రాజుకు అమరావతి రైతుల పాలాభిషేకం
టీవీ5 శాస్త్రి తీరుపై కమలదళాల కన్నెర్ర
ఆయనకు పార్టీతో సంబంధం లేదన్న విష్ణువర్దన్‌రెడ్డి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇద్దరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారే. అందులో ఒకరు ప్రజాప్రతినిధి. మరొకరు టీవీ డిబేట్లలో మాత్రమే కనిపించే మేధావి. కానీ ప్రజలు ప్రజాప్రతినిధికే పాలాభిషేకం చేస్తుంటే, టీవీ డిబేట్లలో కనిపించే మేధావితో తమ పార్టీకి సంబంధం లేదని ఓ రాజకీయ పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని పోరాడుతున్న, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కథ ఇది. అందులో ఒకరు యుశ్రారైకా ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజయితే, మరొకరు ‘టీవీ 5 శాస్త్రిగా ప్రచారంలో ఉన్న  భీమవరం ఆర్ధిక మేధావి జీవీఆర్ శాస్త్రి! ఆ కథేమిటో చూద్దాం రండి.

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ.. భీమవరం యుశ్రారైకా పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తాజాగా రాష్ట్రపతి కోవిందుకు వినతిపత్రం సమర్పించడం చర్చనీయాంశమయింది. ఎందుకంటే ఇది పక్కాగా జగనన్న అభీష్ఠానానికి వ్యతిరేక చర్య. ఆయన కలలు కంటున్న, మూడు రాజధానుల ఆలోచనలకు గొడ్డలిపెట్టు. రఘురామకృష్ణంరాజు చర్యపై ఆయన పార్టీ అగ్గిమీద గుగ్గిలమవుతుండగా, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఉద్యమిస్తున్న రైతులకు మాత్రం రామరాజు వైఖరి సంతోషం కలిగించింది. అందుకే వారంతా రఘురాముడు చర్యను సమర్థిస్తూ, ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు.  దళిత రైతు పులి చిన్నతో పాటు, అక్కడి దళితులు పాలాభిషేకం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక అదే పని.. దాదాపు రోజులో సగభాగం, టీవీ 5 చర్చల్లో కనిపించే ‘ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి… ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త, విశ్లేషకుడు’ అనే భీమవరం వ్యక్తి కూడా చేశారు. టీవీ 5 చర్చల్లో ఎక్కువగా కనిపిస్తూ, లైవ్‌లో ఉన్న వారిని ఇంగ్లీషులో గద్దించి మాట్లాడే ఆ శాస్త్రి గారే ఈ శాస్త్రిగారు!  ఆయన,  ఇదే అంశంపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం.. దానిపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించి.. మిగిలిన అంశాలు కూడా తెలియచేయండని కోరడం జరిగింది. సరే.. ఎలాగూ శాస్త్రిగారు మూర్తి అండ్ సాంబశివరావు నిర్వహించే, టీవీ 5 చర్చాగోష్టిలో ఆస్ధాన శాశ్వత  సభ్యుడే కాబట్టి, ఆ చానెల్ రోజంతా టెలికాస్ట్ చేసింది. జగన్ వ్యతిరేక విధానాలను అజెండాగా తీసుకున్నందున, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కూడా అదే పనిచేసింది. అది సహజం కూడా.  అన్నట్లు.. మూర్తి గానీ, వెంకటకృష్ణ గానీ, సాంబశివరావు గానీ.. చర్చల్లో ఎదుటివారు అడ్డురాకుండా,  శాస్త్రిగారిని ఇతోథికంగా ప్రోత్సహిస్తుంటారు కూడా. ఒక్కోసారి వారు కూడా శాస్త్రిగారి మాదిరిగానే, కోర్టులో వాదించినట్లు వాదించే దృశ్యాలు కనిపిస్తుంటాయి.   దానిపై ఇప్పటికే బీజేపీ కార్యదర్శి విల్సన్, వైసీపీ నేత కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేశారనుకోండి. అది వేరే విషయం!  అంతటి  శాస్త్రి గారి లేఖతో ఉలిక్కిపడి, కదిలిన దేశ ప్రధాని కార్యాలయం.. అమరావతిపై ఆరా తీసిందంటూ, బ్రేకింగులతో ఊదరగొట్టాయి. చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి.

అంతవరకూ సంతోషమే. కానీ మిగిలిన చానెళ్లు ఎందుకో శాస్త్రిగారి పనితనాన్ని, ప్రతిభను, ఢిల్లీలో ఆయనకున్న పరిచయాలను అసలు గుర్తించినట్లు లేదు. బహుశా.. టీవీ5 ప్రేక్షులకు మాత్రమే ఆయన ప్రతిభ పరిమితం అనుకున్నారు కామోసు! కానీ, కమలదళాలే దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు ఆ శాస్త్రి గారికి-బీజేపీ-ఆరెస్సెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, స్వయంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేంద్ర సహాయమంత్రి హోదా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డి స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. ‘‘ఢిల్లీలో బీజేపీ పేరు చెప్పుకునే లక్షమందిలో, శాస్త్రి అనే వ్యక్తి లక్షా ఒకరని’’ అభివర్ణించడాన్ని.. శాస్త్రిగారు-ఆయన ప్రతిభను నిరంతరం వెలికితీసే, టీవీ 5 అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

