ముద్రగడను తప్పు పట్టడం ఎందుకు?

585

రాష్ట్ర జనాభాలో కాపులు ఇంతమంది ఉన్నారు.రాజకీయాధికారం రావడం లేదు….’ అంటూ కొంతమంది కాపు మిత్రులు అప్పుడప్పుడూ ఆవేదనకు లోనవుతూ ఉంటారు. రాజకీయాధికారానికి….జన సంఖ్యాబలానికి అసలు సంబంధం లేదు. రాజకీయాధికారానికి కావలసింది….ఒక వ్యక్తికి ఉండే నాయకత్వ లక్షణాలు, పటిమ. స్వశక్తితో ఆ స్థాయికి రాగలిగిన స్థాయి ఉండాలి. దానిని ఎవరూ ఎవరికీ కట్టబెట్టరు.ఆంధ్ర ప్రదేశ్ కు ప్రకాశం పంతులు గారు…పీ వీ నరసింహారావు గారు ముఖ్యమంత్రులు అయింది….బ్రాహ్మణుల సంఖ్యాబలం మీద ఆధారపడి కాదు. సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి వంటి పెద్దలు రెడ్డి వర్గీయుల సంఖ్యాబలం మీద ఆధారపడి ముఖ్యమంత్రులు కాలేదు. వైస్యుల సంఖ్యాబలం మీద ఆధారపడి రోశయ్య గారు ముఖ్యమంత్రి కాలేదు. దళితుల సంఖ్యాబలం మీద ఆధారపడి సంజీవయ్య గారు ముఖ్యమంత్రి కాలేదు. జలగం వెంగళరావు గారు గానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గానీ…వెలమ ఓట్లతో . ముఖ్యమంత్రులు కాలేదు.
అలాగే, ఎన్టీఆర్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ కమ్మ సంఖ్యాబలం మీద ఆధారపడి ముఖ్యమంత్రులు కాలేదు.
అందువల్ల, ముఖ్యమంత్రి కావాలంటే….సంఖ్యాబలం అవసరం లేదనే విషయాన్ని కాపు మిత్రులు అర్ధం చేసుకుంటే….ఆవేదన ఉండదు. సమాజం లోని అత్యధిక సామాజిక వర్గాల అభిమానం, నమ్మకం చూరగొనగలిగిన మానసిక పరిపక్వత ఉండాలి. ముద్రగడ పద్మనాభం అప్పుడు అలా ఎందుకు చేశారు…?ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు…? అంటూ కాపులు జుట్టు పీక్కోవలసిన పని ఉండదు.ఆ విషయం అర్ధం చేసుకుంటే… మనసు తేలిక పడుతుంది కూడా.
ఆ స్థాయికి తగిన రాజకీయ పరిపక్వత…నాయకత్వ పటిమ…సమాజం లోని అన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొనగలగడం…అన్నింటికంటే ముఖ్యం. ఆ ‘లక్షణాలు’ గలిగినవారు కాపు సామాజిక వర్గం లో ఎవరైనా ఉన్నరేమో…ఆవేదనా పరులు ఓ సారి భూతద్దం వేసుకుని వెదికి చూస్తే…విషయం మరింత స్పష్టంగా అవగతమవుతుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అయినవారు ఎందుకు…ఎలా అయ్యారో…కాపుల నుంచి ఎవరూ ముఖ్యమంత్రి ఎవరూ ఎందుకు కాలేదో అర్ధమవుతుంది.
మరి కాపులు ఏం చేయాలి ?అనే సందేహం రావడం సహజం. ఆర్ధికంగా…సామాజికంగా…విద్యా, ఉద్యోగపరంగా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఎదగడానికి ప్రయత్నిస్తే…అదే రాజ్యాధికారం సాధించినంత గొప్ప. ఈ దిశగా కాపు నేతలు ఆలోచిస్తున్నారేమో తెలియదు. ఒకరిని పొగడడానికో…దూషించడానికో సోషల్ మీడియా ను వాడుకోగూడదు.
ముద్రగడ కుల నాయకుడు కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ నేతగా,1978 నుంచి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు.తాను ఏమి చేస్తున్నారో ఆయనకు తెలియదు అనుకుంటే ఎలా?ఆయినా…పద్మనాభం ఒక్కరే తమ కులానికి రిజెర్వేషన్లు తెస్తారని కాపు నేతలు ఎలా భావించారో కూడా తెలియదు. వారు కూడా తమ…తమ గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో సమాంతరంగా కృషి చేయాలి కదా! చేశారా? గ్రామ, మండల, జిల్లా స్థాయి జే ఏ సీ లు ఏర్పాటు చేసుకున్నారా? వాటి ఆధ్వర్యం లో …ఆయనతో పాటు సమాంతరంగా పని చేశారా? అవేమీ చేయకుండా…ఇప్పుడు ఆయనేదో చేయలేదని నిందించడం ఎందుకన్నది నా భావన. ఆయన దృష్టితో చూస్తే….ఆయన అప్పుడు కాపు ఉద్యమాన్ని హైజాక్ చేసింది కరెక్ట్; ఇప్పుడు బయటకు వెడుతున్నట్టు ప్రకటించడం కరెక్ట్. అప్పుడూ..ఇప్పుడూ కరెక్ట్ గా ఆలోచించలేకపోయింది కాపులే!ఆయన కరెక్టుగానే ఆలోచించారు.
కాపు సామాజిక వర్గం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర సామాజిక వర్గాలతో సహజీవనం చేయకుండా…;’కాపులు…రాజ్యాధికారం…’అంటుంటే…ఇతర సామాజిక వర్గాల వారికి ఆ రెండు మాటలూ బూతు మాటల్లా వినిపిస్తున్నాయి.
ఆ విషయం కాపు సామాజిక వర్గం ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే…రాష్ట్రానికి అంత మంచిది.

-భోగాది వెంకట రాయుడు