చెబితే వింటివ.. గురూ గురూ!

482

సీఎం జగన్ స్వయంకృతం
తలంటున్న న్యాయస్థానాలు
హెచ్చార్సీపైనా మొట్టికాయలు
శిరోముండనం, కిడ్నాప్‌లతో అప్రతిష్ఠ
కోర్టు మెట్టెక్కుతున్న డీజీపీ, సీఎస్, ఎస్పీలు
నాలుగో నెంబరు సీఎంకు ఇదేం నగుబాటు?
              (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయనకు దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులలో నాలుగో వ్యక్తిగా పేరొచ్చింది. దానికి తీసుకున్న ప్రాతిపదక ఏమిన్నది పక్కకుపెడితే.. ఆయన అత్యుత్తమ సీఎంలలో నెంబర్ ఫోర్. అంతే! మరి అలాంటి అత్యుత్తమ సీఎం పనితీరు, నిర్ణయాలు కూడా అంతే ఉత్తమంగా, జనరంజకంగా, అందరినీ మెప్పించేలా ఉండాలి కదా? మరి ఏదీ…? దాదాపు 70 సార్లు హైకోర్టులో ఎదురుదెబ్బలు. దారుణమైన వ్యాఖ్యలు. పోనీ సుప్రీంకోర్టులో ఏమైనా భేషుగ్గా ఉందా అంటే.. అక్కడా చుక్కెదురేనాయె! హైకోర్టు తీర్పులనే ఖరారు చేయని పరిస్థితి. ఆయన దెబ్బకు డీజీపీ, సీఎస్, ఎస్పీలు, ఐఏఎస్‌లు తలవంచుకుని అవమానభారంతో కోర్టు మెట్టెక్కుతున్న దుస్థితి. చివరాఖరకు మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేయమని, నాలుగు నెలలు గడువిచ్చి ఇన్ని నెలలయినా ఇప్పటికీ దిక్కూ మొక్కూ లేదు. వరస వరస వెంట ధిక్కరణలు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో చివరకు, గవర్నర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇలా బేఖాతరు పర్వం విజయవంతంగా సాగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుంటే బాగుండేది. అది జగనన్న రాష్ట్రం పాలిస్తున్న రాష్ట్రం కాకుంటే బాగుండేది. కానీ.. ఇప్పుడు చెప్పినవి, జరుగుతున్నవన్నీ  అక్షరాలా అక్కడ జరుగుతున్నవే!

జగన్మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమం ఎంత స్పీడుగా అమలవుతోందో.. అంతే స్పీడుగా కోర్టు ధిక్కారపర్వం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా అంతే స్పీడుగా సాగుతోంది. తాజాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వేసిన ధిక్కరణ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. వెంటనే ఆయనను గవర్నర్ వద్దకు వెళ్లి, వినతిపత్రం సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు ఆయన గవర్నర్ వద్దకు వెళ్లడం, అందుకు స్పందించిన గవర్నర్, నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిపోయింది. అసలు పిటిషనర్ కోర్టు ధిక్కరణ కేసు వేసేంతవరకూ ఆగకుండా, ప్రభుత్వమే దిద్దుబాటుకు దిగి తిరిగి పోస్టింగ్ ఇస్తే హుందాగా ఉండేది. రాజకీయపరమైన ఆరోపణలు పక్కకుపెడితే, సమర్ధుడైన అధికారిగా పేరున్న సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు,  పోస్టింగు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా అదే నిర్లక్ష్యం. దానితో ఆయన సుప్రీంకోర్టులో  కేవియట్ వేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ పోస్టింగులు ఇవ్వకుండా కాలయాపన చేసే చట్టపరమైన ఎత్తుగడ అని మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

తాజాగా నిజాయితీపరుడు, సమర్థుడైన ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ వ్యవహారమూ అంతే. తమకు సరిపడని వారికి శిక్షలు విధించేందుకయినా ఒక పరిమితి, హద్దు ఉంటుంది. సాధారణంగా అయితే, కొత్త ప్రభుత్వం వస్తే  అలాంటి వారికి లూప్‌లైన్ పోస్టింగులిస్తుంటాయి. అయితే ఏపీలో మాత్రం, అసలు వారు తన పాలనలో ఉండకూడదన్న మొండితనం కనిపిస్తోంది. ఇలాంటివి  పాలకుడి పాలనకు, ఏమాత్రం  శోభనివ్వవు. ఎందుకంటే.. వారంతా అఖిల భారత సర్వీసుకు చెందిన వారు. తాను ఇష్టానుసారం నియమించుకున్న సలహాదారులు కాదు. సీఎంలు ఉద్యోగాలిచ్చిన వారు కాదు.

 ఆ విషయం సీఎంకు నచ్చచెప్పే ధైర్యం ఉన్న అధికారులెవరూ ఏపీలో లేకపోవడం, అలాంటి ధైర్యం-శక్తి ఉన్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించడం విచారకరం. సీఎం చెప్పింది చేయడమే తప్ప.. నిబంధనలు, పాత తీర్పులు, రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న అంశాలను కూడా సీఎంకు గుర్తు చేసే స్థాయి అధికారులు లేని రాష్ట్రాన్ని చూస్తే, ఎవరికయినా జాలి వేయకతప్పదు. సీఎస్‌గా పనిచేసిన అజయ్ కల్లం వంటి.. అనుభవజ్ఞుల మౌనం చూస్తుంటే, అలాంటి వారంతా కేవలం,  రిటైరయి మళ్లీ,  ప్రభుత్వ వేతనం కోసమే పనిచేస్తున్నట్లుందన్న విమర్శలలో  తప్పు కనిపించడం లేదు. సీఎంల ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నప్పటికీ, దానిని చట్టం ప్రకారం నడిపించాల్సిన సీఎస్, డీజీపీలు కూడా నిమిత్తమాత్రులుగా మారడం విచారకరం. ఫలితంగా వారిద్దరూ తరచూ  కోర్టు మెట్లెక్కుతూ, అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఇప్పటికి దాదాపు 70 సందర్భాల్లో,  జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీసు వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వారంతా ఏపీని వింతగా, అక్కడ పనిచేసే అధికారుల పట్ల జాలి, సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ఎల్వీని తప్పించినప్పటి నుంచే, ఐఏఎస్-ఐపిఎస్ వర్గాలు ఏపీ వైపు ఆసక్తిగా, విచిత్రంగా  చూడటం ప్రారంభించాయి. పంచాయితీలకు రంగుల విషయంలో కూడా, సర్కారు అభాసుపాలవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది.

తాజాగా  హైకోర్టు.. పోలీసులనుద్దేశించి చేసిన దారుణ వ్యాఖ్యలు, వాడిన పదజాలం, పోలీసుల నిస్సహాయత, పరాధీనతను స్పష్టం చేసింది. దేశంలోనే ఏపీ పోలీసులకు సమర్ధులుగా పేరుంది. అలాంటి సమర్ధతను, కొందరు పోలీసులు అధికారంలో ఉన్న వారికి తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలను.. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రుజువు చేశాయి. ‘బ్యూరోక్రాట్లు, పోలీసులు రాజకీయాలు కావాలనుకుంటే యూనిఫారం వదిలేసి వెళ్లండి. యూనిఫారంలో ఉంటే మాత్రం ప్రజాహక్కులు పరిరక్షించాల్సిందే. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, మా నిర్ణయాలు మేం తీసుకుంటాం. అప్పుడు మిమ్మల్ని ఏ నేతా కాపాడలేరు.  అర్థరాత్రి తలుపులు పగలకొట్టాల్సిన అవసరం ఏమిటి? ఆయనేమైనా నేరస్తుడా? అంత అత్యుత్సాహం ఎందుకు? ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే,  ఇక సామాన్యుల హక్కుల పరిస్థితేమిటన్నది ఊహించుకోగలం. ప్రజలు అధికారులకు జవాబుదారీగా ఉండాలి. డైరెక్ట్ ఎస్పీ అయిన మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న అశ ఉంటుంది. మీకు మరెంతో కెరీర్ ఉంది. మీదైన తరహాలో వ్యవ హరించండి’ అని కోర్టుకు హాజరయిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీనుద్దేశించి, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. కింది స్థాయి పోలీసులు,  అధికారంలో ఉన్న వారి కోసం పనిచేస్తున్నారన్నది చెప్పకనే చెప్పినట్లయింది. ‘మేం ఆదేశాలిస్తే మిమ్మల్ని ఏ నేతా కాపాడలేరన్న’ హెచ్చరికలు దానికి సంకేతంగా భావించక  తప్పదు. సాధారణ ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారుల మాదిరిగా, కొందరు ఐపిఎస్‌లు కూడా అధికారంలో ఉన్న వారి మెప్పు కోసం పాకులాడటమే దౌర్భాగ్యం.

