జగనన్నను.. ఎవరూ అర్ధం చేసుకోరే?!

868

జనం కోసమే జగన్ పాట్లు
(మార్తి సుబ్రహ్మణ్యం – 9705311144)

జన సంక్షేమం కోసం, వారిని ఆర్ధిక ఇబ్బందుల నుంచి తప్పించేందుకు.. ఏపీ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఎందుకో దురదృష్టవశాత్తూ అపవాదుల బారినపడుతున్నారు. ఈ విషయంలో ఆయన కవి హృదయాన్ని, ఎవరూ అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించకపోవడం విచారకరం. గతంలో పాలనానుభవం లేకపోయినా.. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా, జానాబెతె్తడు బడ్జెటుతోనే బండి నడిపించడం జగనన్నకే చెల్లింది. జనం జేబు ఖర్చులను తగ్గించి, వారి ఆర్ధిక జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఆయన చేస్తున్న ప్రయత్నాలను అర్ధం చేసుకోకపోగా, వేళాకోళం చేయడం అన్యాయం, అక్రమం!

ఉదాహరణకు మద్యం అమ్మకాలనే తీసుకోండి. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు,  ఇష్టారీతిన వైన్‌షాపులు, రెస్టారెంట్లకు అనుమతులిచ్చేశారు. వాటితోపాటు గ్రామాల్లో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దానివల్ల ఆడబిడ్డల ఆవేదన వర్ణనాతీతం. అప్పట్లో ఏ బ్రాండు మందయినా, ఒక క్వార్టర్  100 రూపాయలకు దొరికేది. పనికెళ్లిన భర్త 80 రూపాయలు తాగి, 20 రూపాయలిచ్చే దుర్భర పరిస్థితి అప్పుడు. ఈ దుస్థితిని చూసిన తర్వాతే జగనన్న.. తాను అధికారంలోకి వస్తే, మద్యనిషేధం అమలుచేస్తానని హామీ ఇచ్చారు. దానితో పొంగిపోయిన చెల్లెమ్మలు, అక్కలూ, అవ్వా-తాతలూ జగనన్నకు ఓట్లు గుద్దేశారు.

 సీఎం అయిన తర్వాత జగన్.. మద్యనిషేధంపై ఆలోచించారు

   దానికంటే ముందు.. వైన్‌షాపులు ఎత్తేసి, సర్కారే వాటిని నడిపేలా చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసమే అంతకుముందున్న బ్రాండ్లన్నీ ఎత్తేసి, నిఖార్సయిన మందును తన వారి కంపెనీల సౌజన్యంతో ఏర్పాటుచేశారు. అయినా, తాగుబోతులలో మార్పు రాలేదు. వారిని తాగుడు మాన్పించేందుకు మందు ధరలు అమాంతం పెంచేశారు. అంతకు ముందున్న పాలనలో క్వార్టర్ 100 రూపాయలున్న మందు కాస్తా, ఇప్పుడు 175 రూపాయలయింది. కరోనా కాలంలో అయితే 450 రూపాయలకు అమ్ముడుపోయిందనుకోండి. అది వేరే విషయం.

సరే.. మళ్లీ ఇప్పుడు తాగుబోతులు ఇబ్బందులు పడుతూ, నాటుసారా తాగుతున్నారన్న ఆందోళనతో జగనన్న సర్కారు, వైన్‌షాపుల సమయాన్ని మరో గంటకు పెంచేసింది. దానితో పక్కదారి పట్టడం మానేసిన మందుబాబులు, బేఫికర్‌గా ఎంచక్కా  సర్కారీ మందుషాపు దగ్గర క్యూ కడుతున్నారు. అసలు జగనన్న మందు ధరలు పెంచిందే, మందుబాబులతో మందు మానివేయించడానికి.  మద్యం విక్రయాలను నిరుత్సాహరచడానికి! దానితో మద్యం అమ్మకాలు బాగా పడిపోయాయట. అయినా సరే.. ఆదాయం కంటే, ప్రజారోగ్యమే ముఖ్యమనుకున్న ముఖ్యమంత్రి, ఓ గంట వైన్ షాపుల సమయం పెంచయినా సరే.. మద్య నిషేధానికి దగ్గరగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. మద్య నిషేధం కోసం…ఇంతగా కష్టపడుతున్న జగనన్న మనసును అర్ధం చేసుకోకుండా, అవాకులు చవాకులు పేలడం ఎంత వరకూ సమంజసం? అంతేలెండి. చెట్టున్న కాయలకే రాళ్లు పడతాయి మరి! ఏం చేస్తాం?  కష్టాలు మనుషులకు కాక, మానులకు వస్తాయా చెప్పండి?

