తెలుగు రాష్ట్రాల్లో జనాలకు కోర్టులే తెరవు
ఆంధ్రాలో జగనన్నఅలా.. తెలంగాణలో శేఖరన్న ఇలా
న్యాయమూర్తులకు సెల్యూట్ కొట్టాల్సిందే
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

లా ఒక్కింతియు లేదు..  పాలకులు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి.. పత్రికల్లో ఇలాంటి హెడ్డింగులు, ఎప్పుడోగానీ కనిపించవు. కానీ గత ఏడాది కాలం నుంచి, హైకోర్టు న్యాయమూర్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వైచిత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఏపీలో అయితే ఏకంగా పాలకుల పనితీరును, శరపరంపరగా తప్పుపడుతున్న పరిస్థితి. అయినా పాలకుల్లో మార్పు రాకపోగా, తమ విధేయ దళాలతో న్యాయవస్థపైనే, ఎదురుదాడి చేయిస్తున్న విచిత్ర పోకడ. ఇటు తెలంగాణలోనూ ఇటీవలి కాలంలో, పాలకుల తీరుపై న్యాయవ్యవస్థ వరసగా చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న తీర్పులు చూస్తుంటే.. కోర్టులు కన్నెర్ర చేస్తే తప్ప, పాలకులు కళ్లు తెరవరన్న అభిప్రాయాన్ని స్థిరపరిచేలా మార్చాయి. ఈ విషయంలో ఏపీ సర్కారుతో పోలిస్తే, తెలంగాణ పాలకుల తీరు ఎంతో మెరుగని చెప్పక తప్పదు.

పాలకుల ధోరణిలో మార్పు రాకపోతే, రాను రాను ఇక కోర్టులే వారికి మార్గదర్శిగా మారతాయన్న, మరో అభిప్రాయానికి కారణమవుతోంది. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల్లో.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెల్లడవుతున్న తీర్పులు-వ్యాఖ్యలు పరిశీలిస్తే, న్యాయస్థానాలు లేకపోతే, బాధితులకు న్యాయం, అందని ద్రాక్షగా మారుతుందేమోనన్న భావన ఏర్పడుతోంది. ఇక చివరికి కోర్టులే శరణ్యమన్న నిశ్చితాభిప్రాయం అన్నీ కలసి వెరసి, న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెంచేలా చేస్తున్నాయి. కాబట్టి, జనం ఇబ్బందులు గమనించి, తీర్పులు వెలువరిస్తోన్న న్యాయమూర్తులకు సెల్యూట్ చెప్పడం మన నైతిక ధర్మం.

ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడితే.. అక్కడ గత 14 నెలల కాలంలో.. హైకోర్టు, సుప్రీంకోర్టు కలసి  75 సార్లు.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యలు చేశాయంటే, అక్కడి పాలనా ధోరణి ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ భవనాలకు రంగులు, ఇంగ్లీషు విద్యపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా కాదని.. తనకున్న అధికారాలతో, కోర్టు తీర్పునే సవాల్ చేసేలా,  దొడ్డిదారి మార్గాలు ఎంచుకోవడం చూసి.. ఆయన తెగింపునకు అంతా ఆశ్చర్యపోయారు. నిమ్మగడ్డ రమేష్‌ను, ఎస్‌ఈసీగా తొలగించిన వైనాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ తప్పుపట్టాయి. చివరకు కోర్టు ధిక్కరణ కూడా దాఖలయి, సుప్రీంకోర్టు కూడా తలంటి పోసింది. చివరకు బాధితుడైన రమేష్, కోర్టు ఆదేశాలతో గవర్నర్ వద్దకు వెళ్లి దరఖాస్తు ఇచ్చారు. అయినా జగన్మోహన్‌రెడ్డిలో చలనం లేదు. శుక్రవారంలోగా రమేష్‌కుమార్‌కు, పోస్టింగు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఇది కూడా చదవండి: 14 నెలలు.. 75 చీవాట్లు!

అంటే ఈపాటికే ఫైలు సీఎస్ నుంచి సీఎంఓకు వెళ్లి, అక్కడి నుంచి గవర్నర్ వద్దకు చేరి ఉండాలి. కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి ఇంకా మూడురోజులే గడువు ఉంది. అయినా జగన్మోహన్‌రెడ్డి సర్కారులో చలనం లేదు. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి, చాలాకాలమయింది. అయినా ఇప్పటివరకూ అతీగతీలేదు. ఆ తీర్పును ఖాతరు చేసిన దాఖలాలేదు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని ఆదేశించి నెలలు దాటుతున్నా, దానినీ ఖాతరు చేసిన దాఖలాలు లేవు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సవాల్ చేయడం సాధారణం. అది హక్కు కూడా! కానీ, ప్రతిసారీ హైకోర్టులో ఇస్తున్న తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధిస్తుందంటే… హైకోర్టు తీర్పులో న్యాయం ఉందనేకదా అర్ధం? మరి అందుకు అనుగుణంగా కదా వ్యవహరించవలసింది?

