మళ్లీ ప్రజా తీర్పు దిశగా!?

256

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం కేవలం మరో 8 నెలలు మాత్రమే ఉంది. 2021 మార్చ్ 31 తో ఆయన పదవీకాలం పూర్తి అవుతుంది. కరోనా విజ్రంభణ తీరు వల్ల…ఈ ఎనిమిది నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదు.
అయినప్పటికీ…తనను ప్రభుత్వం ఎలా పునర్నియామకం చేయదో చూడాలని అటు నిమ్మగడ్డ; ఆయనను ఆ పదవిలో తిరిగి నియమించక పోతే ఏం చేసుకుంటారో చేసుకోమని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు వెడుతున్నట్టు కనడుతున్నది.
ఇప్పుడు ఈ వివాదం ….వాయుగుండంగా మొదలై తుఫానుగా మారినట్టు; నిమ్మగడ్డ రమేషకుమార్…..ప్రభుత్వం మధ్య కాకుండా; న్యాయ వ్యవస్థ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య కేంద్రీకృతమైంది.
వచ్చే శుక్రవారం లోపు నిమ్మగడ్డను రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసినట్టు మీడియాలో వచ్చింది. మరో పక్క…. హై కోర్ట్ లో కోర్ట్ ధిక్కరణ కేస్ కూడా …తుఫాను లాగా…చురుకుగా కదులుతోంది.
ఈ పరిస్థితులలో ….వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ కు అతి కీలకం కాబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇక్కడివరకు వచ్చిన తరువాత…ప్రభుత్వం వెనక్కి తగ్గి…నిమ్మగడ్డ రమేష్ ను ప్రభుత్వం తిరిగి నియమిస్తుందనే నమ్మకం ప్రభుత్వ వ్యవహార శైలిని గమనించేవారిలో కలగడం లేదు. అలాగే..తమ తీర్పులను పట్టించుకోకపోతే…న్యాయ వ్యవస్థ కూడా మౌనంగా ఉండే అవకాశమే లేదు.
ఇది ఒక టగ్ -ఆఫ్-వార్ సన్నివేశం. 151 స్థానాలతో ప్రజలు తనకు అధికారం అప్పగించిన నేపథ్యంలో…తన మాటే అంతిమంగా చెల్లుబాటు కావాలనే దృఢ మైన అభిప్రాయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది స్పష్టం. ఆ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు.
అందువల్ల…ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ మాటే అంతిమం కావడాన్ని…ముఖ్యమంత్రి అంగీకరించక పోవచ్చునన్న భావన కూడా కొన్ని రాజకీయవర్గాల్లో బలంగా ఉంది.
న్యాయ వ్యవస్థ కు తలొగ్గాల్సిన పరిస్థితే ఎదురైతే….మళ్లీ తాజాగా ప్రజల తీర్పు కోరాలనే ఆలోచనకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశాన్ని కూడా కొందరు న్యాయవాదులు ప్రైవేట్ సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు.
శాసన సభ రద్దుకు సిఫారసు చేస్తే….కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా…ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసేదాకా ప్రభుత్వానికి కనిపిస్తున్న ప్రత్యామ్నాయం ఇది అనే వాదన బలం పుంజుకుంటున్నది.
ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆ పదవి లో చూడడానికి…ముఖ్యమంత్రి జగన్ …నూటికి ఒక్క శాతం కూడా ఇష్టపడడం లేదు. తప్పనిసరి ఎదురైతే…శాసనసభను రద్దుచేసి; తాజాగా ప్రజాతీర్పు కోరడానికైనా….ఆయన వెనుకాడకపోవచ్చు.

-భోగాది వెంకట రాయుడు