ఆతిథ్యాని’కి అద్వానీ అర్హుడు!

636

మోదీతో భూమి పూజ మంచిదే
అద్వానీతో చేయిస్తే బహు బాగని వాదన
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అది 1992 డిసెంబర్ 6. దేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని, ఓ అధ్యాయం సృష్టించుకున్న రోజు అది. హిందూ సమాజంలో భావోద్వేగం నింపిన రోజు. హిందూశక్తులన్నీ బలాన్ని కూడ గట్టుకుని అక్కడ కట్టిన మసీదుపై లంఘించిన రోజు. జై శ్రీరాం నినాదాలతో కొండలు, గుట్టలు, అడవులు దాటి, ఖాకీ పటాలం కళ్లుగప్పి అయోధ్యకు వెళ్లి.. శతాబ్దాల కాలం క్రితం ఆక్రమించిన.. రామాలయంలోని మసీదును కూల్చి, దానిపై సగర్వంగా, కాషాయ జెండా ఎగురవేసిన రోజు. కరసేవ చేసిన లక్షన్నరమంది  ఎగరేసిన కాషాయ రెపరెపల మధ్య… కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామనే ైసైనికుడి తరహా  విజయదరహాసం. దేశ సరిహద్దులో పర్వతాలపై జాతీయ జెండా ఎగరేసినంత విజయగర్వం.  మొఘలాయిల నీడ నుంచి, బాబర్ పీడ నుంచి మన రాముడు బయటకు వచ్చాడన్న భావోద్వేగం.

ఇప్పటిమాదిరిగా అన్ని చానెళ్లు లేని ఆ రోజుల్లో.. తెల్లవారుఘామున పత్రికల్లో వచ్చిన ఆ వార్తలు చూసి, హిందువుల ఛాతీ కొన్ని సెంటీమీటర్లు ఉప్పొంగిన రోజు.  అయోధ్యకు వెళ్లొచ్చిన కరసేవకులకు వారి గ్రామాలు,  బ్రహ్మరథం పట్టిన రోజు. నాయకులకు జనాలు నీరాజనాలుపట్టిన రోజు. ప్రతి ఇంట్లో అంతకుముందున్నెడూ కనిపించని, శ్రీరాముడి చిత్రపటాలు వెలసిన రోజు.  అదొక్కటేనా? హిందూ సిపాయిలు చేసిన ఆ సాహసంతో, దేశంలో మతకలహాలకు తెరలేచిన రోజు కూడా అదే. ఫలితంగా లెక్కలేనంతమంది చావుకేకలు. మంటల్లో కాలిపోయిన ఇళ్లు. ఆర్తనాదాలతో ప్రతిధ్వనించిన ఆసుపత్రులు. చచ్చిబతికిన జీవచ్ఛవాలు. ఆస్తినష్టం దాదాపు 9 వేల కోట్లు. ఈ దృశ్యాలన్నీ.. అయోధ్య బాబ్రీమందిర్ విధ్వంసం తాలూకు శిలాన్యాస్‌కు సంబంధించినవేనని, అద్వానీ రథయాత్ర హిందూ సమాజంపై చూపిన పెను ప్రభావమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

దేశ చరిత్రలో ఈ అద్భుత దృశ్య ఆవిష్కరణకు పునాదులు వేసి, సంఘపరివారాన్ని నడిపించింది.. నాటి సంఘ్ సిద్ధాంతకర్త గోవిందాచార్య అయితే, ముందుండి హిందూవాహిని సైన్యానికి, నాయకత్వం వహించింది భారతీయ జనతా పార్టీ రధసారథి లాల్ కృష్ణ అద్వానీ. రధయాత్ర సారథి అద్వానీ వెంట నీడలా నిలిచిన, పర్యవేక్షక నిర్వహకుడు మోదీ.  ఆ ఘటనే.. భారతీయ జనతా పార్టీకి దేశంలో దారులు చూపి, రాజకీయ భిక్ష పెట్టింది. అయోధ్య నుంచి హస్తినలో అధికారమార్గం పట్టించింది. ఆ ఘటనే..  భారతీయ జనతాను జనంలోకి తీసుకువెళ్లింది. సైద్ధాంతిక వేదన నుంచి, రాజకీయ వాదనకు మళ్లించిన ఘటన అది. ఇప్పటి అధికార విస్తరణకు పునాదులు వేసింది, అప్పటి ఈ ఘటనేనన్నది మనం మనుషులం అన్నంత నిజం!

