కాసు మహేష్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లేఖ

108

గౌరవ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారికి, గురజాల నియోజకవర్గంలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగి, పేద ప్రజలు హాస్పిటల్ కి వెళ్లే ఆర్థిక స్తోమత లేక, ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు కూడా హాస్పిటల్ కి వెళ్తే బెడ్స్ ఖాళీ లేవని చెప్పడం ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున మరణిస్తున్న సంగతి మీ దృష్టికి వచ్చిందా?
కరోనా వ్యాప్తి చెందకుండా కరోనా బారిన పడ్డ ప్రజల్ని ట్రీట్మెంట్ ఇప్పించటంలో, ప్రాణాలు కాపాడటంలో ఈ 4 నెలల కాలంలో మీ వంతు బాధ్యతలు ఏమి నిర్వర్తించారు?. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు గుర్తుకు వచ్చేది స్థానిక ఎమ్మెల్యేనే.
కరోనా బారిన పడ్డ ప్రజల్ని కాపాడడంలో మన నియోజకవర్గంలో వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి?, గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి?, బెడ్ల పరిస్థితి ఏంటి?, దానిలో ఆక్సిజన్ యూనిట్స్ పరిస్థితి ఏంటి?
ముందుగా ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి, ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న సౌకర్యాలను చర్చించారా?. 4 నెలల తర్వాత ఒక కొవిఢ్ హాస్పిటల్ ని పిడుగురాళ్లలో ఎనౌన్స్ చేశారు. దానిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయో మీరు కనుక్కున్నారా?
ఒక్కొక్క మండలంలో 400 నుండి 500 మంది ఈ కోవిడ్ బారిన పడుతున్నారని సమాచారం. వాళ్లకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు?, వారి పరిస్థితి ఏంటి?, ట్రీట్మెంట్ జరగక చనిపోయే వారి సంఖ్య ఎంత? దీనిపై మీరు దృష్టి సారించారా?
నియోజవర్గంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ సంఖ్య ఎంత? ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని బెడ్లు ఉన్నాయి? ఎన్ని ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి?. నియోజకవర్గంలో కరోనా బారిన పడిన వారికి చికిత్స ఒకేసారి ఎంతమందికి చెయ్యొచ్చు?
నియోజకవర్గం మొత్తం ఒక కోవిడ్ హాస్పటల్ని ప్రకటిస్తే సరిపోదు. మండలానికి కనీసం తక్కువలో తక్కువ 100 బెడ్లతోని, 100 ఆక్సిజన్ యూనిట్లు తోని ప్రభుత్వం సిద్ధంగా ఉంచాలి.
ప్రైవేట్ హాస్పిటల్స్ లో తగినన్ని బెడ్లు, తగినన్ని ఆక్సిజన్ యూనిట్స్ లేనప్పుడు ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి ప్రైవేట్ హాస్పిటల్ కి ఇచ్చి, లేదంటే మండలాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లను గాని లాడ్జీలను గానీ టెంపరరీ హాస్పిటల్స్ గా మార్చి, వాటిలో 100 బెడ్లు, 100 ఆక్సిజన్ యూనిట్లని పెట్టి, ఇటు ప్రభుత్వ డాక్టర్లు అటు ప్రైవేటు డాక్టర్ల సేవలను మనం ఉపయోగించుకునే విధంగా చెయ్యాలి.
నాలుగు మండలాలకి 400 బెడ్లు, పిడుగురాళ్ల మున్సిపాలిటీకి 200 బెడ్లు, మొత్తం 600 బెడ్లు, 600 ఆక్సిజన్ యూనిట్స్ ని మనం ప్రభుత్వం నుండి వెంటనే కొనుగోలు చెయ్యాలి.
ఒక్కొక్క బెడ్, ఒక్కొక్క ఆక్సిజన్ యూనిట్ కలిపి ₹50,000/- రూపాయల ఖర్చు అవుతుంది. 600 బెడ్లకి కలిపి మొత్తం ₹ 3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ 600 బెడ్లకు కావలసిన డాక్టర్లను అవసరమైతే యుద్ధప్రాతిపదికన కొత్త డాక్టర్లను రిక్రూట్ చేసుకోవటం లేకపోతే మన నియోజకవర్గంలో పీజీ చేస్తున్న డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవటం, టెక్నికల్ పీపుల్ని, నర్సులను అపాయింట్ చేసుకోవడం వీటన్నిటికీ కలిపి కూడా ఇంకో ₹ 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తులకు భోజన సౌకర్యం కానీ, మెడిసిన్స్ గాని, లేకపోతే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు గాని ఎంత మనం ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో ₹5 కోట్ల రూపాయలు వాళ్లకి ఖర్చు అవుతుంది. మొత్తం మీద చూస్తే ఈ కోవిడ్ నివారణకి, ప్రజల ప్రాణాలను పోకుండా రక్షించడం కోసం గురజాల నియోజకవర్గంలో ₹10 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే కోవిడ్ నివారణ చర్యలను చేపట్టవచ్చు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తుల ప్రాణాలను పోకుండా కాపాడవచ్చు. ₹10 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి కేటాయించడం పెద్ద బడ్జెట్ ఏమీ కాదు. ముఖ్యమంత్రి గారిని అడిగి మీరు ఈ బడ్జెట్ ని తీసుకువచ్చి, 600 వందల బెడ్లను మార్చి, ఏప్రిల్ లోనే మీరు సమకూర్చినట్లయితే ఈ ప్రాణ నష్టం జరిగేది కాదు. ఈ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోయారో! నాకు అర్థం కావడం లేదు.
ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబం మాది అని చెప్పుకునే మీరు, ప్రజలకు సేవలు అందించడంలో కూడా అలాగే వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇష్టం లేని పెళ్లి లాగా గురజాల నియోజకవర్గం మీద వ్యవహరించవద్దని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన నిధులను మంజూరు చేయించి, అన్ని మండల హెడ్ క్వార్టర్లలో బెడ్లు, ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేసి గురజాల నియోజకవర్గ ప్రజల్ని కాపాడవలసినదిగా కోరుకుంటున్నాము.
అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక భవన నిర్మాణ కార్మికులు దాని అనుబంధంగా ఉన్న చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ కూడా పనులు లేక పస్తుల్లో ఉన్నారు. కార్మిక శాఖ లో ₹ 2,000/- కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఆ నిధుల నుండి వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.
లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పని దినాలు కల్పించడం లేదంటే ప్రభుత్వ నిధులు రోజుకి ₹500/- రూపాయలు కేటాయించి ఆ కుటుంబాల్ని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.
అలాగే కోవిడ్ నివారణకి, పేషంట్లను రక్షించడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని హాస్పటల్స్ కి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాం.

ఇట్లు
యరపతినేని శ్రీనివాసరావు