కూల్చి‘వెతల’ నుంచి కాపాడిన కేసీఆర్!

497

పాత్రికేయుల ప్రాణరక్షణకేనట
అందుకే హైదరాబాద్ రాని ‘వార్ జర్నలిస్టులు’
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘ సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత వార్తల సేకరణకు అనుమతిస్తే జర్నలిస్టులకు  ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, నిర్దిష్ట వేళల్లో కూడా మీడియాను అనుమతించడం కుదరదు. కరోనా టైంలో విలేకరులను, బస్సుల్లో తీసుకువెళ్లాలన్న ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదు. అందుకే మీడియాను అనుమతించడం లేదు. జీహెచ్‌ఎంసీ యాక్టు సెక్షన్ 180 ప్రకారం అనుమతించడానికి వీల్లేదు’’
– తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత సమయంలో.. మీడియాను అనుమతించాలంటూ దాఖలయిన పిటిషన్‌లో, ప్రభుత్వం వినిపించిన ఈ వాదన వింటే.. తెలంగాణలో పత్రికాస్వామ్య పరిరక్షణ, పాత్రికేయుల ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే  విలువ-గౌరవం ఎంతన్నది స్పష్టమవుతుంది. మీడియా నిరాకరణకు,  కేసీఆర్ సర్కారు కవి హృదయం అర్ధం చేసుకోకుండా.. విపక్షాలు, జర్నలిస్టు సంఘాలు నానా యాగీ చేస్తున్నాయి. జడ్జి, న్యాయవాది చెప్పినట్లు.. యుద్ధవార్తలంటే,  ఎక్కడో అక్కడ నక్కి చూడవచ్చు. కానీ.. ఐదారు వేల ఎకరాల్లో విస్తరించిన, దట్టమైన అరణ్యప్రాంతం నడిబొడ్డున ఉన్న, సెక్రటేరియేట్ కూల్చివేత వార్తలు ఎలా సేకరిస్తారన్నది.. బహుశా పాలకుల సందేహం కావచ్చు. అందుకే అనుమతి నిరాకరించింది కామోసు!

పిటిషనర్ పక్షాన వాదించిన న్యాయవాది చెప్పినట్లు.. ప్రధాని మోదీ లద్దాఖ్ వెళ్లినప్పుడు, మీడియా కూడా  వెళ్లి ఆ వార్త కవర్ చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు, సచివాలయ కూల్చివేతను కవర్ చేసేందుకు, ఎందుకు అనుమతించరన్న ప్రశ్నలో న్యాయం కనిపించవచ్చు. దానితో  జడ్జి గారు కూడా ఏకీభవించవచ్చు. జడ్జి గారు చెప్పినట్లు.. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాధస్వామి ఆలయంలో,  బయటపడిన గుప్త నిధుల నేలమాళిగనే మీడియా ప్రపంచానికి చూపి ఉండవచ్చు. యుద్ధరంగంలో, మావోల ఎన్‌కౌంటర్ ఘటనలనూ చూపించి ఉండవచ్చు. అలాంటప్పుడు సచివాలయం వద్దకు, మీడియాను ఎందుకు అనుమతించరన్న జడ్జి ప్రశ్నను కొట్టివేయలేం. హైకోర్టు జడ్జి చల్లా కోదండరామ్ గారు చెప్పినట్లు.. ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రజలకు సచివాలయ కూల్చివేత దృశ్యాలు చూడాలని కోరిక ఉండవచ్చు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం, విలేకరుల అమూల్యమైన ప్రాణాలను దృష్టిలో ఉంచుకునే, వారిని అనుమతించేది లేదని వాదిస్తోంది. పైగా కరోనా సమయంలో,  అంత రిస్కు చేయలేమని చెబుతోంది. పాత్రికేయుల ప్రాణాలపై, ఇన్ని జాగ్రత్తలు-ఇంత శ్రద్ధ తీసుకునే పాలకులుగానీ, వారి ఇబ్బందుల గురించి ఆలోచించే ప్రభుత్వాలు గానీ, దేశంలో ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి? ఒక్క మన తెలంగాణలో తప్ప?


రెండవ ప్రపంచ యుద్ధంలో జర్నలిస్టులు, ముందువరసలో ఉండి వార్తా సేకరణ చేసిన రోజులున్నాయి. వీరిని ‘వార్ కరస్పాండెంట్లు’గా పిలుస్తారు. అమెరికా అయితే, తాను యుద్ధానికి వెళ్లే ప్రతిసారీ,  తన దేశ జర్నలిస్టులను, సైన్యంతో పంపిస్తుంది. ఆ జర్నలిస్టులు కూడా, సైన్యం దుస్తులతోనే వార్తా సేకరణ చేస్తారు. కార్లు, యుద్ధ ట్యాంకర్లలో సైనికులతో కలసి జీవిస్తారు. ఇలాంటి వారిని ‘ఎంబెడెడ్ జర్నలిస్టు’లని పిలుస్తారు.  1936-39 మధ్య, స్పానిష్‌లో జరిగిన పౌరయుద్ధంలో కూడా, అదే జర్నలిస్టులు ఆ వార్తలను ప్రత్యక్షంగా తిలకించి, ప్రపంచానికి అందించారు. ప్రఖ్యాత బ్రిటీషు జర్నలిస్టు, నోబెల్ అవార్డు గ్రహీత హెమ్మింగ్ వే-ఆయన భార్య కూడా స్పానిష్ సివిల్ వార్‌లో పాల్గొన్నారు. గల్ఫ్ యుద్ధంలో జర్నలిస్టులు, యుద్ధక్షేత్రం నుంచి అందించిన వందల కథనాలు, జనాలను ఆలోచింపచేశాయి. ఆ సందర్భంలో అమెరికా ప్రభుత్వం..  మీడియాను కువైట్‌లోని ఒక హోటల్ భవనం టెర్రస్ పైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచే యుద్ధ దృశ్యాలు చూసే ఏర్పాటుచేసింది. అప్పుడే కొత్తగా వచ్చిన సీఎన్‌ఎన్ చానెల్ ప్రతినిధులు, విడిగా వార్తా సేకరణ జరిపారు.   హిరోషిమా-నాగసాకిపై, అమెరికా  అణుబాంబు వేసిందని.. ప్రపంచానికి చాటింది కూడా ఒక మహిళా జర్నలిస్టే. ఆమె ప్రభుత్వం కన్నుగప్పి, రహస్యంగా అక్కడికి వెళ్లి, రెండురోజుల తర్వాత ఆ విషయాన్ని ప్రపంచానికి చాటింది. ఒసామా బిడ్ లాడెన్ ఆనుపానులు కనిపెట్టేందుకు, జర్నలిస్టులు నెలలు, ఏళ్ల తరబడి అక్కడ జీవించిన చరిత్రను విస్మరించకూడదు.

   మన దేశంలో.. ‘డిఫెన్స్ కరస్పాండెన్స్ కోర్సు’ ఒకటి ఉంది. ఈ కోర్సు నేర్చుకునే జర్నలిస్టులకు ధియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. వారిని త్రివిధ దళాల స్థావరాలకు తీసుకువెళ్లి, ఆయుధాల గురించి వివరిస్తుంటారు. దేశ సరిహద్దులయిన రాష్ట్రాలకు తీసుకువెళుతుంటారు. ఆ తర్వాత యుద్ధ సమయంలో, వారిని మాత్రమే వార్తా సేకరణకు తీసుకువెళుతుంటారు. ఇక మళ్లీ యుద్ధ వార్తాల విషయానికొస్తే..  కశ్మీర్, పంజాబ్‌లో కూడా.. సైన్యం-టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పులను, సమీపం నుంచే చూసి వార్తలందించిన చరిత్ర ఉంది. అంతెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో… ఉత్తర తెలంగాణలో,  పీపుల్స్‌వార్-పోలీసులకు మధ్య తరచూ జరిగే ఎన్‌కౌంటర్ వార్తలను, లెక్కలేనన్నిసార్లు క్రైం రిపోర్టర్లు ప్రజలకు అందించారు. అప్పట్లో జిల్లా ఎస్పీలే తెల్లవారుఝామున, విలేకరులకు ఒక వాహనం సమకూర్చి, నక్సల్స్ ఉన్న పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ వారిని కాల్పులకు అందనంత దూరంగా ఉంచి, తాము నక్సల్స్ ఉన్న ప్రదేశానికి వెళ్లేవారు. ఇలాంటి సంఘటనతో పాటు, కశ్మీర్‌లో జరిగిన కాల్పులను దగ్గరుండి రిపోర్టు చేసిన  తెలుగు జర్నలిస్టులు కూడా లేకపోలేదు.

   మరి అంత పెద్ద యుద్ధాలనే కవర్ చేసిన జర్నలిస్టులు.. ఒక సాధారణ సచివాలయ భవన కూల్చివేతను కవర్ చేస్తే, ప్రమాదంలో పడతారన్న ప్రభుత్వ వాదన వింటే… సచివాలయ పరిసర ప్రాంతం, ఎంత భయంకరంగా ఉంటుందోనన్న అనుమానం రాకతప్పదు. అక్కడ మందుపాతరలాంటివేమైనా ఉంటాయేమో, ప్రత్యర్ధి దేశం ఆ ప్రాంతం వైపు మిస్సైళ్లు, స్టడ్లు, పేట్రియాట్ గురిపెట్టిందేమోనన్న మరో డౌటనుమానం కూడా జనించక తప్పదు. బహుశా అందుకే,  జర్నలిస్టులను అటు వైపు అనుమతించడం లేదని సర్కారు,  న్యాయమూర్తులకు సెలవిచ్చినట్లుంది. అందుకే కామోసు.. యుద్ధాల సమయంలో, సైన్యంతోపాటు వెళ్లి వార్తలు సేకరిస్తున్న..  ప్రపంచ ప్రఖ్యాత వార్ జర్నలిస్టులు, ఎంబెడెడ్ జర్నలిస్టులు కూడా..  హైదరాబాద్‌లో సచివాలయ కూల్చివేత కవరేజీకి, ప్రాణభయంతో  వెనకడుగు వేసి ఉండవచ్చు.  నిజాం కట్టించిన ఆ భవనాల నేలమాళిగలో  నిధి నిక్షేపాలున్నాయని, అందుకే ప్రభుత్వం రహస్యంగా తవ్వకాలు చేస్తోందని,  కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలే, ఇంత రచ్చకూ కారణం అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ నిధి నిక్షేపాలు లేకపోతే.. కేసీఆర్ ప్రభుత్వం అంత రహస్యంగా,  అర్ధరాత్రి వేళ ఎవరినీ అనుమతించకుండా, ఎందుకు కూల్చివేస్తుందన్న రేవంత్ లా పాయింట్.. అటు తిరిగి, ఇటు తిరిగి హైకోర్టులో.. జర్నలిస్టులకు అనుమతివ్వాలని కోరే వరకూ వచ్చింది! అయినా…  సర్కారు పాలిసీ.. ‘సర్వేజనా సుఖినో భవంతు’ అయినప్పుడు, భవంతుల కూల్చివేతపై ఇక రంధ్రాన్వేషణ ఎందుకు?…. మీకు అర్ధమవుతోందా?