పలకరించలేదని ఫీలయిన ఒమర్ అబ్దుల్లా
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆశకయినా ఒక హద్దుండాలి. ఆశ మంచిదే. అత్యాశ పనికిరాదు.  కశ్మీర్ యువకిశోరం, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాటలు అలాగే కనిపిస్తున్నాయి. ఇంతకూ ఆయన గోల ఏమిటంటే.. గృహనిర్బంధంలో ఉన్న తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనీసం ఫోన్లోనయినా పకలరించలేదట. కనీసం ఆ చర్యను ఖండించలేదట.  అంతేనా… ‘ఈ పెద్దోళ్లున్నారే’ అని, అదేదో సినిమాలో హీరో ఉయద్ కిరణ్ అన్నట్లు… ఆ చంద్రబాబునాయుడున్నాడే.. అంటూ తిట్లు లంకించుకున్నారు. ఆ సందర్భంలో గత ఎన్నికల్లో ఫరూఖ్ తన నియోజకవర్గంలో ప్రచారం కూడా మానుకుని, టీడీపీ కోసం బెజవాడ ప్రచారానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అసలు ఒమర్ బాధేమిటో చూద్దాం.  ‘‘చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోతాడని, జగన్ సీఎం అవుతారన్న విషయం, చంద్రబాబుకు తప్ప అందరికీ తెలుసు. అయినా మా నాన్న ఫరూఖ్ అబ్దుల్లా అక్కడికి వెళ్లి, చంద్రబాబు కోసం ప్రచారం చేశారు. రాజకీయ అవసరాలకు, తన రాష్ట్రంలో మైనారిటీల ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్న చంద్రబాబు, మా రాష్ట్రానికి సమస్య వస్తే కనీసం మాట్లాడలేదు. మా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే, బాబు ఒక్క మాట మాట్లాడలేదు. మమ్మల్ని కేంద్రం అన్యాయంగా గృహనిర్బంధంలో పెడితే, కనీసం బాబు మాకు మద్దతుగా, ఒక్క మాట మాట్లాడలేదు. మాకు మద్దతిచ్చేందుకు కనీసం శ్రీనగర్, పోనీ ఎయిర్‌పోర్టు వరకూ రావాలనిపించలేదు. బాబు విశ్వాసఘాతకుడు. భవిష్యత్తుల్లో ఆయనను నమ్మేదిలేదు. ఇకపై ఆయనకు ఏ విషయంలోనూ మద్దతునిచ్చేది లేదని’ కశ్మీర్ యువరాజావారు, ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్రోశించారు. అయితే.. యువరాజా వారి ఆక్రోశాన్ని, వైసీపీ అధికార మీడియా ‘సాక్షి’లో తప్ప ఏ తెలుగు పత్రిక రాయలేదు. సరే అది సాక్షికి అత్యవసరం. ఆ రెండు పత్రికలకు అనవసరం. అలాంటి అప్రియపదాలు  వాటికి వినిపించవు. కనిపించవు. అది వేరే విషయం!

ఒమర్ అబ్దుల్లా ఆవేదన చూసి, ఇక్కడ తెలుగు తమ్ముళ్లు పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు. ‘అబ్బకు లేక ఆకులు తింటుంటే, కొడుకొచ్చి కోడి కూర అడిగినట్లు’.. 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటున్న తమనే పలకరించే దిక్కులేక తాము ఏడుస్తుంటే, మధ్యలో ఈ కశ్మీర్ కూనిరాగాలేమిటని తమ్ముళ్లు, ఒమర్‌ను చూసి జాలిపడుతున్నారు. కరోనా సీజన్‌లో ఉప రాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు దగ్గర నుంచి నరేంద్రమోదీ, బండారు దత్తాత్రేయ వరకూ.. తమ పార్టీ నేతలనే కాదు, తమ కాలంలో పనిచేసిన వారందరికీ ఫోన్లు చేసి, వారి యోగ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆ రోజులను గుర్తు చేసుకుని, కరోనా సమయంలో జరభద్రమని హెచ్చరించారు. ఆ ముచ్చట్లన్నీ పత్రికల్లో పెద్ద అక్షరాలతోనే వచ్చాయి. వెంకయ్యనాయుడయితే, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైతం ఫోను చేసి, యోగ క్షేమాలు అడిగారు.

