రఘురాముడు.. జై ‘హింద్’!

0
1

అయోధ్య, అమరావతి ఆలయాలకు విరాళాలు
మతమార్పిళ్ల, గోశాలలపై నిర్లక్ష్యం,టీటీడీ భూములపై నిరసన గళం
-(మిర్రర్ టుడే కోసం మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)
రెబెల్ స్టార్.. ఈ బిరుదు వింటే మొదట గుర్తుకొచ్చేది ఒకప్పటి హీరో, ఎంపీ కృష్ణంరాజు. ఇప్పుడు రాజకీయాల్లో  రెబెల్ స్టార్ పేరు చెబితే గుర్తుకొచ్చేది ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన సినిమా తెరపై రెబెలయితే, ఈయన పొలిటికల్ స్క్రీన్‌పై రెబల్. గమ్మత్తేమిటంటే ఇద్దరికీ ఒకే ప్రాంతం. ఇద్దరిలోనూ చివర కృష్ణంరాజులున్నారు. ఇద్దరూ క్షత్రియ పుత్రులే! యుశ్రారైకాపా.. అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ, రఘురాముడు ఆ పార్టీ నాయకత్వానికి జండూబామ్‌లా మారారు. ఉంచుకోలేరు. వదలించుకోలేరు. అలాంటి రఘురాముడు ఇప్పుడు రామనామం జపిస్తున్నారు. రాముడిని భక్తుల్లోకి తీసుకువెళ్లే వీరభక్త రామాంజనేయుడవుతున్నారు. ఏంటి?.. ఇంకా అర్ధం కాలేదా?..ఆయన హిందువుల మనోభావాలకు ప్రతినిధి అవతారమమెత్తుతున్నారండి బాబూ? అదేంటీ? ఒక క్రైస్తవుడి సారథ్యంలో ఉన్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, తారకమంత్రం జపించడమేమిటనుకుంటున్నారా? ఎస్.. చూస్తూ ఉండండి.. సదరు రఘురాముడు రేపో, మాపో హిందూమహాసభ ఆంధ్ర రాష్ట్ర నాయకుడయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

నర్సాపురం  యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు.. హిందుత్వ అజెండాతో వెళుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా వెంకన్న స్వామి వీరభక్తుడైన  రఘురాముడు, తిరుమల భూముల అమ్మకాలకు నిరసనగా గళమెత్తి, సొంత పార్టీ వారిని ఖంగుతినిపించారు. అప్పటివరకూ వైసీపీలో ఉన్న హిందూ ప్రజాప్రతినిధులెవరూ దానిపై పెదవి విప్పలేదు.  అదే సమయంలో భాజపా దళపతి కన్నా లక్ష్మీనారాయణ కూడా నిరసన వ్యక్తం చేయడంతో,  భూముల అమ్మకాలపై సర్కారు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక అక్కడి నుంచీ రఘురాముడు లేవెనెత్తుతున్న హిందూ అనుకూల అంశాలు, ఆయనను హిందువులకు మరింత దగ్గర చేశాయి. క్రైస్తవతమార్పిళ్లపై ఆయన లేవనెత్తిన అభ్యంతరాలతో, హిందువులలో ఆయన హీరో అయ్యారు. ఎందుకంటే.. ఆ స్ధాయిలో భాజపా కూడా ఇప్పటిదాకా గళమెత్తిన దాఖలాలు లేవు. అందుకే హిందువులు ఆయనను దమ్మున్న నాయకుడిగా చూస్తున్నారు. తమ మనోభావాలు వ్యక్తీకరిస్తున్న నాయకుడిగా అవతరించారు.
యుశ్రారైకాపా నాయకత్వం తనపై వే టు వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ, తన పదవిని ఆ పార్టీ ఎంపీ బాలశౌరికి ఇప్పించాలని ఒత్తిళ్లు చేస్తున్నా… రఘురామరాజు లెక్కచేయకుండా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ నాయకత్వాన్ని నానా యాతనకు గురిచేస్తున్నారు. ‘ప్రతిఘటన’ సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్లు పొగుడ్తాండా? తిడతాండా అని కూడా అర్ధం కావడం లే దు.  ఈలోగా హిందుత్వానికి సంబంధించిన అంశాలను భుజానవేసుకోవడంతో, హిందూ నాయకుడిగా అవతరించారు. రాష్ట్రంలో 2.5 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవుల సంఖ్య, 25 శాతానికి చేరిందంటే, మతమార్పిళ్లు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చన్న అస్త్రం  కలకలం రేపింది. ఈ విధానం వల్ల మతం మారిన దళితులు రిజర్వేషన్ సౌకర్యం అనుభవిస్తుండటం వల్ల, నిజమైన హిందూ దళితులు అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మతమార్పిడి నిరోధక బిల్లు తీసుకురావాలని గళమెత్తడం సంచలనం సృష్టించింది.