రెండు సీట్ల నుంచి 89, అక్కడి నుంచి 120, 169, 182.. అలా అలా..  ఇంతింతై వటుడింతయి అన్నట్లు.. పార్లమెంటులో పాగా వేసి, వాజపేయి, నరేంద్రమోదీని భారత ప్రధానులుగా ప్రతిష్ఠింపచేసిన ఘటనకు,  పునాదులు అవేనన్నది విస్మరించకూడదు. భారతీయ జనతా మూలవిరాట్టు శ్యాంప్రసాద్‌ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి స్వప్నం, దేశంలోని కోట్లాదిమంది దేశభక్తుల కోరికయిన, మొన్నటి ఆర్టికల్ 370 రద్దు సాకారానికి అయోధ్య శిలాన్యాసే అంకురార్పణ.  ఆ తర్వాత.. ఆ ఘటన కమలం పువ్వును నవ్విస్తే.. కాంగ్రెస్‌ను శోకింపచేసింది. వాజపేయిని గద్దెనెక్కిస్తే, పీవీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని సొంత పార్టీలో ముద్దాయిని చేసింది. మరి ఇన్ని కీలక ఘట్టాలు, అద్భుతాలకు ఆద్యుడు, ప్రేరకుడయిన ఎల్.కె.అద్వానీని మరిచిపోతే ఎలా?

సరే.. భాజపా కూడా రాజకీయ క్రీడలో సవ్యసాచిగా మారి,  కాంగ్రెస్ బాపతు లక్షణాలు పుణికిపుచ్చుకుని, ఆ ‘వికాస్‌పురుషుడి’ని రాజకీయంగా అన్యాయం చేసినా, బాబ్రీ విధ్వంసానికి వ్యూహకర్త అయిన గోవిందాచార్యను, కరివేపాకులా తీసిపడేసినా…హిందూ భావోద్వేగాలకు ప్రతీక అయిన, వినయ్‌కటియార్‌ను పులుసులో ముక్కగా  వాడుకున్నా, దాని దుంపతెగ.. ‘అయోధ్య ఆలయ నిర్మాణ ఆనందం’లోనూ వారిని మర్చిపోతే ఎలా? కమలనాధులనే కాదు. సంఘపరివార సభ్యులనూ వేధిస్తున్న ప్రశ్న ఇది. కాదంటారా? అన్నట్లు.. 76 ఏళ్ల సంఘ్ సిద్ధాంతకర్త గోవిందాచార్య ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?.. బీహర్, మధ్యప్రదేశ్, యుపీలో కొన్ని లక్షల ఎకరాలను, సేంద్రీయ వ్యవసాయంగా మార్చే ఓ ఎన్జీఓ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. ‘సేంద్రీయ వ్యవసాయం-ప్రజల ఆరోగ్యం’పై రైతులలో చైతన్యం తీసుకువచ్చే పనిలో ఉన్నారు.

అయోధ్యలో కరసేవకు వెళ్లిన, హైదరాబాద్ టైగర్ నరేంద్ర బృందం ఒక్కటే లోపలి వరకూ చేరగలిగింది. వెంకటరమణి, బాలనర్శిం, రాజశేఖర్‌రెడ్డి, గుండుకృష్ణ, ప్రసాద్‌కాక వంటి బీజేపీ నేతలు అప్పట్లో అయోధ్యకు చేరుకోగలిగారు. ఆలె నరేంద్ర అంటే బీజేపీకి అండ. రాజధాని నగరంలో బీజేపీ ఈస్థాయిలో ఉందంటే అది భాయ్‌సాబ్ చలవే. ఒక బీసీ నేత ఆ స్థాయిలో బీజేపీని తిరుగులేని శక్తిగా, మజ్లిస్‌ను ఢీకొనే స్థాయికి తీసుకువెళ్లడం సాధారణ విషయం కాదు.  ఆ తర్వాత సహజంగా అందరిమాదిరిగానే, ఆయనను కూడా పార్టీ మరిచిపోయింది.  కేసీఆర్ పార్టీలో విలీనం చేసిన తర్వాత గానీ భాయ్‌సాబ్ కేంద్రమంత్రి కాలేకపోయారు. జీవితంలో ఒక్కసారి, బీజేపీ రాష్ట్ర పగ్గాలు అందుకోవాలన్న భాయ్‌సాబ్ కల నెరవేరకుండానే కన్నుమూశారు. అదో విషాదగాథ. ఇక ఇప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి హోదాలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ  బీహార్ బృందంతో కలిపి లోపల బలరాముడి విగ్రహం ప్రతిష్ఠించే సాహసం చేశారు. అయినా చాలా ఏళ్ల తర్వాత గానీ, ఆయనకు అధ్యక్ష పదవి దక్కలేదు.

