సరిలేరు నీకెవ్వరూ..

303

బాధితులతో భోజనం చేసిన కేసీఆర్
భయపెట్టిన వారితోనే బంతిభోజనం
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ముఖ్యమంత్రి. తెరాస అధ్యక్షుడిగానే కాదు. పాలకుడిగా, పార్టీ అధినేతగా  కూడా ఆయన వ్యూహాలు ఎవరికీ అర్ధం కావు. ఆయన ఎత్తుగడ అంచనా వేయడం కూడా అంతే కష్టం. ఆయనకు ఎప్పుడు ఎవరిమీద ఆగ్రహం, ఎవరిపై అనుగ్రహం వస్తుందో ఎవ రికీ తెలియదు. ఇష్టం లేకపోతే ఎవరితో మాట్లాడరు. సమస్యల్లో ఉంటే, కొద్దికాలం వ్యూహాత్మక మౌనం పాటిస్తారు. తర్వాత తనకు తనే అవకాశం సృష్టించుకుని మళ్లీ తెరపైకొస్తారు. గెరిల్లా యుద్ధసూత్రం ఆయనను చూస్తే గుర్తుకొస్తుంటుంది. అందుకే ఆయనో విలక్షణ వ్యక్తి. రాజకీయాల్లోనయినా, సాధారణ జీవనం విషయంలోయినా!

నిండు సభలో కాంగ్రెస్‌ను చీల్చి చెండాడే సమయంలోనే, ‘పెద్దలు, గౌరవనీయులు జానారెడ్డి గారు చెప్పినట్లు’ అని ఆయన సమక్షంలోనే ఆకాశానికెత్తేస్తారు. ఆయనకు ఎనలేని గౌరవం ఇస్తారు. ‘కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది. 108 వాహనాలు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం నేను స్వయంగా చూశా. హైటెక్ సిటీలో చంద్రబాబు గొప్పతనమేమీ లేదు. అది నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి గారుండగా కేటాయించారు. మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఇది ఒప్పుకుని తీరాలి. నిజాలను అంగీకరించాలి’ అని అదే నిండుసభలో కుండబద్దలు కొడతారు. ఇష్టం లేని, ఇరుకున పెట్టే ప్రశ్నలేస్తే జర్నలిస్టులనూ వదిలిపెట్టరు. ‘అయితే ఏం జేద్దామంటవ్’ అని వెటకారంగా ఎదురు ప్రశ్నించి, మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా చేస్తారు. మధ్యలో బోలెడన్ని ఛలోక్తులు విసురుతారు. అసలు కేసీఆర్ ప్రెస్‌మీటంటేనే అదో అనుభవం.

కొన్ని అంశాలపై స్థిరంగా, అత్యంత  కఠినంగా వ్యవహరించే కేసీఆర్, అందులో కూడా మానవీయ కోణం దర్శిస్తారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేశారు. అది తెలంగాణ రాష్ట్రమొక్కటే కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ రికార్డు. ఆ సమయంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకొచ్చాయి. కార్మికులకు దన్నుగా నిలిచారు. ఇంకేముంది? కేసీఆర్ పనయిపోయిందనుకున్నారు. జనంలో వ్యతిరేకత పెరిగిపోయిందని అంచనా వేశారు. ధర్నాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆ సమయంలో  మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తప్ప.. కేటీఆర్, హరీష్ సహా ఏ ఒక్క మంత్రీ ఆర్టీసీ సమ్మెను, సమర్ధించే సాహసం చేయలేకపోయారు. అప్పుడు కూడా కేసీఆర్ పెదవి విప్పలేదు.

చివరకు కోర్టు సైతం వారి సమస్యలను సానుభూతితో చూడాలని, రాజు కుటుంబపెద్దగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి కూడా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అయినా కేసీఆర్ కరగలేదు. 52రోజుల తర్వాత సమ్మె విరమించిన, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. అయితే.. సమ్మెలో పాల్గొని, కేసీఆర్‌పై కారాలు మిరియాలు నూరిన అదే ఆర్టీసీ ఉద్యోగులను, డిపోల వారీగా కొందరిని ఎంపిక చేసి మరీ, తన ఇంటికి విందు ఇచ్చిన కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. తలకాయకూర, చికెన్, మటన్, ఫిష్, గోంగూర మటన్ వంటి షడ్రసోపేత విందు ఇవ్వడంతో, వారంతా కేసీఆర్ అతిథిమర్యాదలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కేసీఆర్‌లోని  కరుణ-రౌద్ర రసానికి ఇదో ఉదాహరణ.

తాజాగా దేశ సరిహద్దులో, చైనా ముష్కరుల దాడిలో తలవాల్చిన సూర్యాపేటకు చెందిన, కల్నల్ సంతోష్ మృతదేహం హైదరాబాద్‌కు వచ్చింది. గవర్నర్ తమిళసై ఎయిర్‌పోర్టుకు వెళ్లి, మృతదేహానికి సెల్యూట్ చేశారు. మంత్రి కేటీఆర్ సహా, విపక్షనేతలు వెళ్లి నివాళులర్పించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వెళ్లకపోవడం, సహజంగానే విమర్శలకు గురయింది. ‘తెలంగాణ బిడ్డ దేశం కోసం చనిపోతే వెళ్లరు గానీ, ఆంధ్రా సినిమా వాళ్లు చనిపోతే అక్కడికి వెళ్లి పరామర్శిస్తారం’టూ విమర్శలు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల తర్వాత.. అదే కేసీఆర్.. స్వయంగా సంతోష్ నివాసానికి వెళ్లి  2 కోట్ల నగదు ఇచ్చి, సంతోష్‌బాబు భార్యకు కోరుకున్న ఉద్యోగం ఇస్తామన్నారు.  ఏ ఉద్యోగం కావాలో కోరుకుంటే, తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత, నియామకపత్రం ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ విమర్శకులు, దానినో ఉత్తి హామీగా కొట్టిపారేశారు. అది వేరే విషయం.

కానీ, బుధవారం సంతోష్ కుటుంబసభ్యులను దాదాపు 20 మందిని తన ఇంటికి పిలిపించి, వారితో కలసి భోజనం చేశారు. ప్రగతిభవన్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా, కేసీఆర్ తన సీటులోనే కూర్చుని వారితో మాట్లాడుతుంటారు. కానీ సంతోష్‌బాబు భార్య, తల్లి తన ఇంటికి వచ్చినప్పుడు..తాను కూర్చునే సీటుతోపాటు, తన పక్కనే ఉండే అలాంటి మరో సీటులో కూడా వారిద్దరినీ కూర్చోబెట్టారు. తాను మాత్రం సాధారణ కుర్చీలోనే కూర్చుని, వారితో ముచ్చటించారు. ఈ దృశ్యం అక్కడి వారిని విస్మయపరిచింది. తర్వాత సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగమిచ్చి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో.. 716 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. ఆమె కుదురుకునేంతవరకూ,  ఆమె బాగోగులు స్వయంగా చూసుకోవాలని, తన కార్యదర్శి స్మిత సభర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇలా..హాస్య-కరుణ-రౌద్ర-వీర-శాంత-బీభత్స-భయానక-అద్భుత రసాలు కలగలసి ఉన్న లక్షణాలు, ఒక్క కేసీఆర్‌లోనే కనిపిస్తుంటాయి. బహుశా దేశంలో ఏ పాలకుడిలోనూ ఇన్ని విభిన్న లక్షణాలు కనిపించవేమో?!