గిరిజన భూములు ‘రాజు’ల పాలు?

732

జీలుగుమిల్లిలో రికార్డులు జూలకటక?
గిరిజనుల భూముల అమ్మకానికి భారీ స్కెచ్?
ఓ మంత్రిగారి కుటుంబం పేరుతో రికార్డులు బదిలీ?
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో కదులుతున్న అమ్మకాల డొంక?
విచారణకు రానున్న కేంద్ర బృందం?
త్వరలో తేలనున్న అమ్మకాల యవ్వారం
                   (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజుల సొమ్ము రాళ్లపాలంటారు. కానీ అక్కడ గిరిజనుల సొమ్ము రాజుల పాలవుతోంది. అది గిరిజనులకు మాత్రమే సొంతమయిన భూమి. దానిని ఇతరులు కొనకూడదు. అమ్మకూడదు. దానిని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలుంటాయి.  చట్టం అలా ఉంది మరి.  అయితేనేం?.. ‘రాజు’గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? 70 వ దశకం నాటి రికార్డులకూ కాళ్లు, చేతులు వచ్చేస్తాయి. కొత్త రికార్డులూ పుట్టేస్తాయి.  గిరిజనుల భూములయితే మాత్రం లెక్కా జమా? అందులో అధికారం చేతిలో ఉన్న కామందుల వారు నిబంధనలు ఖాతరు చేస్తారా? ఓ మనిషి భూమ్మీద పడేందుకు, నవమాసాల సమయం తీసుకోవాలి. కానీ రెవిన్యూ ఆఫీసులలో, రికార్డులు మాత్రం రోజుల్లో పుట్టేస్తాయి. పైసామే పరమాత్మ! అంతా సవ్యంగా జరిగితే సదరు కామందుల వారి ఖజానాలోకి కోట్ల వర్షం కురిసేదే. ఆయన అధీనంలోని భూమిని, సర్కారుకు అమ్మి సొమ్ము చేసుకునే పనే.

కానీ, ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అనేవాడెప్పుడూ ఏదో ఒక రూపంలో, ఎక్కడో అక్కడ తగులుతాడు కదా? అదిగో.. ఆ ఆచంట మల్లనే ఎంపీ రఘురామకృష్ణంరాజు. గిరిజనుల భూములు దొడ్డిదారిన హక్కు భుక్తం చేసుకునే మాయోపాయాన్ని.. ఆయన కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం, దానిపై కేంద్రమంత్రి సీరియసయి, కేంద్ర అధికారులను పంపించాలని ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయింది. ఆ ప్రకారంగా కాగల కార్యాన్ని ఎంపీ గంధర్వుడు కానిచ్చేస్తున్నారు. దానితో జీలుగుమిల్లిలో ‘రాజు’గారు కలలు కన్న కాసుల పంటకు, ఎంపీ రాజుగారు కన్నం పెట్టినట్టయింది. డామిట్ కథ అడ్డం తిరగడమంటే అదే మరి! పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలంలో గిరిజనుల భూములపై కన్నేసిన, ‘శ్రీ’మాన్ అమాత్యుల వారి కథా కమామిషేమిటో విందాం రండి.

అది ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలం. అది షెడ్యూల్ ఏరియా. అక్కడ దాదాపు 89 ఎకరాల గిరిజనుల భూములున్నాయి. అది 20 ఏళ్ల నుంచి ఒక రాష్ట్ర మంత్రి అధీనంలోనే అనధికారికంగా  ఉంది. అక్కడ ఉన్న మామిడి పంటను ఆయనే అనుభవిస్తున్నారు. షెడ్యూల్ ఏరియా భూమి అంటే తెలుసు కదా? అక్కడ గిరిజనులకు మాత్రమే భూమి ఉండాలి. మిగిలిన వారికి భూములు కొనే హక్కు లేదు. మరి సదరు మంత్రి గారు గిరిజనుడు కాదు కదా? మరి ఆయనకు భూమి ఎలా వచ్చిందని అప్పుడే తొందరపడి ప్రశ్నించకండి. అక్కడికే వద్దాం. ఆ భూములు నిజానికి గిరిజనుల పేరుతోనే ఉన్నాయి. కానీ ఓ షావుకారు.. వారి అవసరాలు, ఆర్ధిక బలహీనతలను సొమ్ము చేసుకున్నారట. అంటే వారికి అప్పులిచ్చి, తన పేరు రాయించుకున్నారట. సరే దానిమీద అప్పుడెప్పడో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈలోగా ప్రభుత్వం మారడం, ఓ మంత్రి గారి కన్ను దానిపై పడటం జరిగింది. దానితో ఆయన ఆ షావుకారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకుని, తన పేరు బదలాయించుకునే పనిలో ఉన్నారట.

