14 నెలలు.. 75 చీవాట్లు!

354

శరపరంపరగా జగనన్న సర్కారుకు శరాఘాతాలు
నవ్విపోదురుగాక..నాకేటి….?
నాలుగో నెంబరు సీఎంకు నగుబాటు
సలహాదారులు, న్యాయసలహాదారులు ఉన్నారా?
(మార్తి సుబ్రహ్మణ్యం0 9705311144)

ఆయన దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రులలో నాలుగో వ్యక్తి. ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఓ ప్రైవేటు సర్వే సంస్ధ. కానీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ.. ఆయన పాలనపై ఇస్తున్న తీర్పులు, చేస్తున్న దారుణ వ్యాఖ్యలు చూస్తుంటే.. సదరు ప్రైవేటు సర్వే సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్టును శంకించక తప్పదు. పాత పాలకుడి మాదిరిగా ‘మేనేజ్‌మెంట్’ వ్యవహారంపై డౌటనుమానం రాకతప్పదు. ఎందుకంటే.. ఒకటా? రెండా? 14 నెలల పాలనలో 75 చీవాట్లు. తలదించుకోవలసిన వ్యాఖ్యలు. అయినా.. ఆ నాలుగో నెంబరు సీఎంకు ఇదంతా నగుబాటు అనిపించడం లేదు. అవి తన పాలనాతీరుపై పడుతున్న మచ్చగా భావించడం లేదు. అవి పరోక్షంగా తనకే ఈటెల్లా తగులుతున్నాయనుకోవడం లేదు. పైగా.. రెట్టించిన ఉత్సాహంతో, తప్పు మీద తప్పులు, ధిక్కరణ మీద ధిక్కరణలు. ఆయన ఉత్సాహానికి సీఎస్, డీజీపీ కోర్టు మెట్లెక్కుతున్న దుస్థితి. పాలనకు రెండు కళ్లయిన ఆ ఇద్దరు కోర్టు గుమ్మమెక్కితే, దానిని అవమానంగా భావించని పాలకుడాయన! పైగా.. కోర్టులు- జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను, కాపాడతామని చెప్పిన నాయకుడికి అధినాయకుడాయన!! నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో అనవసర ప్రతిష్ఠకు పోయి, తలబొప్పి కట్టించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ చర్యలు.. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో, ప్రజల ముందు తలదించుకునేలా మారాయి. ఈవిధంగా.. కోర్టుల నుంచి,  శరపరంపరగా శరాఘాతాలకు గురవుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే!

‘‘ న్యాయ సలహాదారులు ప్రభుత్వానికి సరైన సలహాలివ్వడం లేదు. సరైన సలహాలివ్వకుండా కోర్టులను నిందిస్తే ఫలితమేమిటి? వాళ్ల వల్లే ఉన్నతాధికారులూ కోర్టులో నిలబడాల్సి వస్తోంది. విషయం చిన్నదయినా, మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందంటే పరిస్థితి గ్రహించండి. డీజీపీగా ఉండి మాతో చెప్పించుకుంటే ఎలా? 151 సెక్షన్ కింద విపక్ష నేత అరెస్టు సరైనదేనా? న్యాయపాలన చేయాల్సింది ఇలాగేనా?’’
– ఓ కేసులో డీజీపీని కోర్టుకు పిలిపించినప్పుడు, హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. ఆ సందర్భంలో విపక్షనేతకు, ఆ  నోటీసు ఇవ్వడం తప్పేనన్న సవాంగ్‌తో ఆ సెక్షన్‌ను కోర్టు చదివించింది.

‘‘ రాష్ట్రంలో చట్టబద్ధ నిబంధలు అమలవుతున్నాయా? అసలిది రాష్ట్రమేనా? మరేదైనానా? ప్రభుత్వాలు వస్తాయి. పోతాయి. కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఎలా? మీరు ఈ రాష్ట్రానికే డీజీపీ. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం మీ బాధ్యత. పోలీసుల చర్యలు హద్దు మీరుతున్నాయి. ఇలాగైతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాం. మిగతాది కేంద్రం చూసుకుంటుంది. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని, ఇళ్ల స్థలాలుగా మార్చి వేరొకరికి ఇచ్చే అధికారం మీకెక్కడిది? ఇళ్ల స్థలాల కోసం మీ జేబులో నుంచి ఇవ్వండి. అభివృద్ధి పనులు మరచి ఈ పింపిణీలేమిటి? భూములు అమ్మాల్సిన అవసరమేమిటి? ప్రభుత్వం దివాలా తీసిందా? వన్‌సైడ్ గేమ్ ఆడతానంటే కుదరదు. అసైన్డ్‌భూములలో పోలీసులకేం పని?’’
– ఇవి కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు తీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే.