అన్నట్లు.. భూం భూం బీర్, యూత్‌స్టార్, యంగ్‌స్టార్, ఆంధ్రాఛాయస్, కౌంట్‌డౌన్ 9, బ్లాక్‌బస్టర్, ఓల్డ్‌టైమర్, గెలాక్సీ, డికె, 999 పవర్‌స్టార్, ఎపిక్ రిజర్వ్,  9 సీ హార్సెస్, కోల్ట్, బ్యాచిలర్స్ చాయస్, జంటిల్మన్ విస్కీ, ఆంధ్రాగోల్డ్, ఆల్‌సీజర్స్,  జోర్డాస్ బార్ వంటి బ్రాండెండ్ కంపెనీల పేర్లను  ఇప్పటివరకూ ఏపీ ప్రజలే కాదు, అసలు తెలుగు రాష్ట్రాల ప్రజలే వినలేదు. చూడలేదు!  నిజానికి అవన్నీ.. అమెరికా, రష్యా, స్విజర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ, అర్జెంటీనా వంటి దేశాలలో మాత్రమే దొరికే అరుదైన బ్రాండ్లు!!  ఒక్కముక్కలో చెప్పాలంటే.. బకార్డీ, ఫిన్స్‌బరీ, జాక్‌డెనియల్స్, జంటిల్మన్‌జాక్, బ్లాక్ లేబిల్, బ్లూ లేబిల్, రెడ్ లేబిల్, గోల్డ్ లేబిల్, స్మిర్మాఫ్, చివాజ్ రీగల్ స్థాయిలో తయారయిన బ్రాండ్లు అవి.   ఆ రకంగా ఏపీలో దొరికే బ్రాండ్లు, ప్రపంచ స్థాయి బ్రాడెండ్ కంపెనీలతోనే పోటీ పడుతున్నాయట. అసలు ప్రపంచస్థాయి కంపెనీలు వాడే రసాయనాలే ఆంధ్రా బ్రాండు కంపెనీలు వాడుతున్నాయన్న రహస్యం చాలామందికి తెలియదట.

బహుశా అందుకేనేమో… ఆంధ్రాలో దొరుకుతున్న ఈ ప్రపంచస్థాయి లిక్కరు బ్రాండ్లను చూసి, పక్కనే ఉన్న తెలంగాణ-తమిళనాడు-కర్నాటక రాష్ట్రంలోని మందుబాబులు కుళ్లుకుంటున్నారట. ఆ విషయం తెలిసిన తర్వాతనే జగనన్న.. పరాయి రాష్ట్రాలకు ఆ మందు వెళ్లకుండా, బోర్డర్ల దగ్గర చెక్ పోస్టులు పెట్టి కాపలా కాయిస్తున్నట్లున్నారు. మందు అమ్మకాలను నిరుత్సాహపరచడానికి..  ఎక్కువ ధరలు పెట్టినా, ప్రపంచస్థాయి బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. టీడీపీ, బీజేపీ నాయకులు.. అనవసరంగా జగనన్నను ఆడిపోసుకోవడం ఏమాత్రం సబబు కాదు.

ఆ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అయితే, ఏకంగా టీడీపీ ఆఫీసులో ఏపీ బ్రాండ్లతో ఏకంగా వైన్‌షాపే తెరచి.. జె టాక్సు కోసమే, ఈ పిచ్చి బ్రాండ్లు సృష్టించారని, హైదరాబాద్‌లో పేమెంట్ చెల్లిస్తే, తాడేపల్లిలో కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించడం, మందుబాబులకు ఏమాత్రం నచ్చడం లేదు. సోషల్‌మీడియాలో కూడా.. తెలంగాణ బ్రాండ్లు-ఆంధ్రా బ్రాండ్ల ధరలను పోల్చుతూ, దుష్ప్రచారం చేయడం మంచిదికాదు. తెలంగాణలో దొరికే బ్రాండ్లను తలదన్నే బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చిన అన్నను అభినందించడం మానేసి, ఈ కామెడీలు చేయడాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడూ ఖండించాల్సిందే.

