పీవీపై.. ప్రేమ చూడతరమా?

286

జయంతి ఉత్సవాల జాతర
తరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్
గల్లీలో సరే.. ఢిల్లీ మాటేమిటి?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

దేశంలో ఉన్న బంగారాన్ని కుదువపెట్టిన దౌర్భాగ్య పరిస్థితి నుంచి రక్షించి, విదేశీ మారక ద్రవ్య నిలువలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, దేశ ఠీవిని చాటిన పాములపర్తి వెంకట నరసింహారావు అనే పీవీ గారిపై.. కాంగ్రెస్ చూపిస్తున్న ప్రేమాభిమానాలను చూసి, పైనున్న పీవీ ఆత్మ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. తనపై కాంగ్రెస్ పార్టీకి ఇంత కృతజ్ఞత ఉందనుకుని ఉబ్బితబ్బిబ్బవుతుంది.  అలా అని ఎవరైనా అనుకుంటే.. ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే!  ఆయన శతజయంత్యుత్సవాలను ఏడాది పొడవునా చేయాలన్న, తెలంగాణ కాంగ్రెస్‌కున్న బుద్ధి-బుర్ర.. సోనియమ్మ సారథ్యంలోని ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎందుకులేదని అడిగినవాడు, ఇటలీమాత దృష్టిలో దేశద్రోహి కిందే లెక్క. ఏఐసీసీ ఆఫీసులో, పెద్దాయన ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన వాడూ పాపాత్ముడి కిందే లెక్క. పాములపర్తి వారి కీర్తికి అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన విలువ, తెలుగువాడికి ఇచ్చిన గౌరవం అది! దశాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా వెలిగిన పీవీ రంగస్థలానికి.. ఆయన పెరిగిన కాంగ్రెస్ కనీసం,  చనిపోయిన తర్వాత.. అదే ఢిల్లీలో గజం స్థలంలో స్మారక మందిరం కూడా ఇవ్వలేదు. పదేళ్ల తర్వాత.. అదీ ఎన్డీఏ హయాంలో,  పీవీ స్మృతికి ఓ గూడు వెలసింది. ఓ తెలుగుబిడ్డకు బీజేపీ ఇచ్చిన విలువ ఇదీ!! అది కూడా మరో తెలుగువాడయిన వెంకయ్యనాయుడు నేతృత్వంలో!!!

పీవీ ఇప్పుడు గుర్తుకొచ్చారు..

ఆలికి అన్నం పెట్టనివాడు ఊరికి ఉపకారం చేస్తాడన్నట్లుంది.. పీవీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్  చేస్తున్న హడావిడి!  దానికో కమిటీ, దాని నాయకత్వానికీ కొట్లాట. పీవీ  గారు కాంగ్రెస్‌కు చేసిన సేవలు. అబ్బో అబ్బో అబ్బబ్బో.. ఎన్ని చిత్ర విచిత్రాలో? ఎంత విధేయతనో? ఇన్నాళ్లూ వంగర బిడ్డను మర్చిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌కు, ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని మరపునకు రావడం విచిత్రమే. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతో మెరుగు. ఆంధ్రా పీసీసీ అయితే అసలు ఆ ఊసే ఎత్తిన పాపాన పోలేదు. చివరాఖరకు, ఆ పనేదో తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నందుకు మెచ్చుకోవలసిందే.

పదవుల్లో ఉంటే అంతే..

పీవీ ప్రధానిగా ఉన్న కాలంలో.. ఇదే తెలంగాణకు చెందిన ఓ డజనుమంది ప్రముఖులు, ఆయన వయసంత బరువున్న కేకులను తీసుకువెళ్లి, పీవీతో కట్ చేయించేవారు. కానీ, ఆయన పదవీ వియోగం తర్వాత, ఒక్కరు కూడా ఆయన జన్మదినం రోజున,  కిలో కేకు తీసుకువెళితే ఒట్టు. దటీజ్ కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చేసిన రోశయ్య గారికీ, దాదాపు ఇలాంటి అనుభవమే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో రోశయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేవారు. ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి, ఇవేమీ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ విద్య’లో ఆరితేరిన రాజకీయ నాయకులకు, ఈ విన్యాసాలు పెద్ద విషయమే కాదు.

పీవీ మృతదేహానికి చోటేదీ?


సరే.. మళ్లీ పీవీ గారి జ్ఞాపకాల లోతులకు వెళదాం. తన అనుభవం,  మేధస్సును జీవితకాలం కాంగ్రెస్ ఉన్నతి, గాంధీ కుటుంబం కోసం ధారపోసిన పీవీకి.. ఆ పార్టీ ఆయన చరమాంకం, కడకు భౌతికకాయానికి ఇచ్చిన గౌరవం, మర్యాద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు ఆ స్థాయిలో, ఏ పార్టీ నాయకత్వం కూడా వ్యవహరించదు. అంత గొప్పగా, అంత ఆర్భాటంగా, అంత గౌరవప్రదంగా..  ఆయన శరీరం, హస్తిన నుంచి హైదరాబాద్‌కు తరలింది మూగగా రోదిస్తూ! ఒక  ప్రముఖ నాయకుడు మృతి చెందితే, ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆ మృతదేహం కొద్దిసేపు అక్కడ ఉంచడం ఆనవాయితీ. ఎందుకంటే, ఆ పార్టీ కోసం సదరు నేత చేసిన సేవకు.. ఆ నాయకత్వం ఇచ్చే అంతిమ గౌరవం, నివాళి అది! ఆరకంగా పార్టీ ఆ వ్యక్తిని ఆ పార్టీ సొంతం చేసుకుందన్నది అర్ధం.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లో మృతి చెందితే, ఆయన భౌతిక కాయాన్ని గుంటూరు పార్టీ ఆఫీసులో ఉంచారు. అంతకముందు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఉంచారు. భౌతిక కాయం వెంట చంద్రబాబు నాయుడు ఉన్నారు. మాజీ మంత్రి పి.జనార్దన్‌రెడ్డి, ముఖేష్ వంటి నేతలు మృతి చెందినప్పుడు, వారి భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో ఉంచారు. ఇంకా అనేకమంది కాంగ్రెస్ నేతలు మృతి చెందిన సందర్భంలో.. అంతిమయాత్రకు ముందు వారి మృతదేహాన్ని గాంధీభవన్‌లో కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం ఉంచిన సందర్భాలు కోకొల్లలు.