తెలివైన పాలకులెవరూ, కోర్టులతో పెట్టుకోరు. వాటి ముందు తగ్గే ఉంటారు. ఎందుకంటే వాటి ప్రాధాన్యం తెలుసు కాబట్టి. కానీ జగన్మోహన్‌రెడ్డి అందుకు భిన్నం. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినందున, తనకు ఎవరూ.. ఏ వ్యవస్థ ఎదురు చెప్పకూడదన్నది ఆయన సిద్ధాంతం. అందుకు అడ్డువచ్చిన వారెవరిపైనయినా సరే నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడి చేస్తున్న తీరే, ఆయనను వివాదాస్పదుడిని చేస్తుంది. ఈ ప్రతీకార ఆలోచనా ధోరణి వల్ల డీజీపీ, సీఎస్ కోర్టుకు తరచూ హాజరుకావలసి వస్తోంది. ఇక జిల్లా ఎస్పీల సంగతి సరేసరి. ఓ న్యాయమూర్తిపై వైసీపీ విధేయ బృందం ఇష్టారీతిన సోషల్‌మీడియాలో బూతులు లంకించుంకుంది. తమ ప్రియతమ నేత పాలనకు వ్యతిరేకంగా.. తీర్పులిస్తున్న జడ్జిలను గదిలో బంధించి, వారిపై కరోనా రోగిని వదలాలన్న పైశాచిక ప్రవృతి ప్రదర్శించింది. వారికి కులాలను ఆపాదించింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా.. సోషల్‌మీడియా వీరులు భయపడాల్సిన పనిలేదని, వారిని ఏ కష్టం వచ్చినా పార్టీ ఆదుకుంటుందని అభయమిచ్చారు. అంటే దీని ద్వారా ఇచ్చే సంకేతాలేమిటి?

జగన్ భక్త సోషల్ మీడియాబృందం కొనసాగిస్తున్న ఈ వెకిలిచేష్టలు, సీఐడికి కనిపించకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారికి కనిపించేవి విపక్షాల చేష్టలు, ప్రభుత్వ వ్యతిరేకవర్గాల చర్యలే.  న్యాయమూర్తులపై సోషల్‌మీడియాలో, దూషణపర్వం సాగించిన వారందరినీ ఇప్పటిదాకా అరెస్టు చేసిన దాఖలాలు లేవు. అదే మంత్రులు, వైసీపీ నేతలపై ఎవరైనా పోస్టులు పెడితే, రాష్ట్రాలు దాటి వారిని అరెస్టు చేస్తున్న సీఐడి.. కోర్టులపై వ్యాఖ్యలు చేసిన వారిపై, చర్యలకు ఎంతకాలం సమయం తీసుకుంటారని ఇటీవలే ప్రశ్నించింది. అయితే, వైసీపీ భక్తబృందం.. న్యాయమూర్తులకు కులాలు అంటగట్టి దుష్రపచారం చేస్తున్నాయి. కానీ వాస్తవంగా.. వైసీపీ నేతల భాషలోనే చెప్పాలంటే ‘ ఆ సామాజిక వర్గ’ జడ్జిలెవరూ తీర్పులిస్తున్న వారిలో లేరు. ఈవిధంగా తీర్పులిచ్చే వారికీ, కులాలు ఆపాదించడం ఓ దౌర్భాగ్యం. తమ విధేయులైన వారికే,  కుల సంఘ నాయకుల ముసుగు వేయించి.. వారితో న్యాయమూర్తులపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదులు చేయిస్తున్న వైనం జుగుస్పాకరం. ఆ రకంగా తమ స్వేచ్ఛ, కోరికలకు అడ్డుగా ఉన్న అన్ని వ్యవస్థలపై కూడా బురదచల్లే మైండ్‌గేమ్‌ను, న్యాయవ్యవస్థపైనా కొనసాగించడం నల్లకోటును కూడా తెల్లబోయేలా చేస్తోంది. అంటే రాజ్యాంగ-చట్టపరమైన రక్షణ ఉన్న న్యాయమూర్తులకే, ఆంధ్రలోకంలో రక్షణ లేకపోతే.. ఇక సామాన్యులు, ప్రజాస్వామ్యవాదులు, పాత్రికేయులు, మానవహక్కులు నినదించే వారికి దిక్కెవరు?

