‘మాదిరెడ్డి’పైనా తప్పని.. జగన్ ‘ప్రతాపం’!

576

జగనన్న తీర్పునకు అర్ధాలు వేరులే…
ఆయన ‘అన్నా’ అన్నారంటే,  వాళ్లు అయిపోయినట్లే…
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

ఆర్ట్ ఆఫ్ లివింగ్.. బతకనేర్చిన విద్య! ఇది అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తుంటుంది. సలాములు కొట్టడం, గులాంగిరీ చేయడం. రాజకీయాల్లోనయితే ఇది మోతాదుకు మించి కనిపిస్తుంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి, ‘నియోజకవర్గ అభివృద్ధి కోసమ’నే ట్యాగ్‌లైన్‌తో జంపయిపోతుంటారు. అయితే చాలామందికి తెలియని రహస్యమేమిటంటే.. అధికారులు కూడా చాలామంది బతకనేర్చిన విద్యలో ఆరితేరారు. ఈ బాపతు అధికారులు .. ముఖ్యమంత్రులు ఎవరున్నా, వారికి అనుకూలంగా మారిపోతుంటారు. ఫలితంగా మంచి పోస్టింగులు పట్టేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు, ఆయనకు బాగా కావలసిన అధికారులే, వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన పంచన చేరిపోయారు. అది బయట జనాలకు తెలియదు. అది అంతర్గతంగా జరిగే వ్యవహారం కదా?

పాపం.. సత్తెకాలపు సత్తెయ్యలు

కానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియని పాపం కొంతమంది అమాయక అధికారులు, ఇంకా సత్తెకాలపు సత్తెయ్యకాలపు మనుషుల్లాగానే  ఉద్యోగ జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. అంటే పోస్టింగుల కోసం కాకాలు పట్టడం, లాబీయింగ్ చేయడం, పైవారి మెహర్బానీ, మెరమెచ్చుల కోసం తమను తాము అమ్ముకోవడాలు వారికి సుతరామూ నచ్చదు. ఎక్కడ పోస్టింగు వేసినా, ఏ పని చెప్పినా అంతవరకే పరిమితమవుతారన్నమాట. అక్కడ కూడా.. మతలబు ఉందని అనుమానించే ఫైళ్లు వస్తే, నిర్మొహమాటంగా పక్కనపడేస్తారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. తాము కోరుకున్న పనులు చేసిపెట్టాలనుకునే పాలకులకు, ఈ టైపు అధికారులు సెట్టవరు. అంటే ఎల్వీ సుబ్రమణ్యం లాంటి వాళ్లన్నమాట! ఇలాంటి వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో వేళ్లమీదనే లెక్కబెట్టవచ్చు. వారి అదృష్టం బాగుండి, వచ్చిన పాలకుడికి పాలనపై పట్టు ఉంటే, గౌరవప్రదమైన పోస్టులిచ్చి గౌరవిస్తారు. లేకపోతే పనీపాటా లేని ఓ పోస్టు ఇస్తారంతే. అదే నిరంతరం కక్ష సాధింపు మనసుతో రగిలిపోయే పాలకలు వచ్చారనుకోండి. ఇక వారికి అరిచిగీపెట్టినా పోస్టింగులుండవు. ఇచ్చినా, వెంటనే వాటిని కూడా రద్దు చేసి, అవమానిస్తారు.

మాదిరెడ్డి రూటే వేరు…

ఇలాంటి జాబితాలో కనిపించే పేరు మాదిరెడ్డి ప్రతాప్. ఐపిఎస్ అధికారి. ముక్కుసూటి మనిషి. నిజాయితీకి నిలువుటద్దం. తనకు నచ్చని పని, నిబంధనలకు విరుద్ధంగా ఉండే పని అస్సలు చేయరు. అందుకే ఆయన ఏడాదిలోనే రెండు, మూడు శాఖలు మారాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. చాలామంది అధికారుల మాదిరిగా, ఆయనకంటూ సొంత ఇల్లు లేదు. కార్లలోనే వెళ్లాలనుకోరు. పక్కన మందీ మార్బలం, గన్‌మెన్లు ఉండాలనుకోరు. ఒక్కోసారి అలా నడుచకుంటూ, మరీ అర్జంటయితే సైకిల్‌పైనయినా వెళ్లిపోతారు. భేషజాలు లేని మనిషన్నమాట!  ఫైళ్లలో ఉన్న విషయం నచ్చితేనే, నిబంధనలు పాటించారన్న నమ్మకం కుదిరితేనే సంతకం పెడతారు. అలాంటి విషయాల్లో సీఎం చెప్పినా  వినరు. అందుకే ఆయనంటే ఎవరికీ పెద్దగా నచ్చదు.

