జర్నలిస్టులను.. యాజమాన్యాలు ఆదుకోవా?

489

కిలో బియ్యం కూడా ఇవ్వలేని పేద సంస్థలా?
యాజమాన్యాల కంటే రాజకీయ నేతలే  రైటు
సర్కారు సాయం పరిమితమే కదా?
మరి యూనియన్లు బజ్జున్నాయా ?
46 లక్షల సాయమందించిన అల్లం నారాయణ
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)


ఒక మనోజ్.. ఇంకో మధుసూదన్‌రెడ్డి.. మరో వెంకటసుబ్బయ్య, పార్ధసారథి,  సిద్దారెడ్డి శ్రీనివాస్.. పేరు ఏదైతేం? ప్రాంతం ఏదైతే నేం?.. వీరంతా తెలుగు జర్నలిస్టులు. కరోనా బాధితులు! చనిపోయిన వారు కొందరయితే, బతికున్నవారు మరికొందరు. బతుకుతూ చస్తున్న వారు ఇంకొందరు.  చనిపోయిన వారి కుటుంబాలు ఇంకా విషాదంలోనే ఉంటే, బతికున్న రోగుల బంధువులు బయట వలవల ఏడుస్తున్నారు. ఒకరిది లోకంలో లేని విషాదం. మరొకరిది లోపల ఉన్న వారి తాలూకు, చావుబతుకుల  వేదన. అంతా జర్నలిస్టులే!  మధ్య తరగతి మనుషులే. కరోనా రక్కసి కాటేస్తుందని తెలిసినా, ఉద్యోగ ధర్మం కోసం చావుకు తెగించి వార్తలు సేకరిస్తున్న వారియర్స్. కరోనా బూచితో, బలిసిన బడా మీడియా సంస్థలు సైతం జీతాలు కోత పెడుతున్నా.. కొన్ని సంస్థలు అసలు జీతాలే ఇవ్వకపోయినా.. వచ్చిన దానితోనే, ఇచ్చిన దానితోనే సంతృప్తి పడుతూ, వచ్చేదానికోసం ఆశగా ఎదురుచూస్తూ, ఉద్యోగాలు చేస్తున్న విలేకరన్నల పాలిట కరోనా మరణ మృదంగమయింది. ‘అన్నా.. ఈ ఆసుపత్రిలో సరైన చికిత్స లేదు. నన్ను బతికించండన్నా. ఇంజక్షన్ చేయించండి. డాక్టర్‌కు ఫోన్ చేయించడన్నా. భయమేస్తోందన్నా. చచ్చిపోతానేమో అన్నా. ప్లీజ్ అన్నా. దయచేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్లండ’ని ఒకరు.. ‘సార్. ఊపిరాడటం లేదు. జ్వరం వస్తోంది. డాక్టర్లు పట్టించుకోవడం లేద’ని మరొకరు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఇంకొకరు.కన్నీటికి చలించని యాజమాన్యాలు..

ఈ ఆర్తనాదాలు, ఆకలికేకలు, అరచి అరచి అలసి సొలసి.. ఆఖరికి శాశ్వత సెలవు తీసుకుంటున్న విషాద దృశ్యాలు, కన్నీటి కథలు, గాథలు తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టు కుటుంబాలలో, పుట్టెడు దు:ఖం నింపుతున్నాయి.   వారి కుటుంబాల చావుకేకలు, కాపాడమని వేడుకుంటున్న దయనీయ దృశ్యాలు, కఠిన పాషాణ హృదయులను సైతం కదిలించి, కరిగిస్తున్నా.. వారితో పనిచేయించుకుంటున్న, మీడియా సంస్థ యాజమాన్యాలను మాత్రం కదిలించడం లేదు. కనికరించడం లేదు. సాయం చేయడానికి చేతులు రావడం లేదు. పేరు గొప్ప జర్నలిస్టు సంఘాలు మాత్రం.. ప్రభుత్వాలను సాయం చేయమని నిలదీస్తాయి. బీమా ప్రకటించాలని డిమాండు చేస్తున్నాయి. కోర్కెల దినం పాటిస్తున్నాయి. మంచిదే. కానీ… మీడియా సంస్థల మెడలు వంచి, మృతులు, బాధిత  జర్నలిస్టు కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు, మాత్రం నిలువెల్లా వణికిపోతున్నాయి. ఎందుకంటే సదరు సంఘాల  నాయకమ్మన్యులూ,  ఏదో ఒక మీడియా సంస్థలో కొలువుగాళ్లే మరి. అదీ అసలు భయం! యాజమాన్యాలు  ఎలాగూ నష్టపరిహారం ఇవ్వవు. పాలకులు ఇచ్చే సాయం సరిపోదు. జర్నలిస్టును కట్టుకున్నందుకు, ఆ కుటుంబం ఇక ఛస్తూ బతకాల్సిందే. ఇది నిజం. ఎంత నిజమంటే… మనం మనుషులం అన్నంత!

వారి సేవలు చిరస్మరణీయం..

కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులు ముందు వరసలో ఉన్నారు. మొదటి ముగ్గురికి ప్రభుత్వాలు తాయిలాలు, వరాలిచ్చేశాయి. ఇవ్వాలి కూడా. ఎందుకంటే.. ఇప్పటికి అనేకమంది వైద్యులు, పోలీసులు కరోనా కాటుకు బలయిపోయారు. ముఖ్యంగా తెలంగాణలో గాంధీ, ఏపీలో తిరుపతి, విశాఖ, గుంటూరు ప్రభుత్వాసులకు భద్రత కల్పిస్తున్న పోలీసులు, వైద్యులను కరోనా కాటేస్తోంది. తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వీరందరికీ ఎంత ఇచ్చినా తక్కువే. పైగా వీళ్లంతా ప్రభుత్వోద్యోగులు. మరి జర్నలిస్టులు? ప్రభుత్వాలకు జర్నలిస్టులతో ఏం పని? ప్రైవేటు ఉద్యోగులు. సర్కారు వార్తలు మోసి, రాయడం వరకే వారి బాధ్యత. విధినిర్వహణలో ఏమైనా జరిగితే, ఆదుకునేందుకు  వారు పనిచేసే యాజమాన్యాలున్నాయి కదా? జర్నలిస్టులు కరోనా బారిన పడితే, వారిని కూడా సాధారణ రోగుల మాదిరిగానే చూడటం సహజం. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు కాబట్టి, మంత్రులో, అధికారులో సిఫార్సు చేస్తే, సర్కారీ ఆసుపత్రుల్లో కాస్తంత మెరుగైన వైద్యం, మరికొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవచ్చు. అంతకుమించి చేసేదేమీ ఉండదు.

జర్నలిస్టు యూనియన్లు అడగవేం?

కానీ, కరోనా బారిన పడి అశువులు బాసిన జర్నలిస్టులకు, 50 లక్షలు ఇవ్వాలనేది ఒక డిమాండ్. బీమా సౌకర్యం కల్పించాలన్నది మరో డిమాండ్. ఆంధ్రా-తెలంగాణ జర్నలిస్టు లీడర్ల కోరిక ఇది.  మంచిదే. ఇవన్నీ జర్నలిస్టు సంఘాలు, వాటి నాయకమ్మన్యుల  కోరికలు. ఇవన్నీ ప్రభుత్వాలను అడుగుతున్న డిమాండ్లు. మరి.. రోజూ జర్నలిస్టులతో పనిచేయించుకుని, నెల జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వకుండా, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించని మీడియా సంస్థల యాజమాన్యాలను, ఇవే డిమాండ్లు సంఘాలు అడగవేం? కరోనాతో పోరాడి ఓడిన జర్నలిస్టు కుటుంబాలకు, చికిత్స పొందుతున్న వారికి నష్టపరిహారం, వారి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని గర్జించరేం? కరోనా సమయంలో జీతాల్లో ఎందుకు కోత విధించారని, ఈ నాయకమ్మన్యులు నిలదీయరేం? వాటి సాధనకు మంత్రులు, సమాచార శాఖ కమిషనర్లను కలసి ఫొటోలకు ఫోజులిచ్చినట్లు.. ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలను కలవరేం? భయమా? బిడియమా?!

స్ట్రింగర్లంటే సరే… ఉద్యోగుల మాటేమిటి?

సరే.. లైన్‌అకౌంట్లతో బతికే డివిజన్ ఇన్చార్జులు/ జోన్ ఇన్చార్జిలు/ స్ట్రింగర్లు/కంట్రిబ్యూటర్లంటే.. అదో జీతం, బతె్తం లేని ఉద్యోగం. వారికి ఏళ్ల తరబడి డబ్బులివ్వకపోయినా, ఒక్క నాయకుడూ నోరుమెదపరనుకోండి.  యూనియన్ నాయకులకు స్ట్రింగర్ల సమస్యలు అవసరం లేదు. కానీ జిల్లాలలో యూనియన్ల మనుగడకు, పెత్తనాలకు మాత్రం వారు కావాలి. స్ట్రింగర్లు కూడా యూనియన్లు విసిరే జిల్లా/రాష్ట్ర స్థాయి పదవులకు ఆశపడి, యూనియన్లను బతికిస్తుంటారు.  పనిచేసే పత్రిక/చానెల్ నుంచి దమ్మిడీ రాకపోయినా, ఏళ్ల తరబడి లైన్‌అకౌంట్లు ఇవ్వకపోయినా.. యూనియన్లు ఇచ్చే పదవులొక, కిరీటాలనే పిచ్చి భ్రమల్లో బతుకున్నారనుకోండి. మరి కనీసం.. మీడియా సంస్థలు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి, నియమించుకున్న ఉద్యోగుల గోడయినా, ఈ సంఘాలు పట్టించుకోవాలి కదా? వారంతా ఏదో ఒక యూనియన్‌లో సభ్యులే కదా? మరి కరోనా సమయంలో యాజమాన్యాలు జీతాలివ్వకుండా, వారిని గాలికొదిలేస్తే.. ఈ వీర విప్లవ ధీరదిగ్గజ యూనియన్ల కిశోరాలు గర్జించకుండా, ఏ గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నారన్నది జర్నలిస్టుల ప్రశ్న.  జర్నలిస్టు సంఘాల నాయకుల నుంచి, సలహాదారులుగా రూపాంతరం చెందిన మాజీ జర్నలిస్టు వృద్ధశిఖామణులకూ, జర్నలిస్టు జాతి ఈతి బాధలు పట్టవేం?

రాజకీయ నేతలే నయం..

లాక్‌డౌన్ విధించిన తర్వాత రాజకీయ పార్టీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వచ్ఛంద సంస్థలు పేదవారికి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు కూడా తెల్లకార్డులున్న వారికి నగదు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాయి. ప్రభుత్వ సాయం పక్కనబెడితే.. ప్రైవేటు సంస్థలు, రాజకీయ నాయకులు అందించిన సాయం అందుకున్న వారిలో,  స్థానికంగా పనిచేసే కంట్రిబ్యూటర్లు/స్టింగర్లు కూడా ఉన్నారు. తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న, గోపాల్, టీడీపీ నగర అధ్యక్షుడు సాయిబాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, మేకలసారంగపాణి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కోమటిరెడ్డి, ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్,  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రోజా, విడతల రజనీ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, మాజీ మంత్రి  దాడి వీరభద్రరావు,  సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శిద్దా రాఘవరావు  వంటి నాయకులు పేదలతోపాటు.. స్థానికంగా పనిచేసే కంట్రిబ్యూటర్లకు బియ్యమో, నగదు సాయమో చేసి, తమ ఔదార్యం చాటుకున్నారు.

కిలో బియ్యానికీ దిక్కులేదా..?

కానీ.. పాపం.. మూడు నెలల నుంచి పూర్తి జీతాలకు నోచుకోని.. పత్రికలు/చానెళ్లలో  పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ సబ్ ఎడిటర్లు, చివరకు చప్రాసీలకూ… ఆయా  యాజమాన్యాలు,  కనీసం కిలో బియ్యం ఇచ్చిన పాపాన పోలేదు. ఏం?  మానవత్వం ఇతరులలోనే ఉండాలని కోరుకోవాలా? ఏళ్ల తరబడి తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల జరుగుబాటుకు, కనీసం బియ్యం ఇచ్చేందుకూ చేతులు రావా? కరోనా సాకుతో జీతాలలో కోతవిధించి.. ఇకపై ఇచ్చే జీతాలలోనూ  సగానికి సగం శాశ్వతంగా కత్తిరించాలనుకుంటున్న యాజమాన్యాలు,  తమ ఉద్యోగులకు కిలో బియ్యం ఇచ్చే దిక్కులేని పరిస్థితిలో ఉండటమే దౌర్భాగ్యం. కిలో బియ్యానికే గతి లేని యాజమాన్యాల నుంచి, కరోనా కాటుతో కడతేరిన జర్నలిస్టుల కుటుంబానికి, సాయం ఆశించడం కూడ అత్యాశేనేమో? మరి వీటిపై జర్నలిస్టు సంఘాలొక్కటే కాదు. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష మేధావులూ మాట్లాడరేం?

కామ్రేడ్లూ కత్తిరించేస్తున్నారు..

