర్కొన్నారు.

జగన్ అధికారంలోకి రావడమే, రాష్ట్రానికి దరిద్రం పట్టినట్లు అయ్యిందన్న ఉమా, 14 నెలలపాలన చూస్తే ప్రజలంతా అదే అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 13జిల్లాల అభివృద్దికి విశాల థృక్ఫధంతో పనిచేసిందని, జగన్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఆనందిస్తున్నాడన్నారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు ఇక్కడే ఉండి పాలన చేస్తూ, మరోచోట రాజధాని అని ఎలా అంటాడన్నారు. రాజ్యాంగంపై, చట్టాలపై జగన్ ప్రభుత్వానికి అవగాహన ఉందా అని ప్రశ్నించిన ఉమా, దేశంలో ఎక్కడైనా ఒక రాజధాని ఉండగా, ఎవరైనా మూడు రాజధానులు పెడతామని అన్నారా అని ప్రశ్నించారు. చరిత్రలో ఆనాడు తుగ్లక్ మాత్రమే ఆపని చేశాడని, ఇప్పుడు ఏపీలో ఈ తుగ్లక్ చేస్తున్నాడని బొండా ఎద్దేవాచేశారు. గతంలో మూడురాజధానుల బిల్లును ప్రభుత్వం మండలికి పంపితే, దాన్ని పరిశీలించాలని మండలి సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగిందని, అది అలా ఉండగానే, జూన్ 16న అసెంబ్లీ లో మరలా అదే బిల్లును ఆమోదించి, శాసనమండలికి పంపకుండా గవర్నర్ కు పంపడం ఏమిటని బొండా నిలదీశారు. ఏఏ పార్టీలు సహకరించాయో, ఏమాయ చేశారో, ఎవరు ఒత్తిడి చేశారో, గవర్నర్ బిల్లులు ఆమోదించారన్న ఉమా, గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించిన విషయాన్ని ఏపీ ప్రజలెవరూ మరువలేదన్నారు.

భారతదేశపటంలో ఏపీ రాజధానిగా అమరావతికి చోటు కల్పించారని, ఆనాటి ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని మోదీ అమరావతికి శంఖుస్థాపన చేసి, రాజధానికి అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగిందన్నారు. కేంద్రం నుంచి విభజనచట్టం ప్రకారం అమరావతి నిర్మాణానికి కొద్దోగొప్పో నిధులుకూడా రావడం జరిగిందన్నారు. టీడీపీ ఎప్పుడూ అమరావతే రాజధాని అని చెబుతోందని, అందుకు తగ్గట్లుగానే ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని పోరాటం చేస్తుందని ఉమా తేల్చిచెప్పారు. 240రోజుల నుంచి రైతులు రాజధాని కోసం పోరాడుతున్నారని, ఇప్పటికే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని ఉమా తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో, వికేంద్రీకరణ బిల్లు విషయంలో కూడా న్యాయస్థానంలో అదే విధమైన భంగపాటు ప్రభుత్వానికి తప్పదని బొండా స్పష్టంచేశారు. గవర్నర్ కు తప్పుడు సూచనలు ఇచ్చి, బిల్లులు ఆమోదించేలా చేశారన్న టీడీపీనేత, హైకోర్టులో ఇవే బిల్లులు పెండింగ్ లో ఉండగా గవర్నర్ సంతకాలు చేయడం కచ్చితంగా న్యాయస్థానాల్లో చెల్లదన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న వారు కోర్టులను ఆశ్రయిస్తారని, వారికి న్యాయం జరుగుతుందన్నారు.

మూడురాజధానుల బిల్లు అనేది ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి తప్ప, ఎవరికీ ఏమీ మేలు చేయడానికి కాదని చెప్పిన బొండా, ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్ ఏ ప్రాంతంలోనైనా ఒక్క అభివృద్ధి పని అయినా చేశాడా అని ప్రశ్నించారు. వడ్డించిన విస్తరి లాంటి ఒక్క రాజధాని కట్టలేని వాడు, మూడు రాజధానులు కడతాడా అని బొండా మండిపడ్డారు. ఒక పథకం ప్రకారం కొన్ని అంతర్గత శక్తులన్నీ కలిసి ఈ పని చేశాయన్న మాజీ ఎమ్మెల్యే, గల్లీలో ఒకలా, ఢిల్లీలో ఒకలా మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయన్నారు. ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్న పార్టీల భవిష్యత్ ఏమైందో గుర్తుంచుకోవాలన్న బొండా, తాము అమరావతిని కోరేది ప్రజలందరి తరపున అనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలను రెచ్చగొట్టే చర్యలను మానుకొని, ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయం కోరాలని బొండా పునరుద్ఘాటించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తామన్న ఉమా, అక్కడ ఏపీకి న్యాయం జరుగుతుం దన్న నమ్మకం, విశ్వాసం తమకు ఉన్నాయన్నారు.