జగన్ రాజ్యంలో విఠలాచార్యుడు విహరిస్తున్నాడా?

233

అన్నక్యాంటీన్లను ఆయనే మాయం చేశాడా?
మాకేమీ తెలియదన్న జగన్ సర్కారు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

జానపద బ్రహ్మ విఠలాచార్య గుర్తున్నారా? ఈ టెక్నాలజీ మెరుపులు, గ్రాఫిక్స్ విరుపులు లేని పాతకాలపు రోజుల్లోనే,  తెరపై గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలతో అద్భుతాలు సృష్టించిన సాంకేతిక సినిమా బ్రహ్మ ఆయన. మాయావి తన మంత్రదండంతో.. ఉన్న దానిని లేనివిగా, లేనివి ఉన్నట్లుగా, ఉన్న భవనాలు మాయమయినట్లు సృష్టించడం, పాలకుల శరీరంలో పరకాయ ప్రవేశం చేసి.. పాలకుడితో ఆజ్ఞలు ఇవ్వడం, రాజకుమారిని అంత:పురంతో సహా మాయం చేయడం వంటి, చిత్ర విచిత్రాలు చూపించడంలో,  గురువుగారిది అందెవేసిన చెయ్యి.
ఆయన చనిపోయి చాలా ఏళ్లయిపోయింది. అయినా ఆయన సృష్టించిన జానపద చిత్ర కళాఖండాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆయన సృష్టించిన పాత్రలు, మాయాలీలలు జనం మదిలో చిరస్థాయిగా సజీవంగా నిలిచిపోయే ఉన్నాయి. కానీ.. ఆ జానపద బ్రహ్మ గురించి, ఈ లోకానికి తెలియని.. తెలివైన వారికి మాత్రమే తెలిసిన, మరో రహస్యం కూడా ఉంది. ఈ లోకం విడిచివెళ్లారనుకుంటున్న జానపద బ్రహ్మ విఠలాచార్య ఆత్మ,  ఇంకా బెజవాడ చుట్టూనే తిరుగుతోంది!  అది పాలకులను ఆవహించింది. అందుకే అచ్చం ఆయన సినిమాల మాదిరిగానే, పాలకులకు తెలియకుండానే.. భవనాలు కూడా మాయమయిపోయాయి. పథకాలు రద్దయిపోతున్నాయి. అన్నక్యాంటీన్లు అందులో ఒకటి!!  ఇదొక్కటి చాలదూ?.. అమరావతి-బెజవాడ మధ్య విఠలాచార్య ఆత్మ షటిల్ సర్వీసు చేస్తుందని చెప్పడానికీ?
ఎస్.. అన్నక్యాంటీన్లు అనే ఒక చిన్నపాటి గూళ్లను ఆరోజుల్లో  చంద్రబాబు నాయుడు అనే రాజు పట్టణాలు, నగరాల్లో నిర్మించారు. చిన్నా చితకా, బీద బిక్కీ జనాలు అక్కడికి వచ్చి, ఫలహారం, భోజనాలను కారుచౌకగా తిని వెళ్లేవారు. దానితో ఆ రాజ్యంలో అన్నక్యాంటీన్లు మరింతగా వెలిశాయి. నాటి రాజు చంద్రబాబు నాయుడుకూ దానితో మంచి పేరొచ్చింది. తక్కువ ధరకే పూటకూళ్లమ్మ తరహాలో, కడుపునింపుతున్న రాజును పేదలు మెచ్చుకున్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ రాజుకు ఓట వేయలేదనుకోండి. అలాగే, సతె్తనపల్లి అనే సామంత రాజ్యంలో.. ఐదురూపాయల అన్నక్యాంటీను భోజనాన్ని కూడా,  ఆ సామంతరాజు కుటుంబం కక్కుర్తిపడి, నలభై రూపాయలకు తన ప్రజలకు అమ్ముకున్న దౌర్భాగ్యకథలూ, చిల్లర గాథలూ చాలా  వెలుగుచూశాయి.  అది వేరే విషయం! సరే ఇప్పుడు ఆ క్యాంటీన్లు  కనిపించడం లేదు. అన్నీ మాయమయ్యాయి. కొత్త పాలకులనడిగితే,  ఏమో మాకేం తెలుసు? ఎవరెత్తుకెళ్లారోనంటున్నారు. దీన్ని బట్టి.. విఠలాచార్య ఆత్మ, అమరావతి చుట్టూనే  తిరుగుతుందని అర్ధమయిందా లేదా? ఇది విఠలాచార్య ఆంధ్రా పాలకులలో ఆవహించి, చేస్తున్న చేష్టలేనని ఇంకా గ్రహించని వారు, అమాయకుల కిందే లెక్క!!
