శహభాష్.. భూమన!

315

వరవరరావు విడుదలకు వెంకయ్యకు  లేఖ
ఇప్పటి నేతల్లో ఏదీ ఆ సామాజికస్పృహ?
విచిత్రమన్న విశ్వహిందూపరిషత్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అన్ని వేళ్లూ ఒకేలా ఉండనట్లే, రాజకీయ నాయకులంతా ఒకే రకంగా ఉండరు. సంపాదన కోసం పరితపించే నేతలు కొందరయితే, సామాజిక స్పృహ, మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై తపన మరికొందరు నేతల సొంతం. నేటి రాజకీయాల్లో మొదటి బాపతు వ్యక్తులే ఎక్కువ. రెండో తరహా నేతలు బహు అరుదు! అలాంటి వారిలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఒకరు. బహుశా చివరా కావచ్చు!!  కొన్ని దశాబ్దాల క్రితం… ప్రజా ఉద్యమాలనే వంతెన నిర్మించి, దానిపై  నిలబడి, పాలకులను చూపుడు వేలితో ప్రశ్నించి, విద్యార్ధులకు సామాజిక బాధ్యత నేర్పి, వారిని ఉద్యమబాట పట్టించిన రాడికల్ అనే విద్యార్ధి సంఘానికి, పురుడుపోసిన వారిలో భూమన ఒకరు. రాజకీయంగా ఇప్పుడు ఆయన సమర్ధించే పార్టీ భావజాలం అనుసరిస్తున్నా, తన ప్రజాభావజాల పునాదుల నుంచి మాత్రం పక్కకు వైదొలగని ఆ తత్వమే, ఇంకా ఆయనను జనంలో నిలిపింది. రాడికల్ ఉద్యమం నుంచి వైదొలిగి, రాజకీయ బాట పట్టి ఇన్ని దశాబ్దాలయినా, నలభై ఏళ్ల నాటి తన ఉద్యమ సహచరుడి ఈతి బాధలను గుర్తుంచుకుని, ఆయనను  కాపాడమని ఓ ప్రజాప్రతినిధిగా, ఒకప్పటి తన జైలు సహచరుడైన నేటి ఉప రాష్ట్రపతికి  లేఖ రాయడం భూమనకే చెల్లింది. ఆయన లేఖ సహజంగానే చర్చకు తెరలేచింది.
ప్రధానిని హత్యకు పాల్పడ్డారన్న కుట్ర కేసులో అరెస్టయి, మహారాష్ట్ర జైలులో ఉన్న తెలుగు విప్లవరచయిత వరవరరావు ఆరోగ్యం దెబ్బతింది. ఆయన వయసు 81. పైగా కరోనా బాధితుడిగా మారారు. ఈ పరిస్థితిలో ఆయన ఆరోగ్యంపై విప్లవవాదులు, కుటుంబసభ్యుల ఆందోళన సహజం. కరోనాతో యుద్ధం చేస్తున్న ఆయనను విడుదల చేయాలని తెలంగాణలో కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులంతా ఇప్పటికే  ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు సైతం.. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని, విడుదల చేయాలని అభ్యర్ధించాయి. అయితే, ఆయనకు అక్కడే మెరుగైన వైద్యం చేయిస్తామని ప్రభుత్వం బదులిచ్చింది. వరవరరావు ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు చూసి, ఆయనను అభిమానించే వారంతా కలవరపడుతున్నారు.
ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారా? నక్సలైట్లతో సత్సంబంధాలున్నాయా? ఆయన మావోయిస్టు పార్టీ లీగల్ మెంబరా? అన్న చర్చ అప్రస్తుతం. ఎందుకంటే అది బహిరంగమే. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పడాయన ఓ  వృద్ధ శల్య శరీరుడు. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం. చట్టం అందరికీ సమానమే. దానికి వరవరరావు మినహాయింపు కాదు. అతీతుడు అంతకంటే కాదు. కానీ… దేశాన్ని అస్థిరపరిచాలన్న పాక్ మష్కరులను పట్టుకుని, బిర్యానీలు పెట్టి మేపిన ఈ దేశంలో, ఓ వృద్ధుడిపై కరుణ చూపాలని కోరడం నేరం కాదు. ఘోరం అంతకంటే కాదు. బహుశా భూమన కూడా,  అదే కోణంలో లేఖ రాసినట్లున్నారు.
