జగన్ పాలనకు జలకళ!

566

వైఎస్ కుటుంబాన్ని వీడని వరుణుడు
‘రైతు’లకు కలిసొచ్చిన పెట్టుబడి ‘భరోసా’
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అదేంటోగానీ వరుణుడికీ, వైఎస్ కుటుంబానికీ ఫెవికాల్ మాదిరిగా ఏదో విపదీయలేని బంధం ఉన్నట్లుంది. అప్పుడు వైఎస్. ఇప్పుడు జగన్. ఇద్దరి పాలనలో ఒకటే వర్షాలు. ‘అవునయ్యా.. వరుణుడు కూడా మా పార్టీలో చేరాడు’ అని  అప్పుడెప్పుడో  వైఎస్ మీడియాతో అన్న మాటలు, ఇప్పుడు ఆయన తనయుడైన జగన్ పాలనలోనూ నిజమవుతున్నాయి. ఫలితంగా… జగన్ పాలనకు జలకళ అద్దినట్టయింది. అవును.. ఏపీలో పెరిగిన అదనపు వర్షపాతం రైతులను ఆనందభరితులను చేస్తుండగా, రిజర్వాయర్లకు జలకళ కనిపిస్తోంది. అలా.. వరుణ దేవుడి సెంటిమెంటు. వైఎస్ కుటుంబాన్ని వీడకుండా విజయవంతంగా వెన్నంటే నిలుస్తోంది.

ఈ ఏడాది అదనపు వర్షపాతం 113.1 మిల్లీమీటర్లు. జూన్ నాటికి సాధారణ వర్షపాతం 93.7 మిల్లీమీటర్లు. మొత్తం 670 మండలాలలో 502 మండలాలలో అధిక వర్షపాతం నమోదవడం, గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి.  కరవు జిల్లా అయిన అనంతపురంలో 149, కర్నూలులో 181 మిల్లీమీటర్లు ఎక్కువ విస్తీర్ణంలో పంటసాగు అయినంది. మొత్తంగా.. 248.2 మిల్లీమీటర్లు నమోదయిట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే గతేడాదికంటే ఇది 57.5 శాతం ఎక్కువ. చివరకు వర్షాలు లేక తల్లడిల్లే  రాయలసీమ జిల్లాలలో కూడా,  గతేడాదికి మించి అదనపు వర్షపాతం నమోదు కావడం సీమ రైతు మొఖంలో జలసిరి కనిపిస్తోంది. ఫలితంగా.. సాగు విస్తీర్ణం గతేడాది కంటే గణణీయంగా పెరగడం, అటు  రైతన్న ఆత్మస్థైర్యం పెంచినట్టయింది.  అన్నీ సక్రమంగా జరిగి, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు రాకపోతే..  172 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఆహారోత్పత్తి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా సమయంలో దాదాపు అన్ని రంగాలు పడకేయగా, ఒక్క వ్యవసాయరంగం మాత్రం, ఇతరులకు సాయం చేసే స్థాయికి ఎదగడం విశేషం. దానికి అపార వర్షం కూడా తోడయింది. 8.32 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గతేడాది కంటే 5 లక్షల హెక్టార్లు ఎక్కువ. వరి, నూనె గింజలు, వేరుశెనగ సాగు ఆశావహకంగా ఉంది. సాగు పెట్టుబడిగా రైతులకు ఉచితంగా 49.43 లక్షల మందికి రైతుభరోసా అందింది. ఇది రైతును ఆర్ధికంగా ఆదుకుంది. దానికితోడు కరోనా తర్వాత, వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా తిరిగిరావడం, గ్రామీణ ఉపాథి హామీ పనులు వినియోగించుకోవడంతో, వ్యవసాయ పనులు ముమ్మరంగా కనిపిస్తున్నాయి.  జగన్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు అటుంచితే.. వ్యవసాయరంగంలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు, అభివృద్ధికి ఆనవాళ్లు అనడంలో సందేహం లేదు