ఎన్నికల ముందు ఉన్న అన్నక్యాంటీన్లను.. తర్వాత వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని, కృష్ణాజిల్లాకు  చెందిన ఒకాయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లు..  బెజవాడ అంటేనే పైన అమ్మవారు. కింద కమ్మవారు! ఎంతైనా తెలివైన వాళ్లు కదా? ఆ పాయింటుతో జగనన్నను కొట్టారన్నమాట! అన్నక్యాంటీన్లను మూసేయడం వల్ల, పేదలు ఆకలితో అల్లాడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నాడు. కాబట్టి కామందుల వారు దయతలచి, అన్నక్యాంటీన్లు మళ్లీ పునరద్ధరించాలని వేడుకున్నాడు. దానికి స్పందించిన కమిషన్ వారు.. ఏపీ పురపాలక శాఖను దీని సంగతేమిటో చూడమని వివరణ కోరారు.
అయితే, పురపాలక శాఖ కార్యదర్శి మాత్రం ‘రాష్ట్రంలో అన్నక్యాంటీన్ల మూసివేతకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు’ అని, పాతకాలంలో టెలిగ్రాం మెసేజ్ మాదిరిగా జవాబిచ్చారు. అప్పుడు నోరెళ్లబెట్టడం, ఆశ్చర్యపోవడం కమిషన్ వంతయింది. అదేంటి? అన్నక్యాంటీన్ల మూతకు, సర్కారు ఆదేశాలివ్వకపోతే.. మరి రాష్ట్రంలో అంతకుముందు, నిక్షేపంగా నడిచిన క్యాంటీన్లను ఏ కాకి ఎత్తుకెళ్లింది? ఒక క్యాంటిన్నయితే ఒక కాకి ఎత్తుకెళ్లొచ్చు. మరి వందల క్యాంటీన్లను ఎత్తుకెళ్లాలంటే కాకుల కెపాసిటీ, సంఖ్య  సరిపోదు. పైగా సెల్  టవర్లూ, అవీ ఎక్కడంటే అక్కడ కట్టారు కాబట్టి.. కాకులు, పిచ్చుకలూ పెద్దగా బతికికూడా లేవు. అసలు పెద్దలకు పెడుతున్న పిండాలు తినడానికే, ఒక్క కాకీ కనిపించడం లేదాయె! కాబట్టి.. ఏ గద్దలో, డేగలో, రాబందు వంటి పక్షిజాతులన్నీ కట్టకట్టుకుని వస్తే తప్ప,  అవి మాయం కావడం అసంభవం అన్న తీర్మానానికి వచ్చింది.
కానీ.. ఇక్కడ దేవతావస్త్రాల కథ మాదిరిగా.. తెలివైన వారికి మాత్రమే తెలిసి, ఇతరులకు తెలియని రహస్యమేమిటంటే.. ఆ అన్నక్యాంటీన్లను పాలకులకు తెలియకుండా, వారిలో పరకాయప్రవేశం చేసి,  మాయం చేసింది మాయల మరాఠా విఠలాచార్యనే! ఈ విషయం ఎలా తెలిసిందంటారా?..  విఠలాచార్య గారు అప్పుడెప్పుడో షూటింగులో, మర్చిపోయిన మంత్రదండం దొరక పుచ్చుకుని.. మాయావి వేషం కట్టిన కైకాల సత్యనారాయణ చెప్పిన ఆనాటి డైలాగు, దానితో ఓ పాటను గుర్తుచేసుకుని చదివితే…. ఈ రహస్యం బయటపడింది! ఇప్పుడు విఠలాచార్య దాచిపెట్టిన అన్నక్యాంటీన్లు, ఎక్కడ ఉన్నాయని వెతకాలంటే అంజనం వేయాల్సిందే. లేకపోతే… విఠలాచార్య వారసుడైన ‘భైరవద్వీపం’  సింగీతం శ్రీనివాసరావును తీసుకురావలసిందే. ఆయనొస్తే తప్ప ‘బెజవాడ ద్వీపం’లో అన్నక్యాంటీన్ల జాడ తెలియదు. అదీకాకపోతే.. రాజుల సినిమాలో మాదిరిగా, జగన్మోహన్‌రెడ్డి కూడా… క్యాంటీన్లను వెతికి తెచ్చిన వారికి అర్ధరాజ్యం ప్రకటిస్తే సరి! బాలకృష్ణ వంటి వీరులు వెతికి పట్టుకొస్తారు. ఏమంటారు రాజా?!

1 COMMENT