ఎక్కడదాకో ఎందుకు? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ఎంబీఏ చదివేందుకు సెలవుపై,  ప్రపంచ ప్రఖ్యాత వార్తన్ యూనివర్శిటీకి వెళ్లారు. ఐపిఎస్ అయిన మాదిరెడ్డి, పై చదువులకోసం లండన్ వెళ్లివచ్చిన తర్వాత, ఆయనకు సరైన పోస్టింగ్ ఇవ్వాలని వైఎస్ భావించారు. పలు శాఖల ముఖ్య కార్యదర్శులను అడిగి చూశారు. కానీ వాళ్లెవరూ ‘అమ్మో మాదిరెడ్డా..మాకు వద్దని’ సున్నితంగా చెప్పారట. ఎందుకంటే మాదిరెడ్డి ముక్కుసూటి మనిషి. పైగా ఐపిఎస్. చాలామంది అధికారుల మాదిరిగా ఆయనకు లౌక్యం తెలియదు. ఎవరితో పెద్దగా సంబంధాలుండవు. ఎవరితో కలవరు. ఆయన లోకం ఆయనది. అదో టైపన్నమాట! అదీ అసలు కారణం.

వైఎస్ పేషీలో మెరిసిన మాదిరెడ్డి

దానితో వైఎస్ స్వయంగా తన పేషీలోనే స్థానం కల్పించి, ఐటి , పెట్టుబడులు, పరిశ్రమల విభాగాన్ని అప్పగించారు. అక్కడ ఆయన చూపిన ప్రతిభ అందరి ప్రశంసలు అందుకుంది. తన చదువు, విజ్ఞానాన్ని ఆయా శాఖల అభివృద్ధి కోసం  వినియోగించారు. వైఎస్‌కు ఆ శాఖలో అనేక కొత్త విషయాలు, ప్రపంచంలో మారుతున్న పారిశ్రామికీకరణ, పెట్టుబడుల అంశాలను వివరించేవారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పేషీలోగానీ, ఆయన వద్ద పనిచేసిన అధికారులపైగానీ ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  కొంతమంది అధికారులు జైలుకెళ్లినా, కేసులకు గురయినా.. మాదిరెడ్డి మాత్రం, పులుకడిగిన ముత్యంలా పేరు తెచ్చుకున్నారు. అసలు ‘ఇతర వ్యవహారాల’ గురించి, ఆయనతో మాట్లాడేందుకే అంతా భయపడేవారు. చివరకు వైఎస్‌ను వ్యతిరేకించే విపక్షాలు గానీ, మీడియా గానీ మాదిరెడ్డిపై పల్లెత్తు విమర్శ చేయలేదంటే.. ఆయన వ్యక్తిత్వమేమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వైఎస్ చివరిసారిగా హెలికాప్టర్‌లో వెళ్లినప్పుడు ఆయన వెంట మాదిరెడ్డి ఉండాల్సింది. కానీ, సుబ్రమణ్యం అనే మరొక అధికారి,  ఆయన స్థానంలో వెళ్లాల్సి వచ్చిందనే నిజం చాలామందికి తెలియదు.

జగనన్న రాజ్యంలో అవమానం..

