సినిమా హీరోలకు.. సిగ్గుందా?

702

సోనూ సూద్‌ను చూసి నేర్చుకోండి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఒకరు మెగాస్టార్.. మరొకరు సూపర్‌స్టార్.. ఇంకొకరు పవర్‌స్టార్.. మరొకరు రెబెల్ స్టార్. ఇలా అన్ని స్టార్ల భుజకీర్తులున్న తెలుగు సినిమా హీరోలు.. ఒక దృశ్యం చూసి సిగ్గుతో చితికిపోవాలి. నవరంధ్రాలూ మూసుకుని, మొక్కల పోటీలో చాలెంజ్ చేస్తూ గడపాలి.. ఎందుకంటే సోనూ సూద్ చేసిన పని అలాంటిది మరి!

సోనూ సూద్. తెలుగుసినిమాల్లో విలన్ పాత్రధారి. కానీ ఆయన తెరపై మాత్రమే విలన్. నిజజీవితంలో అతనే అసలైన  హీరో. తెరపై కనిపించే పెద్ద పెద్ద హీరోల హీరోయిజమంతా ఆ తెరపైనే. నిజజీవితంలో మాత్రం వారంతా జీరోలే. వారిలో సామాజిక స్ప్పహ, బాధ్యత ఉన్న వారి సంఖ్య అత్యల్పం. ఏ రాజశేఖర్ లాంటి వాళ్లో అరుదుగా కనిపిస్తుంటారు. మరి మన హీరోలు ఏం సేవచేస్తారని ప్రశ్నించవచ్చు. ఎందుకు చేయరు? బ్రహ్మాండంగా చేస్తారు! ఎలా అంటే.. కలర్ కాంబినేషన్  జీన్స్, టీ షర్టు, రేబాన్ కళ్లజోడుతో తన ఇంటిలోనే మొక్కలకు నీళ్లు పోసి, ఫొటోలు దిగి.. మిగిలిన వారికి చాలెంజ్ విసురుతారు. దాన్ని ట్విట్‌ర్‌లో పెట్టేస్తారు.  అంతే మిగతా హీరోలు, హీరోయిన్లు వెంటనే వారి ఇళ్ల పెరట్లో చిన్న గుంత తీసి, మొక్క నాటి ‘ఫలానా స్టార్ విసిరిన చాలెంజ్‌కు ఇదే నా సమాధానం. మరి మీరు?’ అని తన ఫొటోతో ఒక ట్వీట్ చేస్తారు. దానిని మీడియా కూడా అదేదో సంఘసేవ చేసినట్లు, ఎవరి ఇళ్లలో వాళ్లు మొక్కలు పెంచుకుంటే అదేదో ఘనకార్యమైనట్లు ఫొటోలు వేసి, ఉచిత ప్రచారం అందిస్తాయి.
హీరోలంతా సామూహికంగా ఆంధ్ర-తెలంగాణ సీఎంలను కలసి, తమ స్టుడియోలకు స్థలాలు, సినిమా హాళ్లకు విద్యుత్ రాయితీలు, షూటింగులకు పర్మిషన్లు, సినిమా థియేటర్లకు అనుమతి కోసం వినతిపత్రాలిస్తారు.ఇది కూడా చదవండి: గ్యాంగ్ లీడర్లా..? బ్యాండ్ లీడర్లా? ఒకరు మీటింగులకి పిలవలేదని అలిగి ఆరోపణలు చేస్తే..ఇంకొకరు యూట్యూబ్‌లో సమాధానం చెప్తారు.దానికి  ఫ్యాన్స్ రెచ్చిపోవటం ఇదంతా క్యాష్ చేసుకునేందుకు ఎప్పుడు ముందుండే ప్రముఖ ఛానల్స్ వీటి మీద డిబేట్లు,ఇంటర్వ్యూలు,స్పేషల్ ప్రొగ్రాములు అబ్బో ఒకటా…రెండా…ఇలా ఎన్నో మరెన్నో. ఇది చాలదూ..కళామతల్లికి వారు చేస్తున్న అనిర్వచనీయ సేవలు!ఇది కూడా చదవండి: చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!

కానీ, సోనూ సూద్ అనే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు పుట్టింది ఆంధ్రాలో కాదు. తెలంగాణలో కాదు. ఆయన పంజాబీ. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో తెలుగు వారికి దగ్గరయి, ఉత్తమవిలన్‌గా నంది పురస్కారం అందుకున్న నటుడు. బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్ సైతం, ఆయన నటన చూసి అసూయపడ్డారు. నటనలోనే కాదు, నిజజీవితంలో కూడా సూద్ సేవలు చూస్తే.. కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు, వారి కుటుంబాలు కూడా సిగ్గుతో తల దించుకోవలసిందే.  పూర్వాశ్రమంలో రైల్వేలో కూలీగా పనిచేసిన సూద్.. ఇప్పుడు సమాజానికే సేవాచిహ్నంగా మారారు.

