వీరులలో.. ట్విట్టరు వీరులు వేరయా..?

324

మోదీ, మహేష్, రాహుల్, బాబు, లోకేష్ టాప్
జగన్ కంటే పవన్‌కే ఎక్కువ ఫాలోయింగ్
(మార్తి సుబ్రహ్మణ్యం  – 9705311144)

‘‘ వీరులలో ట్విట్టరు వీరులు వేరయా.విశ్వదాభిరామ ట్విట్టరు వేమ

’’. ట్వీట్లు.. ప్రచారంలో ఇదో కొత్త పుంత! ఏదైనా ఘటనపై వెనువెంటనే స్పందించాలంటే ఇదొక ఆధునిక సాంకేతిక మార్గం. అప్పటికప్పుడు ప్రెస్‌కాన్ఫరెన్సులు పెట్టి, మీడియా పేరంటం పెట్టాల్సిన పనిలేదు. గొట్టాలతో అసలు పనే లేదు. నరేంద్ర మోదీ నుంచి సీపీఐ నారాయణ వరకూ.. జనం నోటిలో నానుతున్నారంటే, దానికి కారణం ఈ ట్విట్టర్ చిలకనే! సోషల్‌మీడియాలో యమా చురుకుగా ఉండేందుకు ట్వీట్లను ఎంచుకునే ప్రముఖులు, దానికోసం ప్రత్యేకంగా ఓ టీమును నియమించుకుంటారు. నిరంతరం చానెళ్ల ముందు కూర్చుని, జరిగే సంఘటనలపై వాయివేగంతో స్పందించడమే ఈ టీముల ఉద్యోగం! చురకత్తుల్లాంటి కుర్రాళ్లు, అనుభవజ్ఞుల మేలుకలయికతో ట్వీట్లను వండివారిస్తుంటారన్నమాట. అటు ట్విట్టర్ కూడా బాగా చురుకుగా ఉండేవారిని సెలబ్రిటీగా గుర్తిస్తూ, వారికి ‘గ్రీన్ టిక్’ ఇస్తుంటుంది.

ట్విట్టర్‌లో ఇలా..

మన దేశంలో ట్వీట్ల ద్వారా నిరంతరం మేల్కొని ఉండే అగ్రనాయకులు ‘ట్విటిజన్లు’ను పలు అంశాలపై పలకరిస్తుంటారు. అందులో అగ్రస్థానంలో నిలుచున్న నేత ప్రధాని నరేంద్ర మోదీ!  ప్రధాని మోదీ,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు. ఒక్కోసారి ఆయనను అధికమిస్తున్నారు కూడా. ఇక ఆయన తర్వాత దేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోయిన రాహుల్‌గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో ‘తెరాస పనిచేసే అధ్యక్షుడ’యిన మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక సినిమా స్టార్ మహేష్ సినిమాతారల్లో అందరికంటే, అందనంత దూరంలో ఉన్నారు. ఇక ఈ ట్విట్టర్ ఖాతాల కథేమిటో చూద్దాం రండి.

ట్విట్టర్ వీరులు..  వీరే!

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను అత్యధికంగా.. అంటే  5 కోట్ల 98 లక్షల 13 వేల 243 మంది ఫాలో అవుతున్నారు! కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని ఒక కోటి 51 లక్షల 91 వేల 675 మంది, హీరో మహేష్‌బాబును ఒక కోటి 10 లక్షల 97 వేల 519 మంది, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును 47 లక్షల 25వేల 886 మంది, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను 40 లక్షల 23 వేల 515 మంది, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను  24 లక్షల 65 వేల మంది, ఏపీ సీఎం జగన్‌ను 16 లక్షల 78 వేల 933 మంది,  కేసీఆర్ కుమార్తె కవితను 9 లక్షల 76 వేల 364 మంది, తెలంగాణ మంత్రి హరీష్‌రావును 9 లక్షల 22 వేల 481 మంది,  టీడీపీ యువ నేత నారా లోకేష్‌ను 7 లక్షల 82 వేల 933 మంది, చిరంజీవిని 5 లక్షల 94 వేల 281 మంది, విజయసాయిరెడ్డిని 3 లక్షల 85 వేల 241 మంది, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని 2 లక్షల 9 వేలమంది, బీజేపీ ఎంపి జీవీఎల్ నరసింహారావును లక్షా 23 వేల 628 మంది, టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడును ఒక లక్ష 9 వేల 693 మంది, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను 72 వేల 987 మంది, విజయవాడ ఎంపి కేశినేని నానిని 59 వేల 460 మంది, తెలంగాణ కాంగ్రెస్ నేత, నటి విజయశాంతిని 45 వేల 700 మంది,  ఇటీవలే ఖాతా తెరచిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను 26 వేల 596 మంది, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ను 14,534  మంది తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను 7 వేల 700 మంది, ఎంపి రఘురామకృష్ణంరాజును 3 వేల 857 మంది  ఫాలో అవుతున్నారు.

ముందు వరసలో కేటీఆర్..


వీరిలో వివాదాస్పద ట్వీట్లతో, ప్రత్యర్ధులపై యుద్ధం చేస్తున్న వారిలో విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉన్నారు. తెలంగాణ మంత్రి కేసీఆర్ అందరికంటే ఎక్కువగా ‘ట్విటిజను’లతో టచ్ లో ఉంటున్నారు. హైదరాబాద్ నగర వాసులు తమ సమస్యలను ట్వీట్ల ద్వారానే ఆయన దృష్టికి తీసుకువెళుతుంటే, దానికి ఆయన వెంటనే స్పందిస్తూ, వాటిని సంబంధిత అధికారులకు బదిలీ చేస్తున్నారు.  కౌంటర్లు ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి ముందున్నారు.