మాదిరెడ్డి సరే.. దీక్షితుల సంగతేమిటి స్వామీ?

387

ఆయనకూ షోకాజ్ ఇస్తారా?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)
‘మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమెక్కి ఒంటేలు పోశాడన్నది’ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వినిపించే సామెత. పోనీలే… విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద చెలరేగిపోయారు కదా అని,  మళ్లీ ఏదో ఉద్యోగమిస్తే.. ఈయనేంది స్వామీ? ట్విట్టరు వీరుడు  విజయసాయిరెడ్డి మాదిరిగా,  సొంత ప్రభుత్వం మీదనే రెచ్చిపోతున్నాడని  వైసీపేయులు తలపట్టుకుంటున్నారు!  రమణదీక్షితులనే పండితుల వారు తనకు కొలువిచ్చిన ఈఓ, జెఈఓలపైనే విరుచుకుపడుతూ ట్వీట్ చేసి, దానిని జగనన్నకు ట్యాగ్ చేయడమే దానికి కారణం.

జగన్ పరువును  దీక్షితులు ‘కొండె’క్కించారా?

ఇంతకూ అసలు దీక్షితుల వారికి,  ప్రభువులపై ఎందుకు కోపమొచ్చిందంటే.. కరోనా కారణంగా తిరుమల కొండపై అర్చకులకు కరోనా సోకినా, దర్శనాలను ఎందుకు నిలిపివేయడం  లేదన్నదే స్వాములోరి ఆగ్రహానికి కారణమట. పోనీ ఆ ముక్కేదో చైర్మన్ చెవిలో గానీ, ఈఓ గారి దివ్యసముఖంలో గానీ, జెఈఓకు ఓ చీటీ ముక్కలోగానీ వెల్లడిస్తే సరిపోయేది. దానిని కాదని ఏకంగా..  ప్రపంచంలోని తన భక్తజనాలందరికీ తెలిసేలా ట్వీట్ చేసి, జగనన్న సర్కారు పరువును ‘కొండె’క్కించడం, వైసీపేయులకు నచ్చడం లేదట. అప్పటికీ  పాపం జగనన్న సీఎం అయిన తర్వాత, బాబు విధేయుందరికీ పోస్టింగులివ్వని యజ్ఞం చేస్తుంటే.. దీక్షితులు మాత్రం ‘ఇంకా టీటీడీలో చంద్రబాబు పాటించిన మిరాశి అర్చకులు..బ్రాహ్మణ వ్యతిరేక విధానాలనే ప్రస్తుతం టీటీడీ అధికారులు పాటిస్తున్నారు. సీఎం జగన్ స్పందించకపోతే ఉపద్రవం జరిగిపోతుంద’ని ట్వీట్ చేయడం, దానిని జగనన్నకూ పంపించడం, జగనన్న అభిమానులకు ఎక్కడో కాలినట్టయింది. అంటే దీక్షితుల లెక్క ప్రకారం.. ఇంకా బాబు విధానాలు పాటిస్తున్న అధికారులే, టీటీడీలో ఉన్నట్లు చెప్పినట్టయింది. ఇది జగనన్న ఇమేజీని, దారుణంగా డామేజీ చేసినట్లేనని అన్న అభిమానులు అగ్గిరాముళ్లవుతున్నారట.

మరి మాదిరెడ్డికి నోటీసు ఇచ్చారు కదా?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ ఎలా బాసో, టీటీడీలో ఉద్యోగులకు ఈఓ కూడా బాసు. రెండురోజుల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారంటూ, ఆర్టీసీ ఎండీగా ఉన్న ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ అనే అధికారికి,  సీఎస్ పేరిట షోకాజ్ నోటీసు ఇచ్చారు. అలా మాట్లాడటం సర్వీసు రూల్సుకు విరుద్ధమని పేర్కొన్నారు. పాపం..మొన్నీ మధ్యనే వైఎస్ జయంతి జరిగింది. ఆ రోజు ఏపీలోని ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, వైఎస్ చిత్రపటం పెట్టి పూలమాల వేసిన వారు లేరు. కానీ, ఆయన వద్ద పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్ ఒక్కరే.. ఆర్టీసీలో వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి భక్తిభావంతో పూలమాల వేసి, ఆయనతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ సరిగ్గా ఆ మరసటి రోజునే ఆయనకు బదిలీ ఉత్తర్వు, ఆ తర్వాత షోకాజు నోటీసూ పంపించారు. అది వేరే విషయనుకోండి. ‘మాదిరెడ్డి’పైనా తప్పని.. జగన్ ‘ప్రతాపం’!