అయితే.. నాలుగు దశాబ్దాల  క్రితం, ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు.. ముషీరాబాద్ జైలులో (ఇప్పటి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి) ఖైదు చేయబడిన నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వరవరరావు సహచరుడైన నేటి తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ముంబయిలో మృత్యువుతో పోరాడుతున్న, తన ఒకప్పటి జైలు సహచరుడైన వరవరరావు విడుదల కోసం ఉప రాష్ట్రపతికి లేఖ రాయడం అందరినీ ఆకట్టుకుంది. ఆశ్చర్యపరిచింది. ఈ దేశంలో మావోలకు, రహస్యంగా నిధులిచ్చే ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. వారికి ఆశ్రయమిచ్చే రాజకీయనేతలూ చాలామంది ఉన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో నల్లగొండ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పుడు ఈ సంఖ్య ఎక్కువగానే ఉండేది. కానీ గుమ్మడి నర్సయ్య, విఠల్‌తోపాటు కొద్దిమంది వామపక్ష ప్రజాప్రతినిధులు తప్ప, మిగిలినవారెవరూ బహిరంగంగా వారెవరూ మావోల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు.
ఇప్పుడు అధికారపార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే,  వరవరరావును విడుదల చేయడం విశేషమే.
జైల్లో తనకు సహ చరుడిగా ఉన్న ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు.. తమ ఇద్దరి సహచరుడైన, వరవరరావును విడుదల చేసేందుకు సహకరించాలని, భూమన లేఖ రాయడం గొప్ప విషయమే. ఇది ఆయనలోని మానవతావాదిని ఆవిష్కరించింది. ఆ లేఖలో ఆయన వాడిన పదజాలం పరిశీలిస్తే.. ఈ మాత్రం ఆర్ధ్రత, మానవత్వం, ఉద్యమకారుల పట్ల సానుభూతి నేటి రాజకీయ నాయకుల్లో ఇంకా బతికుండటం నిజంగా గొప్పతనమే. భూమన లేఖలో పేర్కొన్న అంశాలు కచ్చితంగా రైటిస్టులకు నచ్చకపోవచ్చు. నచ్చవు కూడా. అలా ఆశించడం కూడా తప్పే. మావోల చేతిలో నిహతులైన రాజకీయ పార్టీలు, జాతీయవాద సంస్థల ప్రతినిధులకు ఆయన లేఖలోని అంశాలు, వాడిన భాష రుచించకపోవచ్చు. కానీ, ‘53 సంవత్సరాలుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం.. మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా?’ అన్నది మాత్రం నిష్ఠుర నిజం.
భూమన వాడిన ఈ పదాన్ని స్వాగతిస్తున్న జాతీయవాదులు, ఆయన పేర్కొన్న మిగిన అంశాలతో మాత్రం ఏకీభవించం లేదు. ‘ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలను అకారణంగా చంపిన మావోలను సమర్ధించిన వరవరరావుకు అవెప్పుడూ మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపించలేదు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపినా, చంద్రబాబును హతమార్చాలని చూసినా, వందలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్పంచులను పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో మావోలు చంపినా వరవరరావుకు ఎప్పుడూ అవి మానవ హక్కుల ఉల్లంఘన కింద కనిపించలేదు. ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నడం, అలాంటి వ్యక్తి విడుదల కోసం లేఖ రాయడం మీ వంటి ప్రజాప్రతినిధికి సమంజసమా? మీ లేఖ వరవరరావు స్థాయిని, ఆయన సిద్ధాంతం విలువను తగ్గించడమే’నంటూ వీహెచ్‌పీ నేత బాలస్వామి చేసిన ప్రకటననూ కొట్టిపారేయలేం. ఉనికిలో లేని మావోయిజం గురించి చర్చ వృధా. అయినా.. వాటికి సమాధానమివ్వడానికి భూమున ఇప్పుడేమీ, మునుపటి మాదిరిగా ఇంకా అడవుల్లో లేరు. ప్రజారణ్యంలోనే ఉన్నారు. భూమన లేఖను మానవీయకోణంలో చూస్తే చాలు!