పజ్జన్న.. ఈ పనులేందన్న?

632

సర్కారు మాటంటే లెక్కలేదా?
కరోనా వచ్చినా ఖాతరు చేయవా?
కేటీఆర్ చెప్పినా డోంట్ కేరేనా?
అందరికీ అంటిస్తారా ఏంది?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఖాసు మనిషి. అందుకే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించినా,  డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. మరి పజ్జన్న.. అదేనండీ పద్మారావు మాత్రం తక్కువోడా ఏందీ? పబ్లిక్‌తో మస్తు మజా చేస్తాడు. మజాక్‌కు ఆడా, మగా తేడా లుండవు. ఆయన ఆఫీసుకెళితే అవన్నీ చూడొచ్చు. మాస్ మల్లన్న మాదిరిగా జనంతో కలసిపోతారు. భేషజాలేవీ ఉండవు. పక్కా మాసంటే పక్కా మాస్ అంతే!

కానీ, ఆయన మంత్రి నుంచి డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎదిగినా.. ఇంకా, ఆదయ్యనగర్, గాసుమండి చేష్టలు పోలేదు. ఇప్పుడు అది పజ్జన్నకే కాదు, పక్కనుండేవాళ్లనూ పరేషాన్ చేస్తోంది. కరోనా సోకిన పజ్జన్న ఇంటిపట్టునే ఉండకుండా.. అట్ల తగ్గిందో లేదో, ఇట్ల రోడ్డుమీదకొచ్చి బోనాల సంబరం చేసిండంటే.. ఆయన్నేమనాలి? ఇంకా ఇంట్ల పబ్లిక్‌తో ముచ్చట్లు పెడుతుంటే ఏమనాలి? అసలు కరోనా దిక్కెల్లి.. బోనాలు, ఫలహార బండ్ల ఊరేగింపులూ  జాన్తానై అని సర్కారే చెప్పినా, దాన్ని బేఖాతరు చేసి.. ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న పజ్జన్న తీరుతో.. విపక్షాలకు ఏం జవాబు చెప్పాలో తెలియక సర్కారు తలపట్టుకుంది.

హైదరాబాదోళ్లకు కరోనా రాదన్నారు..

డిప్యూటీ స్పీకర్ పద్మారావు రూటే సెపరేటు. ఆయన సీతయ్యకు కాకయ్య! ఎవరు చెప్పినా వినరు. చివరకు పార్టీ సుప్రీం కేటీఆర్ చెప్పినా వినరు. అదేమంటే నాకు కేసీఆర్ బాసంటారేమో మరి?! మొన్నామధ్య..సికింద్రాబాద్ ఫంక్షన్ హాల్లో ఓ కార్యక్రమానికి పద్మారావు, మంత్రి కేటీఆర్‌ను పిలిచారు. ఆలస్యమయినా పజ్జన్న పిలిచాడని, అక్కడికి వచ్చిన కేటీఆర్.. మాస్కు కట్టుకోమని, తన వద్ద ఉన్న మాస్కును పజ్జన్నకు ఇచ్చారు. మరి దాన్ని కట్టుకోవాలి కదా? అహ.. కట్టుకుంటే పజ్జన్న ఎందుకవుతాడు? ‘మా హైదరాబాదోళ్లు స్ట్రాంగుంటారు. మాకు కరోనా గిరోనా రాదని’ ఆ మాస్కును మడిచి తన జీన్స్ ఫ్యాంటు జేబులో పెట్టుకున్నారు.

కేటీఆర్ చెప్పినా బేఖాతరు..

ఇంకొరినయితే కేటీఆర్ ఏమనోవారో గానీ.. పజ్జన్న కదా..? ‘చిచ్చా’తో ఎందుకులే అనుకుని, తలకొట్టుకుని వెళ్లిపోయారు. ఉన్నట్లుండి ఓరోజు పద్మారావుకూ కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త, ఆయన అభిమానులను కలవరపరచింది. ఆయనొక్కడికయితే సరే.. పాపం ఇంట్లో ఉండే కుటుంబసభ్యులకూ సోకింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ఓ సభలో ఉదహరించారు. ‘పద్మారావుకు నేనెంత చెప్పినా.. మాస్కు కట్టుకోకుండా, హైదరాబాద్ వాళ్లకు కరోనా రాదని చెప్పాడు. మేమంతా స్ట్రాంగ్‌గా ఉంటామని అన్నాడు.  ఇప్పుడేమైంది? ఆయనకు కరోనా వచ్చింది. ఆయనకొక్కడికి వస్తే ఫర్వాలేదు. ఇంట్లో అందరికీ వచ్చింది. కాబట్టి మీరంతా జాగ్రత్తలు పాటించాలని’ కేటీఆర్ ప్రజలను హెచ్చరించారు. ఆరుపదులొచ్చిన పద్మారావు తన వయసును మర్చిపోయి, వ్యవహరించడమే ఆశ్చర్యం.

నిబంధనలు బేఖాతరు చేసినందుకే…

పజ్జన్నకు కరోనా సోకిందని తెలియడంతో, ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు, గన్‌మెన్లు, ఆయన వెంట తిరిగిన ఓ వందమంది కరోనా టెస్టులు చేయించుకోవలసి వచ్చింది. వాళ్లలో చాలామందికి అదృష్టవశాత్తూ నెగటివ్ వచ్చింది. అయినా హోంక్వారంటైన్‌లోనే ఉంటున్నారనుకోండి. నిజానికి కరోనా సీజన్‌లో పద్మారావు, కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా బేఫికర్‌గా  తిరిగారు. కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండా, జనం మధ్యలో కార్యక్రమాలు నిర్వహించారు.

