జగనన్న.. మాస్క్ పెట్టారోచ్!

313

(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆంధ్రా సీఎం జగనన్న ఏం చేసినా సంచలనమే. ఏం మాట్లాడినా విశేషమే. అంతెందుకు? ‘కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే. దట్ కమ్స్ అండ్ గోస్‌లా వచ్చివెళుతుంద’ని జగనన్న వ్యాఖ్యానించినప్పుడు, అంతా ఆయనను హేళన చేశారు.  ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకూ జగనన్న మాటలనే రిపీట్ చేశాయి. మరి అంత చెప్పిన జగనన్న ఇప్పటివరకూ మాస్కు పెట్టుకుని పెట్టుకుని కనిపించింది ఒకే ఒక్కసారి. అది కూడా 104,108 అంబులెన్సుల ప్రారంభోత్సవం సందర్భంగా! ఇక ఆ తర్వాత ఎప్పుడూ మాస్కులు పెట్టుకున్నట్లు కనిపించలేదు. చివరకు రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన ఓటింగులో కూడా,  చంద్రబాబు మాస్కు పెట్టుకుని ఓటు వేస్తే, జగనన్న మాత్రం మాస్కు లేకుండా నిర్భయంగా వచ్చి ఓటేసివెళ్లారు. అధికారులతో నిర్వహించే సమీక్షల్లో కూడా ఎక్కడా మాస్కు కట్టుకున్న దాఖలాలు లేవు.

      తాజాగా గవర్నర్‌తో మంత్రుల ప్రమాణస్వీకారంలో మాత్రం, మళ్లీ రెండవసారి మాస్కు కట్టుకుని కనిపించారు. ఆ తర్వాత వారితో విడిగా దిగిన ఫొటో సెషన్‌లో మాత్రం, మళ్లీ  మాస్కు మాయమయింది. ఇక తాజాగా ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో మాత్రం, జగనన్న మాస్కు కట్టుకుని కనిపించారు. ఆ కార్యక్రమంలో ఆయన తలపై టోపీతో ఎనర్జిటిక్‌గా కూడా కనిపించారు. ఆంధ్రాలో మంత్రులంతా దాదాపు మాస్కులు పెట్టుకునే కనిపిస్తున్నారు. అయితే, మాస్కులు, గ్లవుజులు పెట్టుకుని, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి విజయసాయిరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. దానికి కారణం సామాజికదూరం పాటించకపోవడమే.

తెలంగాణలో సీఎం కేసీఆర్ కేవలం ఒక్కసారే మాస్కుతో కనిపించారు. ప్రెస్‌మీట్లలో గానీ, సమీక్షల్లో గానీ మాస్కుతో కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నిర్వహించిన ఓ నియోజకవర్గ సమీక్షలో మాస్కు లేకుండా కనిపించగా, ఆయన ఎదురుగా కూర్చున్న కార్పొరేటర్ మాత్రం మాస్కు, గ్లవుజుతో కనిపించడం విశేషం. తాజాగా కరోనా సోకిన పద్మారావు ఇటీవలే కోలుకున్నారు. తెలంగాణలో కూడా ప్రజాప్రతినిధులు అనేకమంది ఆంధ్రాలో మాదిరిగానే కరోనా బారిన పడ్డారు.

సర్పంచి నుంచి ప్రధాని వరకూ అంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని చెప్పారు. కానీ, ప్రజాప్రతినిధులే వాటిని ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు.  ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు సామాజిక దూరాన్ని చెరిపేసి.. పదులు, వందలమందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాలు పత్రికలు, చానెళ్లలో కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఓ సాగనీటి ప్రాజెక్టు కార్యక్రమానికి హాజరయినప్పుడు వందల సంఖ్యలో తరలివచ్చిన వారిలో మాస్కులు కనిపించలే దు.  మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న పోలీసులు… సీఎంల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ దానిని పాటించకపోయినా, మౌనంగా ఉండటం విచిత్రం. తాజాగా ప్రకాశం జిల్లాలో కిరణ్ అనే యువకుడిని, మాస్కు లేదన్న కారణంతో ఎస్‌ఐ కొట్టిన దెబ్బలకు మృతి చెందిన వైనం చూస్తే.. చెప్పడానికేనా నీతులు అనిపించకమానదు.