కరోనా బాధితులను ఆదుకుంటున్నాం

590

కరోనా క్లిష్ట కాలంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు
సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా పై రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశా, నిర్ధేశం చేస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు తగ్గించేందుకు ఖరీదైన రెమ్ డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారన్నారు. ఇప్పటికే 5 వేల డోసుల రెమ్ డెసివిర్ ను కొనుగోలు చేసి ఆసుపత్రులకు చేర్చడం జరిగిందన్నారు. ఆగస్టు చివరికి 90 వేల రెమ్ డెసివిర్ డోసులను ప్రభుత్వం సిద్దంగా ఉంచనుందన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు, వెంటిలేటర్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

దేశంలో కరోనా పరీక్షల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. జాతీయ స్థాయిలో రోజుకు సగటున 1 మిలియన్ కు 12,498 మందికి కరోనా పరీక్షలు చేస్తుండగా, రాష్ట్రంలో 32,761 మందికి చేయడం విశేషమన్నారు. అదేవిధంగా దేశంలో పాజిటివ్ కేసుల శాతం 8.55 కాగా, రాష్ట్రంలో 6.30 గా, మరణాల సంఖ్య రాష్ట్రంలో 1.04 శాతం కనిష్టంగా ఉందన్నారు.
గతంలో రాష్ట్రంలో వైరల్ టెస్టింగ్ ల్యాబ్ లు సున్నాగా ఉంటే నేడు 78 ల్యాబ్ లు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా భారిన పడినవారికి చికిత్స అందించేందుకు అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆసుప్రతుల ద్వారా అత్యాధునిక వైద్యం అందించి, ప్రతి వ్యక్తికి రోజుకు రూ. 500 ఖర్చు తో మంచి భోజన వసతి కల్పిస్తున్నారన్నారు. ఇందుకోసం రోజుకు 1.5 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ నియంత్రణ పరీక్షలకు నెలకు దాదాపు రూ. 350 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. పేద వారిపై పైసా భారం పడకుండా కరోనా చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా దేశంలో మన రాష్ట్రం నిలబడిందన్నారు. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూడా ప్రతి ఒక్కరికీ దారి ఖర్చులకు రూ. 2,000 ఆర్థిక సాయం అందచేస్తున్నారన్నారు. అదేవిధంగా దురదృష్టవశాత్తూ మృతి చెందిన మృతుల అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరతలేకుండా 9,712 మంది వైద్య సిబ్బందిని ఆగస్టుకల్లా నియమితులయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా గతంలో నింపకుండా వదిలివేసిన దాదాపు 500 డాక్టర్ల ఖాళీలను కూడా ఈ ప్రభుత్వ భర్తీ చేసింది. వసతలులేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు నాడు-నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

ఒక వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుందన్నారు. లాక్ డౌన్ కాలంలో నెలకు ఒక్కసారి ఇచ్చే రేషన్ ను ఇప్పటికి ఏడు సార్లు ఇవ్వగా, ప్రస్తుతం ఎనిమిదవ విడత పంపిణీ నేడు జరుగుతుందన్నారు. దీంతోపాటు పప్పుదాన్యాలు సైతం ప్రజా పంపిణీ వ్వవస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 ల ఆర్థిక సాయం అందించడం వల్ల ప్రభుత్వం పై రూ. 2,800 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న 16 కోట్ల మాస్క్ ల తయారీ బాధ్యతను 40,000 వేల స్వయం సహాయ సంఘాలకు అప్పగించడం ద్వారా అక్కచెల్లెమ్మలకు లాక్ డౌన్ కాలంలో రోజుకు రూ. 500 నుండి 600 వరకు ఆదాయం పొందేందుకు వీలు ఏర్పడిందన్నారు. డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా 14410 కాల్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా జనరల్ ఓపీడీ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక సదుపాయాలున్న 1,088 (108, 104) వాహనాలు ప్రతిమండలానికి సేవలందించడానికి ప్రారంభించడం జరిగిందన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ధార్మిక సంస్థల కార్యకలాపాలు నిలచిపోవడంతో జీవనోపాధిలేక ఇబ్బందిపడుతున్న 77,290 మంది అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్లకు ఉపశమనంగా రూ. 37.71 కోట్ల సాయం అందించామన్నారు. సొంత వాహనం కల్గిన ఆటో, టాక్సీ, మాక్సీ కాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు ఏటా అందించే పది వేల రూపాయల ఆర్ధిక సాయంలో భాగంగా కరోనా సమయంలో 2,62,493 మందికి రూ. 262.49 కోట్ల సాయం అందించామన్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం 2,47,040 మందికి రూ. 247.04 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు.
కరోనా క్లిష్ట సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు తీసుకుందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.