ఇక బాబ్రీమసీదు విధ్వంసం రోజు హైదరాబాద్ అల్లకల్లోలమయింది. అల్లర్లు పాతబస్తీ నుంచి కొత్తబస్తీకి పాకిన రోజులవి. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి. కార్యకర్తల ఇళ్లను జల్లెడ పట్టి, స్టేషన్లకు తీసుకువెళ్లిన సందర్భమది.  నగరంలో నాయకులంతా అయోధ్యకు వెళ్లే మార్గమధ్యంలో అరెస్టయి నైనా, బరేలీ జైళ్ల పాలయ్యారు. హైదరాబాద్‌లో కమలదళాలపై లాఠీచార్జీల ఫలితంగా కిక్కిరిసిన ఆసుపత్రులు. వారికి కనీసం మందులిచ్చే దిక్కులేదు. అప్పటి బీజేపీ అగ్రనేత , ఫైర్‌బ్రాండయిన జి.ఆర్.కరుణాకర్ ఒక్కరే పోలీసుల నిర్బంధం నడుమ, జీపులో మందుల బాక్సులు క్షతగాత్రుల కోసం  తీసుకువెళ్లారు. ఆయన ఇప్పుడు పార్టీలో ఎవరికీ పట్టకుండా పోయారు. అదీ విషయం!

అవును. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న.. రామాలయ భూమిపూజకు, ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బాబ్రీమసీదు విధ్వంస సమయంలో అద్వానీ నిర్వహించిన రథయాత్రలో, సర్వంతానయి  వ్యవహరించిన నరేంద్రమోదీతో, భూమిపూజ చేయించడం మంచిదే. గురువు వెంట నడిచిన శిష్యుడు ఆ స్థాయికి ఎదగడం, ఏ ఆలయ రక్షణ కోసమయితే ఉద్యమం జరిగిందో, అదే ఆలయానికి భూమిపూజ చేయడం అబ్బురమే. దేశ ప్రధాని స్వహస్తాలతో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అయోధ్య రామమందిరానికి భూమిపూజ చేయించడం, హిందూ సమాజానికి మార్గదర్శి అయిన శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి, భారతీయ జనతా పార్టీకి కొత్త ఇమేజ్ తెచ్చిన మోదీతో పునాదులు వేయించడం గర్వకారణమే. అది సమున్నత నిర్ణయమే కావచ్చు.


 కానీ.. అసలు బాబర్ జ్ఞాపకాలను, దేశ ప్రజల మది నుంచి సమూలంగా సమాధి చేసి, యావత్ హిందూ సమాజంతో జై శ్రీరామ్ అని, పిక్కటిల్లేలా ప్రతిధ్వనింపచేసిన  నినాదాలకు మూలపురుషుడయిన అద్వానీతో.. ఆ భూమిపూజ చేయిస్తే, దేశచరిత్రను మలుపు తిప్పనున్న ఆ ఆగస్టు 5 నాటి కార్యక్రమం.. మరింత శోభిల్లుతుంది. ఇది కమలనాధుల వాదనే కాదు, ఆ నాటి కార్యక్రమంలో పాల్గొన్న కరసేవకుల మనోభావం కూడా.  నాటి కరసేవలో తెగువ చూపిన ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, బజరంగ్‌దళ్, హిందూవాహినితోపాటు సాధు, సంతుల ఆకాంక్ష కూడా! నాడు బీజేపీ కార్యకర్తల కంటే,  కరసేవలో వీరోచితంగా పాల్గొని హిందూ శక్తులను నడి పించింది స్ధానిక సాధు సంతులే.


అద్వానీ నేతృత్వంలో.. నాడు సోమనాధ్ నుంచి అయోధ్యకు కదిలిన మురళీమనోహర్‌జోషి, ఉమాభారతి, సాధ్వీరితింభర, గోవిందాచార్య, అశోక్‌సింఘాల్, వినయ్‌కటియార్ వంటి హేమాహేమీలలో  అశోక్‌సింఘాల్ ఇప్పుడు లేరు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రేరణ, అయోధ్య ఆలయ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చిన ఆ నాయకులకు.. సింహభాగంలో సమున్నతస్ధానం ఇచ్చి, వారి సమక్షంలో- వారితో కలసి,  నరేంద్రుడితో భూమిపూజ చేయించడమే.. నాడు బాబ్రీ విధ్వంసంలో పాల్గొన్న కరసేవకులకు ఇచ్చే,  నిజమైన బహుమతి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి ట్రస్టు ఏం చేస్తుందో?