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా చేయలేని ఆ పని.. నెల్లూరు నాయుడుగారు చేసినందుకు, రాజమండ్రి చౌదరి గారు మురిసిపోయే ఉండాలి. బుచ్చయ్య బాబాయ్‌ను.. వెంకయ్య నాయుడు పలకరించిన విషయం, పత్రికల్లో వచ్చిన తర్వాతయినా, బాబన్నలో చలనం వచ్చి.. పార్టీలో పడి ఉన్న పాతకాపులను, కనీసం ఫోనులో పలకరించకపోవడమే తమ్ముళ్లను ఆశ్చర్యపరిచింది. జూనియర్ తమ్ముళ్ల అంతర్మథనం చూసి, సీనియర్ తమ్ముళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ‘మేం కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. బాబన్న దగ్గర ఇలాంటివెన్ని చూశాం. సారు మనసారా పలకరిస్తే వార్త గానీ, పలకరించకపోవడం వార్త ఎలా అవుతుంది? అయినా సారు మారాలనుకోవడం వీళ్ల భ్రమ. వీళ్లే సారుకు అనుగుణంగా మారాలి. పార్టీ తీర్థం తీసుకుని ఇన్నేళ్లయింది. ఇంత వయసొచ్చింది. ఇంకా హెప్పుడు తెలుసుకుంటారో హేమో’నని నిట్టూర్పు విడుస్తున్నారు.
అయినా.. తమ్ముళ్ల పిచ్చి ఆశలు గానీ, బాబన్న వాటికి అతీతుడు. ఆయన ఫక్తు రాజకీయవాది.

   ‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపిక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’‘

అన్నది సుమతీశతక కారుడి తత్వం.  అంటే.. ఏ సమయంలో ఏది అవసరమో, ఆ మాటలు పలుకుతూ, తాను బాధపడకుండా-ఇతరులను బాధపెట్టకుండా పనులు చక్కబెట్టేవాడు, గొప్పవాడన్నది దీని అర్ధమన్నమాట.  ఈ తత్వాన్ని,  దేశ రాజకీయాల్లో బాగా అవపోసన పట్టిన బాబన్నను.. ఇప్పటివరకూ ఎవరూ ఫాలో కాకపోవడమే, తమ్ముళ్ల అపార్ధాలకు అసలు కారణం.

బాబు గారు ఎప్పుడూ చెబుతున్నట్లు… నాయకులు, కార్యకర్తలు ప్రాణసమానమే. వారంతా ఆయన కుటుంబసభ్యులే. కాకపోతే.. లోకేష్ తప్ప, మిగిలిన కుటుంబసభ్యులెవరూ ఆయన తత్వాన్ని ఇప్పటివరకూ అర్ధం చేసుకోలేకపోతున్నారు. అసలు సమస్య అదే. బాబు గారికి కుటుంబం కంటే, ప్రజలు ముఖ్యం. అందుకే, కరోనా కష్టకాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలి? ప్రజలను ఆదుకోవడంలో జగనన్న సర్కారు ఎలా విఫలమయింది? దేశ-విదేశీ  వైద్యుల సలహాలు తీసుకుని కరోనాకు ఎలా చెక్ పెట్టాలి? వైద్యుల ఉపాయాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి, ఎంత తొందరగా కరోనాను తరిమికొట్టాలి? అన్న ఆలోచనలతోనే బాబన్న సమయం, మేధస్సు వెచ్చిస్తున్నారు. అందుకే.. ఆయన కరోనా కాలంలో తన పార్టీ సీనియర్లు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వారి కష్టసుఖాలేమిటి? మొన్నటి ఎన్నికల్లో,  చివరాఖరి సమయంలో పార్టీ చేతులెత్తేస్తే, తన హామీ మేరకు అప్పులు చేసి, అవస్థలు పడుతున్న తమ్ముడభ్యర్ధులు ఎలా ఉన్నారు?  అన్న ఆలోచనలు బాబన్నకు రావడం లేదు.