ఇక విద్యుత్ బాగా ఖరీదైన వస్తువుగా మారింది. ప్రతివాడూ కరెంట్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్నాడు. చివరకు పూరి గుడిసెలో కూడా ఒక కూలర్, ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు, గ్రైండర్లు వాడుతున్నారు. అలా దానిని విలాస వస్తువుగా మార్చేస్తున్నారు. మరి విద్యుత్తేమో బయట నుంచి కొనుక్కోవాలాయె. అది అసాధ్యం. ఎందుకంటే ఏపీ పేద రాష్ట్రం!  అందుకోసమే.. జగనన్న, లిక్కరు మాదిరిగానే బ్రహ్మాండమైన ఆలోచన చేశారు. అదేమిటంటే, విద్యుత్ చార్జీలు పెంచేశారు. అలాగయినా, ప్రజలు కరెంటు వాడకం తగ్గిస్తారన్న ఆలోచనతో! కరెంటు బిల్లుతో షాక్‌కు గురయ్యే జనం, లిక్కరు మాదిరిగా కరెంటు వాడకం మానేస్తారు. అప్పుడు బోలెడు కరెంటు మిగులుతుంది. పరాయి రాష్ట్రాల నుంచి కొనుక్కోకుండా, ఎంచక్కా మనమే ఇతరులకు కరెంటు అమ్మవచ్చన్నమాట. అయినా ఓ నలభై ఏళ్ల క్రితం అంతా లాంతర్లు, వీధి లైట్ల దగ్గర బతకలేదా ఏమిటి? ఎంచక్కా ఆరు బయట నులక మంచాలేసుకుని పడుకుంటే, ప్రాణాలెటో పోయేవి కదా? అప్పుడు ఈ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉన్నాయా ఏమిటి? ఇంత దివ్యమైన ఆలోచన అసలు ఏ ముఖ్యమంత్రికి వస్తుంది? చివరకు దానిని కూడా స్వాగతించకుండా, ప్రతిపక్షాలు విమర్శించడం ఏం పద్ధతి చెప్పండి? ఇలాగయితే, మంచి చేయాలనుకున్న వారికీ చికాకు రాదా మరి?

  ఆర్టీసీనే తీసుకోండి. చార్జీలు తక్కువున్నాయి కదా అని.. ప్రతివాళ్లూ అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు. అసలే ఆర్టీసీ పీకల్లోతు కష్టాలు, నష్టాల్లో ఉంది.  డీజిల్ ధరలు గూబవాచిపోతున్నాయి. అందుకే.. దానిని కూడా సంస్కరించాలని జగనన్న సంకల్పించారు. ఎలాగంటారా? లిక్కరు, కరెంటు ధరల మాదిరిగానే! బస్సు చార్జీలు పెంచడం ద్వారా, జనం ఇక ఎక్కువగా ప్రయాణాలు చేయరు. అవసరం ఉంటేనే వెళతారు. అప్పుడు జనం జేబులో డబ్బులు కూడా మిగులుతాయి. అంటే ఆర్టీసీ చార్జీలు పెంచడం ద్వారా.. లిక్కురు మాదిరిగానే, ప్రయాణాలను నిరుత్సాహ పరచడమన్నమాట! ఇసుక రేట్లు పెంచడం ద్వారా, ఇళ్ల నిర్మాణాలను నిరుత్సాహపరుస్తున్న విధానానికి అనూహ్య స్పందన వస్తోంది. అప్పట్లో ఇసుకను, నిర్భయంగా ఇళ్లముందు వేసుకునేవారు. ఇప్పుడు జగనన్న పుణ్యాన ఇంట్లోనే దాచుకుంటున్నారు. ఇటీవలే పెట్రోల్-డీజిల్ టాక్సు పెంచడం ద్వారా, జనాల విచ్చలవిడి  వాహన ప్రయాణాలను,  నిరుత్సాహపరిచే విధానం అద్భుత ఫలితాలిస్తోంది.

అన్నట్లు.. జనం నీటి విలువ తెలియకుండా, ఇష్టం వచ్చిన ట్లు తాగేస్తున్నారు. పనుల పేరిట అమూల్యమైన నీటిని వృధా చేస్తున్నారు. రైతులు కూడా నీళ్లను పొలాలకు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. సాగునీటి సమస్యలొస్తున్నాయి. భూగర్భజలాలు ఇప్పటికే అడుగంటాయి. రిజర్వాయర్లకు ఎప్పుడూ సమస్యలే. కాబట్టి.. లిక్కరు, కరెంటు, ఆర్టీసీ మాదిరిగానే, నీటి వాడకాన్ని నిరుత్సాహ పరిచేందుకు.. జగనన్న ఏ విధానం తీసుకువస్తారో చూడాలి! అత్తారింటికిదారేది సినిమాలో రైల్వేస్టేషన్ సీన్‌లో పవనన్న చెప్పినట్లు.. ‘వీటి వల్ల బాధ పడి ఉంటే  క్షమించండి. వీలయితే స్వాగతించండి.  కానీ జగనన్న ఉన్నారని మాత్రం  గుర్తించండి’!!