ముంబయిలో తుపాను రాబోతుందని తెలియడంతో, 28 వేల మందిని స్కూళ్లకు తరలించి వారికి కడుపునిండా భోజనం పెట్టిన మానవతావాది సోనూ సూద్.  అసోం నుంచి ముంబయికి బతకడానికి వచ్చిన 200 మందిని, కరోనా వల్ల ముంబయిలో చిక్కుకున్న ఒడిషా, అసోం  కూలీలను సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటుచేసి, స్వగ్రామాలకు పంపించిన కరుణామయుడు. కేరళలో చిక్కుకున్న ఆడపిల్లల కోసం ఏకంగా విమానం ఏర్పాటుచేసి, వారిని ఒడిషాకు పంపించిన ఆపద్బాంధవుడు. ఆయన సాయానికి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చలించి, కృతజ్ఞతలు చెప్పారు. వలస కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు, సొంత ఖర్చుతో కాల్‌సెంటర్ ఏర్పాటుచేశారు. మహారాష్ట్రలో చిక్కుకున్న తెలంగాణ వాసులకు.. నటి, ఎంపి నవనీత్‌కౌర్‌తో కలసి రెండు బస్సులు ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి. తాజాగా వరంగల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, కూరగాయలు అమ్ముతోందన్న  వార్త తెలిసి చలించిన సోనూ, ఆమె నెంబరు తీసుకుని, సాయం చేసే పనిలో ఉన్నారు. కరోనా బాధితులకు చికిత్సలందించే డాక్టర్లను,  వారి అపార్టుమెంట్లకు రానీయకుండా అడ్డుకుంటున్న ఈ అమానవీయ కాలంలో.. వారి కోసం తన సొంత హోటల్‌నే, ఇచ్చేసిన దయార్ధ హృదయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దానంలో ప్రచారం లేదు. దయ తప్ప!

తాజాగా.. మదనపల్లెలో ఓ చిన్న టీ కొట్టు యజమాని. తనకున్న కొద్దిపాటి పొలం దున్నేందుకు, ఎద్దులు లేక… తన ఇద్దరి కూతర్లనే కాడెద్దులుగా మార్చి, వ్యవసాయం చేస్తున్న దయనీయ దృశ్యాన్ని, టీవీ9 కథనంగా మలిచి ప్రసారం చేసింది. అంతకుముందు, తమ దుస్థితి వివరిస్తూ, ఆ అమ్మాయిలు ఓ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఆ దృశ్యాలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒక్క మన తెలుగు హీరోలను తప్ప! ఆ విషయం తెలిసిన విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు సోనూ సూద్.. ‘మీరు చదువుకోండి. రేపటికల్లా మీకు కాడెద్దులు మీ గుమ్మం ముందుంటాయి’ అని ట్వీట్ చేశారు. తర్వాత మళ్లీ ఆయనే.. ‘ఎద్దులు కాదు. మీ కుటుంబానికి ట్రాక్టరే కావాలి. సాయంత్రానికల్లా మీ పొలంలో ట్రాక్టరు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. అన్నట్లుగానే సాయంత్రానికల్లా, 8 లక్షల ఖరీదయిన  ట్రాక్టర్ పంపించి, ఔదార్యం చాటుకున్న మహామనీషి సోనూ సూద్.


ఒక పంజాబీ వ్యక్తి, తెలుగువారితో ఏమాత్రం సంబంధం లేని ఓ నటుడు, ఇన్ని మానవీయ కార్యక్రమాలు చేపడుతుంటే.. తెలుగు ప్రజలు కొనే టిక్కెట్లతో వందల కోట్లకు పడగలెత్తిన, మన హీరోలు మాత్రం సెల్ఫీలు దిగి, కాలక్షేపం చేయడాన్ని ఏమనాలి? ఏం.. వారికి మాత్రం సామాజిక బాధ్యత లేదా? వారూ ఒకప్పుడు వేషాలు లేక పస్తులున్న వారే కదా? పోనీ..ఈ హీరోలేమైనా, కృష్ణానగర్‌లో తోపుడు బండ్లమీద దొరికే తిండి తిని బతుకుతున్నారా? ఏ రోజు బియ్యం ఆరోజు తెచ్చుకుని పొట్టపోసుకుంటున్నారా? స్టుడియోలకు స్థలాలు, అక్రమ కన్వెన్షన్ హాళ్లను కూల్చివేయకుండా పాలకులతో పైరవీలు, భూములు, సినిమా హాళ్లు, మాల్స్ కొనుగోలుపై ఉన్న శ్రద్ధ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న, ఇలాంటి సమస్యలపై పది శాతం కూడా చూపరేం? చాలామందికి ఇలాంటి ప్రశ్నలు మింగుడుపడకపోవచ్చు. ఏం? సంపాదిస్తే పెట్టాలని రూలుందా అని కొందరు అడగవచ్చు. ఎస్. అది మిగిలిన వారికి వ ర్తించకపోవచ్చు. సాధారణ ఉద్యోగులు, వ్యాపారులకు అది వర్తించకపోవచ్చు. కానీ, జనం సొమ్ముతో కొనే టికెట్ల వల్లే..సమాజంలో ఒక స్థానం సంపాదించుకున్న హీరోలకు మాత్రం, ఆ ప్రశ్నలు కచ్చితంగా వర్తిస్తాయి. అంతే!

అన్నట్లు.. సోనూ సూద్,   ఆడబిడ్డల కష్టాన్ని చూసి చలించి, ట్రాక్టర్ పంపిస్తే, దానిని ఏ ఒక్క తెలుగు పత్రిక మొదటి పేజీలో వేయలేదు. పెద్ద పత్రికలు సహా, అన్నీ మళ్లీ సినిమా థియేటర్ల ప్రారంభం కథనాలకే  ప్రాధాన్యం ఇవ్వడం బట్టి, జర్నలిస్టుల మెదళ్లు కూడా ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.  అదే ఏ మెగాస్టారో, ఏ పవర్‌స్టారో, ఏ సూపర్‌స్టారో ‘టక్ చేసుకుని, నెత్దిన టోపీ, చేతికి గ్లవుజులు పెట్టుకుని,  వ్యవసాయం చేస్తే’ ఆ ఫొటోను మొదటి పేజీలో వేసి మురిసిపోయేవి. ఈ సందర్భంగా.. కేసీఆర్, ఓ ఎన్నికల సభలో కాంగ్రెస్ వారిని తిట్టిన తిట్టే గుర్తుకువస్తోంది.