బోర్డు.. తూ నా బొడ్డేనా ఏంటి?

మరి ఇప్పుడు ఆ ప్రకారంగా.. టీటీడీ బోర్డు విధానాలను ప్రశ్నిస్తూ, ఏకంగా ట్వీట్ చేసిన దీక్షితులుపై ఏం చర్య తీసుకుంటారన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వ చ్చింది. టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. ప్రభుత్వ అధీనంలో ఉండి, ప్రభుత్వ ప్రతినిధులుగా  ఈఓ, జెఈఓలు ఉన్నప్పటికీ.. బోర్డు దానికి బాసు. మరి అలాంటి బాసులను లెక్కచేయకుండా, బోర్డును తూనా బొడ్డని, తానేదో టీటీడీకి-దాని విధానాలకు అతీతుడనే లెక్కలో నేరుగా ట్వీట్ చేస్తే, ఆయనకు లెక్క ప్రకారం షోకాజివ్వాలి కదా? ట్విట్టర్‌లో ‘చేయి పారేసుకున్నందుకు’ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా? పైగా.. ఇప్పటి పాలనా పద్ధతులను పాత సీఎంతో పోలిస్తే, ఆయనను కించిత్తు మాట అనకుండా, టిక్‌టాక్ చూస్తున్నట్లు చూస్తారేంది చెప్మా? అన్నది వెంకన్న భక్తుల ప్రశ్న! అంటే.. మాదిరెడ్డి ప్రతాప్ వంటి ఐపిఎస్ ఆఫీసరు కంటే, రమణ దీక్షితులు ఎక్కువా? గతంలో టీడీపీ మీద విరుచుకుపడ్డారు కాబట్టి, ఆ సానుభూతి ముసుగులో, ఒక ఉద్యోగి ఏది మాట్లాడితే అది చెల్లుబాటవుతుందా? మరిప్పుడు దీక్షితులు టీటీడీ ఉద్యోగే తప్ప-ఈఓ కాదు కదా? అన్నది తెరపైకి వచ్చిన మరో లాజిక్కు!

జగన్ గారూ.. మీకు అర్ధమవుతోందా?

గతంలో.. అంటే, బాబు సర్కారు తన ఉద్యోగం ఊడగొట్టినప్పుడు.. తిరుమల శ్రీవారి హుండీలో కానుకలు వేయవద్దని, అవి భక్తుల సౌకర్యాలు, ధర్మరక్షణకు ఉపయోగపడటం లేదని ఇదే దీక్షితుల వారు, మీడియా భేటీలో  టన్నుల కొద్దీ ఆవేదన కుమ్మరించారు. మరి జగనన్న వచ్చిన తర్వాత వెంకన్న కొలువులో మళ్లీ వచ్చిన ఈ శ్రీవారు.. కానుకలు హుండీలో వేయమని చెప్పలేదు. అంటే.. ఆ ప్రకారంగా.. ఇప్పటికీ దీక్షితుల వారు, తన మాటకు కట్టుబడి ఉన్నారనే అర్ధమవుతుంది. జగన్‌గారూ.. మీకు అర్ధమవుతోందా?

ఇవి కూడా చదవండి..
జగన్ కంటే రాజు గారే ‘పవర్’ఫుల్!
 విపక్షంలో స్వపక్షమా.. స్వపక్షంలో విపక్ష మా? స్వామీ?!
లడ్డు అమ్మకాలు.. వెరీ గుడ్!
వెంకన్న భూములు సరే…బంగారమూ తెగనమ్మేస్తారా స్వామీ?
టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది?

1 COMMENT