అదో తుత్తి…అంతే

465

ఎన్ టి రామారావు తరువాత అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారు. 2004 లో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆనాటి కాంగ్రెస్ లో ‘కాంగ్రెస్ అధిష్టానం’ అంటే…రాజశేఖర్ రెడ్డే. అప్పుడు మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ మాటను బహిరంగం గా ప్రకటించారు కూడా. ఆ ప్రకటన పై ఒక్కరు కూడా కిక్కురుమనలేదు. ఢిల్లీకి ఫిర్యాదు చేయలేదు. అదీ…ఆనాటి కాంగ్రెస్ లో .వైఎస్ స్థాయి, పట్టు.కాంగ్రెస్ లో ఓకే నాయకుడు ఐదేళ్లు ముఖ్యమంత్రి గా ఉండడం వై ఎస్ కే చెల్లింది.
2009 వచ్చేసరికి…చంద్రబాబు మహాకూటమి ఒక పక్క;చిరంజీవి ప్రజారాజ్యం ఒక పక్క విసిరిన సవాళ్ల నుంచి కాంగ్రెస్ ను గెలిపించి .. వైస్సార్ .ముఖ్యమంత్రి అయ్యారు.
అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు దుర్మరణం పాలైతే….ఆయన కొడుకు ;తన తండ్రి పేరిట రాజకీయ పార్టీ పెట్టాలని భావించడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. తప్పు పట్టలేరు కూడా.
అందుకే…వైస్సార్ పేరిట వైస్సార్ కాంగ్రెస్ అనే పార్టీ పెడదామని ఆయన భావించినప్పుడు; ఎవరో ఆ పేరును అంతకంటే రిజిస్టర్ చేయించుకుని ఉండవచ్చు.. తప్పులేదు. కానీ…వారు ప్రజా జీవితంలో విజయవంతంగా కొనసాగుతూ వస్తున్న వారు కాదు. వైస్సార్ అభిమానులు అయితే అయి ఉండవచ్చు. ఆయనకు నిజమైన అభిమానులే అయి ఉంటే…
సాక్షాత్తు వైస్సార్ కొడుకే, తన దివంగత తండ్రి పేరిట పార్టీ పెట్టి:ప్రజా జీవనంలో కొనసాగాలని భావించినప్పుడు….దానికి “సాంకేతికమైన” అడ్డంకులు కల్పించకుండా…ఆయనకు సహకరించడం ద్వారా…వైస్సార్ పై నిజమైన అభిమానాన్ని వ్యక్తం చేసి ఉండేవారు. వీధికి ఎక్కేవారు కాదు.మీడియా విలేకరులకు తప్ప; వారెవరో ప్రజలకు తెలిసిన దాఖలాలు లేవు.
ఈ సాంకేతికత ను పట్టుకుని…తెలుగు దేశం ప్రచార మాధ్యమాలు….జగన్ పని అయిపోయిందన్నట్టుగా…
ఎవరెస్ట్ శిఖరం ఎక్కి…బాకాలు ఊదుతున్నాయి.
పేరు ఏమిటనేది ఇప్పుడు ముఖ్యం కాదు.
ఎన్ టి రామారావు రాజకీయాలలోకి వచ్చి, 1982 లో ‘తెలుగు దేశం’ అని పేరు పెడితే; ‘దేశం’ ఏమిటంటూ జనం ఆశ్చర్య పోయారు. అది పెట్టింది ఎన్టీఆర్ కాబట్టి, జనం విరగబడి మరీ ఓట్లేశారు.
రామోజీరావు విశాఖలో1974 లో ‘ఈనాడు’అని దినపత్రికను ప్రారంభిస్తే….అది ఏమి పేరు అంటూ జనం బిత్తరపోయారు. అప్పటివరకూ…ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి…వంటి పేర్లే జనం నోట్లో నానుతూ ఉండేవి.
అలాగే, ఇప్పుడు జగన్ పార్టీ పేరు ఏమిటి అనేది …ఆయన పార్టీ నేతలకు గానీ, కార్యకర్తలకు గానీ, జనానికి గానీ ముఖ్యం కాదు. ఆ దశను జగన్ దాటేశారు. ఇప్పుడు జగనే ముఖ్యం.
అందువల్ల…’వైస్సార్ కాంగ్రెస్’ అని తన పార్టీ ని పిలవడం కుదరక పోతే…వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
ప్రస్తుత శాసన సభలో ఆయన పార్టీ కి 151 మంది సభ్యులు ఉన్నారు. 89 ఉంటే చాలు, మెజారిటీకి. అంటే…ఇంకో 62,63 మంది అదనంగా ఉన్నారు.
జగన్ పార్టీ గుర్తింపు రద్దు ఖాయమొహో…అంటూ తెలుగుదేశం అనుకూల ప్రచార మాధ్యమాలు… పరోక్షంగా వ్యక్తం చేసే ఆనందోత్సాలు కేవలం పైశాచికానందమే.
ఆయన పార్టీ గుర్తింపు రద్దు చేస్తే…తెలుగు దేశం అధికారం లోకి రాదు. శాసన సభలో ఒక్క స్థానం కూడా లేని బీజేపీ కూడా -అధికారంలోకి రాలేదు. జగన్ పార్టీ గుర్తింపుకు రద్దు అయినా…పట్టుమని పదిమంది కూడా ఆయనను వదలరు.
ఒకవేళ ఆయన బెయిల్ రద్దు అయినా…రాష్ట్రాన్ని ఇప్పుడు నడిపిస్తున్న’జగన్ భావ జాల’ మే ఇకముందూ రాష్ట్రాన్ని నడిపిస్తుంది. కుదరక పోతే…అసెంబ్లీ ని రద్దు చేసి, తన పార్టీ కి ” గోంగూర పచ్చడి”అనే పేరు పెట్టి అయినా సరే…మళ్లీ ఎన్నికలకు వెళ్లే సత్తా జగన్ కు వచ్చేసింది.
జగన్ కు రాజకీయం తెలియక ముందు…తెలుగు’దేశం’…’బీజేపీ’.
ఇప్పుడు ఆయనకు రాజకీయం తెలిసింది. ఓటర్ల మైండ్ సెట్టూ అర్ధమైంది.
ఇక ఇప్పుడు…తెలుగు దేశమూ లేదు. బీజేపీ లేదు. కాకపోతే…ప్రేక్షక, వీక్షకానందం కోసం…. ఈ పైశాచికానందం.

-భోగాది వెంకట రాయుడు