తెలంగాణలో రాష్ట్రంలో కూడా.. హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యలు సామాన్యుడిని మెప్పించేలా, వారికి రక్షణ కల్పించేలా  ఉన్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి అంశాన్ని, కేసీఆర్ ప్రభుత్వం వివాదాస్పదం చేయకపోవడం వల్ల.. తీర్పులు ఆ స్థాయిలో రావడం లేదు. కేవలం వ్యాఖ్యలకే పరిమితం అవుతున్న హైకోర్టు హెచ్చరికలతో.. తెలంగాణ సర్కారు అప్రమత్తమయి, దిద్దుబాటకు దిగుతోంది. ఆర్ అండ్ బి భవనం కూల్చివేతను హైకోర్టు నిరాకరించింది.  కొండపోచమ్మసాగర్, ఆర్టీసీ సమ్మె సందర్భాల్లో ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ, తీర్పులు అందుకు భిన్నంగానే ఉంటున్నాయి. అంటే కేసీఆర్ సర్కారు, వాటిని వెంటనే సరిదిద్దుకోవడమే దానికి కారణం. తెలంగాణ సచివాలయం కూల్చివేతను, అడ్డుకోవాలలన్న  పిటిషన్‌ను కొట్టివేసింది. అయినా, జర్నలిస్టులకు అనుమతి విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. యుద్ధ సమయంలో వార్తలనే మీడియా కవర్ చేస్తుంటే, సచివాయ కూల్చివేత వార్తలు కవర్ చేయడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. వారిని అనుమతించాలని ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాల తర్వాతనే ప్రభుత్వం, జర్నలిస్టులను సచివాలయం లోపలికి అనుమతించింది.ఇది కూడా చదవండి: కూల్చి‘వెతల’ నుంచి కాపాడిన కేసీఆర్!

కరోనా సమయంలో… తెలంగాణ ప్రభుత్వం సరైన పరీక్షలు చేయడం లేదన్న పిటిషన్లు విచారించిన హైకోర్టు, ఆ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంది. మీడియాలో వచ్చే కథనాలు కూడా పరిగణనలోకి తీసుకుని, వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో సాక్ష్యాలతో సహా వచ్చిన కరోనా మృతుల కథనాలను సమర్ధించింది. తాను ఆ కథనాన్ని నమ్ముతున్నానని స్వయంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారంటే.. కరోనా అంశంలో హైకోర్టు ప్రజారోగ్యంపై, ఏ స్థాయిలో శ్రద్ధవహిస్తుందో స్పష్టమవుతుంది.  ఈ సందర్భంగా హైకోర్టు.. ఎక్కువ పరీక్షలు ఎందుకు పరీక్షలు చేయడం లేదని, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్ సర్కారు, స్టే తెచ్చుకుంది.   మిగిలిన అన్ని అంశాలపై.. కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాతనే ప్రభుత్వం దిద్దుబాటకు దిగింది. సీఎస్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులనే కోర్టుకు పిలిపించింది. కరోనా కేసుల వివరాలు, అందుబాటులో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య, చికిత్స పొందుతున్న వారి వివరాలు, ప్రతిరోజూ బులె టన్ల ద్వారా వెల్లడించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని ప్రశ్నించగా, వాటికి నోటీసులిచ్చామని, వాటిపై నిఘా ఉంచామని సీఎస్ వివరణ ఇచ్చారు. కరోనా టెస్టులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స వంటి అంశాలపై..  హైకోర్టు క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లనే, కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై రంగంలోకి దిగాల్సి వచ్చింది.  అయితే, ఆయా కేసుల విచారణ సందర్భంలో హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటుకు దిగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దానితో ఏపీ స్థాయిలో ప్రభుత్వంపై వస్తున్నన్ని వ్యతిరేక తీర్పులు తెలంగాణ ప్రభుత్వంపై రావడం లేదని న్యాయవాదులు చెబుతున్నారు. పైగా.. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి సర్కారు మాదిరిగా, హైకోర్టు ఇచ్చిన ప్రతి తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా.. వాటిని పాటిస్తుండటం ప్రస్తావనార్హం.

న్యాయవ్యవస్ధపై ఇలా పట్టువిడుపులు, స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తున్నందుకే… తెలంగాణ ప్రభుత్వం, ఏపీ సర్కారు మాదిరిగా వ్యతిరేక తీర్పులు కొనితెచ్చుకోవడం లేదన్నది, న్యాయనిపుణుల అభిప్రాయం. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాదిరిగా, కేసీఆర్ ప్రభుత్వం మొండివైఖరి- ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పండిదంటున్నారు. ‘ప్రభుత్వాలు అందరినీ మెప్పించేలా నిర్ణయాలు, ప్రజాస్వామ్య-రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తే  ఏ కోర్టులూ, ఏ ప్రభుత్వాన్నీ తప్పుపట్టవు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించి, వాటికి విఘాతం కల్పించినంత కాలం న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో, ఏపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో మీడియాను ఫాలో అయ్యే వారందిరికీ ఇప్పటికే అర్ధమయింది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. వారి హక్కులు ముఖ్యం. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. తమకు ఇష్టం లేని వారిని వే ధిస్తే, రాజ్యాంగాన్ని కాపాడే న్యాయస్థానం చూస్తూ కూర్చోదు.  దాన్ని అర్ధం చేసుకుని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలకు, ఎలాంటి భయం అవసరం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనన్ని రాజ్యాంగధిక్కరణలు ఏపీలోనే కనిపిస్తున్నాయి. అందుకే కోర్టులు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవలసి వస్తోంద’ని నిమ్మగడ్డ రమేష్ కేసు వ్యవహారంలో, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస పక్షాన వాదించిన, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వ్యాఖ్యానించారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner