గవర్నర్‌జీ.. భల్లే భల్లే!

457

ఫాఫం..నిమ్మగడ్డ
        ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బాధిత అధికారి  ఇచ్చిన పిటిషనుపై, తన ప్రభుత్వానికి తానే ఓ లేఖ రాశారు హిజ్ ఎక్స్‌లెన్సీ గవర్నరు గారు.  నిమ్మగడ్డకు రాసిన లేఖ చూస్తే అదే అర్ధమవుతుంది. ఎహె. తన సర్కారుకు తానే లేఖ రాయడమేమిటి? ఆయనేమైనా మామూలోడనుకుంటున్నారా? రాజ్యాంగం కాచివడపోసిన ప్రథమ పౌరుడని ఇంతెత్తున ఎగిరేందుకు సిద్ధమవకండి. ఇది నిఝంగా నిజం!  కావాలంటే నిమ్మగడ్డ రమేష్‌కు ఏపీ గవర్నర్ కార్యదర్శి రాసిన లెటర్ చూడండి. ‘మీ వినతిపత్రాన్ని గౌరవనీయ గవర్నర్‌గారు చదివారు.  ఆ మేరకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు’. ఇదీ.. నిమ్మగడ్డ రమేష్‌కు గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ రూపంలో వచ్చిన జవాబు.

 నో.నో. ఇదంతా పచ్చి మోసం. దగా. మీరు దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. బయట మీడియా, టీవీ చానెళ్లు జగన్‌రెడ్డి సర్కారుకు గవర్నర్  ఝలక్ ఇచ్చారని, కరెంట్ షాకులు పెట్టిందని, జగన్ ప్రభుత్వం పరువు పోయిందని ఊదరగొడుతున్నారు. నారా వారి నుంచి నారాయణ వరకూ ‘ఇది ప్రజాస్వామ్య విజయమని’ ప్రకటనలిచ్చేస్తున్నారు. వాళ్లు ఆ లెటర్ చూడకుండానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారా ఏంటీ? అంతలావు పెద్దోళ్లకు తెలిసిన చట్టం, మీకు తెలియకపోవడమేమిటని అమాయకంగా అడగకండి. నిజంగా పిచ్చోళ్లయిపోతారు.

ఎందుకంటే… అసలు గవర్నరు బిశ్వభూషణుగారేమైనా, నిమ్మగడ్డ రమేష్‌ను తక్షణం విధుల్లోకి తీసుకోండని సూటిగా  ఆర్డరేశారా? లేదు. పోనీ.. నిమ్మగడ్డ వేసిన కోర్టు ధిక్కరణపై మాననీయ హైకోర్టు స్పందించి, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఆదేశించింది కాబట్టి, వెంటనే ఆయనకు తీసేసిన కొలువును మళ్లీ ఇవ్వాలని లౌక్యంగా సీఎస్‌కేమైనా గవర్నరు మహాశయులు ఆదేశించారా? ఉహు. అదీ లేదు. గవర్నరు గారివన్నీ సూచనలే. ఆదేశాలు లేవు. అసలు.. ఎన్నికల కమిషనర్ నియామకం, రాష్ట్ర ప్రభుత్వ పరిథిలో లేదని హైకోర్టు గతంలోనే ఇదే కేసులో చెప్పింది. సో.. తనకు ఆ అధికారం లేనందున, మళ్లీ నిమ్మగడ్డను నియమించే అధికారం గవర్నరుకు లేదన్నట్లే కదా? అసలు ఆ లెక్కన ఆయనను మళ్లీ నియమించాల్సిన పనే లేదు. ఎందుకంటే..  ఆయనను పీకేయడాన్ని హైకోర్టు కొట్టివేసింది కాబట్టి! ఆ లెక్కన నిమ్మగడ్డ కమిషనర్‌గా కొనసాగుతున్నట్లే లెక్క. అలాగని కొనసాగుతున్నట్లూ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది కాబట్టి!!  అబ్బబ్బబ్బ… ఏమిటీ కిరికిరి పంచాయతీ అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు కదా? అందుకే మరి.. ప్రథమ పౌరులవారు, లౌక్యంగా అలా లేఖ రాసి ముందుకువెళ్లారని అర్ధమవుతుంది. పైగా.. ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది కాబట్టి, అక్కడి నుంచి స్పష్టత వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని జగనన్న సర్కారు చెబితే.. గవర్నరుగారు కూడా చేసేదేమీ ఉండదు.