దీనితో టీవీ 5 డిబేట్లు చూసే అభిమానులు మనస్తాపం చెందారు. విష్ణువర్దన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ నద్దా, పీఎంఓకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి, ఏపీ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లే శాస్త్రి గారికి,  బీజేపీతో సంబంధం లేదని ఎలా అంటారని కారాలుమిరియాలు నూరుతున్నారు. సంఘ్‌తో సంబంధాలున్న వ్యక్తిని పట్టుకుని.. అసలు బేజీపీకి గానీ, సంఘ్‌కు గానీ సిద్ధాంతకర్తలు లేరని  విష్ణు చెప్పడం, టీవీ 5 చూసే శాస్త్రి అభిమానులకు సుతరామూ రుచించడం లేదు. అంతమాట అనడానికి విష్ణుది గుండెనా? చెరువా? అని మండిపడుతున్నారు.

ఒక ‘ప్రముఖ ఆర్ధిక శాస్తవేత్త’ను అలా అనడం మంచిదికాదని, ఆయన రాసిన లేఖకు పీఎంఓనే స్పందించిందంటే.. ఆయన మేధస్సు, పరిచయాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చని హితవు చెబుతున్నారు. పీఎంఓ వంటి ఉన్నత కార్యాలయమే, అమరావతికి సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని అభ్యర్ధించిందంటే.. శాస్త్రి గారి మేధస్సు గురించి అంచనా వేసుకోవాలంటున్నారు.
అయితే.. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి మాత్రం.. ‘‘జీవీఆర్ శాస్త్రి అనే ఆయన, అమరావతి ఉద్యమ పరిరక్షణ కమిటీకి  లోకేష్, చంద్రబాబునాయుడు నియమించుకున్న వ్యక్తి. ఢిల్లీలో ఏదో వ్యవహారాలు నడుపుతాడని ఆయనను పెట్టుకున్నారు. చంద్రబాబు ఆయనను ఢి ల్లీలో టీడీపీ వ్యవహారాలు చూసుకునేందుకు  నియమించుకున్నారు తప్పితే, శాస్త్రిగారికి బీజేపీకిగానీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో గానీ, సంఘపరివారంతో గానీ ఎలాంటి సంబంధం లేదు.

ఇటీవల ప్రచారం జరుగుతున్నట్లు  శాంతాసిన్హాకు గానీ మాకు సంబంధం లేదు. మాకు డాక్టర్ హెడ్గేవార్ తప్ప, మరో  సిద్ధాంతకర్త లేరు. జీవీఆర్ శాస్త్రి అనే వ్యక్తి ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసే అవకాశం లేదు. ఆయన గురించి పెద్దగా చర్చించడం కూడా అనవసరం. ఢిల్లీలో మా పార్టీ పేరు లక్షమంది వాడుకుంటుంటున్నారు. శాస్త్రిగారు లక్షా ఒకటోవ్యక్తి’ అని సాక్షి టీవీలో విష్ణువర్దన్‌రెడ్డి.. ‘కొమ్మినేని లైవ్‌షో’లో కుండబద్దలు కొట్టడం.. అటు శాస్త్రి అభిమానులకు, ఇటు ఆయన కార్యక్రమాలను పర్మినెంటుగా తిలకించే, టీవీ 5 అభిమానులకు గానీ ఏమాత్రం నచ్చడం లేదు.

అఖిల భారత హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ ఏపీ కన్వీనర్ హోదాలో… ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా, ఢిల్లీలో పెద్దలను కలవగలిగే ఆయన స్ధాయిని,  విష్ణువర్దన్‌రెడ్డి కించపరచడంపై శాస్త్రి-టీవీ 5 అభిమానులు జమిలిగా కుమిలిపోతున్నారు. అటు భీమవరంలో అయితే, ఆయనతో పాటు బీకాం చదివిన సహచరులు కూడా, విష్ణువర్దన్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. భీమవరం కాలేజీ నుంచి అమెరికాలో ఉన్నత విద్య చదివి, ప్రముఖ ఆర్ధికశాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకుడిగా దేశస్థాయిలో పేరు తెచ్చుకున్న తమ సహచరుడికి.. భాజపా-సంఘపరివారంతో సంబంధం లేదనడం వారిని బాధించింది. అన్నట్లు.. ఢిల్లీలో తెలుగురాష్ట్రాల బీజేపీ సమన్వయకర్తయిన, పురిఘళ్ల రఘురాం కూడా… శాస్త్రిగారు చదివిన కాలేజీలో సహచరుడు కావడం విశేషం. ఢిల్లీలో సాకేత్‌కు వెళ్లి శాస్త్రి గారు చెబితే,  తెలియని వారుండరని ఆయన మిత్రులు చెబుతున్నారు. అప్పట్లో ఆయన తన ఇంటి కోసం చాలా పోరాటాలు చేశారట!

By RJ

Leave a Reply

Close Bitnami banner