కొత్త ‘కమల దళపతి’ సోముకు.. కత్తిమీద సామే!

685

లేటయినా ‘లేటెస్టు ట్రెండ్’ చూపిస్తారా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

భారతీయ జనతా పార్టీ ఏపీ దళపతిగా.. విధానమండలి సభ్యుడు, సీనియర్ నేత సోము వీర్రాజు పగ్గాలందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సోము, సంఘ్‌పరివార సభ్యుడే. పార్టీ జెండాను మొదటినుంచీ మోస్తున్న పాత ‘కాపు’. అదే బలమైన కాపు నాయకుడయిన కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో, మరో కాపును తీసుకురావడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. నిజానికి గతంలోనే అధ్యక్ష పదవి రేసులో ఉన్న సోముకు, ఢిల్లీలో చక్రం తిప్పే ఓ జాతీయ నాయకుడు మోకాలడ్డారు. ఈసారి కూడా సదరు జాతీయ నాయకుడు అడ్డుపడినా, అదృష్టం మాత్రం వీర్రాజు వెంట ఉంది. రాష్ట్రానికి చెందిన ఆ జాతీయ నాయకుడికి సోము మొదటి నుంచీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.  తొలి నుంచీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగి, అవాంతరాలు ఎదుర్కొని పార్టీ దళపతిగా ఎంపికయిన సోమును అభినందించాల్సిందే.

కానీ, ఏపీలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితిలో.. పార్టీని అధికారంలోకి తీసుకురావడం అటుంచితే, కనీసం ప్రతిపక్ష స్థానం వరకూ తీసుకెళ్లడం,  కొత్త కమల దళపతి సోముకు కత్తిమీద సామే. ఎందుకంటే, జాతీయ నాయకత్వం.. అధికారంలో ఉన్న వైసీపీ పట్ల ఉదారంగా ఉందో, ఉగ్రరూపంతో ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అధికార పార్టీ ఎంపీ దారుణంగా విమర్శించి, ఆరోపణలు చేసినా జాతీయ నాయకత్వం బెల్లం కొట్టిన రాయిలా ఉంది. రేపు అలాంటి పరిస్థితి కొత్త అధ్యక్షుడికీ రాదన్న గ్యారంటీ ఏమీ లేదు. అయితే అదీ.. సోము కూడా ఆ స్థాయిలో అధికార పార్టీపై పోరాడితే తప్ప! వైసీపీ సర్కారుపై, కన్నా వైఖరిని సోము కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపైనే ఆయన నాయకత్వ సామర్థ్యం, ప్రభుత్వంపై వైఖరి తేలుతుంది. ప్రధానంగా అమరావతి రాజధానిపై సోము వైఖరేమిటో, అధ్యక్షుడయ్యాక తేలాల్సి ఉంది.

ఇప్పటివరకూ టీడీపీ నుంచి చేరిన నాయకులకు పదవులేమీ లేవు. వారికి ఏరకమైన గుర్తింపు ఇస్తారన్నది ఓ ప్రశ్న. ఆ పార్టీ నుంచి వచ్చిన ఎంపీలను, ఇంకా టీడీపీ కోవర్టులుగానే అనుమానిస్తున్నారు. వారిపై వైసీపీ నేతలు ఆ మేరకు విమర్శించినా, జాతీయ నాయకత్వం స్పందించలేదు. కన్నా మాత్రం ఒకసారి.. వారి విశ్వసనీయతను అనుమానించాల్సిన పనిలేదు. పార్టీలో చేరిన వారిని రక్షించుకుంటాం అని చెప్పారు. అసలు పార్టీలో ఉన్న వైసీపీ అనుకూల-వ్యతిరేక-టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య, సోము ఎలా సఖ్యత కుదురుస్తారో చూడాలి. పైగా.. ఆయన ఫక్తు పార్టీ వాది అయినప్పటికీ.. వైసీపీ కంటే, టీడీపీపైనే ఎక్కువ విరుచుకుపడతారన్న పేరుంది. టీడీపీ చేసిన తప్పులతో ఆ పార్టీ 14 నెలల క్రితమే ఓడి, పేకమేడల్లా కూలుతోంది. అయినా.. అధికారంలో ఉన్న వైసీపీ కంటే, ఇంకా టీడీపీనే విమర్శిస్తుండటం వల్ల, సోము ఆ రెండు పార్టీల్లో ఎవరిపై ఎక్కువ సానుభూతితో ఉన్నారది, చెప్పకనే చెబుతోందన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