అసలు.. నిమ్మగడ్డ అనే అధికారికి ఫలానా తేదీలోగా బాధ్యతలు అప్పగించాలని, అందుకు సంబంధించి చేసిన ప్రక్రియపై తనకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు కనుక ఆదేశించి ఉంటే.. ఈ పంచాయతీ తప్పేది. కానీ హైకోర్టు అలా స్పష్టత ఇవ్వలేదే మరి? ఆ ఐపిఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కేసు కూడా అంతే. ఆయనకు తక్షణం ఉద్యోగమిచ్చి, పెండింగ్ జీతం కూడా ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వెంటనే అనే దానికి స్పష్టత ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేది! అప్పుడూ అంతే. ఇదే మీడియా.. ఇంకేముంది? జగన్ సర్కారుకు హైకోర్టు షాకిచ్చింది. రేపో, మాపో ఏబీవీ జాయినయిపోతారన్న వార్తలు వదిలింది.  కానీ ఏం లాభం? ఇప్పటిదాకా ఆయనను ఉద్యోగంలో తీసుకున్న పాపాన పోలేదు. ఎప్పటిలోగా ఉద్యోగం ఇవ్వాలన్న స్పష్టత లేకపోవడంతో, జగనన్న సర్కారు కూడా తనకున్న హక్కుతో సుప్రీంకోర్టుకెళ్లింది. సరే.. ఏబీ అక్కడా కేవియట్ వేశారనుకోండి. అది వేరే విషయం. అది ఇంకా నెంబరింగే కాలేదు. ఎప్పుడవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రకారంగా.. ఒక్కోసారి నిర్దిష్టమైన తేదీ లేకుండా ఇచ్చే తీర్పులు, ప్రభుత్వాలకు వాయిదాలు కోరి, తాను అనుకున్నది సాధించుకునే వెసులుబాటు కల్పిస్తుంటాయని లాయర్లు చెబుతున్నారు. చివరాఖరకు చెప్పచ్చేదేమిటంటే.. నిమ్మగడ్డ రమేష్ కు మరో కొత్త ఉత్కంఠ తప్ప,  రాజభవన్ నుంచి ఊరట లభించలేదు. అద్గదీ సంగతి!

కానీ, ఒక ఆర్డరును ఆవిధంగా కూడా ఇవ్వవచ్చన్న విషయం.. ఇంతకాలం తమ సర్వీసులోనే నేర్చుకోనందుకు, తెలుసుకోనందుకూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు.. గవర్నర్ కార్యదర్శి రాసిన లేఖ చూసి తెగ మదనపడుతున్నారట. ఆయన ప్రతిభను చూసి మురిసి ముక్కలవుతున్నారట. బహుశా.. ‘సీఎస్ స్థాయికి ఎక్కువ-కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి స్థాయికి తక్కువ’ తెలివితేటలున్న వారికే అది సాధ్యమవుతుందంటున్నారు. ఆ స్థాయి అధికారులు ఇంకా రాజ్‌భవన్‌లో కాకుండా.. ఏ సీఎస్‌గానో, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీగానో ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. అంత స్పష్టత ఇచ్చిన అధికారులను తమ సర్వీసులోనే చూడలేదని కితాబు ఇస్తున్నారు. ఎన్ని జన్మల అదృష్టం ఉంటేగానీ, అలాంటి అధికారులు దొరకరంటున్నారు. నిజమే కామోసు?