 పాపం.. ఎన్నికల ముందు బాబన్న ఇచ్చిన భరోసాతో,  బోలెడన్ని అప్పులు చేసి, అమరావతి చుట్టూ తిరగలేక తమ్ముడభ్యర్ధుల చెప్పులు ఇప్పటికే డజనుసార్లు మారిపోయాయి. ఆ డబ్బులు అసలు వస్తాయా? రావా? లేకపోతే ఇక నీళ్లొదులుకోవసిందేనా అన్నది తమ్ముడభ్యర్ధుల ఆందోళన. సరే పీత కష్టాలు  పీతవి. తమ్ముడభ్యర్ధుల కష్టాలు తమ్ముడభ్యర్ధులవనుకోండి!  ఆ మాటకొస్తే.. ఎన్నికల ముందు పత్రికలు, చానెళ్లకు ఇచ్చిన ప్రకటనల సొమ్ము కూడా, చెల్లించలేనంత కడుపేదరిక పరిస్థితి. కరోనా కల్లోలంలో.. ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే హడావిడిలో పడే.. బాబన్న, కరోనాకాలంలో  తమ్ముళ్లను పలకరించలేదు. లేకపోతే ఎందుకు పలకరించరూ? ఆమాత్రం అర్ధం చేసుకోకపోతే ఎలా?  ఇది కూడా చదవండి.. బాబుకు.. పలకరింపే బంగారం!

అయితే.. బాబన్న తత్వం అర్ధం చేసుకోలేని తమ్ముళ్లు మాత్రం.. పనికిరాని ఆ టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులతో సమయం వృధా చేసేబదులు.. రోజుకు పదిమంది సీనియర్ తమ్ముళ్లకు ఫోన్ చేసి, పలకరిస్తే వాళ్లూ సంతోషిస్తారు  కదా? ఏం.. మోదీ, వెంకయ్య, దత్తన్న వంటి బిజీగా ఉండే వాళ్లే ఆ పనిచేస్తుంటే, మన సారెందుకు చేయరు? మరీ అంత మానవీయ వాతావరణం లేకపోతే ఎలా? దాని దుంప తెగ.. ఓ మాట, పలకరింపు, ఉభయకుశలోపరి లేకపోతే ఎలా? ఈ పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత, పార్టీ రాను రాను కార్పొరేట్ ఆఫీసవుతోంది. సారు ఎప్పుడు మారతారో హేమిటోనని నిట్టూరుస్తున్నారు.

ఈ మాట తెలిసిన బాబు తత్వ సహచరులు… జూనియర్ తమ్ముళ్ల కోరికలు, తనది కాకపోతే కాశీ దాకా దేకమన్నట్లుందంటున్నారు. పిల్లకాకి ఒమర్ అబ్దులా.. ఏదో ఆవేశంలో ఏదిపడితే అది మాట్లాడితే, ముందు వెనుకా చూసుకోకుండా,  బాబన్న తన తత్వం మార్చుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘అసలే అధికార వియోగంలో నానా కష్టాలు పడుతుంటే, కశ్మీర్‌కు వెళ్లి హౌస్ అరెస్టయి, ఇంట్లో ఉన్న అబ్దుల్లా ఫ్యామిలీని పరామర్శించాలా? ఆశ దోశ అప్పడం! హమ్మో.. అలా చేస్తే ఇంకేమయినా ఉందా? మోదీ-అమిత్‌షాకి ఆ విషయం తెలిస్తే మరేమయినా ఉందా? తనపై కాంగ్రెసు, అప్పోజిషను పార్టీలను దండయాత్రకు ఉసిగొల్పిన ఎన్నికల ముందు కథను కమలదళాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాయి. మళ్లీ ఏదో సర్దుబాటు, దిద్దుబాటు వ్యవహారంలో ఉన్న కథను, క శ్మీర్‌కు వెళ్లి చెడగొట్టుకోవాలా? అందుకే కదా.. మోదీ భయ్యా ఏ నిర్ణయం తీసుకున్నా, అందరికంటే ముందే భలేగుందని చప్పట్లు కొడుతుంది? మొన్నామధ్య మోదీ చెప్పగనే, వెంటనే రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించింది? ఇప్పుడు కేంద్ర విద్యావిధానం ప్రకటించిన వెంటనే, వైసీపీ కంటే ముందుగానే బ్రహ్మాండమని పొగిడింది? అప్పుడంటే.. మోదీ-బీజేపీ మీద కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిపై, కాంగ్రెస్‌తో కలసి పోరాడాం. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పోరాడి, అసలుకే ఎసరు తెచ్చుకోవాలా’’ అని జూనియర్ తమ్ముళ్లపై, సీనియర్ తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. ఏదైనా బాబు సార్.. బాబుగారంతే!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner