హన్నా..స్వరూపానందులపైనే విమర్శలా ?

265

ఎమ్మెల్యే వాసుపల్లికి ఎంత ధైర్యం?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లు.. కోవిడ్‌పై వైద్య కోవిదులు-ఏపీ సీఎం జగనన్న కిందా మీద పడుతుంటే.. అసలు దానితో ఎలాంటి సంబంధం లేకుండా, తన మానాన తానేదో చాతుర్మాస్య దీక్ష చేసుకుంటున్న శారదా పీఠాధిపతి  స్వరూపానంద సరస్వతి వారి మీద పడటం అన్యాయం, అక్రమం. అక్కడికేదో.. కరోనా భూతం,  విశాఖ స్వామి వారు చెబితే వినేటట్లుగా విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్  వెక్కిరించడం అన్యాయం. ఇది అపర బ్రహ్మ, విశ్వామిత్ర-వశిష్ఠ రాజర్షులు, దేవర్షులు, ఆదిశంకరుల అంశలో.. చినముషిడివాడలో వెలియడం ఆంధ్రుల అదృష్టం. వాసుపల్లి వ్యాఖ్యలు.. పురప్రజలు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల, విశాఖలోనే పుట్టిన స్వరూపానందుల వారిని అవమానించినట్లే.

అవునండీ.. మే 5వ తేదీ నాటికల్లా కరోనా తగ్గిపోతుందని స్వామి వారు చెప్పారే అనుకోండి. కాలం, ఖర్మం కలసిరాకనో, గ్రహాలు అడ్డంపడో, రాశులు క్రమశిక్షణ పాటించకపోవడం వల్లనో, అసలు ప్రజల తలరాత బాగోలేకనో.. స్వామి వారి మాట క రోనా వినలేదనుకోండి. అహ.. కాసేపు అనుకోండి! పక్కనే  ఆ చైనా స్వామి, వదిలిన కరోనా భూతమే ప్రపంచాన్ని ఆవహించిందనుకోండి. ఉత్తిగనే.. కాసేపు అలా అనుకోండి!! అంతమాత్రాన, స్వామి వారు చెప్పిన తేదీకల్లా, కరోనా పారిపోనంత మాత్రాన నెపం కలియుగ ఆదిశంకరుల మీద తోసెయ్యడమేనా? ఆ భయానికి స్వామి వారు పీఠానికి తాళమేసుకున్నారనడమేనా? విశాఖలో గ్యాసు లీకయి 13 మంది చనిపోయి, లెక్కలేనంతమంది ఆసుపత్రి పాలయ్యారు. అది వారి  ప్రారబ్ధం. అంతమాత్రాన.. స్వాములోరు విశాఖలో ఉండగనే, మృత్యుదేవత ఆ సిటీకి ఎలా వచ్చింది? అక్కడికి రావడానికి దానికెన్ని గుండెలు? దానిని ఆయన  అడ్డుకుని, జనాలను ఎందుకు కాపాడలేదన్న బుర్రా- బుద్ధీ లేని ప్రశ్నలు వేయడం తప్పు కదూ?  ముఖ్యమంత్రులు అనేక హామీలిస్తుంటారు. అంతమాత్రాన అవన్నీ చేసేస్తారా? స్వామి వారి పలుకూ అంతేనని ఎందుకనుకోరు?

పైగా.. స్వామి వారిని రెండవ ముఖ్యమంత్రి అని విమర్శిస్తారా? ఆయనెక్కడా? జగనన్న ఎక్కడా? చిన్నంతరం పెద్దంతరం ఉండక్కర్లా? ఏదో స్వామి వారు ముచ్చటపడి, తన ఆశ్రమం వద్ద పోలీసు అవుట్ పోస్టు పెట్టించుకున్నారనుకోండి. రాజర్షి, రాజగురువులకు ఆపాటి భద్రత, బిల్డప్పూ లేకపోతే  ఏలిన వారికే నామర్దా కదూ?! పదవులపై ప్రేమతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ, నాయకులు ఆయన ఆశ్రమానికి వచ్చి వెళుతూ, పీఠాన్ని  పావనం చేస్తున్నారే అనుకోండి. ఏదోస్వామి వారు, పూర్వాశ్రమంలో తనకు సేవ చేసిన వారికి.. శిష్య పరమాణువైన జగన్‌బాబుకు సిఫార్సు చేసి, కొన్ని పదవులు ఇప్పించుకున్నారే అనుకోండి. ఇంకా ఇప్పించుకోవలసిన జాబితా చాంతాడంత ఉందే అనుకోండి. ఏం? ఇప్పించుకోకూడదా? ఒక సాధారణ నాయకుడిని, పాలకుడిగా మార్చినందుకు ఆమాత్రం గురుదక్షణ కోరుకోకూడదా?  సాధారణ స్వామి నుంచి, వీవీఐపీ స్థాయికి వచ్చిన గురువుగారి కోరికలో తప్పేముంది? ఆయన కూడా మనిషే కదా?!

స్వామి వారు.. జగనన్నతో పుష్కరస్కానాలు, యాగాలవీ చేయించారనే అనుకోండి. అంతమాత్రాన ఆయనేమైనా ఢిల్లీ చంద్రస్వామిలా, పవర్‌ఫుల్లు స్వామి అయిపోతారా? ఇది అన్యాయం కాక మరేమిటి? స్వామి వారి పీఠం కడు పేదరికంలో ఉన్నందుకే కదా.. శంషాబాద్‌లో ఎకరం భూమి, రెండు రూపాయలకే కేసీఆర్ సర్కారు ఇచ్చింది? రిషీకేష్ వెళ్లేందుకు చేతిలో  చిల్లిగవ్వలేకనే కదా.. పరమాచార్య పంథాలో కాలినడకన వెళ్లింది? ఈరోజుల్లో కూడా అలాంటి పాదయాత్రలు చేసే పరమాచార్యులెవరుంటారు? ఈ దేశంలో విమానాల్లో వెళ్లని, ఏకైక సర్వసంగ పరిత్యాగి ఆయనకొక్కరే కదా? ధర్మాన్ని నాలుగుపాదాలా, హిందూ సంస్కృతిని అరవైనాలుగు పాదాలా నడిపిస్తున్న పూజ్య గురువులపై.. అంతలేసి నిందలేయడానికి,  ఒక సాధారణ ప్రజాప్రతినిధయిన వాసుపల్లికి  నోరెలా వచ్చింది? అసలాయనది హృదయమేనా?

ఒక్క కరోనాపై ఇచ్చిన డెత్‌లైన్ మిస్సయినందుకే,  స్వామి వారి మహిమలు ఆవిరయిపోయినట్లు భ్రమ పడకండి. ఆయన కఠోర తపస్సు, దీక్షకు చంద్రబాబునాయుడు వంటి.. రాజకీయ ఐరావతమే కుప్పకూలిపోయి, జగన్మోహన్‌రెడ్డి పాలకుడి అవతారమెత్తారు. ఇక కరోనా ఎంత? స్వామి వారి మహిమాన్విత శక్తితో పోలిస్తే, కరోనా అనేది సముద్రంలో కాకిరెట్టంత! కానీ.. ఎందుకో స్వామివారు సరిగా మనసుపెట్టడం లేదంతే!!