దానిపై రాష్ట్ర-జాతీయ-అంతర్జాతీయ క్రైస్తవ మత ప్రచారకుడైన కిలారి ఆనంద్ పాల్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన శాపనార్ధాలు అటు హిందూ సమాజంలో కూడా చర్చనీయాంశమయ్యాయి. క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే.. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకుందని చేసిన వ్యాఖ్యలు, హిందువుల్లో కొత్త ఆలోచనకు కారణమయ్యాయి..ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, నేరుగా క్రైస్తవ మతం, అది చేసే మతమార్పిళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో గోశాలలకు రక్షణ కల్పించాలంటూ రాజు, సీఎంకు రాసిన లేఖ హిందువులను క దిలించింది. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధికి కమిటీలు వేయాలి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో కమిటీలు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత కమిటీలు వేయలేదు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల, గతేడాది సింహాచలంలో మూడు గోవులు చనిపోయాయి. తాడేపల్లి-కొత్తూరు గోశాలలో విష ప్రయోగం వల,్ల 100 ఆవులు చనిపోయాయి. ఆవులు, దూడల సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంద’ని సీఎం జగన్‌కు రాజు రాసిన లేఖ సగటు హిందువును మెప్పించింది.

ఈ పరిణామాలతో  క్రైస్తవ సంఘాల నాయకులు కూడా, రామరాజుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా ఇండియన్ దళిత క్రిస్టియన్ జాతీయ అధ్యక్షుడు పెరిక వరప్రసాద్ కూడా… రఘురామరాజు హిందూ అనుకూల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి క్రైస్తవులకు ఎంతో మేలు చేస్తున్నారని, ఆయన క్రైస్తవ సీఎం అని రఘురామరాజు వంటి ఎంపీలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దానికోసం కేసీఆర్‌తో కలసి జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ పాస్టర్లకు కోవిడ్ కష్టకాలంలో, 5 వేలు ఇచ్చి ఆదుకున్న జగన్‌కు కృత జ్ఞత తెలిపారు. ఆ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికి రెండుసార్లు అటు కేఏ పాల్ కూడా, రఘురామకృష్ణంరాజు అనుసరిస్తున్న హిందూ అనుకూల వైఖరిని, అమెరికా నుంచి వీడియో సందేశం ద్వారా ఖండించారు. క్రైస్తవులు-హిందువుల మధ్య చిచ్చు పెట్టవద్దని హెచ్చరించారు.

ఏపీలో క్రైస్తవ అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలపై వరస వెంట వరస నిరసన గళం వినిపిస్తున్న రఘురామరాజు… తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాలు పరిశీలిస్తే… ఆయన హిందుత్వ బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అయోధ్యలో నిర్మించనున్న ప్రతిష్టాత్మక రామమందిరానికి, తన మూడు నెలల వేతనమయిన 3.96 లక్షల రూపాయలను, రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టుకు, విరాళంగా అందించి సంచలనం సృష్టించారు. ఎందుకంటే.. ఆ రకంగా రామమందిరానికి విరాళమిచ్చిన తొలి ఎంపీ అయనే. ఇప్పటివరకూ బీజేపీ ఎంపీలు కూడా ఆ సాహసం చేయలేకపోయారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లో చాలామంది సాధువులు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా  కొనసాగుతున్నారు. వారు కూడా ఇప్పటివరకూ, ఎలాంటి విరాళం ప్రకటించకపోవడం గమనార్హం.

అంతకుముందు.. అమరావతిలో నిర్మించ తలపెట్టిన రామాలయ నిర్మాణానికి కూడా,  రఘురాముడే తొలి విరాళం ప్రకటించారు. కరోనా బారిన పడిన తిరుమల తిరుపతి ఆలయ పెద్ద జీయర్‌స్వామి కోలుకోవాలని, ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి బహిరంగంగా ఆకాంక్షించలేకపోయారు. ఆ పని చేసిన తొలి ప్రజాప్రతినిధి రఘురామరాజు కావడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ యువ నేత లోకేష్ ట్వీట్ చేయడం విశేషం.  తనకు సెక్యూరిటీ కల్పించాలని, అమరావతి బిల్లులు ఆమోదించవద్దని కోరుతూ, తాజాగా రాష్ట్రపతి కోవిందును కలసిన రఘురాముడు  యుశ్రారైకాపా నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. కమల దళపతి నద్దా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ అయిన కనుమూరి అడుగులు కమల క్షేత్రానికి దగ్గరగా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజం ‘నరేంద్రు’డెరుక?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here