గవర్నర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ

172

న్యూఢిల్లీ : సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్‌ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా గవర్నర్ వ్యవస్థపై మాట్లాడే పార్టీలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని రాజధానిగా టీడీపీ ఎంచుకుంది. చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలనుకోవడం చంద్రబాబుకు సరికాదు. నాడు రాజధానిపై చర్చ సందర్భంగా అమరావతి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టాడమని కేంద్రం చెప్పింది. కేంద్రంపై టీడీపీ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా బాబు మూర్ఖంగా వ్యవహరించారు. ఫెడరల్ స్ఫూర్తితో పని చేస్తున్నాం.’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.