తండ్రి వైఎస్ హయాంలో అలాంటి అధికారి ప్రశంసలు పొందిన మాదిరెడ్డికి సైతం.. వైఎస్ తుయుడయిన జగనన్న రాజ్యంలో, అవమానం తప్పకపోవడమే అందరి ఆశ్చర్యానికి కారణమయింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు, సర్వీసురూల్సుకు విరుద్ధమంటూ ఆయన వివరణ కోరింది.  జవాబు ఇవ్వని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.  ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా ఇచ్చిన పోస్టింగు కూడా రద్దు చేసి, జీఏడీకి రిపోర్టు చేయాలన్న అవమానకర ఆదేశాలు, అధికారవర్గాలనే కాదు.. వైఎస్‌తో కలసి పనిచేసిన వైసీపీ నాయకులనూ  విస్మయపరిచింది.

మాదిరెడ్డి వ్యాఖ్యల్లో తప్పేమిటి?

ఇంతకూ ఆయనేమన్నారంటే.. ‘వైఎస్ వద్ద ఐదేళ్లు పనిచేశా.  నాకు విజయమ్మ కేక్ పంపితే తిని పడుకున్నా. అర్ధరాత్రి జీఓ వచ్చిన సంగతి తెల్లవారిన సంగతి తెలిసింది. కొందరు నా ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వద్ద పనిచేసిన ఎంతోమంది అధికారులను సీబీఐ ప్రశ్నించింది. నన్ను పిలవలేదంటే నా నిజాయితీనే కారణం. హైదరాబాద్‌లో గానీ మరెక్కడా ఒక్క అపార్టుమెంటు కూడా, నాకు లేదని సగర్వంగా చెబుతున్నా’ అన్నారు. తాను మరికొన్ని రోజులు ఆర్టీసీ ఎండీగా ఉంటే, ఎలాంటి సంస్కరణలు కొనసాగి ఉండేవో ఆయన మీడియాకు వివరించారు. పనితక్కువగా ఉండే పోస్టుకు పంపినందుకు బాధలేదన్నారు. బదిలీలు అధికారులకు సహజమేనన్నారు. తన బదిలీని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

నిజానికి 26 ఏళ్ల సర్వీసులో సీనియర్ ఐపిఎస్ మాదిరెడ్డిపై, ఒక్క మచ్చ కూడా కనిపించదు. తాజాగా ఆయన ఏపిఐఐసిలో చేసినప్పుడు చైర్మన్ రోజా, ఆయన నిర్ణయాలను వ్యతిరేకించేవారన్న ప్రచారం జరిగింది. ఇటీవలే ఎంపిగా ఎన్నికయిన అయోధ్య రామిరెడ్డితో కూడా, ఒక అంశంపై విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. ఇక ఆర్టీసీ బస్సుల కొనుగోలులో.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారికి ఇష్టుడైన ఓ మెగా కంపెనీ అభీష్టానికి భిన్నంగా వ్యవహరించినందుకే, మాదిరెడ్డిని బదిలీ చేశారన్న వార్తలు, ఆర్టీసీలో షికారు చేస్తున్నాయి. తండ్రి హయాంలో ఒక వెలుగు వెలిగిన వారికి, తనయుడి హయాంలో చీకట్లు కమ్ముకోవడానికి కారణాలేమిటన్న నిజం ‘జగన్నా’ధుడికెరుక?

అప్పుడు ఎల్వీ అన్న.. ఇప్పుడు ప్రతాపన్న..

ఏపీ సీఎం జగనన్న.. ఇప్పుడు ఏ అధికారిని ‘అన్నా’ అని ఆప్యాయంగా పిలుస్తారో, వారికి మూడిందన్న జోకులు సచివాలయంలో టపాసుల్లా పేలుతున్నాయి. అధికారులను అన్నా అని సంబోధిస్తున్న సీఎం పిలుపునకు అధికారులు తొలుత మహదానందపడి, మురిసిముక్కలవుతున్నారు.  కానీ రాను రాను,  ఆ పిలుపు- మాటలలో ఉన్న తియ్యద నం.. తర్వాత వికటించి, అదెంత కాఠిన్యంగా ఉంటుందో ఎల్వీ సుబ్రమణ్యం, మాదిరెడ్డి ప్రతాపు చేదు అనుభవాలు చూసిన తర్వాత గానీ అర్ధం కాలేదట. ఏదయినా.. అనుభవమయితే తప్ప తత్వం బోధపడదు కదా?!