లాక్‌డౌన్ సీజన్ ప్రారంభంలో, ఒక వర్గానికి చెందిన వారి వల్లే కరోనా వైరస్ వచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ పద్మారావు దానిని ఖాతరు చేయకుండా, అదే వర్గం వారితో ఎక్కువగా కలసి తిరిగారు. దానితో మిగిలిన వర్గాలు భయపడి, ఆయన వద్దకు రావడం మానేశారు. సన్నిహితులు, మిత్రులు ఎంత చెప్పినా ‘ఢిల్లీలోవాళ్లు వేరు, మనదగ్గర వాళ్లు వేర’ని కొట్టిపారేశారు. చివరకు కరోనా పద్మారావును సోకింది. దానితో ప్రైవేటు ఆసుపత్రిలో, రెండు మూడు రోజులు చికిత్స తీసుకుని, మళ్లీ ఇంటికొచ్చేసి, అక్కడే చికిత్స పొంది ఊరట పొందారు.

అయినా… మనిషి మారలేదు..

కరోనా చికిత్స చేయించుకుని కోలుకుంటున్న పజ్జన్న.. మళ్లీ వారంలో బయటకొచ్చి, మరోసారి కరోనా నిబంధనలు తుంగలోతొక్కారు. ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. ఎక్కడా మాస్కు కట్టుకున్నట్లు గానీ, భౌతిక దూరం పాటించినట్లు గానీ కనిపించలేదు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయి, సర్కారుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ పెద్దలే నిబంధనలు పాటించకపోతే, ఇక పౌరులను హెచ్చరించే నైతిక అర్హత, ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

బోనాలు రద్దు చేసినా..

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల.. ఈ ఏడాది బహిరంగ బోనాలను సర్కారు అనుమతించలేదు. అంటే ఫలహారబండ్ల ఊరేగింపులను నిషేధించింది. ప్రభుత్వమే సంప్రదాయం ప్రకారం.. అమ్మవారికి బోనం, శాక సమర్పించింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దంపతులు, మహంకాళి అమ్మవారికి ప్రభుత్వ పక్షాన బోనం సమర్పించారు.
కరోనా కారణంగా మునుపటి మాదిరిగా జంట నగరాల్లో ఎక్కడా,  బోనాల సందడి కనిపించలేదు. పజ్జన్న మాదిరిగానే.. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా, ఆర్భాటంతో  ఫలహారబండ్లు తీసుకువచ్చే తలసాని కూడా, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆ వేడుకకు దూరంగా ఉన్నారు. లేకపోతే ప్రతి ఏటా పద్మారావుకు  పోటీగా, తలసాని కూడా అమ్మోరి జాతరను ఆర్భాటంగా నిర్వహిస్తారు. ఇటీవల ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్న తలసాని.. మాస్కులతో కనిపిస్తుంటే, డిప్యూటీ స్పీకరయిన పద్మారావు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు.

పద్మారావు అదృష్టం బాగుండి..

పద్మారావు అదృష్టం బాగుండి.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సికింద్రాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీకి సరైన నాయకత్వం, నేతలు లేక.. దీనిని ఇప్పటివరకూ యాగీ చేయలేదు. పద్మారావు అదృష్టమేమిటంటే.. ఆ రెండు పార్టీల నుంచి అక్కడ, ఆయనను విమర్శించే దమ్మున్న నేతలే లేకపోవడం! అక్కడ ఆ రెండు పార్టీలు పడకేశాయి మరి. కానీ సోషల్ మీడియాలో మాత్రం… పజ్జన్న ఫలహారబండ్ల ఊరేగింపు కత యమా వైరల్ అవుతోంది.

వారసులు చెబితే… పోయేది మీ ఇజ్జతే!

హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు నిరంతరం జనంలో, జనంతో ఉండేవారే. దావత్‌లు, చావులు, పెళ్లిళ్లు,  బైటక్‌లతో బిజీ బిజీ. ఎప్పుడూ ఇన్నాళ్లు ఇంట్లో ఖాళీగా ఉండటం తెలియదు. కానీ కరోనా వారికి బ్రేకులు వేసింది. దేశంలో హైదరాబాద్ నగరంలోనే, కరోనా కేసులు శరవేగంగా  పెరుగుతున్నాయి. కనీసం మాస్కులు, భౌతిక దూరం కూడా పాటించని హైదరాబాద్ నేతలు, రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులకు కరోనా సోకి, కోలుకుంటున్నారు. రాజధాని నగరంలో,  కొంచెం హడావిడి చేసే నేతల వయసంతా 50 ఏళ్ల పైమాటే. దాదాపు అందరికీ వారసులొచ్చేశారు. కొందరు రాజకీయాల్లో చురుకుగానే ఉంటున్నారు. వారిలో కొందరు తండ్రులనూ శాసిస్తున్నారు. ఈ కరోనా కల్లోల సమయంలో, నేతలు ఎవరి మాట వినడం లేదు. కాబట్టి.. వారికి వారసులే బ్రేకులు వేయాలి. నాయకులు కూడా.. కరోనా తీవ్రత గుర్తించాలి. పద్మారావు మాదిరిగా,  కరోనా నాకెందుకొస్తుందన్న భ్రమల్లో ఉంటే.. ఆయన మాదిరిగా, ఆసుపత్రి పాలుకాకతప్పదు.  మీ ప్రాణాలు చాలా ముఖ్యం. మీ కుటుంబ సభ్యులొక్కరి కోసమే కాదు.. మిమ్మల్ని నమ్ముకున్న వందలు, వేలాది మంది అనుచరులు, కార్యకర్తలు, ప్రజల కోసమయినా, మీరు ఇంటిపట్టునే ఉండండి. మీ వారసులతో చెప్పించుకునే స్థాయికి చేరితే పోయేది..  మీ ఇజ్జత్తే. తర్వాత మీ ఇష్టం!