సరే. అప్పుడంటే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాదు. పెద్దగా బాధ్యత కూడా లేదు. ఇప్పుడు ఆయనే రధసారథి. కాబట్టి.. బాధ్యత మారినందున, వైఖరి కూడా మారుతుందా లేదా అన్నది చూడాలి. హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సోము వీర్రాజు ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. టీడీపీతో కలసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, టీడీపీ ప్రభుత్వాన్ని దునుమాడారు. శాసమండలిలో ప్రజాసమస్యలపై గళం విప్పి, బాబు సర్కారు కంట్లో నలుసులా మారారు. అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు కంటే.. బాబు సర్కారుపై విరుచుకుపడే, సోము వీర్రాజుకే పార్టీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండేదన్నది నిష్ఠుర నిజం. అప్పుడాయన.. అటు రాష్ట్రానికి చెందిన సొంత పార్టీ జాతీయ నాయకుడి వర్గంతో పాటు, ఆ వర్గం సమర్థించే చంద్రబాబు సర్కారుతోనూ  పోరాడేవారు.

కన్నా అధ్యక్షుడయ్యాక, రాష్ట్రంలో పార్టీకి పొలిటికల్ ఇమేజ్ వచ్చింది. రాష్ట్ర పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన హరిబాబు, ఏనాడూ రాష్ట్ర పర్యటనలు చేసిన దాఖలాలు లేవు. అయితే కన్నా అధ్యక్షుడయ్యాక, ఆ పరిస్థితి మార్చారు. 13 జిల్లాల్లో ఆయన విస్తృత పర్యటనలు చేశారు. కాంగ్రెస్,టీడీపీ నేతలను పార్టీలో చేర్చారు. ప్రధానంగా ఆ రెండు పార్టీల్లో ఉన్న రాయలసీమ బలిజ నేతలను బీజేపీలోకి తీసుకువచ్చారు.  జగన్ సర్కారును దునుమాడటంలో ఒక్కోసారి టీడీపీని మించిపోయారు. అన్ని నియోజకవర్గాల్లో  పార్టీ అభ్యర్ధులను గుర్తించి, పోటీ చేసే స్థాయికి తీసుకువెళ్లారు. అంతకుముందు.. టీడీపీ-బీజేపీ పొత్తు వల్ల, 20 అడుగుల గోతిలోకి వెళ్లిన పార్టీకి అధ్యక్షడయిన కన్నాకు, పార్టీని బయటకు తీసుకురావడానికే చాలాకాలం పట్టింది. ఓ జాతీయ నాయకుడి పుణ్యాన.. ఏపీలో పార్టీ సమాధి అయిందని, ప్రస్తుత పార్టీ దుస్థితికి ఆయనే కారణమని, ఆయనే బీజేపీని తెలుగుదేశం పార్టీకి,  బీ టీముగా మార్చారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కన్నా ఆ పరిస్థితిని మార్చి, అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకురావడం,  మామూలు విషయం కాదన్నది మనం మనుషులం అన్నంత నిజం!

ఇప్పుడు కన్నా స్థానంలో వచ్చిన సోముకూ, ఆయన మాదిరిగా సినిమా కష్టాలు తప్పేలా లేదు. ఎందుకంటే.. వైసీపీతో బీజేపీది కయ్యామా? వియ్యమా? నేరుగా యుద్ధమా? బంతిపూల సమరమా? ఇవేమీ కాకుండా తెరచాటు స్నేహమా? అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు. విజయనగరంలో పార్టీ అభ్యర్థిపై, వైసీపీ నేతలు హత్యాయత్నం చేస్తే.. జాతీయ నాయకత్వం దానిని సీనియస్‌గా తీసుకోలేదు. ఢిల్లీ నాయకత్వాన్ని పక్కకుపెడితే, రాష్ట్ర ఇన్చార్జి పత్తా లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న, ఒక పార్టీ నాయకుడిపై ఒక రాష్ట్రంలో దాడి జరిగితే, ఆ పార్టీ జాతీయ నాయకత్వం మౌనంగా ఉండటం వల్ల, పంపించే సంకేతాలేమిటి? రాష్ట్ర అధ్యక్షుడిపై ఆరోపణలు చేసినా, జాతీయ నాయకత్వంలో చలనం లేదంటే.. ఏపీలో అధికార పార్టీతో జరుగుతోంది భీకర సమరమా? బంతిపూల సమరమా? అన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