ఎందుకంటారా? ఈ మధ్య జగనన్న ప్రభుత్వం.. పేదవారికి ఇళ్ళ స్థలాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఆ ప్రకారంగా ఎక్కడ స్థలాలు ఖాళీగా ఉంటే,  వాటిని సర్కారు సొమ్మతో కొనుగోలు చేసి, పేదలకు ఇవ్వాలన్నది జగనన్న సంకల్పం. ఆలోచన వరకూ బాగానే ఉన్నా, వైసీపీ నేతలకు ఇది కల్పవృక్షంగా మారింది. వైసీపీ నేతల సొంత భూములతోపాటు,  వారే కారుచౌకగా భూములు కొని ,లక్షల రూపాయల అదనపు రేట్లతో సర్కారు నుంచి కొనుగోలు చేయిస్తున్నారు. ఈ మధ్య నెల్లూరు జిల్లా కావలిలో ఓ ప్రజాప్రతినిధి.. అంటే ‘పెద్దారెడి’్డగారన్నమాట. మరో ముగ్గురు ‘పెద్దారెడ్డి’గార్లతో కలిపి, దాదాపు 30 కోట్ల రూపాయలతో ప్రైవేటు భూములు కొనిపించే అద్భుత ప్రణాళిక రచ్చ అయింది. అక్కడ 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా, ప్రైవేటు భూములపైనే ప్రేమ చూపిస్తున్నారట. పైగా.. సదరు నెల్లూరు పెద్దారెడ్డి గార్లు, సీఎంఓలో పనిచేసే అధికారుల పేర్లు అడ్డగోలుగా వాడుకుంటున్నారట. ఆ కథ వేరే! ఆ ముచ్చట తర్వాత చెప్పుకుందాం.

ఇక మళ్లీ జీలుగుమిల్లికి వెళితే.. అక్కడ ఉన్న 89 ఎకరాల గిరిజనుల భూములన్నీ సదరు మంత్రిగారు 1970కు ముందే… అంటే 1/17 చట్టం అమలుకాకముందే, కొనుగోలు చేసింది కాబట్టి, సదరు భూములన్నీ మంత్రిగారి హక్కుభుక్తమన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తెరపైకి తీసుకురావడమే కాదు, ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆ మేరకు ఓ డాక్యుమెంటు కూడా పుట్టించేశారట. దాన్ని ఆమోదించాలని అటు ఐటిడిఓ ప్రాజెక్టు ఆఫీసర్, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌పై నానా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారట. వాళ్లు మాత్రం మావల్ల కాదంటున్నట్లు చెబుతున్నారు.  ఇంతకూ మంత్రిగారి ఆలోచన ఏమిటంటే.. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలాలకు కింద, తనదని చెబుతున్న ఆ 89 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి, దాని ద్వారా వచ్చే డబ్బుతో శేషజీవితాన్ని గడిపేద్దామన్న దివ్యమైన వ్యూహమట! ఎలాగూ రెండేళ్ల తర్వాత మంత్రులను మార్చేస్తామని జగనన్న ముందే ప్రమాదఘంటికలు మోగించారాయె.

ఈ వ్యవహారం కాస్తా గిరిజనుల గుండెల్లో గుబులు రేపాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు. అయితే, ఇది అటు తిరిగి ఇటు తిరిగి, నర్సాపురం యుశ్రారైకా ఎంపీ రఘురామకృష్ణంరాజు చెవికి చేరిందట. మరి ఆయన ఊరుకుంటారా? పైగా ఇటీవలి రెబల్ ఎపిసోడ్‌లో సదరు మంత్రి గారు, ఆయనపై బోలెడన్ని విమర్శలు చేశారు కదా? నా పుట్టలో వేలెడితే కుట్టనా.. అన్నట్లు.. సదరు ఎంపీ రాజుగారు, ఈ విషయాన్ని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దానితో స్పందించిన కేంద్రమంత్రి.. గిరిజన శాఖ ఉన్నతాధికారిని పిలిచి, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిసీస్‌కు ఈ బాధ్యత అప్పగించాలని ఆదేశించారని తెలుస్తోంది. ఆ ప్రకారంగా, సదరు అధికారుల బృందం రేపో, మాపో జీలుగుమిల్లికి వచ్చి ఆ కథాకమామిషేమిటో తేలుస్తుందట.

ఆ ప్రకారంగా..  1970కు ముందు ఆ భూములెవరివి? అవి ఎప్పుడు రిజిస్టరయ్యాయి? అసలు అవి ఆ మంత్రిగారి పేరిట గానీ, ఆయన బినామీ అయిన షావుకారుపైగానీ బదిలీ అయిందా?  ఒకవేళ అధికారికంగా రిజిస్టరయితే, వాటిని ఇన్నాళ్లూ మంత్రి గారు అధికారికంగా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు ఆ వివరాలను ఆయన ఎన్నికల నామినేషన్‌లో చూపించారా? మధ్యలో ఆ  షావుకారెవరు? ఇలాంటి లాజిక్కులన్నీ పిండేస్తారన్న మాట! అయినా.. నీతి-నిజాయితీకి నిలువుటద్దమెన జగనన్న ప్రభుత్వంలో, ఇలాంటి పనులు జరగడమా? హన్నా?.. ఎన్ని గుండెలు? ఇందులో నిజమెంతో పైనున్న ఆ శ్రీరంగనాధుడికెరుక?