ఇదీ కాంగ్రెస్ అంతిమ ‘సంస్కారం’!

మరి రాష్ట్ర స్థాయి నాయకుల విషయంలోనే, అంత గౌరవ మర్యాదలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దేశానికి ప్రధానిగా, ఆర్ధిక సంస్కరణలకు పునాదులు వేసిన పీవీ విషయంలో ఇంకెంత సంస్కారం ప్రదర్శించాలి? ఆయన అంతిమ సంస్కారంలో ఎంత అభిమానం చాటాలి? పివి భౌతిక కాయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఉంచకుండా.. అక్కడి నుంచి ఆగమేఘాలపై మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించి, అక్కడ కూడా అంతిమ సంస్కారాన్ని ఆదరాబాదరాగా ముగించిన వైనం ఆ పార్టీ నేతలు మర్చిపోయినా, ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. పోనీ మృతి తర్వాతయినా, ఢిల్లీలో ఆయన స్మృతి చిహ్నంగా ఘాట్ నిర్మించాలన్న బుద్ధి-బుర్ర  లేని కాంగ్రెస్.. ఇప్పుడు అదే నాయకుడికి, ఏడాది పొడవునా జయంత్యుత్సవాలు జరుపుతామనడం వినడానికే రోతగా లేదూ? ఆయన వల్లనే మైనారిటీలు పార్టీకి దూరమయ్యారని కుమిలిపోయిన కాంగ్రెస్‌కు, ఆయన గుర్తులన్నీ విజయవంతంగా చెరిపేసిన కాంగ్రెస్ పార్టీకి పీవీని స్మరించుకునే నైతిక అర్హత ఉందా? గాంధీ టోపీలు, ఖద్దరు బట్టలు వేసుకున్న ఈ నాయక శిఖామణులకు,  పీవీ పేరు తలచే హక్కు ఉందా అన్నది ప్రశ్న.

కేసీఆర్‌కున్న భక్తి కాంగ్రెసుకేదీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్ధి. పీవీ పేరిట ఏం చేసినా, దాని క్రెడిట్టంతా సహజంగా కాంగ్రెస్ ఖాతాలోకే వెళుతుంది. అయినా సరే.. దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ జయంతిని, ప్రభుత్వపరంగా నిర్వహించడం ఒక్క కేసీఆర్‌కే చెల్లింది. పివి ఘాట్‌ను ఢిల్లీ కాంగ్రెస్ మర్చినా, హైదరాబాద్‌లో మాత్రం అద్భుతంగా నిర్మించిన వైనాన్ని ప్రశంసించకుండా ఉండలేం. అసలు కేసీఆర్, పీవీ జయంతి ఉత్సవాల ఆలోచనకు శ్రీకారం చుట్టిన తర్వాతనే.. తెలంగాణ కాంగ్రెస్ మత్తు వదిలి పీవీ జపం చేయడం పెద్ద జోకు. పీవీ  సేవకు బహుమానంగా, ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. గౌరవించాలన్నది కేసీఆర్ మనోభావంగా చెబుతున్నారు. ఇంతకూ పీవీ కుటుంబసభ్యులెవరూ, ఇప్పుడు  కాంగ్రెస్‌లో లేరు. అదే విచిత్రం!

సరే.. పీవీ శతజయంత్యుత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ కాంగ్రెస్ సంకల్పించడం సంతోషమే. మరి.. ఆ పని ఇటలీమాత సారధ్యంలోని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? అదేదో ఏఐసిసి కార్యాలయం నుంచే ప్రారంభించవచ్చు కదా? ఏదో బలవంతపు బ్రాహ్మణార్ధం మాదిరిగా.. ఆయన ఫొటోను వెతికి పట్టుకొచ్చి, దానికి పూలదండ వేసి, నివాళులర్పించే తంతును పూర్తి చేసిన ఆలిండియా కాంగ్రెస్.. తెలంగాణ కాంగ్రెస్ చేసినట్లు, పార్టీపరంగా దేశవ్యాప్తంగా ఆ పని ఎందుకు చేయలేదు? ఆయన పార్టీ నుంచి ఎంపికయిన ప్రధానమంత్రే కదా? అయినా ఆ పనెందుకు చేయలేదు? అంటే పీవీ ఠీవిని తెలంగాణకే పరిమితం చేయాలనా? పీవీ పేరు స్మరిస్తే,  ఉన్న ఆ మైనారిటీలు కూడా దూరమవుతారన్న భయమా?.. ఈ ప్రశ్నలకు బదులేదీ?