కేసీఆర్ పాలనలో దళితులకు దిక్కేదీ: మోత్కుపల్లి

241

నిజనిర్ధారణకు వెళ్లిన బీజేపీ నేతల అరెస్ట్
ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్, రామచంద్రరావు, చింతా, మోత్కుపల్లి నిర్బంధం

హైదరాబాద్: కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు విరుచుకుపడ్డారు. దళితులను చిన్న చూపు చూస్తున్న కేసీఆర్ పాలనకు, దళితులు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో దళితుల ధన-మాన-ప్రాణ రక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు.

భూపాల్‌పల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన, రాజబాబు అనే దళితుడిని హత్య చేసిన నేపథ్యంలో..  బీజేపీ రాష్ట్ర నాయకులు అక్కడికి నిజనిర్థారణ బృందంగా వెళ్లారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, దళిత నేత వివేక్, చింతా సాంబమూర్తి, మేకల సారంగపాణి, మండూరి సాంబశివరరావు తదితర నాయకులు, బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు ఘన్‌పూర్, వరంగల్ వద్ద అడ్డుకున్నారు. పరకాల చలివాగు బ్రిడ్జి వద్ద పోలీసుల ప్రయత్నాలను బీజేపీ నేతలు ప్రతిఘటించారు. టీఆర్‌ఎస్ నాయకుల చేతిలో హత్యకు గురైన దళిత కుటుంబాన్ని పరామర్శించి, నిజానిజాలు తెలుసుకునేందుకు వెళుతున్న తమను అడ్డుకోవడంపై మోత్కుపల్లి, చింతా సాంబమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపై దళితులు తిరగబడే రోజులు ఎంతోదూరం లేదన్నారు.

 పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, కేసీఆర్ కోసం పనిచేయవద్దని హెచ్చరించారు. తాము శాంతియుత పంథాలోనే అక్కడికి వెళుతున్నామని, తమ వద్ద ఆయుధాలేమీ లేవన్నారు.  విధ్వంసకారులు, హంతకులను వదిలేసి.. తమను అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీసులు టీఆర్‌ఎస్ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్‌ను రేగొండ పోలీసుస్టేషన్‌కు, మిగిలిన నాయకులను పరకాల పోలీసుస్టేషన్‌కు తరలించారు.

తెలంగాణలో బలపడుతున్న బీజేపీని చూసి, కేసీఆర్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే నిర్బంధాల పేరుతో అణచివేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నగర నేత మేకల సారంగపాణి ఆరోపించారు. దళిత కుటుంబాన్ని పరామర్శిస్తే అరెస్టు చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది? అది భారత రాజ్యాంగంలో ఉందా? లేక కేసీఆర్ రాసిన రాజ్యాంగంలో ఉందా చెప్పాలని’ మేకల డిమాండ్ చేశారు.