రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు: సుజనా చౌదరి

369

ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ బలపడుతుందనే నమ్మకం ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, కోవిడ్ దెబ్బతో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 65 సందర్భాల్లో కోర్టుతో మొట్టికాయలు వేయించుకుందని, ఏపీలో ఇంత వరకూ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగలేదని సుజనా చౌదరి విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ కు పంపడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది సెక్షన్ 5, 6కి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అన్నారని, కేంద్ర నిర్ణయంతో అది తేలిపోయిందని, స్వతంత్రం తర్వాత ఎప్పుడు జరగని గందరగోళం ఇప్పుడు ఏపీలో జరుగుతుందని సుజనా విమర్శించారు. 2017 బడ్జెట్ స్పీచ్ లో రైతులకు అనేక వెసులుబాటులు కల్పించారని, సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయాలని, ఆర్టికల్ 196 ప్రకారం కౌన్సిల్ ఆమోదం లేకుండా బిల్లును ఆమోదించకూడదన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని, రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.