‘‘ఏబీ వెంకేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు. ప్రభుత్వ ఉత్తర్వులు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. కక్ష తీర్చుకునేందుకో, ఏకపక్షంగానో సస్పెండ్ చేయకూడదు. డిప్యూటీ పోలీసు సూపరెంటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, సస్పెన్షన్ చేయడానికి వీలులేదు. తగిన వివరాలు లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’
– ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి.

‘‘ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? లేదా? మీకు రాజకీయాలు కావాలంటే ఖాకీ దుస్తులు తీసి రాజకీయాల్లోకి వెళ్లండి. మీరున్నది పొలిటికల్ బాసుల కోసం కాదు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, మేం చేయాల్సింది మేం చేస్తాం. అర్ధరాత్రి లాయర్ ఇంటిపై దాడి చేయాల్సిన అవసరమేమిటి?’’
– కొద్దిరోజుల క్రితం హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్య

‘‘ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? గవర్నర్ ఆదేశాలిచ్చినా ఎందుకు అమలు చేయడం లేదు? గవర్నర్ సలహాలివ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జడ్జీలను, జడ్జిమెంట్లను ఎటాక్ చేస్తున్న క్లిప్పింగులను ఇవ్వండి. ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వడం లేదు. గవర్నర్ లేఖ పంపినా రమేష్‌కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం దారుణం. కోర్టుతోపాటు, గవర్నర్‌తో కూడా చెప్పించుకోవాలా? హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే, అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది’’
– నిమ్మగడ్డ రమేష్ ను, తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంపై.. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలివి.

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న, అనేక ఏకపక్ష నిర్ణయాలు ఈవిధంగా న్యాయస్థానాల్లో వరసగా ఎదురుదెబ్బ తగులుతున్నాయి. అయినా, జగన్ సర్కారులో ఎలాంటి మార్పు రాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సహజంగా ఏ ముఖ్యమంత్రయినా..  ఇలాంటి ప్రతికూల తీర్పులు ఎదుర్కొన్నప్పుడు నైతిక బాధ్యత వహించి, రాజీనామా చేస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మెడికల్ కాలేజీల వ్యవహారంలో అదే పని చేశారు. ఆ పనిచేయకపోతే, కనీసం న్యాయసలహాదారులు, అధికారులను తొలగిస్తారు. ఈ రెండింటిలో జగన్మోహన్‌రెడ్డి ఇప్పటిదాకా ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం.

కానీ, గవర్నర్ వద్దకు వెళ్లిన ఓ కేసు, సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు.. అక్కడ పర్యవసానాలు ఎలా ఉంటాయో, ఊహించలేని న్యాయాధికారులను జగన్మోహన్‌రెడ్డి కొనసాగించడమే విచిత్రం. శరపరంపరగా ఇన్ని శరాఘాతాలు తగులుతున్నా, ఇంకా వారినే కొనసాగించడం మరో వైచిత్రి.  నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై గతంలోనే ఒకసారి, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మళ్లీ హైకోర్టు తీర్పుపై.. స్టేకు వెళ్లేందుకు న్యాయ సలహాదారులు ప్రయత్నిస్తే, దానిని  సహజంగా ఏ ముఖ్యమంత్రయినా నిలువరిస్తారు. కానీ, నిమ్మగడ్డ వ్యవహారంలో.. న్యాయసలహాదారులను, జగన్మోహన్‌రెడ్డే ప్రోత్సహించారా? లేక న్యాయసలహాదారులే, ఆయనను తప్పుదోవపట్టించారా? ఈ రెండు కాకుండా.. ‘ఏదయితే అదవుతుంది. కొత్తగా పోయే పరువువేం ఉందని’ తెగించి, మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారా? అన్నది ‘జగన్నా’ధుడికెరుక?ఇది కూడా చదవండి: 11నెలలు..55 అక్షింతలు!