తెలుగోడి నోట మళ్లీ ఆల‘మట్టి’

388

కర్నాటక ‘ఎత్తు’కు తెలుగు రాష్ట్రాలు చిత్తేనా?
ఎత్తు పెంచితే తెలంగాణ-ఏపీ రైతుల నోట మట్టే
దానికి కేంద్రం అనుమతిస్తుందా?
కాంగ్రెస్ చెలగాటం.. కమలం ఇరకాటం
ఏపీలో టీడీపీ గళం విప్పుతుందా?
జగన్-కేసీఆర్ జమిలిగా పోరాడతారా?
            (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. చుక్కనీరు కూడా తెలుగు రాష్ట్రాలకు వదలకుండా ఉండేలా నిర్మించాలనుకుంటున్న ‘ఎత్తు’గడను,  జగన్-కేసీఆర్ జమిలిగా ఎదుర్కొంటారా? ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సాగు-తాగు నీటిని దెబ్బతీసే.. కర్నాటక కమలం సర్కారు చేస్తున్న ప్రయత్నాలను, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కమలదళాలు స్వాగతిస్తాయా? నిరసిస్తాయా? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ చెలగాటమాడుతుంటే, కమలదళం ఇరుకున పడుతోంది. పక్కనున్న రాష్ట్రం సాగించనున్న నీటిదోపిడిని నిలువరించడమా? లేక రాజకీయ మొహమాటంతో,  మౌనంగా ఉండటమా?.. ఇదీ రెండు రాష్ట్రాల కమలనాధులకు వచ్చిన పడిన సమస్య. అంతేనా?.. కర్నాటక జలచౌర్యంపై ఇప్పటిదాకా  కేసీఆర్ సర్కారు మంత్రి స్థాయిలో స్పందించలేదు. పక్కనే ఉన్న జగన్ సర్కారు కూడా.. తన పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రంపై కయ్యానికి కాలు దువ్వుతుందా? లేక బీజేపీ సర్కారు కదా.. మనకెందుకులే అని మొహమాటం ప్రదర్శిస్తుందా? సరిగ్గా.. ఇలాంటి మొహమాటమే టీడీపీది కూడా! మరి ఆ పార్టీ కర్నాటకలోని బీజేపీ సర్కారును విమర్శిస్తుందా? లేక జగన్ సర్కారు అసమర్ధైతపె సమరం సాగిస్తుందా?.. ఇవీ ప్రశ్నలు!

కర్నాటక ‘ఎత్తు’తో చిత్తవుతామా?

కర్నాటక కమలం సర్కారు.. ఏపీ-తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టే, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే మాయోపాయానికి తెరలేపింది. ఎగువ కృష్ణానదిపై ఉన్న ఆల్లట్టి డ్యాం ఎత్తు పెంచుతూ.. కర్నాటక సర్కారు కేంద్రానికి ప్రతిపాదన పంపించినట్లు,  స్వయంగా ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రమేష్ చేసిన ప్రకటన, తెలుగు రాష్ట్రాల రైతులను కలవరపెడుతోంది. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519 మీటర్లు. అయితే దానిని భూసేకరణతో కలపి, 61 వేల కోట్లతో 524 మీటర్లకు పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించి, ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కర్నాటక మంత్రి వెల్లడించారు. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన సెలవిచ్చారు.

ఇప్పటికే దేవెగౌడ హయాం నుంచి, పెంచిన ఎత్తుతో రెండు తెలుగు రాష్ట్రాలు సాగు-నీరు లేక విలవిల్లాడుతున్నాయి. నిజానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కాదని, కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ఉవ్విళ్లూరుతోంది. కర్నాటక ఇప్పుడు కూడా, గత దేవెగౌడ సర్కారు మాదిరిగా ఈ చర్యలకు దిగితే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వచ్చే వరద నీరు చాలా వరకు తగ్గిపోతుంది. వీటిపై ఆధారపడే లక్షలాది ఎకరాల ఆయకట్టును, ఎడారిగా మార్చే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

కొనసాగుతున్న కర్నాటక కుట్రలు..

ప్రతిసారీ ఆల్మట్టి నీరు నిండుతున్నా.. కర్నాటక సర్కారు నీరు కిందికి విడుదల చేయకపోవడం, మొత్తం నీటిని తీసుకోవాలన్న ఆలోచన ప్రతిసారీ వివాదమవుతోంది. వాటిని ఆ ప్రభుత్వం.. ఎత్తిపోతల పథకాల ద్వారా తన రాష్ట్రంలోని కింది ప్రాజెక్టులకు తరలిస్తుంటే, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్- నేటి రెండు తెలుగు రాష్ట్రాలు చోద్యం చూడటం, మహా అయితే ఫిర్యాదు చేయడం వినా, మరేమీ చేయలేకపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రావలసిన 130 టీఎంసీలను, కర్నాటక  అడ్డగోలుగా వాడుకుంటోంది. కర్నాటక తీరుతో.. తెలంగాణలో మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ, జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులకూ, ఆల్మట్టి వల్ల ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వరద  జలాలపై ఆధారపడి నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతోంది.

పరేషాన్‌లో.. పాలమూరు రైతు

ప్రధానంగా కృష్ణానదీ జలాశయంపై మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించే ప్రాజెక్టులు, ఆల్మట్టి ఎత్తు పెంచితే నష్టపోతాయన్న ఆందోళన ఆ జిల్లా వాసుల్లో ఏనాటి నుంచో ఉంది.  ఇటు శ్రీశైలం డ్యాంలో నీళ్లకు ఎప్పుడూ కరవే. తమకు సాగర్ నుంచి నీళ్లకు ఇబ్బంది ఉన్నందున, కనీసం తాగడానికయినా కొంత నీటిని విడుదల చేయాలని, గత ంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ కర్నాటకను కోరారు. అయితే చూద్దామన్న నిర్లక్ష్య సమాధానమే అప్పట్లో వచ్చింది. ఈవిధంగా మనకు రావలసిన నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా, తన రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు మళ్లించుకుంటున్న కర్నాటక వైఖరి, ఎప్పుడూ కఠినంగానే ఉంటోంది.

కర్నాటకకు కేంద్రం అనుమతిస్తుందా?

అయితే.. కర్నాటక సర్కారు అడ్డగోలుగా ఆల్మట్టి ఎత్తు పెంచుకునే అధికారం, అవకాశం లేదు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు తన వాదన వినిపించేందుకు సిద్ధంగానే ఉంది. ఆల్లట్టి ప్రాజెక్టును 519 మీటర్ల నుంచి, 524 అడుగుల ఎత్తుకు పెంచుకునేందుకు.. కర్నాటక సర్కారు ప్రతిపాదించినప్పుడు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. తర్వాత దీనిని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పునరుద్ధరించింది. రాష్ట్రం విడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఏపీ, మహారాష్ట్ర కూడా కోర్టుకెక్కాయి. దానిపై సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. ఆ ప్రకారంగా.. ఇప్పుడు కర్నాటక మంత్రి చెప్పినట్లు, ఎత్తు పెంచితే అది కచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుంది. అంటే సుప్రీంకోర్టు..  తెలంగాణ సహా రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాతనే, స్టేపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, రాష్ట్ర వాదనలు వినలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి.. కేంద్రంలో-కర్నాటకలో  బీజేపీ  సర్కారు ఉన్నంతమాత్రాన, ఆల్మట్టి ఎత్తు పెంచడం కుదరదని అర్ధమవుతుంది.

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు..

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన ట్లు.. కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు,  తెలుగు రాష్ట్రాల కమలదళాలకు కలవరం కలిగిస్తున్నాయి. ఎత్తు పెంచడం ద్వారా.. ఏపీ-తెలంగాణ లోని జిల్లాలు నష్టపోతున్నాయని, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గళం విప్పుతోంది. బచావత్ అవార్డు కేటాయింపుల ప్రకారం, ఆల్మట్టి డ్యాం ఎత్తు 518.7 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నాటక చర్య వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు.. వరద జలాలపై ఆధారపడి నిర్మించిన,  నిర్మాణంలో ఉన్న డిండి, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్బీసీ, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 27.4 లక్షల ఎకరాలు, ఎడారిగా మారే ప్రమాదం ఉందని వంశీ ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటక చర్యను అడ్డుకునేందుకు, కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కమలం.. కిం కర్తవ్యం?

ఆల్మట్టి అంశంపై కాంగ్రెస్ లేవెనెత్తిన ఈ అంశం, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకత్వానికి ఇరకాటంగా మారింది. ఒకవేళ సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం, గళం విప్పితే కర్నాటకలో ఉన్న బీజేపీ సర్కారుకు, అది ఇబ్బంది కలిగించవచ్చు. జాతీయ పార్టీ అయిన బీజేపీ, ఏ అంశంపైనయినా స్పష్టతతో ఉంటుంది. ప్రధానంగా.. ఏపీతో పోలిస్తే,  బీజేపీ బలంగా ఉన్న తెలంగాణలో, ఆ పార్టీకి  ఈ అంశం కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే, ఈ అంశంలో ఇప్పటికే,  తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడుగా వెళుతున్నారు. అఖిలపక్షం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఎత్తును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తున్న కర్నాటక సర్కారు విధానంపై, రాజకీయ పార్టీగా బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

జగనన్న-చంద్రన్న వైఖరేమిటో..?

ఆల్మట్టి ఎత్తు అంశంపై ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సైతం ఎవరి మొహమాటాలు వారికి ఉన్నట్లు కనిపిస్తోంది. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండటమే దానికి కారణం. ఇదే అంశంపై గతంలో.. చంద్రబాబు సీఎం, దేవెగౌడ సీఎంగా ఉండగా ఫ్రంట్ కన్వీనర్ హోదాలో బాబు.. నాటి పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతిబసు నేతృత్వంలో ఐదుగురు సీఎంలతో ఒక కమిటీ వేసి.. ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఆపించారు.

ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఆల్మట్టిని ఎలా అడ్డుకుంటారో చూడాలి. కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండటం, ఇప్పటిదాకా ఇలాంటి జల సమస్యను తెలంగాణతో తప్ప, బీజేపీ పాలిత రాష్ట్రాలతో ఎదుర్కోలేదు. నిజానికి రెండు జిల్లాలు ఆల్మట్టితో నష్టపోయే అవకాశం ఉన్నందున, ఆయన పాలనాపరంగా దానిని అడ్డుకోవలసి ఉంది. అదే సమయంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా బీజేపీతోగానీ,  పార్టీ పాలిత రాష్ట్రాలతో గానీ ఎలాంటి వైరం లేని జగన్‌కు, ఇప్పుడు ఆల్మట్టి రూపంలో పెద్ద పితలాటమే వచ్చి పడింది.

అటు చంద్రబాబు కూడా ఈ సమస్యపై, ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు బీజేపీపై యుద్ధం ప్రకటించిన బాబు.. తర్వాత పూర్తి స్థాయిలో మౌనం వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకపోగా, మోదీ పాలనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో,  ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక తీరును బాబు తప్పుపట్టే సాహసం చేస్తారా? లేక ఆల్మట్టి ఎత్తును అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారన్న విమర్శలకు తెరలేపుతారో చూడాలి.