వామపక్షాలంటే గుర్తొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలకు చెందిన పత్రికలయితే.. కరోనా కష్టాన్ని, నష్టాన్ని భరించలేమని స్టాఫ్ రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లపై వేటు వేశాయి. ఇకపై ఇప్పుడిస్తున్నంత  జీతాలివ్వలేం. ఇష్టం ఉన్న వారు పనిచేయండని నిర్మొహమాటంగా చెప్పాయి. ఈ పరిస్థితిలో త్యాగం చేయకతప్పదని సెలవిచ్చాయి. ఇదంతా ఆయా పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలట. అదేంటి? కార్మికుల హక్కులు, బూర్జువా, పెట్టుబడిదారీ విధానం, అన్యాయమనే పదాలను.. పుట్టుకతోనే మాట్లాడే ‘ఎర్రన్న’ల ఆధ్వర్యంలో పనిచేసే పత్రికల్లోనే ఇంత అన్యాయమా? అని అమాయకుల మాదిరి నోరెళ్లబెట్టకండి. తమ ఏలుబడిలో పనిచేసే పత్రికలు, సంస్ధల జీతాల విషయంలో మాత్రం ఎర్రన్నలు పెట్టుబడిదారులే. ఏ సంస్థయినా ఉద్యోగులకు అన్యాయం చేస్తే, ఇంతెత్తున ఎగిరిపడతారు. కార్మిక హక్కులు కాలరాస్తున్నాయని కన్నెర్ర చేస్తాయి. కానీ అవన్నీ వారి సంస్థలకు వర్తించవంతే!

‘అల్లం’ను చూసి నేతలు సిగ్గుపడాల్సిందే!

తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ. ఆయన కూడా జర్నలిస్టు జాతి నుంచి ఆ స్థాయికి ఎదిగినాయనే. కానీ, కరోనా సమయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్యపని వారికి ఇచ్చినట్లే జర్నలిస్టులకూ బీమా, పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రినీ కలిశారు. ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా.. కరోనాతో పోరాడుతున్న దాదాపు 400మందికి పైగా జర్నలిస్టులకు,  ప్రెస్ అకాడమీ నుంచి 46 లక్షల ఆర్ధిక సాయం అందించారు. అంతకుముందు, పలు వ్యాధులతో పోరాడుతున్న బక్క జర్నలిస్టులకూ అకాడమీ  నుంచి ఆర్ధికసాయం స్వయంగా అందించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 20 వేలు, హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించి, తెలంగాణ జర్నలిస్టులకు నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించారు.

ఏపీలో సాయం ఏదీ?

కానీ, ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నం. కరోనాతో పోరాడుతున్న జర్నలిస్టులను ఆదుకునే దిక్కులేదు. ప్రెస్ అకాడమి ఏం చేస్తుందో, దాని నిధులేమవుతున్నాయో ఎవరికీ తెలియదు. తెలంగాణ ప్రెస్ అకాడమి జర్నలిస్టులను తనకున్న నిధులతో ఆదుకుంటుంటే, ఏపి ప్రెస్ అకాడమి ఏం చేస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పూర్వాశ్రమంలో జర్నలిస్టులుగా ఉండి, తర్వాత పాలకుల పక్కన చేరిన, ‘ఇద్దరు మెగా జర్నలిస్టు’లిప్పుడు పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ, తెలంగాణలో అల్లం నారాయణ చేస్తున్న ప్రయత్నాల్లో, కనీసం ఐదోవంతు కూడా ఏపీ జర్నలిస్టుల కోసం, కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జర్నలిస్టులకు ఇచ్చిన 10 లక్షల చంద్రన్నబీమా, హెల్త్ కార్డులను ఇప్పటిదాకా రెన్యువల్ చేయించలేకపోయారు. అవి ఫైనాన్స్ శాఖలో సుఖనిద్ర పోతున్నాయి. తాజాగా ఏపీలో జర్నలిస్టు సంఘాలు, కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని ఆందోళన నిర్వహించాయి.

జర్నలిస్టులకు దారేదీ?

సరే ఇప్పుడంటే.. రెండు తెలుగు రాష్ట్రాలు, మీడియాకు పెద్దగా ప్రకటనలివ్వడం లేదు. ఇచ్చినా సొంత కంపెనీలకే సింహభాగం  నిధులు ధారపోస్తున్నాయి. అయితే.. గత ఐదేళ్లు ఏపీలో, కొన్నేళ్లు తెలంగాణలో..  ప్రభుత్వ ప్రచార ప్రకటనలు, ఇతరత్రా ఆదాయాన్నీ సంవృద్ధిగా ఆరగించిన అగ్ర మీడియా సంస్థలు కూడా.. అంతంతమాత్రం ప్రాణమే ఉన్న, చిన్నా చితక పత్రికలు, చానెళ్ల మాదిరిగా  పేద అరుపులు అరుస్తుంటే.. మరి నాటి సంపాదన ఏమయినట్లు? ఇవిచాలనవన్నట్లు,  సిబ్బందిపై వేటు వేసేందుకు ఉత్సాహపడుతున్నాయట. ఇలాగైతే.. ఇక మీడియా భవిష్యత్తు, జర్నలిస్టుల బతుకేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.