ఆంధ్రుల రాజధాని…ఏపీ రాజధాని వేరు వేరు !

219

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది?
జవాబు: ఇప్పటి వరకైతే…బెజవాడ కు పక్కన, గుంటూరు జిల్లా రూరల్ లోకి వచ్చే తుళ్లూరు, మందడం సమీపం లోని వెలగపూడి. దీనికి, ‘అమరావతి’ అనే నామాంతరం కూడా గత ఐదారేళ్లుగా వాడుకలో ఉంది.
ప్రశ్న : మరి, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు వారి ‘రాజధాని’ ఏది?
జవాబు: హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్.
ప్రశ్న : ఎందుకని?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా; ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా పని చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు స్థిర నివాసం హైదరాబాద్ . ఆయన కుమారుడు, ఏ పీ శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ స్థిర నివాసం హైదరాబాద్. ఏ పీ శాసన మండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్థిర నివాసం హైదరాబాద్. ఏపీలో పని చేస్తున్న ఐ ఏ ఎస్; ఐ పీ ఎస్ అధికారుల్లో అత్యధిక శాతం వారి స్వంత నివాస గృహాలు హైదరాబాద్ లో.
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతానికి…అవసరం రీత్యా తాడేపల్లిలో ఉంటున్నప్పటికీ…ఆయన శాశ్వత నివాస గృహం హైదరాబాద్. ఏ పీ సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక భాగం వారి కొంపా… గోడూ హైదరాబాదే. మంత్రులూ…లేజిస్లేచర్ లో అధిక సంఖ్యాకుల స్థిర నివాసాలు హైదరాబాదే.
13 జిల్లాలకు చెందిన వారిలో….దాదాపు ప్రతి కుటుంబానికో…లేక ప్రతి రెండు, మూడు కుటుంబాలకో…. ఒకరు-లేక- ఇద్దరి తల రాతలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాదే.
వారి పిల్లల చదువు సంధ్యలు, ఆస్తిపాస్తులు, బాగోగులు, బతుకు తెరువులకు ఆతిధ్యమిస్తున్నది…హైదరాబాద్ మహానగరం.
13 జిల్లాల్లో ఇంటింటిలో నిత్య స్మరణకు పాత్రమైన పేరు- హైదరాబాద్.
అక్కడ నెల తప్పినవారు పురుడు పోసుకునేది ఇక్కడ. అక్కడ పుట్టినవారు… స్కూల్ లో చేరేది ఇక్కడ. అక్కడ చదువుకున్న వారు …ఉద్యోగ వేట ప్రారంభించేది ఇక్కడ. అక్కడ ఇల్లూ వాకిలీ; పొలమూ.. పుట్రా అమ్ముకుంటే….కొనేది ఇక్కడ. హైదరాబాద్ లో. అక్కడ రాజకీయం చేయాలనుకున్న చిరంజీవి, అల్లు అరవింద్ ఉండేది ఇక్కడ. అక్కడ ప్రజా సేవ చేద్దామనుకుంటున్న జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉండేది ఇక్కడ. అక్కడ జలుబు చేసిన వారు తుమ్మేది ఇక్కడ.
1956 నుంచీ హైదరాబాదే తెలుగు వారి ‘భాగ్య నగరం’ కావడం తో 13 జిల్లాలకు చెందిన సమస్త కులాలు, మతాలు, వర్గాల వారి తల రాతలకు నిలయంగా మారింది హైదరాబాద్.
ఆంధ్రుల కుటుంబాలు హైదరాబాద్ తో ఎంతగా మమేకం అయ్యాయో తెలియాలంటే…దసరా, సంక్రాంతి వంటి పర్వదినాలప్పుడు చూడాలి. హైదరాబాద్ నుంచి వేలాదిమంది తమ, తమ స్వంతూళ్లకు పిల్లా,పాపతో తరలి వెళ్ళిపోతే….హైదరాబాద్ రోడ్లు ఖాళీ. సినిమా హాళ్లు ఖాళీ. వ్యాపారాలు ఖాళీ. షాపింగ్ మాల్స్ ఖాళీ.రెస్టారెంట్స్ ఖాళీ. మొత్తం హైదరాబాదే ఖాళీ.
హైదరాబాద్ లేని ఆంధ్రులకు బతుకు లేదు. ఆంధ్రులు లేని హైద్రాబాద్ కూ బతుకు లేదు. They are made for each other.
ఇక్కడి ఉద్యోగ, విద్య, వైద్య వసతులు, సౌకర్యాలు, అవకాశాలు ఆంధ్ర ప్రాంతం లో కనపడనందువల్లనే… తీపి నీటికి చేపలు ఎదురెక్కినట్టు 13 జిల్లాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయ నాయకులు, సంపన్నులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు వగైరా సమస్త వర్గాల ఆంధ్రులకు హైదరాబాదే నిలయంగా మారింది.
13 జిల్లాల మంచి చెడ్డలు, రాజకీయాలు, అక్కడి ప్రభుత్వం పై చేసే పనులపై చర్చోపచర్చలూ…వ్యాఖ్యానాలూ…డిబేట్లూ, స్ట్రెయిట్ టాక్ లూ, వంకర టాక్ లూ,విశ్లేషణలూ…,బ్రేకింగ్ న్యూసులూ…, ఏ గూటి చిలకల ఆ గూటి పలుకులూ…వగైరాలుఅన్నీ సాగుతున్నది హైదరాబాద్ నుంచే.
అందుకే…ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటనే నిర్లిప్తత అత్యధిక ఏ పీ ప్రజలలో ఉంది. అది ఎక్కడున్నా…మామూలు జనానికి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. దానివల్ల రాజకీయ నాయకులకు, అధికారులకు, కాంట్రాక్టర్లకు, బ్రోకర్ లకు, దళారులకు, పైరవీలకు తప్ప …తమకు అక్కరకొచ్చేది ఏమీ లేదనే భావమే ప్రజలలో ఉంది.
రాయలసీమ లోని కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు వాసులకైతే…అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది, హైదరాబాద్ .
అందుకే తమ నాలుగు జిల్లాలను తెలంగాణలో కలపమని జే సీ దివాకర్ రెడ్డి లాటి నేతలు…రాష్ట్ర విభజన సమయం లో నెత్తీ నోరూ కొట్టుకున్నారు. ‘అమ్మ’ పట్టించుకోలేదు
అందువల్ల; ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసమని అమరావతి నిర్మించినా..;.కాదని అనకాపల్లి లో పెట్టినా….ఆంధ్రులు పట్టించుకోవడంB లేదు.
వారి ‘భాగ్య నగరం’ హైదరాబాదే! గతం లోనూ…;వర్తమానం లోనూ….; భవిష్యత్ లోనూ!

-భోగాది వెంకట రాయుడు

1 COMMENT