ఒక న్యాయవాది కోసమే, హెబియస్ కార్పస్ దాఖలయిన విచిత్ర పరిస్థితి ఏపీలో నెలకొంది. గతంలో అవుట్‌సోర్సింగ్ కేసుకు సంబంధించి, విశాఖ పోలీసులు విజయవాడకు వచ్చి, పిటిషనర్ పక్షాన వాదించిన న్యాయవాది ఇంటికి వెళ్లి.. బెదిరించిన వైనంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రెడ్డి గౌతమ్  దంపతులను ఎత్తికెళ్లిన ఘటనలో, దాఖలయిన హెబియస్ కార్పస్  పిటిషన్‌పై డీజీపీ, స్వయంగా కోర్టుకు హాజరుకావలసి వచ్చింది. ఇరవైఏళ్ల క్రితం పోలీసులు ఎత్తుకెళ్లిన నక్సలైట్ల ఆచూకీ కోసం, పౌరహక్కుల సంఘాలు హెబియస్ కార్పస్ పిషన్లు వేసేవి. ఇప్పుడు సామాన్యులు కూడా ఆ పిటిషన్లు వేస్తున్నారంటే, పోలీసుల అత్యుత్సాహం  ఎంతవరకూ వచ్చిందో స్పష్టమవుతోంది.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో, ఒక దళిత యువకుడిని ఎస్‌ఐ నాయకత్వంలోనే.. పోలీసుస్టేషన్‌లో  శిరోముండనం చేయించిన ఘటన, కచ్చితంగా పోలీసు ప్రతిష్ఠకు మచ్చనే.  ఆ విషయం బయటకు పొక్కడంతో, రాష్ట్రం వేడెక్కింది. చివరకు ఇది సీఎం జగన్ వరకూ వెళ్లడం, ఆ ఘటనకు కారణమైన ఎస్‌ఐను అరెస్టు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం జరిగిపోయింది. ఈ ఘటనలపై సీఎం జగన్ వెంటనే స్పందించడం, డీజీపీ సవాంగ్ చర్యలు తీసుకోవడం అభినందనీయమే. కానీ, స్థానిక వైసీపీ నేత మెహర్బానీ కోసం, ఓ దళితుడిని గుండుకొట్టించిన ఖాకీచకాన్ని మాత్రం క్షమించకూడదు. తూర్పు ఎస్పీ హైకోర్టులో హాజరయి, అక్షింతలు వేయించుకున్న రోజునే, ఈ ఘటన జరగడం ప్రస్తావనార్హం.  దీన్ని బట్టి.. ఏపీలో మానవ హక్కులు, ఏ స్ధాయిలో  అఘోరిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

దేశంలో మానవ హక్కులకు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసమే,  ప్రతి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటుచేయాలని ఆదేశిస్తున్నాయి. హక్కుల కమిషన్లు తెరచుకుంటే, కోర్టులపై పనిభారం తప్పుతుంది. అది కూడా దానికో కారణం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ, ఏపీలో హక్కుల కమిషన్ ఏర్పడలేదు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా దానికి చొరవ చూపలేదు. సమైక్య రాష్ట్రంలోని హక్కుల కమిషన్ సమర్ధవంతంగా పనిచేసింది. కాకుమాను పెదపేరిరెడ్డి ఇన్చార్జి చైర్మన్ గా ఉన్న కాలంలో, పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం సుమోటోగా తీసుకుని, అధికారులను పిలిపించిన సందర్భాలున్నాయి. అప్పుడు దానికో క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఏపీకి హక్కుల కమిషన్ లేకుండా పోయింది.

విభజన తర్వాత ఉన్న కమిషనే హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఏపీకి చెందిన ఉద్యోగులు కూడా అక్కడే పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం.. ఏపీలో హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని హైకోర్టు ఆదేశిస్తే, జగన్ ప్రభుత్వం రెండు నెలల గడువు కోరింది. అయితే, హైకోర్టు మాత్రం 4 నెలల గడువిచ్చింది. అది ముగిసి ఇప్పటికి రెండునెలలయింది. అయినా పట్టించుకునే దిక్కులేదు.  మళ్లీ దానిపై ధిక్కరణ కేసు. ఇలా ఏ వ్యవస్థనూ ఖాతరు చేయకుండా జరుగుతున్న పాలనను చూసి, ప్రజాస్వామ్యవాదులు నోరెళ్లబెడుతున్నారు.