ఇలాంటి అస్పష్ట, అయోమయ, గందరగోళ సైద్ధాంతిక సమరానికి చరమగీతం పాడకపోతే.. కన్నాను నియమించినా, సోమును పెట్టినా, మాధవ్‌ను తీసుకువచ్చినా ఫలితం సున్నా. ఎవరైనా బస్సెక్కి ‘మా ఊరుకు టికెట్టివ్వమం’టే వింతగా చూస్తారు. వెళ్లాల్సిన గమ్యం ప్రయాణికుడికే తెలియక పోతే ఎలా? రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కూడా అంతే!  దీనివల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే కమలనాధులే బలవుతారు. అంటే.. వైసీపీతో మిత్రత్వం ఉంటే, వైసీపీ మాకు వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటించడంలో తప్పు లేదు. అలా కాకపోతే, వైసీపీతో మాకు ఎలాంటి లాలూచీ లేదు. అది మా రాజకీయ ప్రత్యర్థి అని, బాహాటంగా ప్రకటిస్తే సరిపోతుంది. అటు మళ్లీ టీడీపీతో కలిసే ఆలోచన ఉందన్న వార్తలు వస్తున్నందున.. టీడీపీతో ఇక మాకు శాశ్వతంగా పొత్తు ఉండదని, ఆ పార్టీ వల్ల తమ పార్టీ నష్టపోయిందని విస్పష్టంగా ప్రకటిస్తే మేలు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నట్టయితే.. మా ప్రథమ శత్రువు వైసీపీ. టీడీపీని సాటి ప్రతిపక్షంగా గౌరవిస్తాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని చెబితే సరిపోతుంది. ఈ సంకేతాలన్నీ.. గోడమీదపల్లి వాటం రాజకీయాలకు అలవాటుపడిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు సులభంగానే అర్ధమవుతాయి.

ఇవేమీ కాకుండా.. అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి, ఓ ప్రతిపక్ష పార్టీ లక్ష్యంగా విమర్శలు చేయడమే శ్రేణుల గందరగోళానికి కారణమవుతోంది. అంటే దీన్నిబట్టి.. ముందు టీడీపీని బలహీనం చేసి, ఆ తర్వాత వైసీపీ నాయకుడిని జైలుకు పంపించి, ఆ స్థానం బీజేపీ ఆక్రమించాలన్న వ్యూహంలో ఉన్నట్లు.. బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. నిజానికి ఇప్పుడున్న రాజకీయ గందరగోళ పరిస్థితిలో, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ, సొంత కాళ్లపై ఎదిగే బదులు.. ఒకరి భుజంపై తుపాకీ పెట్టి, మరొకరిని కాల్చడాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడూ అంగీకరించరు. ఎందుకంటే అది ఉత్తరప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్! అక్కడ కులమే తప్ప, మత రాజకీయాలు లేవు. ఎన్టీఆర్ నుంచి జగన్ వరకూ, తెలుగు ప్రజలు పోరాట యోధులనే గెలిపిస్తున్నారు. ఇంకోసారి మిత్రపక్షంగా కలసి పోటీ చేసిన టీడీపీ-బీజేపీని గెలిపించారు. అంతకుముందు వైఎస్ వంటి, వీరుడి సారథ్యంలోని కాంగ్రెస్‌ను గెలిపించారు. దొడ్డిదారి రాజకీయాలు చేసిన నాదెండ్లను ప్రజలు అంగీకరించలేదన్న చరిత్రను విస్మరించకూడదు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన భాజపాకు..  ఇప్పుడు ‘పాయింట్ ఎనిమిది’ శాతం ఓట్లు రావడానికి కారణమేమిటన్న ఆత్మపరిశీలన అవసరం.

అసలు కన్నా స్థానంలో… సోము నియామకానికి కారణమేమిటన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ. బీజేపీతో కలసి సాగుతున్న పవన్ కల్యాణ్‌తో.. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి, పీసీసీ చీఫ్-సీఎం పదవులకు పోటీ పడిన స్థాయి నాయకుడైన,  కన్నా లక్ష్మీనారాయణ కెమిస్ట్రీ కుదరలేదంటున్నారు. అదే పవన్‌తో వ్యక్తిగత సంబంధాలున్న, సోము అయితే ఆయనతో కలసి సులభంగా ప్రయాణం చేస్తారన్న అంచనాతోనే, ఆయనకు అధ్యక్ష  పదవి ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. తొలుత పవన్‌ను మోదీ వద్దకు తీసుకువెళ్లింది సోము వీర్రాజే కావటం గమనార్హం. భవిష్యత్తులో కాపు నేతగా పవన్‌ను.. తెరమీదకు తీసుకువచ్చే వ్యూహంలో భాగంగానే, ఆయనకు సన్నిహితుడైన సోమును, తెరపైకి తెచ్చారన్నది ఒక వాదన. రాజ్యసభలో వైసీపీ అవసరం ఉంది. అయితే,  రాష్ట్రంలో వైసీపీతో నెలకొన్న ‘రాజకీయ ఉద్రిక్త పరిస్థితి’ నివారించడానికి.. వైసీపీ సర్కారును ఢీకొంటున్న, కన్నాను తొలగించారన్నది మరో వాదన. ఏదేమైనా.. పార్టీ వైఖరేమిటన్నదానిపై స్పష్టత వచ్చేవరకూ,  కొత్త దళపతికి ఆ పదవి కత్తిమీద సామేనన్నది సీనియర్ల విశ్లేషణ.