ఏపీ గవర్నర్‌పై బిల్లుల ఒత్తిడి
అటు సర్కారు.. ఇటు ప్రతిపక్షాలు
ఆనుమతిస్తారా? రాష్ట్రపతికి పంపిస్తారా?
ఇప్పటికే గవర్నర్ తీరుపై కమలదళం గరం
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు మహా చిక్కొచ్చి పడింది. బిల్లుల ఆమోదంపై అటు అధికారపక్షం, ఇటు విపక్షాల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తూ,  ఆర్డినెన్స్ ఇవ్వవద్దని కోరినా ఖాతరు చేయకుండా, సంతకం చేసిన గవర్నర్‌పై కమలదళం గుర్రుగా ఉంది. ఇప్పుడు ఆ ఒత్తిడి వంతు టీడీపీది. మరి ఆ బిల్లులపై గవర్నర్ ఏం చేస్తారు? ఆమోదించి జగనన్న పెదవులపై చిరునువ్వులు పూయిస్తారా? లేక నాకెందుకీ తలనొప్పని రాష్ట్రపతికి నివేదిస్తారా? లేక న్యాయసలహా కోరతారా?
కాదంటున్న కమలదళం..
జగన్మోహన్‌రెడ్డి సర్కారు పంపిన, క్యాపిటల్ బిల్లుల అంశం గవర్నర్ బిశ్వభూషణ్‌ను సంకటంలో పడేసింది. గవర్నర్ ఆమోదం కోసం వైసీపీ సర్కారు వాటిని రాజ్‌భవన్‌కు పంపింది. అయితే…వాటిని ఆమోదించవద్దని అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ శాసనమండలి నేత మనమల రామకృష్ణుడు ఆ బిల్లులను ఆమోదించవద్దని, తమ అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాని వల్ల జరిగే నష్టాలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ తీరును వారిద్దరూ, తమ లేఖలో స్పష్టం చేశారు.
‘‘రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం 2014ను ప్రభుత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపగా, అది పెండింగ్‌లో ఉంది. వికేంద్రీకరణ బిల్లు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు వ్యతిరేకంగా ఉంది. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం, 2వేల కోట్లు బాండ్ల ద్వారా సమీకరించింది. కేంద్రం కూడా అమరావతికి నిధులిచ్చింది. అమరావతి ప్రాంతంలో, ఒకే రాజధాని ఉంటుందన్న ఒప్పందంపైనే రైతులు, 32 వేల ఎకరాల సారవంతమైన భూమిని ప్రభుత్వానికి త్యాగం చేశారు. దానికోసం అక్కడి రైతులు చేస్తున్న, శాంతియుత ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి. అసలు ఈ చర్యలు, అభివృద్ధికి సహకరించిన వాటాదారులకు ఆమోదయోగ్యం కాదు. కాబట్టి, ప్రభుత్వం పంపిన వికేంద్రీకరణ బిల్లుకు అనుమతి ఇవ్వవద్దని’ కమల దళపతి కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు.
అది కేంద్ర పరిథిలోని అంశం..
అటు టీడీపీ శాసనమండలి నేత యనమల రామకృష్ణుడు సైతం, గవర్నర్‌కు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ప్రజలకు సంబంధించిన బిల్లులకు మండలి ఆమోదం లేదా తిరస్కరణ అవసరం. తిరస్కరిస్తే డీమ్‌డ్ టుబి పాస్డ్ చేయవచ్చు. రెండు బిల్లులు మండలి ఆమోదం లేదా తిరస్కరణ లభించలేదు. ప్రజాభిప్రాయం కోసం అవి సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. కాబట్టి గవర్నర్ దీనిపై న్యాయసలహా తీసుకోవాలి. రాజధాని ఏర్పాటనేది కేంద్ర పరిధిలోని అంశం. పునర్విభన చట్టంలో కేంద్రం ఏర్పాటుచేసే కమిటీ సిఫార్సుల మేరకు, రాజధాని ఏర్పాటు కావాలని ఉంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం, నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. విజభన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది. 3 రాజధానులు చే యాలంటే, విభజన చట్టంలో సవరణలు అవసరం. గవర్నర్ ఈ అంశాన్ని గుర్తించాలి. దానిని రాష్ట్రపతికి పంపాలా? లేక న్యాయసలహాకు పంపించాలా గవర్నర్ తేల్చుకోవాల’’ని యనమల గవర్నర్‌కు సూచించారు.
గవర్నర్ కిం కర్తవ్యం..?
ఈ పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశం, గవర్నర్‌ను ఇరకాటంలో పడేశాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ వర్గాలు, గవర్నర్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ను తొలగిస్తూ పంపిన ఆర్డినెన్స్‌ను, ఆమోదించవద్దని బీజేపీ దళపతి కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖను, గవర్నర్ ఖాతరు చేయకపోవడమే దానికి ప్రధాన కారణం. ఆ సందర్భంలోనే రాష్ట్ర బీజేపీ నాయత్వం, గవర్నర్‌ను మార్చాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది.పైగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ కార్యకర్తలపై, వైసీపీ నేత దాడుల గురించి ఫిర్యాదు చేసినా, గవర్నర్  స్పందించలేదన్న అసంతృప్తి బీజేపీ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. నిమ్మగడ్డ వ్యవహారంలో గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించలేదన్న భావన బీజేపీ నేతల్లో ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, తమ మనోభావాల ప్రకారం గవర్నర్ వ్యవహరించడం లేదన్న అభిప్రాయం, బీజేపీ రాష్ట్ర నాయకుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో తన వద్దకు జగన్ సర్కారు పంపిన బిల్లులను అనుమతిస్తారా? లేక న్యాయసలహాకు గానీ, అదీకాదంటే రాష్ట్రపతికి గానీ పంపిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. రాజ్యాంగ నిపుణులు మాత్రం.. రాజధాని బిల్లు కేంద్రపరిథిలో కాబట్టి, రాష్ట్రపతికి పంపించడమే మంచిదని చెబుతున్నారు. చూడాలి బిశ్వభూషణుడు ఏం చేస్తారో?

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner