ఇందిర వెళితే ఒప్పు.. మోదీ వెళితే తప్పా?

157

నరేంద్రుడు అయోధ్యకు వెళ్లడం నేరమా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అయోధ్యలో తలపెట్టిన.. రామమందిర నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడాన్ని, ఘనత వహించిన లౌకికవాదులు మహా రచ్చ చేస్తుండటం ఆశ్చర్యం. ఆగస్టు 5వ తేదీన జరగనున్న భూమి పూజకు, మోదీ హాజరవడమంటే.. ఒక మతాన్ని ప్రోత్సహించినట్టేనన్న, గొప్ప తర్కాన్ని లౌకికవాదులు తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమయింది. అసలు ఒక మత కార్యక్రమానికి, దేశ ప్రధాని ఎలా హాజరవుతారన్నది వారి లా పాయింటు. అలా హాజరుకావడం వల్ల సెక్యులర్ మడి మైలపడిపోతుందని, లౌకికవాదానికి మహా అపచారం జరిగిపోతుందన్న గగ్గోలు వినిపిస్తోంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణయితే, ప్రధాని శంకుస్థాపన చేయడాన్ని, రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. మరి భారత రాజ్యాంగ తొలి ప్రతిపై.. రాముడిని ముద్రించడం రాజ్యాంగబద్ధమయినప్పుడు.. ప్రధాని అయోధ్యలో మందిర నిర్మాణ శంకుస్థాపనకు వెళ్లడమూ రాజ్యాంగబద్ధం కాక విరుద్ధమెలా అవుతుందన్నది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన ప్రశ్న.

అయోధ్యలో దశాబ్దాల నుంచి నానుతూ ఉన్న, మందిర్-మసీదు సమస్యకు సుప్రీంకోర్టు తెరదించింది. సుప్రీం తీర్పును అంతా సమర్ధించారు. చివరకు మైనారిటీలు కూడా, ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తీర్పు వెలువడిన రోజు.. ఏదైనా మతఘర్షణలు జరుగుతాయోనని భయపడినా, చిన్న నిరసన అపస్వరం కూడా వినిపించలేదు. తీర్పు అనంతరం.. హిందువులు రోడ్డెక్కి సంబరాలు చేసుకుంటే, అది ఎక్కడ ముస్లిం వర్గంపై ప్రభావం చూపుతుందోనని ప్రభుత్వం భయపడింది. దానికోసం ముందస్తు చర్యగా, పోలీసులు  పెద్ద సంఖ్యలో మోహరించారు. కానీ హిందువులు రోడ్డెక్కకపోవడంతో, ప్రభుత్వం హాయిగా ఊపిరిపీల్చుకుంది.

ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు భావించింది. దానికి దేశంలోని మొట్టమొదట స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. విశ్వహిందూపరిషత్ తెలంగాణ నాయకులు, పవిత్రజలాలు-మట్టిని తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.   నాగ ఆకారంలో.. 161 అడుగుల ఎత్తున, చీకటిమయంగా ఉన్న గర్భగృహం నుంచి దేవుడిని దర్శించేలా ఆలయం నిర్మించనున్నారు. దీనిని  శిల్పి నిఖిల్ సోంపుర పర్యవేక్షిస్తున్నారు. నిజానికి ఆగస్టు 5న జరగనున్న ఈ భూమిపూజను, వీడియో ద్వారా నిర్వహిస్తానని మోదీ ప్రకటించారు. కానీ ట్రస్టు పెద్దలు, శిల్పుల వినతితో అక్కడికి వస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని నారాయణ వంటి అతి గొప్ప సెక్యులరిస్టులు ఆక్షేపిస్తున్నారు. ఆయనతోపాటు, పెద్దగొంతు లౌకికవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సరే.. కాసేపు వారి వాదనే నిజమనుకుందాం. మరి.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిజాముద్దీన్ ఆలియా దర్గా ప్రారంభోత్సవానికి ప్రధాని హోదాలో హాజరవడం రాజ్యాంగబద్ధమే అయితే.. మోదీ అయోధ్యకు వెళ్లడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని మెడ మీద తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహం. రాజకీయ పార్టీలే ఇఫ్తార్ విందులు ఇస్తున్నప్పుడు.. ముఖ్యమంత్రిలే క్రైస్తవ భవనాలు ప్రారంభిస్తున్నప్పుడు.. హజ్, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వాలే రాయితీ ఇస్తున్నప్పుడు.. జగన్మోహన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు, చర్చి ఫాదర్లు, మసీదు ముల్లాలకు నెలకు గౌరవ వేతనం ఇస్తున్నప్పుడు.. 370 వంటి చట్టాలను ఒక వర్గం కోసం చేసినప్పుడు.. ఈ   కుహనా లౌకికవాదులు, వీర విక్రమ వామపక్ష మేధావులు, రోడ్డుపై పడి యాగీ చేసే కాలేజీ చిరంజీవులు..  ఎందుకు నోటికి మాస్కులు కట్టుకున్నారన్న ప్రశ్నలకు జవాబిచ్చేదెవరు?